తారాస్వరం: అమ్మాయిలకు చీరే అందం! - సోనాక్షీసిన్హా

7 Dec, 2013 23:00 IST|Sakshi
తారాస్వరం: అమ్మాయిలకు చీరే అందం! - సోనాక్షీసిన్హా

పుట్టినరోజు: జూన్ 2, 1987
 జన్మస్థలం: పాట్నా, బీహార్
 తల్లిదండ్రులు: శత్రుఘ్నసిన్హా, పూనమ్
 చదువు: ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ

 
 హాబీలు: పాత సినిమాలు ఇష్టంగా చూస్తాను. పుస్తకాలు చదువుతాను. సైకాలజీ చదవడం చాలా ఇష్టం.
 నచ్చే దుస్తులు: చీర అంటే ఇష్టం. నాకు తెలిసి చీరలో ఉన్నంత అందంగా, ముచ్చట మరే దుస్తుల్లోనూ కనిపించరు అమ్మాయిలు. ప్రత్యేక సందర్భాలన్నింటికీ నేను చీరలే కట్టుకుంటాను. మామూలుగా అయితే ప్యాంటు, లూజ్ షర్టు వేసుకుంటాను.
 తీరిక వేళల్లో: ఐప్యాడ్ తెరవడం, గేమ్స్ ఆడటం... ఇదే పని. అది నాకు చాలా ఇష్టమైన పని కూడా.
 ఎప్పుడైనా మూడ్ బాగోకపోతే: వెంటనే బయటకు చెక్కేస్తా. ఫ్రెండ్స్‌ని తీసుకుని సినిమాలకీ, షాపింగుకీ తిరుగుతా. మూడ్ అదే సరైపోతుంది.
 ఎప్పుడూ వెంట ఉండేవి: చాకొలెట్స్. అవి తినకపోతే చచ్చిపోతానేమో అన్నంత పిచ్చి. కోక్ తాగకపోయినా కూడా ఉండలేను. ఒకరకంగా నేను వీటికి అడిక్ట్ అయిపోయాను.
 అందుకున్న కాస్ట్‌లీ గిఫ్ట్: నా మొదటి కారు. నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు రోజూ ట్రెయిన్‌లో వెళ్లి ఇబ్బంది పడుతున్నానని... నాన్న కొనిచ్చారు.
 సంతోషపెట్టేది: ఏదైనా పని చేసినప్పుడు చాలా బాగా చేశావు అని ఎవరైనా మెచ్చుకుంటే చాలు, చాలా తృప్తిగా సంతోషంగా అనిపిస్తుంది.
 బాధపెట్టేది: పుకార్లు. అయ్యో దేవుడా... ఏం సృష్టిస్తారో మామీద! వాటిని చదివి నిజమా అని షాకైపోతుంటాను. సోనాక్షి అలా సోనాక్షి ఇలా అని రాసేస్తుంటే చదివి... నేనిలా చేస్తున్నానా అని ఆశ్చర్యపోతూ ఉంటాను. లేనివి కూడా అంత అందంగా రాసే వాళ్ల క్రియేటివిటీని మెచ్చుకుని తీరాలి!
 ఎదుటివారిలో నచ్చేది: నిజాయతీ. అది లేనివాళ్లను దగ్గరకు కూడా రానివ్వను.
 ఎదుటివారిలో నచ్చనిది: నటన. కొందరు జీవితంలో కూడా నటించేస్తుంటారు. అలాంటివాళ్లని చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు.
 
 మర్చిపోలేని కల: ఒకసారి ఓ విచిత్రమైన కల వచ్చింది. అందులో నాకు మరో రెండు చేతులు మొలిచాయి. ఉలిక్కిపడి లేచా. అద్దం ముందు నిలబడి నన్ను నేను ఎంతసేపు పరిశీలించి చూసుకున్నానో. అది నిజం కాదని నమ్మడానికి చాలా టైమ్ పట్టింది.
 మర్చిపోలేని అనుభవం: ఓ ఫ్యాషన్ షోలో ర్యాంపు మీద నడుస్తూ జారి పడిపోయాను. ఎంత సిగ్గుపడ్డానో చెప్పలేను. కానీ ఇప్పుడు తలచుకుంటే నవ్వు ఆగదు.
 నమ్మకం అబద్ధమైన సందర్భం: నేను చాలా లావుగా ఉండేదాన్ని. ఎంత లావు అంటే... ఎప్పటికీ తగ్గలేనేమో అనుకునేదాన్ని. కానీ సల్మాన్‌ఖాన్ నా ఆలోచనను తుడిచేశారు. ప్రయత్నిస్తే అవుతావు, నిజంగా సన్నబడితే నీకు నా పక్కన హీరోయిన్ చాన్స్ ఇస్తాను అన్నారు. అందుకే పట్టుదలగా ప్రయత్నించా. ఆయన పక్కన చాన్స్ కొట్టేశా.
 
 నా గురించి ఎవరికీ తెలియనిది: నాలో మంచి చిత్రకారిణి కూడా ఉంది. అంతేకాదు... నేను మంచి క్రీడాకారిణిని కూడా. వాలీబాల్, ఫుట్‌బాల్, త్రోబాల్, టెన్నిస్‌తో పాటు మరో ఐదారు రకాల ఆటలాడతాను.
 ఇష్టపడే కో స్టార్: అందరూ ఇష్టమే. ఎవరి మీదా అయిష్టత లేదు. కానీ అక్షయ్ కుమార్‌తో పని చేసేటప్పుడు ఎక్కువ కంఫర్టబుల్‌గా ఫీలవుతాను. ఇద్దరం కలిసి ఎక్కువ సినిమాలకు పని చేయడం వల్ల కావచ్చు.
 అందమంటే: మనసు. అది అందంగా ఉంటేనే మనిషి నిజంగా అందంగా ఉన్నట్టు.
 
 ప్రేమంటే: దానికది పుట్టాలి. ఎవరో వచ్చి ఐలవ్యూ చెప్పారు కదా అని మనలో పుట్టేయదు. అలా పుడితే అది ప్రేమ కూడా కాదు. ఒకరిని చూసి తనంత తానుగా మనసు స్పందించినప్పుడు పుట్టేదే అసలైన ప్రేమ.
 పెళ్లంటే: నమ్మకం. ఇద్దరు మనుషులు నమ్మకంతో కలసి ప్రయాణించడానికి వేసే తొలి అడుగే పెళ్లి.
 
 జీవితలక్ష్యం?
 ఏదో సాధించేయాలని ఇంతవరకూ ప్లాన్ చేసింది లేదు. అనుకోకుండా నటినైనా మంచి పేరు వచ్చింది. ఈ పేరుని ఇలా కాపాడుకుంటే చాలు. నాకు అవకాశాలు వచ్చినన్నాళ్లూ, ఇంకా చెప్పాలంటే... నన్ను ప్రేక్షకులు ఇష్టంగా చూసినన్నాళ్లూ నటిస్తాను. అంతే!

మరిన్ని వార్తలు