ఎందుకిలా అవుతోంది?

27 Aug, 2017 00:35 IST|Sakshi
ఎందుకిలా అవుతోంది?

నా వయసు 22. రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. తర్వాత ఆరు నెలలకు కడుపులో గడ్డ ఉందని తెలిసింది. ఆపరేషన్‌ చేశారు. ఆపరేషన్‌కి ముందు నా జననాంగం వద్ద చిన్న చిన్న పింపుల్స్‌లాగా వచ్చి, అవంతటవే తగ్గిపోయేవి. కానీ ఇప్పుడు మూడు నెలలుగా పీరియడ్స్‌ వచ్చే ముందు వస్తున్నాయి. పీరియడ్స్‌ అయిపోయాక తగ్గి పోతున్నాయి. ఎందుకిలా అవుతోంది? చాలా భయంగా ఉంది.
– ప్రత్యూష, కరీంనగర్‌

బ్యాక్టీరియల్, వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల జననాంగం వద్ద చిన్న చిన్న గుల్లల్లాగా రావచ్చు. రక్తహీనత, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నా ఇలాంటివి మాటిమాటికీ రావచ్చు. పీరియడ్స్‌ ముందు శరీరంలో ఉండే హార్మోన్స్‌లో మార్పుల వల్ల ఆ సమయంలో జననాంగం వద్ద ఇన్‌ఫెక్షన్స్‌ ఏర్పడే అవకాశం ఉంది. కలయిక ద్వారా భర్తకు ఉన్న ఇన్‌ఫెక్షన్‌ భార్యకు సోకే అవకాశం కూడా ఉంది. జననాంగాలు శుభ్రంగా ఉంచుకోకపోవడం, అక్కడ ఉన్న వెంట్రుకలు రెగ్యులర్‌గా తొలగించుకోక పోవడం వల్ల కూడా రావచ్చు. కొందరిలో ఏ్ఛటp్ఛట్డౌట్ట్ఛట అనే వైరస్‌ కొన్ని నరాల్లో దాగుండి, అప్పుడప్పుడూ నరాలు స్పందించే చోట నీటిగుల్లల్లాగా (ఠ్ఛిటజీఛిu ్చట ట్చటజి) ఏర్పడి, నొప్పిగా ఉంటాయి. కానీ వారం పది రోజుల్లో తగ్గిపోతుంటాయి. అవి తగ్గకుండా అలాగే ఉంటే ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు కొన్ని రక్త పరీక్షలు చేసి వైరస్‌ ఉన్నట్లు నిర్ధారిస్తే, దానికి తగ్గ చికిత్స తీసుకోండి.

మహిళల్లో రక్తహీనత ఏర్పడడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉంటాయా? గర్భిణులకు రక్తహీనత సమస్య ఉంటే, ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద ఉంటుందని విన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఐరన్‌మాత్రలు తీసుకోవడం మంచిదేనా? తీసుకుంటే ఏ మోతాదులో తీసుకోవాలి. సైడ్‌ఎఫెక్ట్స్‌ ఏమైనా ఉంటాయా?
– జి.స్వాతి, వరంగల్‌

రక్తహీనత (్చn్ఛఝజ్చీ) అంటే రక్తంలో ఎర్ర రక్తకణాలు, అందులోని హిమోగ్లోబిన్‌ శాతం తగ్గడం. ఈ హిమోగ్లోబిన్‌ అనే పదార్థం రక్తం ద్వారా ఆక్సిజన్‌ వాయువును అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది. హిమోగ్లోబిన్‌ తయారీకి ఐరన్‌ ఎంతో అవసరం. చాలామందికి రక్తంలో ఐరన్‌ తక్కువ ఉండటం వల్ల రక్తంలోని ఎర్ర రక్తకణాలలోని హిమోగ్లోబిన్‌ తగ్గి రక్తహీనత ఏర్పడుతుంది. శరీరంలో ఐరన్, బి12 విటమిన్, ఫోలిక్‌ యాసిడ్‌ తక్కువ ఉండటం, రక్తకణాలు ఏర్పడటంలో సమస్యలు, రక్తకణాలు త్వరగా నశించిపోవటం, ఎక్కువ బ్లీడింగ్‌ అవ్వటం వంటి ఎన్నో కారణాల వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఆడవారిలో పీరియడ్స్‌ సమయంలో ఎక్కువ బ్లీడింగ్‌ అవ్వటం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం, కాన్పులలో రక్తస్రావం వంటి అనేక కారణాల వల్ల రక్తహీనత మగవారిలో కంటే ఆడవారిలో ఎక్కువ ఏర్పడుతుంది. గర్భిణీలలో పెరిగే శిశువు అవసరాలకు తగ్గట్లు రక్తంలో మార్పులు జరుగుతాయి. దానివల్ల గర్భిణీలలో చాలామంది రక్తహీనత ఏర్పడుతుంది.

గర్భిణీలలో హిమోగ్లోబిన్‌ 11 గ్రాములు ఉండటం సాధారణ సంఖ్య. కనీసం 10 గ్రాములు అన్నా ఉండటం మంచిది. నెలలు నిండే కొద్దీ, బిడ్డ, తల్లి అవసరాలకు తగ్గట్లు హిమోగ్లోబిన్‌ పెరగకపోవచ్చు. హిమోగ్లోబిన్‌ శాతాన్ని బట్టి రక్తహీనత తీవ్రత ఉంటుంది. రక్తహీనత తీవ్రతను బట్టి, తల్లిలో ఆయాసం, కాళ్లవాపులు, ముఖం ఉబ్బడం, నెలలు నిండకుండా కాన్పులు, బిడ్డ బరువు తక్కువ పుట్టడం వంటి అనేక సమస్యలు ఏర్పడవచ్చు. రక్తహీనత ఉండి, కాన్పు తర్వాత రక్తస్రావం ఎక్కువ అయితే, సరైన సమయంలో రక్తం ఎక్కించకపోతే ప్రాణహాని ఉండే అవకాశాలు ఉంటాయి. ఐరన్‌ మాత్రలు గర్భిణీ సమయంలో రక్తహీనత లేకపోయినా తీసుకోవటం మంచిది.

లేకపోతే గర్భంలో పెరిగే బిడ్డ, తల్లి నుంచి కావలసిన పోషక పదార్థాలు, రక్తం అన్నీ తీసేసుకుంటూ ఉంటుంది. దాంతో తల్లిలో రక్తం తగ్గుతూ ఉంటుంది. రక్తహీనత ఉన్నప్పుడు ఐరన్‌ మాత్రలు, తీవ్రతను బట్టి రోజుకు రెండుసార్లు వేసుకోవలసి ఉంటుంది. తీవ్రత ఎక్కువగా ఉండి ఐరన్‌ మాత్రలు వేసుకోలేకపోతే, ఐరన్‌ ఇంజెక్షన్ల రూపంలో కూడా తీసుకోవలసి ఉంటుంది. కొంతమందికి ఐరన్‌ మాత్రలతో మలబద్ధకం, వాంతులు, మలం నల్లరంగులో రావటం వంటివి జరుగుతుంటాయి. ఐరన్‌ మాత్రలు అనేక రకాల కాంబినేషన్లలో దొరుకుతాయి. ఒకటి పడకపోతే, వేరేది మార్చి వేసుకొని చూడవచ్చు. మాత్రలతో పాటు ఆహారంలో ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పప్పులు, బీన్స్, క్యారట్, బీట్‌రూట్, ఖర్జూర, దానిమ్మ, వేరుశనగ ముద్దలు, మాంసాహారులయితే లివర్, బోన్‌ సూప్‌ వంటివి తీసుకోవటం మంచిది.

బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు సంబంధించి హెచ్చరిక సూచనలు (warning signs)  వివరంగా తెలియజేయగలరు.
– విఆర్, శ్రీకాకుళం

Cancer warning signs అంటే ఇది చాలావరకు క్యాన్సర్‌ అయ్యే అవకాశం లేదా క్యాన్సర్‌ మొదటి దశలో ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు. క్యాన్సర్‌ రావటం, అరికట్టడం కష్టం. కనీసం కొద్దిగా ముందుగా గుర్తించటం వల్ల, చికిత్సతో చాలావరకు అది ముదరక ముందే తొలగించవచ్చు. బ్రెస్ట్‌లో కనిపించే కొన్ని  warning signs బట్టి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను కొద్దిగా ముందుగా గుర్తించవచ్చు. రొమ్ములో గట్టిగా కదలకుండా ఉండే గడ్డ, రొమ్ముపైన చర్మం లోపలకు లాగుకున్నట్లు ఉండటం, రొమ్ము మొన నుంచి స్రవాలు రావటం, చంకల్లో గడ్డలు రొమ్ము మొన లోపలకు వెళ్లటం, పీరియడ్స్‌తో సంబంధం లేకుండా రొమ్ములలో నొప్పి, వాపు వంటివి కనిపించినప్పుడు, డాక్టర్‌ని కలసి అవసరమైన స్కానింగ్, మామొగ్రామ్‌ వంటి పరీక్షలు చెయ్యించుకుని, అది క్యాన్సర్‌ కాదా అని నిర్ధారణ చేయించుకోవటం మంచిది. పైన చెప్పిన లక్షణాలు ఉన్నప్పుడు, 100% క్యాన్సర్‌ ఉండాలని ఏమీలేదు. కాకపోతే క్యాన్సర్‌ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నిర్ధారణ చేసుకొని, ముందుగా చికిత్స తీసుకోవటం మంచిది.

మరిన్ని వార్తలు