నాకు ఈ యుద్ధం వద్దు బావా!

19 May, 2019 00:13 IST|Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

దానవీరశూరకర్ణుడి ముందు దానం కోసం నిలుచున్నాడు విప్రోత్తముడు.‘‘ఏమి విప్రోత్తమా సందేహించుచుంటిరి! ఈ మణులు మిమ్మల్ని తృప్తిపరచకున్న నా రత్నభాండగారాన్నే సమర్పించెదను’’ అన్నాడు కర్ణుడు.‘‘ఆ రాళ్లతో మాకు నిమిత్తం లేదు’’ అని మణిమాణిక్యాలను తేలిగ్గా తీసేశాడు విప్రుడు.‘‘మరి, చతురంగ బలగములా? నృత్యగీత వాద్య వినోదములా? అప్సరసల వంటి విలాసినులా?’’ అడిగాడు కర్ణుడు.‘‘అట్టి అల్పమైన కోరికలు సాధించుకొనుటకు ఈ దానకర్ణుడిని యాచించుట అర్థం లేదు’’ అన్నాడు విప్రుడు.‘‘అయినచో ఇంకేమి కావలెను. మడులా మాన్యములా? సర్వసుభిక్షమగు నా రాజ్య సర్వస్వమా?’’ మళ్లీ అడిగాడు కర్ణుడు.‘‘స్వర్గసుఖములనే తృణప్రాయంగా భావించే మా బోంట్లకు ఈ మహారాజ్య సుఖాలపై ఆశ ఉండునా కర్ణా!’’ అన్నాడు విప్రుడు.‘‘అయినచో తమ మనసులో ఏమి కలదో సంకోచించకుండా వెల్లడింపుడు. ప్రాణములైనా ఇచ్చెదను’’ అన్నాడు కర్ణుడు.‘‘నాకు కావల్సింది నీ ప్రాణములు కాదు. ప్రాణసమానములై ఈ కవచకుండలాలు’’ చివరికి తన మనసులో ఉన్న కోరికను వెల్లడించాడు విప్రుడు.కర్ణుడు ఆశ్చర్యపోయాడు.‘‘ఈ కవచకుండలాలు నాకు పుట్టుకతో వచ్చినవి. నా శరీరం నుండి వేరు చేసినచో తక్షణమే ఇవి జీవరహితమగును. ఈ నిర్జీవముల వలన తమకు కలుగు ప్రయోజనం ఏమిటి?’’ అడిగాడు కర్ణుడు. ‘‘మాకు కలిగే ప్రయోజనం మాట ఎటుల ఉన్నను...నీవు ఇచ్చెదనంటివి...ఇచ్చుట ధర్మం’’ అన్నాడు విప్రుడు.‘‘సరే’’ అన్నాడు కర్ణుడు.

కొద్దిసేపట్లోనే తన శరీరం నుంచి రక్తమోడుతుండగా కవచకుండలాలను తీసి ఇచ్చాడు కర్ణుడు.ఇదెలా ఉన్నా...విప్రుడి రూపంలో వచ్చింది ఎవరో కర్ణుడికి అర్థమైంది.‘‘పుత్రరక్షణకై యాచనకు సిద్ధపడితివా మహాత్మా!  ఈ మాత్రం దానికి విప్ర వేషం ఏల? స్వస్వరూపమున వచ్చినను ఈ కర్ణుడు లేదనేవాడు కాదు. త్రిలోకాధిపతివి సర్వ దివిజ పూజ్యుడవు. నీవంటి యాచకుడు నాకెక్కడ లభించును మహేంద్రా’’ అన్నాడు కర్ణుడు.‘‘కర్ణా నీకు శుభమగుగాక’’ అని ఆశీర్వదించబోయాడు మహేంద్రుడు.‘‘దానము స్వీకరించు హస్తము కింద అగును మహేంద్రా’’ నవ్వుతూ అన్నాడు కర్ణుడు.‘‘నిజం, శూరాగ్రేసరుడిగా మాత్రమే కాక దానవీరునిగా నీ కీర్తి చిరస్థాయి కాగలదు. కర్ణా...కవచం  ఒలుచుటచే నీ శరీరం వికృతమైనదని విచారించకు. సూర్యకాంతితో తేజరిల్లగలదు’’ అని ఆశీర్వదించాడు మహేంద్రుడు.‘‘ధన్యుడను’’ అన్నాడు కర్ణుడు.‘‘నీ ధర్మదీక్షా, దానపరత్వమును మెచ్చితిని. ఏమి కావలయునో కోరుకో’’ అడిగాడు మహేంద్రుడు.‘‘ఇచ్చుటయే గాని పుచ్చుకొనుట యెరుగని వాడను. ఏమి కోరగలను మహేంద్ర’’ అన్నాడు కర్ణుడు.‘‘నీవు కోరకున్నా నేను ఇచ్చెదను. ఇదిగో అద్భుతమైన నా శక్తి. దీనిని ప్రాణపాయ సమయమున మాత్రమే ప్రయోగించుము’’ అని అడగకుండానే కర్ణుడికి వరాన్ని ఇచ్చాడు ఇంద్రుడు.

దుర్యోధన సార్వభౌముడు అవమానాగ్నితో దహించుకుపోతున్నాడు...‘‘మా దేహము బడబాగ్నివలె దహించుచున్నది. నేను భరింపజాలను. ఈ దారుణఘాతం నా హృదయం భరింపజాలదు’’  అవమానం, ఆవేశం, ఆవేదను కలగలిసిన గొంతుతో అంటున్నాడు దుర్యోధనుడు.‘‘కేవలం ఒక్క ఆడుదాని హాసం కోసం ఇంత పరితపించాలా!’’ అన్నాడు శకుని మామ.‘‘ఒక్క ఆడుదాని హాసం మాత్రమే కాదు మామా! ఈ సమస్త ప్రకృతి నన్ను అవహేళన చేయుచున్నది. ఆ వికటాట్టహాసం సమస్త భూగోళమున పరిభ్రమించుచున్నది. ఈ పరిభ్రమణంతో నా మతి పరిభ్రమించుచున్నది. పౌరుషం పటాపంచలై, అభిమానం అవమానితమై, బతుకు భారమైన ఈ వ్య«థాభరిత వదనాన్ని ప్రజలకు ఎలా చూపించాలి! నా సోదరుల నడుమ మనలేను. నాకు ప్రాయోపవేశమేశరణ్యం’’ అన్నాడు దుర్యోధనుడు.‘‘సుయోధనా...ఏమి చేసిననను నీవు మరణించజాలవు’’ అంటూ వారించాడు శకుని.‘‘అవమానము ప్రతీకారం చేయుట చేతకాకున్నాను, మా మరణం మా చేతనే ఉన్నది’’ అన్నాడు దుర్యోధనుడు.‘‘లేదు. నీ మరణం నా చేతనే ఉన్నది. నా మరణాంతరం నీ మరణం. పాండవ లక్ష్మిని హరించి నీ కైవసం చేసిన అనంతరం, అహంకరించి నిన్ను అవమానించిన పాంచాలి పదింతలు పరాభవం పాలై రోదించిన అనంతరం...’’ అని చెప్పుకుంటూ పోతున్నాడు శకుని మామ.

యుద్ధరంగం.అర్జునుడి కళ్లలో శౌర్యం కాదు వైరాగ్యం కనిపిస్తోంది.దిగులుగా ఉన్నాడు.ఏదో కోల్పోయినట్లుగా ఉన్నాడు.గాండీవాన్ని జారవిడుచుకున్నాడు.‘‘అర్జునా గాండీవాన్ని జారవిడుచుకున్నావేమిటి?’’ అడిగాడు కృష్ణుడు.‘‘నాకీ యుద్ధం వద్దు బావా! బాల్యం నుంచి ఎంతో ప్రేమగా పెంచాడు తాత. భీష్మాచార్యుడు మా వంశానికి ప్రతిష్ఠ. అలాంటి మహానుభావుడి మీద బాణాలు ఎలా వేయమంటావు? కన్నబిడ్డ కంటే మిన్నగా ఆదరించి ధనుర్విద్యా రహస్యాలను బోధించిన గురువును ఎలాధిక్కరించగలను! తాతలు, తండ్రులు, గురువులు, అన్నలు, తమ్ముళ్లు, మామలు, కొడుకులు, స్నేహితులు...ఈ స్వజన సంహారం నావల్ల కాదు బావా!మా సౌఖ్యం కోసం బంధురక్తం చిందించలేను.రాజ్యం కొరకు ఆత్మీయులను అంతం చేయలేను...’’ వైరాగ్య స్వరంతో వాపోతున్నాడు అర్జునుడు.‘‘ఎవరు ఆత్మీయులు?
ఎవరు ఎవరికి బంధువులు?ఈ మమతానుబంధాలు శరీరమునకేగానీ ఆత్మకు లేవు అర్జునా!ఒక పరి నా అసలు స్వరూపమును దర్శించుము’’ అని తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపాడు శ్రీకృష్ణుడు.

మరిన్ని వార్తలు