విడాకులు కావాలి! 

1 Apr, 2018 01:15 IST|Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

ఇండియన్‌ సినిమా పాపులర్‌ డైరెక్టర్స్‌లో ఒకరు తీసిన క్లాసిక్‌  సినిమాలోని సన్నివేశాలివి. ఈ తమిళ సినిమా తెలుగులో డబ్‌ అయి ఇక్కడి ప్రేక్షకులకూ ఫేవరెట్‌ సినిమాల లిస్ట్‌లో ఒకటిగా చేరిపోయింది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం...

మధ్యాహ్నం కావొస్తోంది. బయట వర్షం పడుతోంది. క్లాస్‌రూమ్‌లో ప్రొఫెసర్‌ పాఠాలు చెబుతోంది. దివ్యకు వినాలని లేదు. నాన్న మాటలే ఆలోచనలుగా గిర్రున తిరుగుతున్నాయి. ‘మధ్యాహ్నం పెళ్లిచూపులు చూడ్డానికి వస్తున్నారట. వాడు చెప్పేవన్నీ చేసి, మెప్పించి, వాళ్లు ఓకే చెబితే తలొంచి తాళి కట్టించుకోవాలట’ తనకు తాను చెప్పుకుంటోంది దివ్య.  ‘నేనింట్లో ఉంటేనే కదా చూడగలుగుతారు? ఒకవేళ నేను రెండు గంటలకు ఇంటికి వెళ్లకపోతే? నేను వెళ్లడం లేదు. వెళ్లడం లేదు.. వెళ్లడం లేదు..’ అని తనకు తాను సర్దిచెప్పుకొని గట్టిగా నవ్వింది దివ్య. క్లాసయిపోయింది. వర్షం పడుతూనే ఉంది.  దివ్య ఇంటికెళ్లొద్దని ఫిక్సయిపోయింది. ఆడింది. పాడింది. రాత్రి అయ్యే వరకూ ఆడుతూనే ఉంది. ఇంటికెళ్లగానే, పెళ్లిచూపులకు వచ్చిన వాళ్లు వెళ్లిపోయి ఉంటారనుకుంది. కానీ వాళ్లు ఆమె కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.అబ్బాయి దివ్యతో పర్సనల్‌గా మాట్లాడాలని అడిగాడు. అబ్బాయి పేరు చంద్రకుమార్‌. ఇద్దరూ ఒక గదిలోకి వెళ్లారు. ‘‘మిమ్మల్ని ఇంతసేపు వెయిట్‌ చేయించినందుకు క్షమించమని అడగడం లేదు.ఎందుకంటే నేను చేసింది తప్పు అని నాకనిపించలేదు. నాకిది నచ్చలేదు. ఇలా పిల్లను చూస్కోవడం సంతలో పశువును బేరమాడినట్టు ఉంది.’’ దివ్య తాను చెప్పాలనుకున్నదంతా చెప్పేస్తూ.. ‘‘నేను మీకు మంచి భార్యను అవుతానని కూడా నేననుకోను.’’ అంది చివరిమాటగా. చంద్రకుమార్‌ లేచి నిలబడి ఒకే ఒక్క మాట అన్నాడు – ‘‘నువ్వు నాకు నచ్చావు.’’ 

పెళ్లవ్వగానే చంద్రకుమార్‌తో ఢిల్లీ వచ్చేసింది దివ్య. ఆమె ప్రపంచం మొత్తం మారిపోయిందిప్పుడు. కొత్త మనుషులు. కొత్త ప్రదేశం. తనకు తానే కొత్తగా కనిపిస్తోంది. భర్త ప్రేమిస్తున్నాడు. కానీ ఆమెకు నచ్చడం లేదు. ఆ ప్రేమ నచ్చడం లేదు. ఇప్పటివరకూ ఒంటిమీద చెయ్యి కూడా వెయ్యనివ్వలేదు. ‘‘ఇది ఇటుకలు, సిమెంట్‌తో కట్టబడిన ఒక ఆలయం. అంతే. దీన్నొక ఇంటిగా మార్చడం నీ చేతుల్లో ఉంది..’’అన్నాడు చంద్ర. దివ్య అతను చెప్పే మాటలన్నీ విని కాసేపు ఏం మాట్లాడలేదు. ‘‘నాకు ఇటుకలు, సిమెంటు చాలు.’’ అంది అభావంగా. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఢిల్లీకి వచ్చిన రెండో రోజే చంద్రకుమార్‌ ఆఫీస్‌కు వెళ్లిపోయాడు. దివ్య మనసులో ఎన్ని ప్రశ్నలు తిరుగుతున్నాయో, ఆమె తనను ఎందుకు యాక్సెప్ట్‌ చెయ్యలేకపోతోందో చంద్రకుమార్‌కు తెలియదు. దివ్యకు మాత్రమే తెలుసది.ఆమెను సంతోషపెట్టడానికి తనేం చేయాలా అని బాగా ఆలోచించాడు. డిన్నర్‌ పార్టీకి తీసుకెళ్లాడు. పెళ్లికానుకగా ఆమెకు ఏదైనా ఇష్టంగా కొనిపెట్టాలనుకున్నాడు. చంద్రకుమార్‌ ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ ఇంకా రాలేదు. ఎదురుగా దివ్య ఏం మాట్లాడకుండా కూర్చొని ఉంది. నిమిషాలు మెల్లిగా సెకండ్ల చుట్టూ తిరుగుతున్నాయి. దివ్య అడిగింది – ‘‘నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా.’’ ‘‘అడుగు,’’ ‘‘నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు?’’ చంద్ర సమాధానం చెప్పడానికి సమయం తీసుకుంటున్న వాడిలా తల కాస్త కిందకు వంచాడు. ఆమె కొనసాగించింది – ‘‘పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేనెన్నో చెప్పాను. అయినా నన్నే ఎందుకు కావాలనుకున్నారు?’’ చంద్ర చాలాసేపు ఆలోచించి చెప్పాడు – ‘‘నువ్వు నాకు బాగా నచ్చావు. మా అన్నయ్యా, వదినల నిర్బంధం వల్ల పెళ్లిచూపులకు వచ్చాను. నిన్ను చూసి ఈ పెళ్లంటే నాకిష్టం లేదు.నన్ను క్షమించమని అడుగుదామని నీకోసం ఎదురుచూశాను. కానీ నిన్ను చూసిన తర్వాత.. నేను చెప్పాలనుకున్నది నువ్వే చెప్పిన తర్వాత.. మాటల్లో చెప్పలేను.. నువ్వు నాకు బాగా నచ్చేశావు.వద్దని చెప్పాలనుకున్న నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి వచ్చేశాను.’’ మళ్లీ చంద్రకుమారే, కాసేపాగి అడిగాడు – ‘‘నీకు ఈ పెళ్లి జరగడం సంతోషమేగా?’’.దివ్య కళ్లు కిందకు దించి చెప్పింది – ‘‘లేదు’’. మళ్లీ ఇద్దరి మధ్యా నిశ్శబ్దం. నిన్నటి నిశ్శబ్దానికి కొనసాగింపు ఇది. 

డిన్నర్‌ పార్టీ అయిపోయింది. రోడ్డు మీద ఒక లాంటి నిశ్శబ్దం. వాళ్లిద్దరి భారాన్నీ మోస్తున్న నిశ్శబ్దం. కారు చిన్నగా వెళుతోంది. చంద్రకుమార్‌ చూపు రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ఉన్న షాపుల మీదకి మళ్లి వస్తూ, రోడ్డు మీద పడి ఆగిపోతోంది. ఒక షాపు ముందు కారు ఆపాడు చంద్రకుమార్‌. ఇంతసేపూ దివ్య ఒక్కమాటా మాట్లాడలేదు. కారాపగానే అడిగింది – ‘‘ఎందుకు ఇక్కడ ఆగారు?’’. చంద్ర తన చేతిని దివ్యకు అందిస్తూ, రెండు వేళ్లు తెరిచిపెట్టి ఇందులో ఒకటి ముట్టుకో అన్నాడు. ఎందుకన్నట్టు చూసింది దివ్య. ‘‘ఏదైనా బహుమతి కొనిద్దామని ఉంది. అది బట్టలా, నగలా నిర్ణయం కాలేదు.’’ అన్నాడు. ‘‘నాకేమీ వద్దు.’’ ‘‘పెళ్లయిన తర్వాత మొదటిసారి బయటకొచ్చాం. నిన్ను ఒట్టి చేతుల్తో తీసుకెళ్లడం నాకిష్టం లేదు.’’ ‘‘అదే.. నాకేమీ అవసరం లేదని చెప్పాగా!’’ ‘‘ఏం కావాలన్నా అడుగు,’’ ‘‘ఏదడిగినా కొనివ్వగలరా?’’ అడిగింది దివ్య. చిన్నగా నవ్వాడు చంద్ర. ‘‘నా శక్తికి మించనిదైతే కొనిస్తా’’. ‘‘నాకు విడాకులు కావాలి. కొనివ్వగలరా? అది ఈ కొట్లో కొనివ్వగలరా?’’ అంది దివ్య, అసహనంగా కదులుతూ. మళ్లీ నిశ్శబ్దం. కారు స్టార్ట్‌ అయింది. ఆ నిశ్శబ్దంలో దాగిన ఓ కథ అప్పటికి దివ్యకు మాత్రమే తెలుసు. ఆమే చెప్పాలనుకొని, ఆ కథ చెబితే తప్ప చంద్రకుమార్‌కు అదెప్పటికీ తెలియదు. 
 

మరిన్ని వార్తలు