రెక్కల ప్రయాణం 

10 May, 2020 08:41 IST|Sakshi

ఇసుక చెట్టు

ఇంటి కాడ పిల్లజెల్లా ఎట్ల ఉండ్రో.. నా ముసలి తల్లి ఏమి బెట్టి సాదుతుందో....
చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకూ....
పాటను వాట్సప్‌లో వింటూండగా   కాల్‌ వచ్చింది.. పాట ఆర్ద్రతతో మనసు చెమ్మగిల్లడం వల్ల రాజేందర్‌ కళ్లు మసకబారాయి... అందుకే ఆ కాల్‌ ఎవరిదో సరిగ్గా కనపడలేదు. మోచేయితో కళ్లు తుడుచుకొని చూశాడు. భార్య దగ్గర్నుంచి. వెంటనే లిఫ్ట్‌ చేశాడు. 
‘ఆ.. హలో .. సంధ్యా..’ 
‘ఏయ్‌.. ఇండియా ఓడలను పంపిస్తుందట కదా!’ ఆత్రంగా సంధ్య.
‘ఏందీ...’ అర్థంకాలేదు అతనికి.

‘గదే.. గల్ఫ్‌లో ఉన్న మనోళ్లందరినీ ఇండియా దీస్కపోతందుకు ఓడలను పంపిస్తుందట.. ఆడ స్టార్ట్‌ అయినయంట కూడా’ ఒకింత ఉత్సాహం, ఆనందం ఆమె స్వరంలో.
‘సంధ్యా... గా వాట్సప్‌ల చక్కర్లు గొట్టేది నమ్ముతవా?’ నిట్టురుస్తూ అతను.
‘యే.. వాట్సప్‌ల గాదు. వెబ్‌సైట్‌ న్యూస్‌ల చూసిన.. నిజమే’ ఆమె.
‘అయితే మనం మూటముల్లె సర్దుకొని రెడీగా ఉండమంటవ్‌ ఇండియావోతందుకు’ వెటకారంగా అతను.

‘నీకన్నీ పరాచకాలా? నా బాధ కనవడ్తలేదు.. ఇనవడ్తలేదు. కనీసం మనమేం బతుకు బతుకున్నమోనన్న సోయన్న ఉన్నదా లేదా? నువ్వు బహెరన్‌ల.. నేను ఈడ .. పిల్లలిద్దరు మనూర్ల... ఏం బతుకే ఇది? ఎవ్వరమన్నా సంతోషంగా ఉన్నమా?  పిల్లలు రోజూ ఫోన్ల ఏడుస్తున్నరు.. అదన్నా వినవడుతుందా లేదా?’ దుఃఖం, బాధ, కోపం, అసహనం అన్నీ కలగలిశాయి ఆమె గొంతులో.
‘నన్నేం జేయమంటవ్‌ చెప్పు? నీకొక్కదానికే బాధుంటది కాని నాకుండదా? కరోనా కష్టం నాకు, నీకే కాదే.. లోకమంత ఉంది. విమానాలు నడుస్తున్నా.. పైసలు ఖర్చయితలేవని ఈడ కూసున్ననా?’ అని ఆగాడు..

‘గట్లకాదు’ అని ఆమె ఏదో అనబోతుంటే.. ‘ఎట్ల కాదు.. నిన్ను దుబాయ్‌కి నేను పొమ్మన్ననా? నీకు జెప్పకుండా నేను బహెరన్‌ అచ్చిన్నా? గల్ఫ్‌ల ఉద్యోగం ఉంది అని చెప్తే నువ్వే కదా పో పో.. ఈడ ఎన్ని రోజులు చేసినా ఏమొస్తది? పిల్లగాండ్లను నేను జూసుకుంటా.. మీ అమ్మ సూత ఉంటది కదా.. భయమేంది నాకు అని నువ్వంటేనే నేనచ్చిన్నా.. నా అంతట నేను చెప్పకుండా పారిపోయి అచ్చిన్నా? ఆ...’ రెట్టించాడు అతను.

‘నేనే చెప్పిన.. అయితేందిప్పుడు’ ఉక్రోషం ఆమెలో.
‘ నేను కూడా సదివిన.. ల్యాబ్‌ టెక్నీషియన్‌కి  ఈడ  ఆరు వేలు కూడా ఇస్తలేరు.. నాక్కూడా ఆడనే చూడు అని నువ్వన్లేదా? మరి పిల్లలెట్లనే అంటే ఏమన్నవ్‌.. కొంచెం పెద్దగయిండ్రు కదా.. మీ అమ్మ, మా అమ్మ చూసుకుంటరు.. ఒక రెండుమూడేండ్లు కష్టపడి పైసలు కాపాయం చేసుకొని మల్లా ఇండియాకొద్దము అని నువ్వన్నవా లేదా? ’ గద్దించాడు.
‘నాకేం ఎరుక గిట్లయితదని.. ఒకల్లనొకల్లం చూసుకోకుండా గింత పరేషాన్‌ ఒస్తదని. నేను మన మంచికే చెప్పిన’ మనసులో దుఃఖం గొంతులోకొచ్చింది ఆమెకు. 

‘గంతే.. ఇద్దరం మన కుటుంబం కోసమే ఆలోచించినమే. ఓల్లమనుకోలేదు గింత పాపపు గడియలు ఒస్తయ్‌.. కరోనాతో నా కొలువు వోతది..నువ్వు పంపే పైసల మీదనే పడి తినాల్సొస్తదని కలగన్ననా? గసుంటిది ముందే తెలుస్తే సముద్రంల వడి సచ్చిపోదు’ అని అతను అంటూండగా.. ‘ఏం మాట్లాడుతున్నవ్‌?’ అని కోపగించుకుంటూ ‘ నేనెప్పుడైనా అట్లన్ననా?’ అని ఏడ్వడం మొదలుపెట్టింది సంధ్య.
‘మరేందే? నేను మాత్రం సంతోషంగున్నట్టు. పిల్లలు కండ్లల్లకెంచి పోతలేరు. మా అమ్మ.. ఎట్లుందో.. అండ్ల షుగర్‌ పేషంట్‌.. మందులున్నయో లేవో... లేకపోయినా ఉన్నయనే చెప్తది. పిల్లలతో కూడా నిజం చెప్పనియ్యదు ఒట్టేస్తది. మా అమ్మ సంగతి నాకు బాగెరుక’ అంటూ అతనూ ఏడ్వడం మొదలుపెట్టాడు.

‘ఇగో నువ్వు బాధపడకు చెప్తున్నా.. ఎట్లయితేగట్లయితది. అందరితో మనం...’ భర్తకు ధైర్యం చెప్పడం మొదలుపెట్టింది. 
‘పిల్లగాండ్లు ఫోన్‌ చేస్తున్నరంటేనే భయమైతుంది. ఎప్పుడొస్తరు.. ఎప్పుడొస్తరు అని రికామ లేకుండా అడుగుతుంటే ఏం జెప్తం..’ అతను.
‘ఊ... గా ఓడల సంగతి అయితే తెల్సుకో...’ అన్నది.
‘సరే’అన్నాడు.
‘పైసలున్నయా?’ అడిగింది.
‘ఊ...’ చెప్పాడు. 

‘మా తమ్ముడ్ని పొయ్యి మనోల్లను చూసిరమ్మందామన్నా అయేటట్టు లేదు. ఎక్కడోల్లు అక్కడ్నే ఉండాల్నట. ఏ ఊరి నుంచి ఏ ఊరికి రాకపోకల్లేవట మా వోడు జెప్తుండు. నాకేం మనసున వడ్తలేదు’ అంది. 
‘సరే ఫికర్‌వెట్టుకోకు. గా ఓడల సంగతి తెల్సుకుంట కని.. పైలం. ఉంట మరి’ అని ఫోన్‌ పెట్టేశాడు. 
అలాగే గోడకు చేరగిల పడి కళ్లు మూసుకున్నాడు క్యాంప్‌లోని తన గదిలో. రెండు రోజులుగా సరిగ్గా తిండి లేదు. ఆకలి గుర్రుమని పేగుల్ని కదిలిస్తూ నిద్ర పట్టనివ్వట్లేదు. 
‘రాజేందర్‌ అన్నా..’అని పిలిచిన పిలుపుకి కళ్లు తెరిచాడు.

వగరుస్తూ ఎదురుగా మల్లేష్‌. 
‘ఏమైంది మల్లేష్‌.. గట్ల ఆయసపడ్తున్నవేంది?’ అంటూ లేచి కూర్చున్నాడు రాజేందర్‌. 
‘అన్నా.. మన తెలుగోళ్లు అన్నం వండుకొని అచ్చిండ్రు.. బియ్యం, పప్పు, ఉప్పు, నూనె కూడా పంచుతరట.. దా పోదాం’ అంటూ రాజేందర్‌ చేయి పట్టుకొని లేపాడు మల్లేష్‌. 
∙∙ 
‘ఈ రోజు కూడా మీ ఆయనకు చెప్పినట్టు లేదు విషయం’ అడిగింది కరుణ.. వాళ్లాయనతో మాట్లాడి ఫోన్‌కట్‌ చేసిన స్నేహితురాలిని చూస్తూ. 
లేదన్నట్టుగా తలూపింది సంధ్య. ‘తనకూ రెండుమూడు నెల్ల కిందటనే జాబ్‌  పోయిందని రాజేందర్‌కు తెలిస్తే తట్టుకుంటడా? గుండె ఆగి సచ్చిపోతడు ఆడ్నే. అనుకుంది మనసులో.
‘మరి ఎన్ని రోజులు ఇట్లా మేనేజ్‌ చేస్తావ్‌?’ సంధ్య భుజం నొక్కుతూ అనునయంగా అడిగింది కరుణ. 

అవును ఎన్ని రోజులు తమ్ముడి దగ్గర పైసలు తీస్కుని మొగుడికి పంపిస్తది? కరోనాతోని వాడి పరిస్థితి కూడా మంచిగలేదని చెప్పిండు తమ్ముడు. అంటే ఇక పైసలు ఇచ్చుడు కాదని కదా’ ఆమె కళ్లనిండా నీళ్లు. కనపడకుండా కళ్లు మూసుకుంది. ఆ ఒత్తిడికి చెంపలమీదకు జారాయి కన్నీళ్లు. 
‘అమ్మా...నీకు, నాన్నకు రెక్కలుంటే మంచిగ ఉండు.. మేము అడిగినప్పుడల్లా మా దగ్గరకు రావస్తుండే’ కూతురి అమాయకత్వం గుర్తొచ్చి మరింత పొంగింది దుఃఖం ఆమె కళ్లల్లో. 
- సరస్వతి రమ

>
మరిన్ని వార్తలు