జలాధిపత్యం

4 Nov, 2018 01:35 IST|Sakshi

సాయిపథం – అంతర్వేదం 24

ఏ విధంగా సాయి పంచభూతాల్లోని ఆ పృథ్విని అంటే భూమాతని వినయంతో.. గౌరవంతో.. భక్తితో.. తనదానిగా చేసుకుని ఆమెని తన అధీనంలో ఉండేలా చేసుకోగలిగాడో వివరించుకున్నాం. ఆమె కూడా ఎందుకు అలా సాయికి అధీనురాలుగా అయిపోయిందో ఆ కారణాన్ని కూడా తెలుసుకున్నాం గత భాగంలో.ఆ క్రమంలో ఇప్పుడు పంచభూతాల్లోనూ 2,3,4,5గా గల నీరు, తేజస్‌(వేడిమి), వాయువు, ఆకాశం అనే వాటిని కూడా ఎలా తన అధీనంలో ఉండేలా వినయధోరణితో చేసుకోగలిగాడో తెలుసుకుందాం!

నీటి దీపాలు
ప్రతిరోజూ సాయికి తానున్న మసీదు నిండుగా దీపాలని వెలిగించి ఉంచడం ఇష్టం. అదొక ఆనవాయితీ కూడా. అది శీతకాలం కావచ్చు, వర్షకాలం కావచ్చు. దీపాల వేడిమి కారణంగా మసీదంతా ఉష్ణమయం అయిపోయే వేసవికాలం కావచ్చు. దీపాలు వెలగాల్సిందేననేది ఆయన అభిమతం.ఆ నూనె కోసం ఎందరో భక్తులిచ్చే దక్షిణలని దాదాపుగా ఉపయోగించేవారు కాదు. షిర్డీ గ్రామంలో ఉండే వర్తకుల వద్దకి సాయే స్వయంగా వెళ్లి నూనెని అడిగి మరీ తెచ్చుకుంటూండేవారు. లోకరీతి ఎప్పుడూ ఒకలా ఉండదు కదా! అందరూ కలిసి ఓసారి అనుకున్నారు. ఎప్పుడో ఒకసారంటే అడగడం, ఇయ్యడమనే దానిలో అర్థముంది కానీ నిత్యం ఇదేపనా? అయినా భక్తుల నుంచి అంతంత దక్షిణ వస్తూంటే.. అది చాలదన్నట్టుగా దబాయించి ‘ఇంత ఈయవలసిందే’ అంటూ దక్షిణలని తీసుకుంటున్న ఈయనకి వర్తకులమైన మనం ఎందుకు ఉచితంగా ప్రతిరోజూ నూనెనియ్యాలి? ఆయనే తలుచుకుని ఈ సంవత్సరమంతా నూనె ఖర్చు నీదే! అంటూ ఎవరినైనా శాసిస్తే కాదనేవాడు లేనేలేడు గదా! మనల్ని పీడించడం దేనికి? అయినా ఏదో ఒకటో రెండో దీపాలు చాలవా? మసీదంతా వెలుగులమయం కావాలా? ఇంతకు వెనుకకాలంలో ఒక్క దీపమే కదా ఉండేది అంత పాడుబడ్డ మసీదు మొత్తానికీ? ఏదో మనం ఇస్తున్నాం కాబట్టి వెలిగించడమా? అంటూ వ్యక్తికో అభిప్రాయం చొప్పున సామూహికంగా తెలియజేసుకుంటూ సాయి రాగానే అందరూ కలిసిగట్టుగా ఒకే మాట మీద నిలబడి నూనె లేనేలేదని చెప్పాలని నిశ్చయించుకుని నూనెని ఈయనేలేదు.ఎక్కడో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో.. ఏ ప్రవర్తనతో ఉన్నాడో.. ఏ వెనుకకాలంలో తనకి ఎంత రుణమున్నాడో కూడా తన అతీంద్రియశక్తితో గ్రహించగలిగిన సాయికి.. ఈ వర్తకులంతా లోపలేమనుకున్నారో.. ఏ తీరుగా ప్రవర్తించారో.. పైకి ఏమని చెప్తున్నారో తెలియదా? కానీ వీళ్లంతా ‘ఆయనకి ఈ లో–సమాచారం తెలియదు గదా!’ అని తెలిసినతనంతో తాము ప్రవర్తిస్తున్నామని అనుకున్నారు.

సాయి నిరుత్సాహపడలేదు. మౌనంగా లోపల బాధపడ్డాడు. దానికి కారణం.. ‘ఏ మసీదులో దీపాలని వెలిగించి ఆ జ్యోతి వెలిగించిన కారణంగా వచ్చే పుణ్యఫలాన్ని ఆ వర్తకులందరికీ ఆయన పంచదలిచాడో ఆ భాగ్యం వాళ్లకి లేకపోయింది గదా! వాళ్లకి చెందకుండా చేసుకుంటున్నారు కదా!’ అని అనుకోవడమే.భాగవతంలో కుచేలుని భార్య తన భర్తతో తమ మిత్రుడైన శ్రీకృష్ణుని వద్దకి వెళ్లి.. కొంత ధనాన్ని యాచించి.. ప్రస్తుతమున్న ఆర్థికమైన గడ్డు పరిస్థితి నుంచి తాత్కాలికంగా బయటపడే ఉపాయాన్ని వెదకవలసిందని చెప్పింది. అలాగేనన్న కుచేలుడు ఆమెతో ‘వెళ్తాను. మహానుభావుడైన కృష్ణుడ్ని దర్శిస్తాను. అయితే ఆయనకి ఏమియ్యాలో దాన్ని సమకూర్చు!’ అన్నాడు.అయ్యవారి నట్టిల్లెలా ఉంటుందో ఎంత ఐశ్వర్యంతో ఉందో ఆయనకి తెలియదా? ఎందుకడిగినట్లు?పోనీ! ఆయనడిగాడే అనుకుందాం! ఈమె వెంటనే సమాధానమిస్తూ మనకే లేక దుఃఖిస్తూ ఉంటే ఏమియ్యగలను? అంటూ వ్యతిరేకించి వివాదపడలేదు. ఆ చుట్టుపక్కల నలుగురి ఇళ్లకి వెళ్లి (యాచిత్వా ముష్టీ శ్చతస్రః) నాలుగిళ్ల నుండీ కొంత కొంత చొప్పున బియ్యపుముక్కలు (నూకలు) తెచ్చింది.

అంతరార్థమేమంటే.. ఆ నలుగురికీ ఈ కృష్ణదర్శన పుణ్యంలో భాగాన్ని పంచిపెట్టాలనీ, ఈ నలుగురి వైపు నుంచీ తన భర్తని పంపి అలా పట్టుకెళ్లిన పుణ్యాన్ని భర్తకి అందించాలనీనూ. ఈ రహస్యం ఆ దంపతులకి తెలుసుకాబట్టే ఈయన.. ఏదైనా ఈయవలసిందని అనడం, ఆమె కసురుకోకుండా ఆ నూకలని యాచించి ఈయనకి ఇయ్యడమూ జరిగింది.ఈ తీరు జ్ఞానం లేని కారణంగా వర్తకులంతా వ్యతిరేకించారు. సాయి మాత్రం వాళ్లందరికీ పుణ్యఫలాన్ని అందించదలిచినా వాళ్లంతా మేం ఆ పుణ్యానికి అర్హులంకాదంటూ తేల్చేసుకున్నారు నూనెని ఇయ్యకుండా. సాయి దుఃఖమంతా వీళ్ల దురదృష్టాన్ని పోగొట్టదలిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారా? అనేదే!సరే! తర్వాతి కథ మనకి తెలిసినదే! ఆ నూనెడబ్బాని కడిగి దాన్ని తానే స్వయంగా తాగి, ఆ డబ్బానిండుగా నీటిని నింపి అందరూ చూస్తూండగా దీపాలని వెలిగించడం!

నీటిని వశం చేసుకోవడం!
తర్కశాస్త్రాన్ని మనకి అందించిన అన్నంభట్టనే పండితుడు నీటికి నిర్వచనాన్నీ లక్షణాన్నీ చెప్తూ శీత స్పర్శవత్య ఆపః – చల్లనిదనమే తమ స్వభావంగా కలిగినవీ స్పృశించడానికి వీలైనవీ (ఆకాశాన్ని స్పృశించలేము కదా! అలా కాకుండా) నీళ్లు – అన్నాడు. లోకంలోని ప్రతివస్తువుకీ ఓ ధర్మం(లక్షణం) ఉండి తీరుతుంది. దాన్నిబట్టే ఆ వస్తువు ఏదో దాన్ని గుర్తించగలుగుతాం. ఉదాహరణకి రాయి ఉందనుకుందాం! దానికి జ్ఞానం (తాను దొర్లిపడితే ఎవరికైనా గాయమవుతుందనే జ్ఞానం) ఉండదు. ఎక్కడ పడేస్తే అక్కడే ఉంటుంది. పెద్ద ప్రవాహం వచ్చి తనని కొట్టుకుపోయేలా చేస్తే వెళ్లిపోవడమే తప్ప అభిమానమంటూ ఉండదు. కనీసం మరో సురక్షిత ప్రాంతానికి వెళ్లి ఉందామనే ఆలోచనా ఉండదు. ఇదంతా దాని ధర్మం. అందుకే ఇలాంటి అజ్ఞాన నిరభిమాన లక్షణాలున్నవాడ్ని ‘వాడో బండరాయి’ అని

రాతితో పోలుస్తాం!
అలా ఆలోచిస్తే నీటికుండే సహజధర్మం చల్లగా ఉండటం అనేదే. సాయి ఈ నీటితో దీపాలని వెలిగించాడనేది అందరికీ కనిపించిన సత్యం.దీపానికి అతిముఖ్యమైనది నిప్పు. అంటే అగ్ని. అగ్నికుండే లక్షణాన్ని వివరిస్తూ తర్కశాస్త్ర పండితుడైన అన్నంభట్టు చెప్పింది అదే. ‘ఉష్ణ స్పర్శవ త్తేజః’ అని. వేడిగానే ఉంటూ ఉండటం, స్పృశించగల అవకాశాన్ని కలిగి ఉండటం తేజస్సు (వేడిమి–అగ్ని) లక్షణమని. అందుకే ఏ సూర్యుడున్నాడో ఆయన ఎంతో దూరంలో ఉండి ప్రకాశిస్తున్నా మన శరీరాలు ‘చుర్రు’మంటూ ఉంటాయి ఒక స్థాయి వేడిమి దాటితే.

ఇక్కడ గమనించాల్సిన అంశమేమంటే.. నీటికున్న గుణం చల్లగా ఉండటం. అగ్నికున్న గుణం వేడిమితో ఉండటం. నీటికున్న చల్లదనమనే గుణాన్ని తొలగించడం అనే పనిని చేయడమే బహుకష్టం. మరో విశేషం ఉంది. చంద్రునికున్న చల్లదనం ఆకర్షణీయగుణం కారణంగానే ఆయన చంద్రుడవుతున్నాడు(చది ఆహ్లాదనే – చంద్రః) ఆ గుణమే ఆయనలో లేకుంటే ఆయన చంద్రుడు కాకుండాపోతాడు. అలాగే హిమవంతుడున్నాడు. నిరంతరం మంచుని కురిపిస్తూ.. ప్రవహింపజేస్తూ.. మళ్లీ అంతలోనే మంచుని కలిగి ఉండటం హిమవంతుని లక్షణం. ఆ హిమలక్షణం లేకుంటే ఆయన హిమవంతుడే కాలేడు.అదే తీరుగా సముద్రమనేదానికి – ‘అ వేల’ అని పేరు. వేల అంటే ఒడ్డు అని అర్థం. అవేల అంటే ఒడ్డు అనేదే లేనిదని భావం. మనం స్నానం చేసే స్థలం రేవు అవుతుంది తప్ప ఒడ్డు కానే కాదు. నాలుగు వైపులా సముద్రం ఉన్న కారణంగానూ ఆ నాలుగిటి మధ్య భూమి ఉన్న కారణంగానూ (చతురీపమ్‌ చతుస్సముద్ర వేలా వలయితమ్‌) సముద్రానికి ఒడ్డు అనేది లేనే లేదు. ఉండదు కూడా. అలా ఒక్కో ప్రత్యేక లక్షణం కలిగి ఉన్న కారణంగా అవి ఆయాపదార్థాలుగా గుర్తింపుని పొంది ఉన్నాయి లోకంలో.

ఈ పరిస్థితిలో నీటికుండే సహజధర్మమైన చల్లదనాన్ని తొలగించినట్లయితే అది ‘నీరు’గా పిలువబడకూడదు. సాయి చేసిందిదే. నీటికుండే సహజ ధర్మమైన చల్లదనాన్ని తొలగించివేయడమనే పనినే. ఇప్పుడు నీరు కాస్తా ఏమయింది? ముడిపదార్థంగా మారిపోయింది. ఉదాహరణకి ఒక వ్యక్తికి ధర్మరాజుగా వేషాన్ని వేశాం. ఆ ఆహార్యాన్ని తొలగిస్తే అతడు మళ్లీ మనలో ఒక వ్యక్తిగా ‘ఫలాని పేరుగల వ్యక్తిగా’ అయిపోతాడు. మళ్లీ అతనికే మరో దశరథుని వేషం వేస్తే ఇదే ‘ఫలాని వ్యక్తి కాస్తా’ ఆ దశరథుడైపోతాడు.అదే తీరుగా సాయి నీటికున్న సహజధర్మమైన చల్లదనాన్ని తొలగించి నీటిని ఓ ముడిపదార్థంగా మార్చడమే కాకుండా ఆ ముడిపదార్థానికి ఇందాక ధర్మరాజు వేషాన్ని తొలగించి దశరథుని వేషం వేసినట్లుగా తేజస్సుకుండే సహజధర్మమైన వేడిమిని కలిగించి ఆ వేడిమితనం నీటి ద్వారా వత్తికి ప్రవహించేలా చేసి రాత్రిరాత్రంతా దీపాలన్నీ వెలిగే ఏర్పాటు చేశాడు సాయి.‘ఆయన దేవుడు కాబట్టి వెలిగించగలిగాడు’ అంటూ ఒకే ఒక్క వాక్యం ఈ సంఘటనకి ముగింపు పలకడం సరికాదు. ఎలా వెలిగించగలిగాడు? దానిలో దాగిన మూల రహస్యం ఏమై ఉంటుందని ఆ తీరుగా పరిశీలిస్తే సాయి మహత్‌త్వం (గొప్పదనం) ఏమిటో.. ఎంతదో.. మనకి అర్థమై మన హృదయంలో కనిపించే సాయిచిత్రం మరింత చిక్కగా కనిపించేంత దట్టంగా కనిపిస్తుంది.‘ఉపనిషత్తు చెప్పేది – అగ్నే రాపః’ అని. అగ్ని నుండి నీరు పుడుతుందని. సాయి నీటి నుండి నిప్పు పుట్టేలా (వేడిమి) చేయగలిగాడంటే అది మరింత సిద్ధశక్తికి ఉదాహరణం కదా! సాయి ఇక్కడ మాత్రమే నీటిని తన అధీనంలోనికి తెచ్చుకున్నాడనుకోవడం సరికాదు.తన జీవితంతో.. శరీరంతో.. ప్రాణంతో.. సమానంగా పెంచుకున్న గుర్రం చాంద్‌పాటిల్‌కి కనిపించక పిచ్చిపట్టిన వానిలా తిరుగుతున్న వేసవి సమయంలో.. సాయి చెట్టునీడన కూర్చుని చాంద్‌పాటిల్‌కి గుర్రపు జాడని చెప్పి సంతోషపెట్టి – హుక్కా తాగుదువు గాని రా! అంటూ తన సటకాతో నేలమీద కొట్టి నీటినీ.. మళ్లీ అదే సటకాతో అదే నేల మీద కొట్టి నిప్పునీ.. రప్పించి ఆ నీటితో హుక్కాగొట్టాన్ని తడిపి ఆ నిప్పుతో పొగాకు రజనుని వెలిగించుకున్నాడు. ఇది చూసినచాంద్‌పాటిల్‌కి ఆశ్చర్యమనిపించి ‘సాయి’ మహిమ తెలిసిందనుకున్నాం లోగడ!ఉపనిషత్తు చెప్పింది– ‘అబ్భ్యః పృథ్వి – నీళ్ల నుండి పుడుతుంది భూమి’ అని. మరి సాయి విషయంలో చూస్తే భూమి నుండి కదా నీటిని రప్పించాడాయన. ఇదేమిటి? ఎందుకింతగా నీరు ఆయనకి స్వాధీనమయింది? ఆలోచిద్దాం!

ఇదీ కారణం!
నీటిశక్తినీ స్వభావాన్నీ నిరోధించడమనేది భాగవతాది ఇతిహాసాల్లో కనిపిస్తుంది. దేవకీ, వసుదేవులకి పుట్టిన శ్రీహరి రూపంలో దర్శనమిచ్చిన బాలుడ్ని వసుదేవుడు తీసుకువెళ్తూంటే యమునానది తనకు తానుగా రెండుగా చీలి వసుదేవునికి నడిచేందుకు వీలుగా త్రోవనిచ్చింది. ఆంజనేయుడు సముద్రమ్మీద ఎగురుతూంటే సముద్రం తన కెరటాల ఎత్తునీ, ఉద్ధృతినీ తగ్గించి సహకరించింది. అగస్త్యుడు సముద్రాన్ని మూడు మార్లు ఆచమనం చేసి తనలో ఉంచేసుకున్నాడు. జహ్నుమహర్షి తన ఆశ్రమాన్ని వరదనీటితో ధ్వంసం చేస్తున్న భాగీరథీ (గంగ)ని ఆపోశనపట్టి ఆ గంగ ప్రార్థన మీద చెవి నుండి విడిచి పుచ్చాడు. అప్పటి నుండే గంగకి ‘జాహ్నవి’ అనే పేరొచ్చింది. కాబట్టి నీటిని నిరోధించడం, తమ శక్తితో ఆ నీటిని లోకోపకారం కోసం వినియోగించడమనే విధానం ఎప్పుడూ ఉండనే ఉందని అర్థమవుతోందిగా! ప్రాణాయామవిద్యతో దుర్వాసోమహర్షి యమునానదిలో ఉండిపోవడం వేరు – అలాంటి విద్యాప్రదర్శనమేమీ లేకుండా సహజసిద్ధవిధానంతో నీటిని వశం చేసుకోవడం లేదు. సరే!నీళ్లెందుకు సాయి అధీనంలోకి వచ్చేసాయి? అనేది కదా ప్రశ్న! వేదంలో నీళ్లని స్తుతించిన మంత్రాలున్నాయి.

‘ఆ పోహిష్ఠామయోభువః తాన ఊర్జే దధాతన... ఆపో జనయధా చనః’ అని కనిపిస్తాయి. ఇవి ప్రతినిత్యం మనం ఏ పూజని చేయదలిచినా ముందుగా చదువబడే మంత్రాలే.నీళ్లు లౌకిక సుఖాన్ని (స్వేదం మొదలైన వాటిని తొలగించి శారీరకమైన ఆనందాన్ని) కలిగిస్తాయి. ముఖవర్చస్సుని పెంచుతాయి. వ్యక్తికి శక్తినిస్తాయి. నీరు ఏ మాత్రం తాగవీల్లేదని వైద్యుడు చెప్తూ ఫలాని తేనెని లేదా ఔషధాన్ని ఇంతమాత్రపు నీటితో తాగవలసిందని చెప్తాడు. వేసవిలో నీటిశాతం శరీరంలో తగినంత ఉండని పక్షంలో వ్యక్తి మరణానికి చేరువౌతాడు. ఏయే పదార్థానికి (ఖర్జూరం, తేనె, బెల్లం, పంచదార, ద్రాక్ష, పటికబెల్లం..) ఏ తీరు తీపిదనముందో తెలిపేందుకు ఈ అన్నింటితో ఉన్న తీపినీ కలిపి రుచి చేసేందుకు అవసరమైనది జలం. నీటిలో చక్కని రుచి గుణాన్ని ఏర్పాటు చేసేది, పంటలని పండించేందుకు కావలసిన రాసాయనిక ఉత్పాదక శక్తినీ ఇచ్చేది నీరే.. అంటూ పై మంత్రం చెప్తుంది వివరంగా.ఇంత గొప్పవి నీళ్లు కాబట్టే పుష్కరాలు పేరిట 12 రోజుల పాటు పుణ్యస్నానాలని చేస్తాం. పాపభారాన్ని తొలగించుకుని కొంతలో కొంత పుణ్యాన్ని పొందుతాం!ఈ నేపథ్యాన్ని బాగా పరిశీలించుకుని చూస్తే... ఏ నీళ్లు అనేవి వ్యక్తుల పాపాలన్నింటినీ హరించే శక్తి కలిగి ఉన్నాయో ఆ పనిని సాయి కూడా చేస్తూ వ్యక్తులకి హితబోధ చేస్తూ పాపం పట్ల విముఖతా పుణ్యంపట్ల ఆత్రుతా కలిగేలా ప్రత్యక్షంగా చేస్తున్నాడు కాబట్టే తాను చేస్తున్న పనినే చేస్తున్న సాయికి జలాలు స్వాధీనం కావాలని నిర్ణయించుకుని ఆయన వశం అయిపోయాయి.పుష్కరాల్లో మనం స్నానం చేసేది ఎందుకంటే ఆ మన పాపాలన్నీ నదిలో విడిచేసేందుకు. మరి ఇందరి పాపాలని (కొన్ని లక్షలమందికి చెందిన వివిధ వివిధ పాపాలని) తీసుకున్న ఆ పుష్కర నది మహాపాపి కాదా? అంటే ఆ నది ఎదురు చూస్తుంది. ఒక్క పతివ్రత చాలు తనలో స్నానం చేస్తే మొత్తం పాపసమూహమంతా తొలగిపోతుంది అని. (అపి మాం పాపయే త్సాధ్వీ స్నాత్వేతీచ్ఛతి జాహ్నవీ జనకతనయా స్నానపుణ్యోదకేషు) ఏ నీళ్లు వ్యక్తుల పాపాలని హరించే ప్రయత్నం చేస్తోందో అలాగే సాయి కూడా పాపులందరికీ తమతమ పాపాలేమిటో వివరించి ఇక ఆ పాపాలని తిరిగి చేయాలనే దృక్పథాన్ని పూర్తిగా మార్చేసాడు. ఇది ఒక కారణం.

శ్రీరామనవమి ఉరుసు చందనోత్సవం అనే మూడు పండుగలూ ఒకే రోజున జరుపవలసివస్తే ఎందరో జనులకి స్నానపానాదులకి నీళ్లు సరిపోతాయా? అనే చర్చలో జనులుంటే సాయి ఉప్పగా సముద్రజలంలా ఉండే నడబావి (4మార్గాలు కలిసే కూడలిలో ఉన్న నుయ్యి)లో మంత్రించిన పుష్పాలని వేసి పూర్తి తీపి జలంగా మార్చేసాడు. అలా జలం వశం కావడానికి కారణం ఎందరొస్తున్నారో ఆ ఉత్సవానికి. అలా వచ్చే అందరిలోనూ జాతి వర్గ మత కుల స్త్రీ బ్రాహ్మణ వృద్ధ, బాల, వితంతు... ఇలాంటి భేదాలు లేకుండా ఉండే తీరు సత్‌బుద్ధివిత్తనాలని నాటాడు. నాటుతూ ఉండేవాడు కాబట్టి.‘ఆపశ్శుంధంతు మై నసః’ ఓ జలములారా! నాకు నా పాపాలనుండి తొలగే శక్తిని ప్రసాదించవలసిందని ఈ మంత్రానికి అర్థం. దాంతో ఏదైనా పాపాన్ని చేస్తున్నానేమో? అనే బుద్ధివిచక్షణ ప్రతిక్షణమూ ప్రతివ్యక్తికీ కలుగజేస్తుంది ఆ మంత్రం. తన వద్దకొచ్చే అందరికీ ఈ పాప పుణ్య దృష్టీ ఆలోచనా అనేవాటిని నిరంతరం బోధిస్తూ ఉండేవాడు సాయి. అపవిత్రత తొలగి పవిత్రత రావాలంటే (అపవిత్రః పవిత్రోవా..) నీళ్లని శిరసున చల్లుకోవాలని మంత్రం చెప్తుంది. నీళ్లు ఏం చేయడానికి సృష్టింపబడ్డాయో, అదేపనిని సాయి కూడ చేస్తూ తనకి సహకరిస్తున్నాడనే ఉద్దేశ్యంతో జలం కూడా సాయికి స్వాధీనం అయింది. ఇక ‘తేజస్సు’ ఎలా సాయి అధీనానికి వెళ్లిందో, కారణమేమిటో తెలుసుకుందాం!
– సశేషం డా. మైలవరపు శ్రీనివాసరావు 

మరిన్ని వార్తలు