స్వామికి అభిషేకం శుక్రవారం ఎందుకు?

29 Sep, 2019 04:59 IST|Sakshi

కలియుగ  వైకుంఠనాథుడికి వారాలలో శనివారం ఎంతో ప్రత్యేకం. కాని శ్రీవారి ఆలయంలో మాత్రం శ్రీనివాసునికి శుక్రవారం అభిషేకం నిర్వహిస్తారు. శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైన శనివారం కాకుండా శుక్రవారం నాడు స్వామికి అభిషేకం ఎందుకు నిర్వహిస్తారనేది కుతూహలాన్ని కలిగించే సందేహమే కదా... అయితే ఈ కథనం చదవాల్సిందే మరి!

తిరుమల పుణ్యక్షేత్రానికి కలియుగ వైకుంఠమని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి కారణం ఈ ప్రాంతంలో శ్రీవారు స్వయంభువై వెలిసి ఉండడం. తిరుమల కొండలపై ఒక సాలగ్రామ శిలద్వారా స్వయంభువై వెలసిన శ్రీవేంకటేశ్వరుని శ్రీనివాసుడని, సప్తగిరీశుడని, ఏడుకొండలవాడని, బాలాజీ అని, తిరుమలప్ప అని... ఇలా భక్త జనులు రకరకాల పేర్లతో స్వామివారిని ప్రేమతో పిలుచుకుంటారు. కలియుగం ఆరంభంలో అనగా ఇంచుమించు ఐదు వేలసంవత్సరాల క్రితం వక్షస్థలంపై మహాలక్ష్మీ సమేతంగా స్వయంభువై వెలసిన శ్రీవారికి ఎందరో భక్తులు తరతరాలుగా మందిరం, గోపుర ప్రాకారం, మహా ద్వారాలు నిర్మిస్తూ వచ్చారు. ఆ వెంకటపతికి నిత్యోత్సవం, వారోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవాది ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ వచ్చారు.

కొండలలో వెలసిన కోనేటిరాయుడు ఎంతటి భక్తజన ప్రియుడో అంతటి నైవేద్య ప్రియుడు. ఎంతటి నైవేద్య ప్రియుడో అంతటి అలంకార ప్రియుడు. అందుకే శ్రీవారికి నిత్యం అర్చకులు రెండు పూటలా పుష్పాలంకరణ చేస్తారు. శ్రీవారికి సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు అనేక రకాలైన  ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఏడుకొండలవాడికి నిత్యం సుప్రభాత సేవతో మేల్కొలిపి, తోమాలసేవతో పుష్పాలంకరణ చేసి, అర్చనతో సహస్ర నామార్చన చేస్తారు. అటు తరువాత వారోత్సవాన్ని  నిర్వహించిన అనంతరం కళ్యాణోత్సవం, డోలోత్సవం,  వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు  నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం శ్రీవారికి తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అనంతరం అర్చకులు  రాత్రి ఏకాంత సేవతో శ్రీవారిని నిద్రపుచ్చుతారు. ఇక ప్రతి నెల శ్రీనివాసునికి ఏదో ఒక ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు.

జనవరిలో పార్వేటి ఉత్సవం, ఫిబ్రవరిలో రథసప్తమి, మార్చిలో తెప్పోత్సవం, ఏప్రిల్‌లో వసంతోత్సవం, మే నెలలో పద్మావతి పరిణయోత్సవం, జూన్‌ నెలలో జేష్ఠాభిషేకం, జూలై నెలలో ఆణివార ఆస్థానం, ఆగస్టు నెలలో పవిత్రోత్సవాలు, అక్టోబర్‌ నెలలో బ్రహ్మోత్సవాలు, నవంబర్‌ నెలలో పుష్పాభిషేకం వంటి మాసోత్సవాలు నిర్వహిస్తారు. మరో వైపు ప్రతి వారం శ్రీవారికి వారోత్సవాలు నిర్వహిస్తారు. సోమవారం విశేషపూజ, మంగళవారం అష్టదళపాదపద్మారాధన, బుధవారం సహస్రకలశాభిషేకం, గురువారం తిరుప్పావై, శుక్రవారం మూలవిరాట్టుకు అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం శ్రీవారికి నిర్వహించే అభిషేక సమయంలో 84తులాల పచ్చకర్పూరం, 36తులాల కుంకుమ పువ్వు, ఒకతులం కస్తూరి, ఒక్కటిన్నర తులం పునుగు తైలం, 24తులాల పసుపుపొడి వంటి పరిమళ ద్రవ్యాలను వినియోగిస్తారు. శ్రీనివాసునికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేయగా వచ్చే తీర్థాన్ని  పులికాపు తీర్ధం అంటారు.

అభిషేక సేవలో పాల్గొనే భక్తుల మీద సేవానంతరం ఈ తీర్థంతో అర్చకులు సంప్రోక్షణ చేస్తారు. అభిషేక సేవ అనంతరం శ్రీవారి మూలమూర్తి నొసటన నామాలతో అర్చకులు  అలంకరిస్తారు. దీనినే తిరుమణికాప్పు అంటారు. వారంలో ఒకసారి మాత్రమే అంటే అభిషేక సేవ అనంతరం చేసే తిరుమణి కాప్పునకు 16 తులాల పచ్చకర్పూరం, ఒక్కటిన్నర తులాల కస్తూరిని అర్చకులు ఉపయోగిస్తారు. శుక్రవారం నొసటి భాగాన తిరునామాలతో అలంకరించిన తర్వాత తిరిగి గురువారం వాటిని సడలిస్తారు. గురువారం రోజున నామాలు బాగా తగ్గించినందువల్ల  శ్రీవారి నేత్రాలు బాగా కనిపిస్తాయి. దీంతో  గురువారం ఒక్కరోజు భక్తులకు శ్రీవారి నేత్ర దర్శన భాగ్యం లభిస్తుంది. బ్రహ్మోత్సవ సమయంలో మాత్రం ఈ నామం సమర్పణలో రెట్టింపు వుంటుంది. అంటే  ప్రతి సంవత్సరం పది రోజుల పాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ముందు వచ్చే శుక్రవారం 32 తులాల పచ్చకర్పూరం, 3 తులాల కస్తూరితో శ్రీవారి నామాలను ఏర్పాటు చేస్తారు.

అభిషేక సేవ అనంతరం శ్రీవారి మూలవిరాట్టుకు 24 మూరల పొడవు, 4 మూరల వెడల్పుగల సరిగంచు వున్న పెద ్దపట్టువస్త్రాన్ని ధోవతిగాను, 12 మూరల పొడవు 2 మూరల వెడల్పు గల పట్టువస్త్రాన్ని ఉత్తరీయంగాను అలంకరిస్తారు. ఇక 38 రకాల ఆభరణాలతో శ్రీవారి మూల విరాట్టును అలంకరిస్తారు. ఈ ప్రక్రియ అంతా ఆగమబద్ధంగా నిర్వహించడానికి దాదాపుగా రెండున్నర గంటల సమయం పడుతుంది. శ్రీవారికి శనివారం విశేషమైన రోజు కావడంతో వెంకన్న దర్శనార్థం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. రద్దీ రోజులలో శ్రీవారికి అభిషేక సేవ నిర్వహిస్తే భక్తులు స్వామిని సందర్శించుకునే సమయం బాగా తగ్గుతుంది. దీనికితోడు శ్రీనివాసుడి వక్షస్థలంపై లక్ష్మీ అమ్మవారు వుండడంతో, అమ్మవారికి శుక్రవారం విశేషమైన రోజు కావడం వల్ల శ్రీవారితోపాటు అమ్మవారికి కూడా కలిపి ఒకేరోజు అభిషేక సేవను నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు