ఇంకేమి సేయవలరా డింగరీ!

30 Sep, 2018 00:36 IST|Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

కాశీమజిలీ కథల్లో నుంచి పుట్టుకొచ్చిన కమ్మని కథ ఇది.నాటక రూపంలోనే కాదు చలనచిత్రంగా కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.పింగళి వారి డైలాగులు పటాసుల్లా పేలాయి.కాలాలకతీతంగా కనుల విందు, వీనుల విందు చేస్తున్న సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి.  సినిమా పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం...

మాంత్రికుడు పెద్ద గొంతుతో అరుస్తున్నాడు...‘‘ఆమ్‌ అహమ్‌... అష్టభైరవిని కట్టా. కామ్‌ కహామ్‌.... కాలభైరవిని కట్టా...తాం తదనమ్‌ తంటామారిని గెంటా... ఇక మంత్రబలం చూపించే మనోబలం చూపించే...’’
బెల్లం చుట్టూ ఈగల్లా జనం పోగయ్యారు.‘‘జనమూ.... జనమూ... నేపాళమాంత్రికునికి  వందనాలు అనండి. డింగిళ్లు అనండి’’ జనాల్ని చూస్తూ అరిచాడు మాంత్రికుడి అసిస్టెంట్‌ డింగరి.‘‘వందనాలు... వందనాలు’’ అని అరిచారు జనాలు.‘‘యువకులంతా ముందుకు రండి.... యువతులంతా ముందుకు రండి’’ అంటూ యువతీ యువకులను ముందువరసలోకి తెచ్చిన మాంత్రికుడు వృద్ధులు, వయసు మళ్లిన వాళ్లపై నిర్లక్ష్యపు చూపు విసిరి...‘‘నడుములు వంగిన నాయకులంతా గడబిడ సేయక వెనక ఉండండి’’ అని ఆదేశించినంత పని చేశాడు. ఆ తరువాత...‘‘అరేయ్‌ డింగరీ’’ అని అరిచాడు.‘‘ఏం గురూ’’ అని దగ్గరకు వచ్చాడు అసిస్టెంటు.‘‘జనం కోరేది మనం సేయడమా? మనం చేసేది జనం చూడటమా? ఏరా డింగరి’’ పొడవాటి గెడ్డాన్ని నిమురుకుంటూ అడిగాడు మాంత్రికుడు.‘‘మన కన్నే  మన చెవే మన మాటే మన జనం. జనమంతా నేనే. మనం కోరతాం. మీరు సేయండి... గాగీ గూగీ మోటా టీటూ వీళ్లందరికీ టోపీలు పెట్టండి’’ అని జనాలను  చూపిస్తూ అడిగాడు డింగరి.‘బోలెడంత ఆశ్చర్యం! ‘‘ఇంకేమీ సేయవలరా డింగరీ’’ అడిగాడు మాంత్రికుడు.

నేల మీద ఉన్న రాయిని చూపిస్తూ...‘‘రాతిని కోతి చేయండి గురువు గారు’’ అడిగాడు అసిస్టెంటు.‘‘హాంఫట్‌’’ అంటూ అలాగే చేశాడు మాంత్రికుడు.మళ్లీ బోలెడంత  ఆశ్చర్యం.రాతి కోతిగా మారిందిఅంతమాత్రాన చిలిపివాడైన డింగరి ఊరుకుంటాడా!‘‘కోతిని నాతిని చేయండి’’ అని అడిగాడు.మాంత్రికుడు ‘హాంఫట్‌’ అన్నాడో లేదో కోతి కాస్తా అందమైన యువతిగా మారింది. ‘‘మహాజనానికి మరదలు పిల్లా... గలగలలాడే గజ్జెల కోడి’’ అని ఆ యువతిని చిలిపిగా చూశాడు మాంత్రికుడు. ఈ చూపుల బాణం సోకి కాలికి గజ్జె కట్టింది ఆ యువతి...‘వగలోయ్‌ వగలోయ్‌తళుకు బెళుకుల వగలోయ్‌’ అనిపాడుతూ నృత్యం చేసి జనాల మనసులను కిలోలకొద్దీ దోచుకుంది.ఈలోపే ఎవరో వస్తున్న అలికిడి వినిపించి. జరగండి.. జరగండి... అనే మాటలు వినిపిస్తున్నాయి.వచ్చింది ఎవరో కాదు.... సాక్షాత్తు రాణిగారి తమ్ముడు.ఈ తమ్ముడుంగారు మాంత్రికుడి వైపు కోపంగా చూస్తూ, చేతిలోని కత్తి అటూ ఇటూ తిప్పుతూ...‘‘ఏయ్‌ ఎవడివయ్యా నువ్వు?’’ అని ఆరా తీశాడు.‘‘నేపాళమాంత్రికుడు’’ అని అరిచాడు మాంత్రికుడి అసిస్టెంటు.‘‘నేపాళమంత్రికుడా! తప్పు తప్పు... భూపాళం పగిలేను. ప్రమాదం. పన్ను ఇచ్చుకోండి’’ అనే డైలాగుతో తనకు రాబోయే కష్టాలు,కన్నీళ్లను మేళతాళాలతో ఆహ్వానించాడు రాణిగారి తమ్ముడు.మాంత్రికుడుగారు గుర్రుమన్నాడు.‘‘ఎవడ్రా వీడు?’’ అని కూడా అన్నాడు.‘‘రాణిగారి తమ్ముడుగారండీ’’ జనంలో నుంచి ఎవరో చెప్పారు.‘‘మాకు ఎవరైనా ఒకటే’’ అని ఆ యువకిశోరాన్ని తీసిపారేస్తూ ‘హాంఫట్‌’ అని అరిచాడు. అంతే!తమ్ముడుంగారి నెత్తి మీద కిరీటంతో పాటు... మూతి మీద మీసం కూడా ఎటో  ఎగిరిపోయింది. ఆడరూపం వచ్చేసింది‘భామలారా ఓ యమ్మలారా... తాళలేనే నే తాళలేనే’ అని విచిత్రమైన గొంతుతో గెంతులు కూడా వేశాడు... సారీ వేసింది. చేసిన తప్పు తెలుసుకున్న తమ్ముడుంగారు–మాంత్రికుడి కాళ్ల మీద పడి...‘‘మాంత్రికుడోయ్‌... మాంత్రికుడోయ్‌.... నన్ను రక్షించండి రక్షించండి’’ అని వేడుకున్నాడు.‘‘బుద్ధి కలిగి ఉంటావురా’’ అంటూ తమ్ముడుంగారిని చూస్తూ కన్నెర్ర చేశాడు మాంత్రికుడు.

‘‘ఉంటాను బాబు ఉంటాను. నన్ను మామూలు వీరుడ్ని చేయండి’’ సారీ చెబుతూనే... వీరుడ్ని చేయమని వరం అడిగాడు.‘‘విద్యలు వినోదాలు కాదురా... వివేకం కలిగి ఉండాలి’’ మీసం మెలేస్తూ ఉపదేశించాడు మాంత్రికుడు.తమ్ముడుంగారికి మళ్లీ మూమూలు రూపం వచ్చేసింది. ‘హమ్మయ్య’ అనుకున్నాడు నూటొక్క సారి!మాంత్రికుడు డింగరిని పిలిచి...‘‘ఒరేయ్‌ డింగరి, మహాజనం మన భక్తులు.ఇదిగో అక్షయఘటం. ఎవరికి ఏది కావాలో కోరుకోమను’’ అరిచాడు.ఒక వృద్ధుడు అరటిపండు అడిగాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ అక్షయఘటంలో నుంచి అరటిపండు వచ్చింది. ఒకావిడ కుంకుమభరిణఅడిగింది. అలాగే వచ్చేసింది. పండ్లు అడిగిన వాడికి పండ్లు, వరహాలు అడిగిన వాడికి వరహాలు వచ్చాయి. అడిగిన వారికి అడిగినంత.తోటరాముడిలో అంతులేని ఆశ్చర్యం.తాను ఏ ఆశయ సాధన కోసం అయితే ఇంటి నుంచి బయలుదేరాడో ఆ ఆశయాన్ని నెరవేర్చుకోవాలంటే మాంత్రికుడి చేతిలో ఉన్న అక్షయఘటం తన చేతిలో ఉంటే చాలు అని అనుకున్నాడో లేదో, దాన్ని మాంత్రికుడి చేతి నుంచి లాక్కొని వెనక్కి తిరిగి చూడకుండా పరుగందుకున్నాడు తోటరాముడు.
  

మరిన్ని వార్తలు