నెత్తుటి రాత

11 Oct, 2015 01:01 IST|Sakshi
నెత్తుటి రాత

క్రైమ్ ఫైల్
మన్‌హట్టన్ (అమెరికా)... నవంబర్ 2, 2006...
 ఆండీ ఆస్ట్రాయ్ కళ్లలోంచి కన్నీళ్లు జారిపడుతున్నాయి. అతని వైపే తీక్షణంగా చూస్తున్నాడు ఇన్‌స్పెక్టర్. ఆయన కళ్లలో కొద్దిగా జాలి. కొన్ని వందల ప్రశ్నలు.
 ‘‘ఊరుకోండి మిస్టర్ ఆండీ. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ నాకు...’’
 ‘‘నేనే నేరస్తుడినని అనిపిస్తోంది... అంతే కదా’’... ఇన్‌స్పెక్టర్ మాట పూర్తి కాకముందే అన్నాడు ఆండీ.
 
‘‘మీ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆమెను మొదట చూసింది మీరే. మాకు ఫిర్యాదు చేసిందీ మీరే. మరి మొదట మా దృష్టి మీమీదే పడటం సహజం కదా?’’
 నవ్వాడు ఆండీ. ‘‘మీ వివరణ అద్భుతంగా ఉంది సర్. ఫిర్యాదు చేసినవాళ్లే నేరస్తులు అయి ఉంటారన్న మీ అనాలసిస్ చాలా గొప్పగా ఉంది.’’
 
ఇన్‌స్పెక్టర్ ముఖం కోపంతో ఎర్ర బడింది. ‘‘మీరు మాట్లాడుతున్నది ఓ పోలీసాఫీసర్‌తో అని మర్చిపోకండి ఆండీ. ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో, ఎవరిని అనుమానించాలో మాకు తెలుసు. మీరు మా మీద సెటైర్లు వేయాల్సిన పని లేదు.’’
 ‘‘నేను సెటైర్లు వేయడం లేదు సర్.  మీ అనుమానం కరెక్ట్ కాదంటున్నాను.’’
 ‘‘సరే. చెప్పారుగా. ఇక వెళ్లండి. అవసరమైతే మళ్లీ పిలుస్తాను’’... అనేసి ఫైల్లో తల దూర్చాడు ఇన్‌స్పెక్టర్.
 
ఆండీ ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ ఇన్‌స్పెక్టర్ ముఖంలో కనిపిస్తోన్న సీరియస్ నెస్ అతణ్ని నోరు విప్పనివ్వలేదు. దాంతో మౌనంగా లేచి బయటకు నడిచాడు.
 ఆండీ బయటకు వెళ్లగానే సబార్డి నేట్స్‌ని పిలిచాడు ఇన్‌స్పెక్టర్. ‘‘అతని మీద ఓ కన్నేసి ఉంచండి. ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు... అన్ని వివరాలూ కావాలి నాకు. అతని ఫోన్ కాల్స్ కూడా ట్రేస్ చేయండి’’... అదేశించాడు.

వాళ్లు సరేనని వెళ్లిపోయారు. ఇన్‌స్పెక్టర్ ఆలోచనలో పడ్డాడు.
 ఆడ్రియానా షెల్లీ... ఆండీ ఆస్ట్రాయ్ భార్య. మంచి రచయిత్రి. టాలెంటెడ్ నటి. అద్భుతమైన దర్శకురాలు. టీవీలో పని చేసింది. సినిమా రంగంలో పని చేసేం తగా ఎదిగింది. అవార్డులూ రివార్డులూ అందుకుంది. ‘వెయిట్రస్’ అనే సినిమా తీసే పనిలో తల మునకలై ఉంది. కానీ అంతలోనే ఆత్మహత్య చేసుకుంది.
 సరిగ్గా ముందు రోజు అదే సమయానికి (నవంబర్ 1, 2006, సాయంత్రం 5:30) ఇన్‌స్పెక్టర్‌కి ఓ ఫోన్ వచ్చింది.
 
‘‘సర్... నా పేరు ఆండీ ఆస్ట్రాయ్. నా భార్య ఆడ్రియానా ఆత్మహత్య చేసుకుంది. మీరు వెంటనే రండి.’’
 తక్షణం తన టీమ్‌ని తీసుకుని మన్ హట్టన్‌లోని వెస్ట్ విలేజ్ ప్రాంతంలో ఉన్న అబింగ్డన్ స్క్వేర్ అపార్ట్‌మెంట్స్‌కి చేరుకున్నాడు ఇన్‌స్పెక్టర్.  బాత్రూములో.. షవర్ గొట్టానికి దుప్పటితో ఉరి వేసు కుంది ఆడ్రియానా. ‘‘తనని మొదట ఎవరు చూశారు?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్.
 ‘‘నేనే సర్. సాయంత్రం తన పని త్వరగా అయిపోయింది, ఇంటికి వెళ్తు న్నాను అని నాకు నాలుగ్గంటలకి ఫోన్ చేసింది. నేను ఐదున్నరకు ఇంటికొచ్చాను. తలుపు దగ్గరకు వేసివుంది. హాల్లో ఉయ్యాల్లో ఉన్న పాప ఏడుస్తోంది. ఆడ్రియానా కోసం ఇల్లంతా వెతికాను. చివరికి తను బాత్రూములో ఇలా...’’
 
ఆండీ గొంతు పూడుకుపోయింది. అర్థమైందన్నట్టు తలూపాడు ఇన్‌స్పెక్టర్. ఆడ్రియానా మృతదేహాన్ని కిందికి దించి, పోస్ట్‌మార్టమ్‌కి పంపించి, తనూ బయలు దేరాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అతడి మెదడుని తొలుస్తున్న ప్రశ్న ఒకటే. కెరీర్ అంత సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న సమయంలో ఆడ్రియానా ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది? ఈ ప్రశ్న అతడిలో వంద సందేహాలను రేకెత్తిస్తోంది. అవన్నీ ఆండీ దగ్గరకు వెళ్లే ఆగుతున్నాయి.

కచ్చితంగా వ్యక్తిగత జీవితంలోని సమస్య వల్లే ఆమె చనిపోయిందని ఇన్‌స్పెక్టర్‌కి అనిపిస్తోంది. రెండు మూడు రోజులపాటు ఇదే ఆలోచనల్లో ఉన్నాడు. తర్వాత అతడికి మరో ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి చెప్పింది విని అవాక్కయ్యాడు. వెంటనే హడావుడిగా బయలుదేరాడు.
   
‘‘ఏంటి సర్, ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా’’ గుమ్మంలో నిలబడిన పోలీసుల్ని చూసి అన్నాడు ఆండీ.
 ‘‘నేరస్తుడు పోలీసుల్ని వెతుక్కుంటూ ఎప్పుడూ రాడు. నేరస్తుణ్ని వెతుక్కుంటూ పోలీసులే వెళ్లాలి... తప్పదు’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ లోపలికి అడుగుపెడుతూ.
 నిట్టూర్చాడు ఆండీ. ‘‘నా భార్య పోయిందన్న బాధ కంటే ఆమె మరణానికి నేనే కార కుడినని మీరు వేస్తోన్న నిందే ఎక్కువ బాధపెడుతోంది సర్ నన్ను.’’
 
‘‘ఆహా అలాగా! ఏ మూలో నీ మాటలు నిజమేమోనన్న అనుమానం ఉండింది నాలో. కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే నాకిప్పుడే ఓ కొత్త నిజం తెలిసింది. ఆడ్రియానా ఆత్మహత్య చేసుకోలేదు. ఎవరో హత్య చేశారు.’’
 విస్తుపోయాడు ఆండీ. ‘‘నిజమా సర్? తనది హత్యా? నేను అనుకుంటూనే ఉన్నాను. నా భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. కానే కాదు.’’
 
ఇన్‌స్పెక్టర్ భృకుటి ముడివడింది. అనుమానిస్తున్నాడే గానీ ఆండీలో నేరస్తుడి లక్షణాలు ఎక్కడా కనిపించడం లేదు. తడబాటు లేదు. మాటల్లో బాధ ఉంది. కళ్లలో నిజాయతీ ఉంది. పైగా తన టీమ్ అతణ్ని ఫాలో అవుతోంది. ఎక్కడా అతని ప్రవర్తనలో తేడా లేదు. అయినా కూడా ఆడ్రియానాది హత్య అని అటాప్సీ చేసిన డాక్టర్ ఫోన్ చేసి చెప్పగానే, కావాలనే ఆండీని పరీక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు కూడా ఆండీలో ఏ తేడా కనిపించడం లేదు. మరి హత్య ఎవరు చేశారు?
 
‘‘నేను క్రైమ్‌స్పాట్‌ని మళ్లీ చూడాలి’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్. ‘‘మీ ఇష్టం సర్’’ అన్నాడు ఆండీ. ఆడ్రియానా మరణించిన బాత్రూమ్ దగ్గరకు వెళ్లారు. ఆ రోజు వేసిన సీలును తొలగించి ఇన్‌స్పెక్టర్ లోనికి ప్రవేశించాడు. బాత్రూముని మరోసారి క్షుణ్నంగా పరిశీలించాడు. అతడి కళ్లు ఒకచోట ఆగిపోయాయి. క్లూ దొరికింది. వెంటనే అతని మెదడు చురుగ్గా పని చేయడం మొదలు పెట్టింది.
   
‘‘నిజం చెప్పు... ఆడ్రియానాని నువ్వే కదూ చంపింది?’’... గర్జించినట్టే అన్నాడు ఇన్‌స్పెక్టర్. అతడికి ఎదురుగా కూర్చుని ఉన్న పందొమ్మిదేళ్ల డీగో పిలికో భయంతో వణికాడు. ఇక తప్పించుకోలేనని అర్థమై మొత్తం కక్కేశాడు.
 ఆడ్రియానా వాళ్లు నివసిస్తోన్న అపార్ట్ మెంట్లో కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతోంది. అక్కడికి కూలీగా వచ్చాడు డీగో. ఓ రోజు అందరూ భోజనం చేయడానికి వెళ్లారు. ఆకలిగా లేకపోవడంతో డీగో మాత్రం పని చేస్తున్నాడు. ఇనుపరాడ్లను సుత్తితో కొడు తున్నాడు.

అంతలో ఆడ్రియానా వచ్చింది. చాలా శబ్దం వస్తోందని, పాప నిద్ర పాడ వుతోంది మెల్లగా పని చేసుకొమ్మని అంది. నువ్వే సర్దుకుపో అంటూ నిర్లక్ష్యంగా సమా ధానమిచ్చాడు డీగో. ఆడ్రియానా ఏదో చెప్పబోతే ఎగ తాళిగా మాట్లాడాడు. ఆమెకు కోపం వచ్చింది. వెళ్లి అపార్ట్ మెంట్ యజమానికి ఫిర్యాదు చేసింది. అతడు కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఓనర్‌కి విషయం చెప్పాడు. అతడు డీగోని పిలిచి క్లాసు పీకాడు. దాంతో పగబట్టాడు డీగో.
 
నవంబర్ 1 సాయంత్రం క్రష్ నుంచి పాపను తీసుకుని ఇంటికొచ్చింది ఆడ్రియానా. కార్ పార్క్ చేసి తన ఫ్లాట్‌కి వెళ్తోన్న ఆమెను అనుసరించాడు డీగో. ఆమె వెనకాలే అపార్ట్‌మెంట్‌లోకి దూసు కెళ్లాడు. ఆడ్రియానా మీద దాడి చేశాడు. ఆమె చెప్పేది కనీసం వినకుండా పీక నులిమి చంపేశాడు. అనుమానం రాకుండా ఉండేందుకు బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి దుప్పటితో ఉరి వేశాడు.
 
అంతా విని చాచి కొట్టాడు ఇన్‌స్పెక్టర్. ‘‘మనిషివా రాక్షసుడివా! చిన్నబిడ్డకు తల్లి. ఆ పాప కళ్లముందే తల్లిని చంపేశావ్. అది కూడా చిన్న కారణానికి. నిన్నేం చేసినా పాపం లేదు... ఛీ’’ అనేసి బయటకు వచ్చే శాడు. అతడి కోసమే ఎదురు చూస్తోన్న ఆండీ కంగారుగా లేచి దగ్గరకు వెళ్లాడు. ‘‘ఏమైనా చెప్పాడా?’’ అన్నాడు ఆతృతగా.
 ‘‘సారీ ఆండీ... మిమ్మల్ని అనుమా నించాను. మీ భార్యను చంపింది వీడే’’ అని, ఏం జరిగిందో చెప్పాడు. ఆండీ కళ్లలో నీళ్లు పొంగుకొచ్చాయి. ‘‘అంత చిన్నదానికి నా భార్యను చంపేశాడా? చేతులెలా వచ్చాయి సర్ వాడికి? నా బిడ్డను తల్లి లేనిదాన్ని చేశాడు’’ అంటూ చేతుల్లో ఉన్న పాపను గుండెకు హత్తుకు న్నాడు.

ఓదార్పుగా అతని భుజమ్మీద చేయి వేశాడు ఇన్‌స్పెక్టర్. ‘‘అసలు వాడే చంపి ఉంటాడని మీకెలా అనుమానం వచ్చింది సర్’’... అడిగాడు ఆండీ. ‘‘రెండోసారి బాత్రూమ్‌ని పరిశీలించి నప్పుడు ఇసుక కనిపించింది. అప్పుడే నా దృష్టి కన్‌స్ట్రక్షన్ వర్క్ మీద పడింది. అక్కడ మాత్రమే ఇసుక ఉంది. అది ఆడ్రియానా చెప్పులకు అంటుకునే చాన్స్ లేదు. తర్వాత ఇంట్లోకి వచ్చిన నీ బూట్లకూ అంటుకునే అవకాశం లేదు. కచ్చితంగా అక్కడి నుంచే ఎవరో వచ్చి ఉంటారనిపించింది.

అందరి గురించీ ఎంక్వయిరీ చేస్తే గతంలో డీగో మీద ఆడ్రియానా కంప్లయింట్ ఇచ్చిన విషయం బయటికొచ్చింది. వాణ్ని లాక్కొచ్చి నాలుగు పీకితే నిజం కక్కాడు.’’
 ‘‘మ్‌మ్‌మ్... నా భార్య ఎన్నో కథలు రాసింది. వీడు మాత్రం తన నుదుటన నెత్తుటి రాత రాశాడు. వస్తాను సర్’’ అనేసి వెళ్లిపోతోన్న ఆండీ వైపు జాలిగా చూస్తూండిపోయాడు ఇన్‌స్పెక్టర్.
 
ఆడ్రియానా భర్త ఆండీ, వారి ప్రేమకు ప్రతిరూపం సోఫియా
ఆవేశంలో చేసినా, డీగో చేసిన నేరాన్ని తీవ్రగానే పరిగణించింది న్యాయస్థానం. పెరోల్ తీసుకునే అవకాశం కూడా లేకుండా పాతికేళ్ల కఠిన కారాగారశిక్షను విధించింది. ప్రస్తుతం అతను జైలులో మగ్గుతున్నాడు. ఆడ్రియానా గుర్తుగా ‘ఆడ్రియానా షెల్లీ ఫౌండేషన్’ను స్థాపించాడు ఆమె భర్త ఆండీ. దాని ద్వారా పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ను, పేద రోగులకు వైద్య సహాయాన్ని, పేద కళాకారులకు ఆర్థిక సాయాన్నీ అందిస్తున్నాడు. తమ ప్రేమకు గుర్తుగా మిగిలిన కూతురు సోఫీ (ప్రస్తుతం ఏడేళ్లు)ని గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటున్నాడు.
- సమీర నేలపూడి

మరిన్ని వార్తలు