వివేకం: రెండవ దృష్టికోణం

21 Sep, 2013 23:59 IST|Sakshi
వివేకం: రెండవ దృష్టికోణం

ఓ సన్యాసి తన సాధన కోసం అడవికి వెళ్లాడు. అతనికి ముందరి రెండు కాళ్లు పోగొట్టుకొని ఎటూ కదల్లేని ఒక నక్క ఎదురుపడింది. అది ఊరికే ఒక చెట్టు కింద కూర్చుని ఉంది. చూస్తే దానికి బాగానే ఆహారం దొరుకుతున్నట్టుగా ఉంది. ఆ నక్క బహుశా ఏ వేటగాడి ఉచ్చులోనో పడి అలా అయి ఉండవచ్చు అనుకున్నాడు. ఆ గాయం చాలా కాలం క్రితమే మానిపోయినట్టుంది. కాళ్లు లేకుండా నక్క ఎలా జీవించగలుగుతోందో సన్యాసికి అర్థం కాలేదు. ప్రకృతి కుంటితనంపై అంత దయ చూపదు. ఆహారం సంపాదించుకోలేకపోతే, మరణించినట్టే.  అతని ఆశ్చర్యాన్ని రెట్టింపు చేస్తూ, ఆ సాయంత్రం అక్కడికో సింహం వచ్చింది.
 
 అది తను వేటాడిన ఒక జంతు కళేబరాన్ని అక్కడికి తీసుకొచ్చి తిన్నది. తినగా మిగిలినదాన్ని నక్క ముందుంచింది. సన్యాసి తన కళ్లను తాను నమ్మలేకపోయాడు. ప్రతి రెండు మూడ్రోజులకూ, ఆ సింహం వచ్చేది, కొంత మాంసాన్ని నక్క ముందుంచి వెళ్లిపోయేది. దీంతో ఆ సన్యాసి ఇది దేవుడి నుండి వచ్చిన సందేశమే కాని మరొకటి కావడానికి వీల్లేదు. ఒక సింహం కుంటి నక్కను మేపడం ఒక అద్భుతం. అందుకే, అతను ఇది నాకో సందేశం అనుకున్నాడు. ఒక కుంటి నక్కకు అది కూర్చున్నచోటికే ఆహారం వస్తే, ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్న ఓ సన్యాసినైన నాకు ఆహారం ఎందుకు దొరకదు? భిక్షాటన కోసం నేను నగరానికి ఎందుకు వెళ్లాలి? కూర్చొని ధ్యానం చేయటానికి బదులు, నేను ఆహారం కోసం అనవసరంగా నగరానికి వెళుతున్నాను అనుకున్నాడు.
 
 అతను అడవిలో ఓ రాతిమీద కూర్చుని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. మూడు రోజులు ఎలాగో గడిపాడు. నాలుగో రోజు నుంచీ అతను ధ్యానం చేయలేకపోయాడు. అతను పొట్టను గట్టిగా పట్టుకొని కూర్చుండిపోయాడు. అతన్ని ఆకలి దహించి వేస్తోంది. 18 రోజులు గడిచాయి. అతను పూర్తి బలహీనంగా, బక్కగా అయిపోయాడు. కానీ ఇంకా దైవకృప కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. నాకు తటస్థ పడింది తప్పకుండా దేవుని సందేశమే. అయినా నాకేం జరుగుతోంది? ఎందుకు ఎవరూ రావట్లేదు. ఆహారాన్ని ఎందుకివ్వట్లేదు? అనుకున్నాడు. ఆ దారినే ఒక యోగి వెళుతూ, ఈ సన్యాసి మూలగడం విని, నీకేమైంది? ఎందుకు నువ్వీ పరిస్థితిలో ఉన్నావు? అని అడిగాడు, నక్క-సింహం ఉదంతాన్ని వివరించి సన్యాసి ఇలా అడిగాడు: వివేకవంతులైన మీరే చెప్పండి. ఇది దైవ సందేశం కాదా?
 
 ఆ యోగి అతన్ని చూసి, కచ్చితంగా ఇది దేవుడి సందేశమే. కానీ నువ్వు కుంటి నక్కలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? దయ కలిగిన సింహంలా ఎందుకు ప్రవర్తించడం లేదు? అన్నాడు. పరిస్థితిని అర్థం చేసుకోవడంలో వీరిద్దరిలోని తేడా గమనించారా? మీరు పరిస్థితిని సరిగా అర్థం చేసుకోండి.
 
 సమస్య - పరిష్కారం
 కష్టాలొచ్చినప్పుడు మానవులు ఎక్కువ పూజలు చేయడం అవశ్యమా? అలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా?
 - ఎన్.కుమారి, నిడదవోలు
 సద్గురు: పూజలు ఎందుకోసం చేస్తారు. భగవంతుడి గురించి తెలుసుకోవడానికా? మీరు పూజలు చేసేది దానికోసం కాదు. భగవంతుడు మీ కోరికలు తీర్చే ఒక యంత్రంగా మీరు భావిస్తున్నారు.
 భగవంతుడిని పూజిస్తే మీరు కోరిన కోరికలు తీరుస్తాడని అందరూ మీతో చెప్పడం వల్ల, ఆయన ముందు విన్నవించుకోవడాన్నే మీరు ప్రార్థన అనుకుంటున్నారు. అసలు భయం వల్ల కాని, ఆశల వల్ల కాని భగవంతుడిని పూజించడం ప్రార్థన కాదు. భగవంతుడికి బదులుగా ఒక గాడిదను చూపి, దాన్ని పూజిస్తేనే మీ కష్టాలు తీరుతాయని ఎవరైనా అంటే ఆ పనిని కూడా మీరు సంతోషంగా చేస్తారు.
 
 ప్రార్థనను ఒక పనిలా కాకుండా, మనస్సుని నిజాయితీతో భగవంతుడిపై కేంద్రీకరించగలిగితే మీకు కష్టమొచ్చినప్పుడు స్నేహితుడిలా మిమ్మల్ని ఆదుకోగలడు. అయితే మీ ప్రార్థనలో భక్తి శ్రద్ధలు లోపించి, పూజలు ఒక సంప్రదాయంగా భావిస్తే, కోటి మార్లు పూజలు చేసినా ఎటువంటి ఫలితమూ పొందలేరు.
 - జగ్గీ వాసుదేవ్

మరిన్ని వార్తలు