మీకు మీరే.. మాకు మేమే!

10 Dec, 2017 01:15 IST|Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

మెయిన్‌ స్ట్రీమ్‌ తెలుగు సినిమాలో అరవై ఏళ్ల కిందట వచ్చిన ఓ క్లాసిక్‌ సినిమాలోని సన్నివేశాలివి. ఇప్పటికీ తెలుగులో టాప్‌ సినిమాల్లో ఈ సినిమాకు చోటు ఉంటుంది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం?..

ఎమ్‌.టి.రావు చెప్పిన విషయాన్నే పదే పదే ఆలోచిస్తోంది మేరీ. మేరీకి రావు చెప్పినదానికి మించిన ఆప్షన్‌ ఇంకోటి కనిపించలేదు. ప్రస్తుతానికి ఇద్దరికీ ఉద్యోగాలు లేవు. అందివచ్చిన అవకాశాన్ని కాదనుకోలేదు.‘‘రాత్రంతా ఆలోచించి చూశాను. మీ ఐడియా బాగానే ఉంది.’’ అంది మేరీ. ఎమ్‌.టి.రావు చిన్నగా నవ్వాడు.‘‘బాగుండక ఏం చేస్తుంది! ఐడియా లేకపోతే ప్రపంచమే లేదు!’’ అన్నాడు రావు, గట్టిగా నవ్వుతూ.‘‘కానీ.. కానీ..’’ అంటూ తన భయాలు చెప్పబోయింది మేరీ.‘‘గ్రహించాను. మీరింకేం చెప్పక్కర్లేదు.’’ ధైర్యమిచ్చాడు ఎమ్‌.టి.రావు.అప్లికేషన్‌ ఫామ్‌ మీద సంతకాలు చేశారు ఇద్దరు.  ‘‘చూడండీ! ఇకనుంచి ఇద్దరం కేవలం స్నేహితుల్లాగానే ఉండాలి..’’ అంది మేరీ.‘‘అలాగే! కలంతో గానీ, నోటితో గానీ, మీ ఉద్యోగం నిలుపుకోవడం కోసం ఎంతవరకు మీకు భర్తగా ఉండాలో..!’’ ఎమ్‌.టి.రావు చెబుతూంటే, మధ్యలోనే అందుకొని..‘‘ఇక చెప్పకండి! నాకు సిగ్గేస్తోంది..’’ అంటూ నవ్వింది మేరీ.

అప్పాపురం రైల్వే స్టేషన్‌లో ఎమ్‌.టి.రావు, మేరీల కోసం ఎదురుచూస్తున్నాడు గోపాలం. ఊర్లో బాగా పేరున్న వ్యక్తి గోపాలం. సొంతంగా ఒక స్కూల్‌ కూడా ఉంది. ఆ స్కూల్లో పనిచేసేందుకే ఎమ్‌.టి.రావు, మేరీలకు ఉద్యోగాలు ఇచ్చాడాయన. కానీ వాళ్లు కేవలం తనకింద పనిచేసే ఉద్యోగులుగా మాత్రమే ఉండటం ఆయనకు ఇష్టం లేదు. అందుకే తానే స్వయంగా వచ్చి రైల్వే స్టేషన్‌లో వాళ్ల కోసం నిలబడ్డాడు. రాగానే మెడలో దండలు వేసి ఇద్దరినీ ఆహ్వానించాడు. ఎమ్‌.టి.రావు, మేరీల జంట ఆయనకు చూడముచ్చటగా కనిపించింది. ఇద్దరినీ తన కారులో ఇంటికి తీసుకెళ్లి, ఇంట్లో అందరికీ పరిచయం చేసి, అతిథి మర్యాదలతో వారిని చూసుకోవాలని ఆదేశించాడు. రావు, మేరీలకు ఇదంతా కొత్తగా ఉంది. మేరీని ఆ ఇంటి బిడ్డగా చూసుకోమని అందరికీ చెప్పాడు గోపాలం.

గోపాలం భార్యకు కూడా మేరీ బాగా నచ్చింది. కానీ మేరీనే ఆవిడ కొంత ఇబ్బంది పెట్టింది. ‘‘అదేంటమ్మా! బొట్టు లేకుండా ఉన్నావ్‌!’’ అన్నప్పుడు మేరీ కొంత ఇబ్బందిగా కదిలింది. అక్కడున్న వారెవ్వరికీ తెలియదు.. మేరీ అసలు పేరు అక్కడున్న వారికి పరిచయం అయినట్టు మహాలక్ష్మి కాదని; రావు, మేరీలు భార్యభర్తలు కారని.తాము భార్యాభర్తలుగా నాటకం ఆడుతున్నది, ఉద్యోగం కోసమే వాళ్లు ఈ అగ్రిమెంట్‌ చేసుకున్నదీ అక్కడున్న ఎవ్వరికీ తెలిసే అవకాశం రాకుండా.. రావు, మేరీ ఇద్దరూ జాగ్రత్త పడ్డారు. జాగ్రత్త పడుతూనే ఉన్నారు.గోపాలం కూతురు సీతకు సంగీతం పాఠాలు చెప్పేందుకు కూడా మేరీ ఓకే చెప్పింది. ఆ పాఠాలూ అలా కొనసాగుతున్నాయి.  రోజులు గడుస్తున్నాయి. రావు, మేరీల వ్యవహారం ఏదో తేడాగా ఉందని రాజు వారిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. రాజును అందరూ డిటెక్టివ్‌ రాజు అంటారు. గోపాలానికి మేనల్లుడు అతను.రాజు వీరిద్దరూ భార్యాభర్తలు కాదన్న అనుమానానికి వచ్చేశాడు. అందుకు ఆధారాలు సంపాదించేందుకు కష్టపడుతున్నాడు కూడా!

గోపాలం కూతురు సీత, రావుకు దగ్గరవుతోంది. ఆయనతో అంత కలివిడిగా మెలగొద్దని మేరీ వారించినా ఆమె తగ్గలేదు. మేరీ దగ్గర సంగీతం నేర్చుకోవడం మానేసి సీత, రావు దగ్గర నేర్చుకోవడం మొదలుపెట్టింది.  సీతను ఇష్టంగా ప్రేమించే రాజుకూ ఈ విషయం నచ్చలేదు. ‘‘ఇద్దరం కేవలం ఫ్రెండ్స్‌గానే ఉండాలి’’ అని మాట తీసుకున్న మేరీ, ఆ మాటను తానే బ్రేక్‌ చేసుకొని రావుకు దగ్గరైపోతోంది.దీంతో రావుతో సీత అంత చనువుగా ఉండటం మేరీకి నచ్చలేదు. ఆ విషయం పరోక్షంగా ప్రకటిస్తూనే వస్తోంది. ఈ నలుగురి మధ్యా ఒకరికి ఒకరు చెప్పుకోని చిన్న చిన్న అసూయలు అలా బయటపడుతూ, బయటపడకుండా ఉంటున్నాయి.అలాంటి ఒకరోజు మేరీతో మాట్లాడటానికి రాజు ఆమె గదికి వచ్చాడు. ‘‘నమస్కారమండీ!’’ అంటూ రాగానే రెండు చేతులూ జోడించి వినమ్రంగా నమస్కరించాడు రాజు.‘‘నమస్కారం! కూర్చోండి’’ అంటూ మేరీ అంతే వినమ్రంగా నమస్కరించింది.ఆ వెంటనే ‘‘వెళ్లి! కాఫీ తీసుకురా!!’’ అంటూ ఇంట్లో పనిమనిషికి చెప్పింది మేరీ.‘‘అబ్బే వద్దండీ.. నేనూ.. మీతో ఓ విషయం మాట్లాడాలని వచ్చాను..’’ అన్నాడు చిన్నగా, కొద్దిగా సిగ్గుపడుతూనే.‘‘చెప్పండీ!’’‘‘మీరంతా చూస్తూనే ఉన్నారుగా..’’ కుర్చీలో కూర్చుంటూ మెల్లిగా అడిగాడు రాజు.

‘‘ఆ! చూస్తూనే ఉన్నాను.’’‘‘చూస్తూనే ఇలా ఊరుకోవడం ఏమీ బాగోలేదు. పరిస్థితి చాలా ముదిరింది.’’‘‘అయితే నన్నేం చెయ్యమంటారు..? మీ అమ్మాయిని మీరు జాగ్రత్తగా చూసుకోండి’’ విసురుగా అంది మేరీ.‘‘హయ్యో! జాగ్రత్త చేసుకోలేకనే కదా ఇదంతా!!’’ అని కాసేపాగి, ‘‘మీరు నాకో సాయం చేయండి..’’ అన్నాడు రాజు.    ‘‘చెప్పండి! నాకు చేతనైతే చేస్తాను..’’‘‘మీరు మా సీతకు సంగీతం చెప్పాలి..’’‘‘నా దగ్గర వద్దనే కదా.. ఆయన దగ్గర చెప్పించుకుంటోంది..’’‘‘అవుననుకోండీ.. అట్లా అని ఊరికే ఊరుకుంటామా?’’‘‘పోనీ.. మీరెందుకు చెప్పకూడదూ..?’’‘‘నేనా? నాకు రాదే!!’’‘‘నేను నేర్పిస్తాను. నేర్చుకోండి..’’‘‘నాకెందుకు లెండి..’’‘‘ఫర్వాలేదు. నేర్చుకోండి..’’ అంటూ లేచి హార్మోనియం దగ్గరకెళ్లి కూర్చుంది మేరీ. ‘‘సానిసరిమారీనిసాసా..’’ అంటూ మేరీ రాగం పాడితే.. రాజు ఆమెను అందుకోలేక కూని రాగాలు తీయడం మొదలుపెట్టాడు. మేరీ తనకున్న సంగీత పరిజ్ఞానాన్నంతా చూపెడుతోంది. రాజు భయపడిపోతున్నాడు.దాన్ని అందుకుంటూ కూనీరాగాలు తీస్తోన్న రాజు, ఎమ్‌.టి.రావును చూడగానే ఆగిపోయాడు. మేరీ పాడుతూనే ఉంది.రావును చూడనట్టుగానే నటిస్తూ, మేరీ మరింత గట్టిగా పాడటం మొదలుపెట్టింది.రావు నవ్వుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు.రావును చూస్తూ.. మేరీ పాట అందుకుంది..‘‘మీకు మీరే.. మాకు మేమే!’’     
 

మరిన్ని వార్తలు