ఉప్పు ఒలికిపోతే..?

9 Nov, 2013 23:12 IST|Sakshi
ఉప్పు ఒలికిపోతే..?

మరికొన్ని వింత నమ్మకాలు
     మనకు ఇష్టం లేని వ్యక్తి పదే పదే మనింటికి వచ్చి విసిగిస్తుంటే... అతడు వచ్చినప్పుడు చిటికెడు ఉప్పును అతని మీద వెయ్యాలట. అంతే... అతడు మళ్లీ రాడట!
     సముద్ర జలాల మీద ఉన్నప్పుడు ఉప్పు అన్న మాట నోట రాకూడదని, వస్తే క్షేమంగా తిరిగి వెళ్లలేరని కొన్ని దేశాల్లోని జాలర్లు నమ్ముతారు!
     కొత్త పెళ్లికూతురు తన పెళ్లి వస్త్రాల మీద కాసింత ఉప్పు చల్లుకుంటే... కాపురం పదికాలాలు పచ్చగా ఉంటుందట!
     బయటి నుంచి ఉప్పును అరువుగా తెచ్చుకుంటే, దానితో పాటే దురదృష్టం ఇంటికొచ్చి తిష్ట వేస్తుందట!
     కొత్తగా పుట్టిన శిశువుని ఉప్పు నీటిలో ముంచి తీస్తే, దుష్టశక్తులు దగ్గరకు రావట!
     ఓ అమ్మాయి డైనింగ్ టేబుల్ మీద ఉప్పు పెట్టడం మర్చిపోయిందంటే, ఆ అమ్మాయి జీవితంలో ఏ అబ్బాయీ లేడని అర్థమట!
 
 మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా అని అడుగుతారు ఒకరు. మా కంపెనీ ఉప్పు తినండి, జీవితంలో పెకైదగండి అంటూ ప్రచారం చేస్తారు ఇంకొకరు. ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుందంటారు పెద్దలు. సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు. కానీ ఉప్పుతో మనకు ముప్పు ఏర్పడుతుందని ఎవరైనా చెప్పారా? ఉప్పు రూపంలో అదృష్ట దురదృష్టాలు మనతో ఆటలాడుకుంటాయని ఎవరైనా చెప్పడం విన్నారా?
 
 వంటకి ఉప్పు కావాలి. ఆరోగ్యానికి ఉప్పు కావాలి. అలాంటి ఉప్పుతో ముప్పు వస్తుందని ఎవరు అనుకుంటారు! కానీ వస్తుందనే నమ్మకం ఎన్నో చోట్ల, ఎన్నో యేళ్లుగా ప్రచారంలో ఉంది.
 ఉప్పును పారబోయడం అశుభ సూచకం అన్న నమ్మకం చాలా దేశాల్లో ఉంది. ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పడమే కాదు... ఒలికిన ఉప్పుని ఎత్తి, ఎడమ భుజమ్మీదుగా వెనక్కి విసిరేయాలని, దానివల్ల కీడు తొలగిపోతుందని పరిహారం కూడా చెబుతుంటారు. ఎందుకంటే దెయ్యాలు, దుష్టశక్తులు ఎప్పుడూ మనిషికి ఎడమవైపునే ఉంటాయట. అందుకని ఎడమవైపుకు పారబోయాలట. అంతేకాదు. ఎంత ఉప్పు ఒలికిందో, అదంతా కరిగిపోయేటన్ని కన్నీళ్లు కార్చాలనే ఆచారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఇది మరీ అతిగా ఉందని కొందరు ఆధునికులు కొట్టి పారేస్తున్నా... ఇప్పటికీ దీన్ని అనుసరిస్తున్నవాళ్లు తక్కువేమీ లేరు.
 
 ఈ నమ్మకానికి నాంది పలికినవాడు లియొనార్డో డావిన్సీ అని చెప్పవచ్చు. అతడు వేసిన ‘లాస్ట్ సప్పర్’ చిత్రంలో యూదా ఇస్కరియోతు (ఏసుక్రీస్తును పట్టించినవాడు) చేతి దగ్గర ఓ చిన్న సీసాలాంటిది వేశాడు. అది పడిపోయినట్టు, అందులోంచి ఉప్పు ఒలికిపోయినట్టు చిత్రించాడు. లాస్ట్ సప్పర్ (యేసుక్రీస్తు శిష్యులతో కలసి చేసిన ఆఖరు భోజనం) తరువాత యేసుక్రీస్తును సైనికులు బంధించడం, సిలువ వేయడం వంటివి జరిగాయి. దాన్నిబట్టి... ఉప్పు ఒలికిపోవడం అన్న సంఘటన జరగబోయే అనర్థానికి సూచికలా ఉందనీ, అందుకే ఉప్పును ఒలకబోయకూడదనే నమ్మకం మొదలయ్యిందని చెబుతుంటారు చరిత్రకారులు. ఇది ఎంతవరకూ నిజం అనేదానికి ఆధారాలయితే లభించడం లేదు. పైగా బైబిల్ ప్రకారం, లాస్ట్ సప్పర్‌లో వాళ్లు కేవలం రొట్టె తిని, ద్రాక్షరసం తాగారు. మరి అక్కడ ఉప్పు ఎందుకుంది అనే ప్రశ్న కూడా కొందరిలో తలెత్తింది.
 
 అలాగే బైబిల్‌లో ఉప్పు గురించి గొప్పగా రాశారు. మనిషి ఎలా ఉండాలి అనేదానికి ఉప్పును ఉదాహరణగా చూపించి చెప్పారు. మీరు లోకానికై ఉప్పై ఉండండి అన్నారు క్రీస్తు. ఉప్పు నేలమీద పడితే నిస్సారమైపోతుంది, మనిషి జీవితం కూడా వెళ్లకూడని దారిలో వెళ్తే ఎందుకూ పనికి రాకుండా పోతుందంటూ గొప్పగా చెప్పారు. అలాంటి ఉప్పు వల్ల చెడు జరగడమేమిటి అనేవాళ్లు కూడా ఉన్నారు.
 
 పూర్వం చాలా ఖరీదు కనుక...
 ఏ రకంగా చూసినా ఉప్పు చుట్టూ ఉన్నవి మూఢనమ్మకాలుగా అనిపిస్తాయే తప్ప, నిజమైన నమ్మకాలుగా అనిపించడం లేదంటారు కొందరు విజ్ఞులు. పూర్వం ఉప్పు చాలా ఖరీదు. అందుకే జాగ్రత్తగా వాడుకొమ్మని చెప్పేందుకు, ఇష్టమొచ్చినట్టు వృథా చేయకుండా అడ్డుకునేందుకు ఇలాంటి కథలన్నీ పుట్టించారని చెబుతారు వారు. ప్రాచీన రోమన్లు ఉప్పును ఎంతో విలువైన వస్తువుగా భావించేవారు. ఇప్పటికీ రోమ్‌లోని క్రైస్తవ దేవాలయాల్లో పవిత్ర జలాన్ని తయారు చేసేందుకు ఉప్పును వాడతారట.

మరిన్ని వార్తలు