ఇద్దరి కల

19 Aug, 2018 00:03 IST|Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

తమిళంలో క్లాసిక్‌ అన్న పేరున్న ఒక డబ్బింగ్‌ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. విడుదల సమయంలో ఫ్లాప్‌ అయిన ఈ సినిమా,  ఆ తర్వాత కల్ట్‌ క్లాసిక్‌ అనిపించుకుంది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... 

సమర సూర్యం, ఆనంద్‌.. వాళ్లిద్దరూ ఒకరికొకరు పరిచయం కావడానికి చాలా ముందు నుంచే ఇద్దరికీ కొన్ని కలలున్నాయి.   సమర సూర్యం పెద్ద రచయిత. సినిమాల్లోనూ అప్పుడప్పుడే బిజీ అవుతున్నాడు. కానీ రాజకీయాలను, సమాజాన్ని మొత్తం మార్చేయాలన్నది అతడి కల. గాంధీజీ స్ఫూర్తితో మొదలైన ఒక కొత్త పార్టీలో చేరి పనిచేస్తున్నాడు.  ఆనంద్‌కు నటుడవ్వాలన్నది కల. కనిపించిన స్టూడియోలన్నీ తిరుగుతున్నాడు. ‘ఒక్క అవకాశం ఇప్పించండి’ అని బతిమిలాడుకుంటున్నాడు.  ఆనంద్‌కు సూర్యం పరిచయమయ్యాడు. ఆనంద్‌ మాటకు, సూర్యం రాత తోడైంది. ఇద్దరూ కలిసి అవకాశాల కోసం తిరిగారు.ఆనంద్‌ పడుతున్నాడు, లేస్తున్నాడు. చివరికి గట్టిగా నిలబడ్డాడు. కథానాయకుడి పాత్ర. సూర్యం వరుస సమావేశాలతో పార్టీలో ఓ కీలక వ్యక్తిగా ఎదుగుతున్నాడు.  ఇద్దరి జీవితాలూ అప్పుడే ఒక మలుపు తీసుకుంటున్నాయి.  ఆనంద్‌ సినీ పరిశ్రమలో కథా నాయకుడిగా ఒక వెలుగు వెలుగుతున్నాడు. సూర్యం తన కల కోసం పార్టీని జనాల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళుతున్నాడు.  ప్రజలకు సేవ చేయడానికి తానూ పార్టీలో చేరతానన్నాడు ఆనంద్‌. సూర్యం తమ నాయకుడికి ఆనంద్‌ను పరిచయం చేశాడు. 

‘‘ఆకాశంలో ఎగిరే తార ఒడిలో వచ్చి వాలతానంటే అందరికీ సంతోషమేగా!’’ అన్నాడు వాళ్ల నాయకుడు. ఆనంద్‌ కొత్త ఆశలతో పార్టీలో చేరాడు. ‘‘నేను పార్టీలో చేరడం సమరసూర్యానికి నచ్చలేదా?’’ సూర్యాన్ని కౌగిలించుకుంటూ అడిగాడు ఆనంద్‌. గట్టిగా నవ్వాడు సూర్యం, తను సమాధానం చెప్పే రోజు ఇంకా రాలేదన్నట్టు.అలాంటిరోజు వచ్చింది. ఆనంద్‌ను భోజనానికి ఇంటికి పిలిచాడు సూర్యం. అతడు తింటూండగానే, మధ్యలోనే చెయ్యి కడగమని బలవంతం చేసి, మేడ మీదకి తీసుకెళ్లాడు. ఆ ఇంటి మేడ మీదినుంచి కిందకు చూస్తే చుట్టుపక్కల ఎంత దూరం ఖాళీ స్థలం ఉంటే అంత దూరం జనంతో నిండిపోయింది. ‘‘ఇదే ప్రజాశక్తి. లెనిన్, స్టాలిన్‌ ఎంతో కష్టపడి సాధించిన ప్రజాశక్తి. ప్రజల మనస్సులోకి వెళ్లగల శక్తి.’’ ఉద్వేగంతో చెబుతున్నాడు సూర్యం.‘‘కానీ నేను ఒట్టి నటుడ్ని కదా!’’ అన్నాడు ఆనంద్‌. ‘‘వాళ్లలా అనుకోవడం లేదు. అలా చూడు! వాళ్ల మనస్సులో నీ రూపాన్ని చెరగని ముద్ర వేసుకున్నారు. నీకోసం ప్రాణాలిస్తారు. ఈ శక్తిని నువ్వేం చేస్తావ్‌?’’ అంతే ఉద్వేగంతో అడిగాడు సూర్యం. ‘‘ఏం చేయాలంటావ్‌?’’ ‘‘ఇంతటితో వదలకూడదు. దాన్ని కొన్ని వేల రెట్లు పెంచాలి. పార్టీ కోసం ఉపయోగించాలి. అంతా నీ మొహంలోనూ, ఆ వెండితెరలోనే ఉంది.’’ ఆనంద్‌ను గట్టిగా కౌగిలించుకొని చెప్పాడు సూర్యం. ఆనంద్‌ రెండు చేతులూ పైకెత్తి కిందనున్న వాళ్లకు అభివాదం చేశాడు. ఇద్దరి వేర్వేరు కలలు ఆరోజు ఒక్క కలగా మారాయి. 

పార్టీ కోసం కలిసి పనిచేశారు. ప్రజా సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి ఎత్తి చూపారు. పార్టీని జనాల్లోకి తీసుకెళ్లారు. ఆనంద్‌ కథానాయకుడి పాత్రలు చేస్తూ సూపర్‌స్టార్‌ స్థాయికి వెళ్లాడు. ఆయన ఎక్కడ కనబడితే అక్కడ జనం కుప్పల్లా పోగై కనిపిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ నాయకుడు సూర్యాన్నే ముఖ్యమంత్రి పదవి స్వీకరించమని కోరాడు. సూర్యం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాడు. రోజులు గడుస్తున్నాయి. సూర్యం ముఖ్యమంత్రిగా తాను చేయాలనుకున్న పనులు ఒక్కొక్కటిగా చేస్తూ వెళుతున్నాడు. ఆనంద్‌ వరుసగా సినిమాలతో దూసుకెళ్తున్నాడు.ఒకరోజు సూర్యం ముందు కూర్చుని, ‘‘మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారని విన్నాను. సూర్యం! నాకు ఆరోగ్య శాఖ ఇవ్వాలి. పెద్దాయన నాతో అన్నారు, మంత్రి పదవి స్వీకరించాలని.’’ అన్నాడు ఆనంద్‌ చాలా ప్రశాంతంగా. సూర్యం ఆలోచిస్తున్నాడు.‘‘ఏం సూర్యం? మంత్రిపదవి స్వీకరించే అర్హత నాకు లేదంటావా?’’ అడిగాడు ఆనంద్‌. ‘‘ఈ పార్టీకి మిగతా వాళ్ల కంటే నువ్వు చేసిన సాయం ఎక్కువ. అందుకే మొదటి మంత్రివర్గంలోనే నీ పేరు సూచించా. కానీ వర్కింగ్‌ కమిటీ నువ్వు నటనకు స్వస్తి చెప్తేనే పదవి అన్నారు. వాదించాను. కానీ వాళ్లు ఒప్పుకోలేదు.’’‘‘సూర్యం నాకు మంత్రి పదవి ఇవ్వడన్నమాట!’’‘‘ఆనందూ! నువ్వు సినిమాలు వదిలేస్తే...’’ అని ఆగాడు సూర్యం. 

ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటకొచ్చేశాడు ఆనంద్‌. సూర్యం ఈర్ష్యతోనే ఇదంతా చేశాడని ఆనంద్‌కు ఎంతమంది చెప్పినా అతను స్నేహాన్నే నమ్మాడు. ఆనంద్, సూర్యం మధ్యన దూరం పెరిగింది. పార్టీ నాయకుడు పెద్దాయన అనారోగ్యంతో చనిపోయాడు.పెద్దాయన సంతాప సభలో ఆనంద్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పెద్ద ప్రసంగం ఇచ్చాడు. అవినీతి పెరిగిందని, ప్రజల్లో పార్టీపై నమ్మకం పోకుండా ఉండటానికి, పెద్దాయన ఆశయ సాధన కోసం నాయకులంతా తమ తమ ఆస్తులను బయటకు లెక్క చూపాలని అరిచి చెప్పాడు.  పార్టీలో చీలిక మొదలైంది. ఆనంద్‌ను పార్టీ బహిష్కరించింది. ‘‘ఇది నిజంగానే నాకు మంచి రోజు.’’ అని సమాధానమిచ్చాడు ఆనంద్, తనను పార్టీ బహిష్కరించడం గురించి చెప్తూ. ఆనంద్‌ కొత్త పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టడంతోనే ఆయన అధికారంలోకి వచ్చాడు. ఇద్దరు మిత్రులు అధికారం, ప్రతిపక్షంలో కూర్చున్నారిప్పుడు. ఆ తర్వాత ఆనంద్, సూర్యం స్నేహితుల్లా మాట్లాడుకున్నది లేదు. ముఖ్యమంత్రిగా జనాల గుండెల్లో మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే ఆనంద్‌ గుండెపోటుతో చనిపోయాడు. అప్పుడు మాత్రం స్నేహితుడ్ని తల్చుకొని బాగా ఏడ్చాడు సూర్యం. 

మరిన్ని వార్తలు