‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

28 Jul, 2019 07:43 IST|Sakshi

‘షమితాబ్‌’ సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన అక్షర హాసన్‌... తొలి సినిమాతోనే అక్షరాలా అందమైన నటి అనిపించుకుంది. అక్షర పాండేగా ఆ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఎడా పెడా కాకుండా ఏరి కోరి సినిమాలు చేస్తున్న అక్షర, తాజాగా ‘మిస్టర్‌ కేకే’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.  అక్షర హాసన్‌ ముచ్చట్లు ఆమె మాటల్లోనే...

అలా అయితేనే...
నేను చెన్నైలోనే పుట్టి పెరిగాను. నా పదో యేట అమ్మా, నాన్నలు విడిపోయారు. 2002లో అమ్మతో పాటు ముంబై వెళ్లిపోయాను. ఇక్కడ రెండు సంవత్సరాలు చదివిన తరువాత బెంగళూరు బోర్డింగ్‌ స్కూలో చేర్పించారు. అయితే అక్కడ చదువు సజావుగా సాగలేదు. చదవాలి కాబట్టి చదవాలి అని నేను అనుకోను. చదువుకు వందశాతం న్యాయం చేయగలిగినప్పుడే చదువుకోవాలి. అంతేగానీ, వాళ్లు వీళ్లు ఏమనుకుంటారో అని చదువుకోకూడదు అనేది నా అభిప్రాయం.

ఆరోప్రాణం
డ్యాన్స్‌ అంటే నాకు ఆరోప్రాణం. ఎనిమిదో యేట  డ్యాన్స్‌ నేర్చుకోవడం మొదలైంది. సల్సా, పాప్, భరతనాట్యం, కూచిపూడి...ఇలా రకరకాల డ్యాన్సులు వచ్చు. ఒకసారి కాలికి గాయం వల్ల సంవత్సరం పాటు డ్యాన్స్‌కు దూరంగా ఉండాల్సివచ్చింది. ఊపిరి ఆగినంత పనైంది. ఒకలాంటి డిప్రెషన్‌లోకి వెళ్లాను. గాయం నుంచి బయటపడిన తరువాత కమర్శియల్‌ యాడ్స్, స్టేజీపై నృత్యరూపకాలు చేశాను. ఆ సమయంలోనే నటించాలనే కోరిక మొదలైంది.

అలా మొదలైంది...
రాహుల్‌ ఢోలకియా ‘సొసైటీ’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. నా చిన్నప్పుడు అప్పుడప్పుడు ఆయన షూటింగ్‌లకు వెళ్లేదాన్ని. వ్యాన్‌లో కూర్చొని హోంవర్క్‌ చేసుకునేదాన్ని. ఒకసారి ఒక యాడ్‌ చేసి వస్తున్నప్పుడు స్టూడియో దగ్గర డైరెక్టర్‌ బాల్కి కనిపిస్తే పలకరించాను. ఆ సమయంలోనే ‘షమితాబ్‌’ సినిమా గురించి చెప్పారు. అలా ఆ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆయనతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. రాహుల్, బాల్కీలను గురువులుగా భావిస్తాను.

ఆమె మహారాణి
‘ఈ ప్రపంచంలో నువ్వు అత్యంత ప్రేమించే వ్యక్తి ఎవరు?’ అని అడిగితే మొదటి స్థానం నాకు ఇచ్చుకుంటాను, రెండో స్థానంలో అమ్మ ఉంటుంది. నా జీవితానికి అమ్మ మహారాణి. ఆమె ఎప్పుడూ నాకు ఆదర్శమే. అమ్మ ఆలోచన తీరు, నాది ఒకే తీరుగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు ఆందోళనపడదు, ఒత్తిడిని దరి చేరనివ్వదు. స్పోర్టివ్‌గా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే...అమ్మది స్వీట్‌హార్ట్‌. అమ్మ శక్తిమంతమైన  స్త్రీ. ఆమె నుంచి నాకు కావలసిన శక్తిని తీసుకుంటాను. 

మరిన్ని వార్తలు