సర్కారా! గాడెవడురో?!

2 Dec, 2018 01:19 IST|Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

‘నిగ్గదీసి అడుగు..’ అంటూ ప్రశ్నల కొడవళ్లను మన ముందు పెట్టిన సినిమా. ‘అగ్గితో కడుగు ఈ సమాజ జీవనచిత్రాన్ని’ అని ఎలుగెత్తిన సినిమా. ఇద్దరు అగ్రదర్శకులు కథ అందించిన సినిమాలో కొన్ని దృశ్యాలు ఇవి.  ఈ సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...

రౌడీనాయకుడు మరియు రాజకీయనాయకుడు గురునారాయణను ఎయిర్‌పోర్ట్‌లో  విలేకర్లు చుట్టుముట్టారు.ఆయన ముఖం కందగడ్డలా ఉంది. ఈ ముఖాన్ని చూసి ప్రశ్న అడగనక్కర్లేదు. అయినా సరే అడిగారు...‘‘మీరు ఢిల్లీ వెళ్లిన పని ఏమైంది సార్‌?’’సూటిగా సమాధానం చెప్పకుండా ‘‘ఐయామ్‌ వెరీ హ్యాపీ’’ అంటూ వేగంగా కారు వైపు దౌడు తీశాడు గురునారాయణ.దారిలో అభిమాని ఒకడు దండ పట్టుకొని దగ్గరకు వస్తూ  ‘‘అన్నా... ఒక్క నిమిషం’’ అన్నాడు.‘‘ఏ టైమ్‌లో దండేయాలో కూడా తెల్వదు. ధమాక్‌ లేనోడు’’ అని అభిమాని వైపు కొరకొరా చూస్తూ కారెక్కాడు గురునారాయణ.‘‘అన్నా...పోయేటప్పుడు అందరూ సపోర్ట్‌  చేస్తానన్నరు. గిట్లైందేంది?’’ అడిగాడు నర్సింగ్‌.‘‘అందరూ పాలిటిక్స్‌ నేర్చిండ్రురా’’  పండ్లు నూరాడు  గురునారాయణ.ఇంట్లో...‘‘అదేన్నా... ప్రొహిబిషన్‌ గడబిడలో సారా దుకాణాలు తీసేస్తరట. అందుకే రాజాసింగ్‌ పరేశాన్ల ఉన్నడు’’ అన్నాడు నర్సింగ్‌.‘‘సారా మీద బతికే సర్కారోళ్లు భయపడాలెగాని దందా మీద బతికే మనకేమైతదిరా’’ అని రాజాసింగ్‌కు ధైర్యం చెప్పాడు గురునారాయణ.‘‘లేదన్నా, సీరియస్‌గానే ఉన్నదట’’ భయపడుతూనే ఉన్నాడు రాజాసింగ్‌.

‘‘ఛల్‌ తీ. ఒక్కటి పోతే ఇంకొక్కటి ఉంటది. గుడుంబ లేదా’’ అని మళ్లీ ధైర్యం చెప్పాడు గురునారాయణ. అప్పుడే లాయర్‌సాబ్‌ ఇంట్లోకి వచ్చాడు.‘‘లాయర్‌సాబ్‌కి కుర్చేయండి’’ అని మార్యాద చేస్తూనే ‘‘గా ఢిల్లీ ముచ్చట అగడొద్దు’’ అని చెప్పకనే చెప్పాడు గురునారాయణ. ఢిల్లీ టాపిక్‌ను దారి మళ్లించడానికి  ‘‘గావళ్లు ఏమైన్రూ?’’ అని ఆరా తీశాడు.‘‘ఎవళు సార్‌?’’ అడిగాడు నర్సింగ్‌.‘‘గదేరా, కొట్లాడొచ్చిన్రు చూడు. వాళ్లను పిలువు’’ గురునారాయణ.వాళ్లు వచ్చి గురునారాయణ ముందు నిల్చున్నారు.‘‘ఈళ్లు గౌలిగూడ బార్ల దూరి వాళ్ల మందుతాగి వాళ్లనే కొట్టిండ్రు. బయట కనబడితే పోలీసులు ఎక్కడ బొక్కలో నూకుతరోనని ఫికరైతాండ్రు. మీదికెళ్లి వాడి బర్త్‌డే నంట. గదో సెంటిమెంట్‌ బెట్టిండు. జర ఏమైనా చెయ్‌’’ అని లాయర్‌సాబ్‌తో చెబుతూ కుర్రాళ్ల వైపు తిరిగి...‘‘జరిగింది జరిగినట్లు చెప్పుండ్రి. లేకపోతే బర్త్‌డే కేకు కాదు జైల్లో చిప్పకూడు తినాల్సొస్తది’’ అరిచాడు గురునారాయణ.

గురునారాయణ మినిస్టర్‌ అయిన తరువాత.... ఒకరోజు‘‘ప్రెసొల్లా! లేలేలే... ఆ దుక్నం మనకొద్దు బై. ఆళ్లు అడ్డమైన కొచ్చెన్‌లెస్తరు మనకు చెప్పనీకి రాదు. నాకు సిగై్గతది. పొమ్మను పో’’ టీవీలో మైకేల్‌జాక్సన్‌ డ్యాన్స్‌ ప్రోగ్రాం చూస్తూ అన్నాడు  గురునారాయణ.‘‘భలేవారే! ప్రెస్‌వద్దా...మీరు గొప్పోడు అని నేను, నేను గొప్పాడు అని మీరు అనుకుంటే సరిపోద్దా? ప్రపంచానికి తెలియాలి. పబ్లిసిటీ ఇంపార్టెంట్‌. లేకపోతే ఎక్కడి మైకేల్‌ జాక్సన్, ఎక్కడి మనం... చూడట్లా!’’ అని నక్క బుర్రతో సలహా ఇచ్చాడు లాయర్‌సాబ్‌.‘‘ఏక్‌ధమ్‌ సమజైంది బై. మంచిగచెప్పినవ్‌’’ అని లాయర్‌సాబ్‌కు థ్యాంక్యూ చెబుతూ ‘‘గా పోరిని రమ్మను’’ అని నర్సింగ్‌తో అన్నాడు గురునారాయణ.రిపోర్టర్‌ అనిత లోపటికి వచ్చింది.గురునారాయణ కండ్లలో కనిపించని భయం. ‘‘థియేటర్లలో జరిగిన హత్యల విషయంలో మీ కామెంట్‌   ఏమిటి?’’ అడిగింది అనిత.‘‘గదైతే నేను ఖండిస్తున్నాను. అంతే’’ అన్నాడు గురునారాయణ గంభీరంగా.‘‘అంటే?’’ అర్థం కానట్లు చూసింది రిపోర్టర్‌.‘‘ఖండిస్తున్నాను కదా. అంతే’’ అని మరోసారి అన్నాడు గురునారాయణ.‘‘అది అర్థమైంది కాని, మీరు ఏం యాక్షన్‌ తీసుకుంటున్నారని...’’ అడిగింది రిపోర్టర్‌.‘‘ఏం యాక్షన్‌ తీసుకుంటం. పోలీసోళ్లకు జెప్పినం. నువ్వే గదరా డీయస్పీతో ఫోన్లో మాట్లాడినవ్‌. గాడేం జెయ్యలే. సూడుమళ్లా’’  నర్సింగ్‌ వైపు తిరిగి అన్నాడు గురునారాయణ.‘‘ఇలాంటి ముఠా తగాదాల వల్ల ఎంతోమంది అమాయకులు వాళ్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దానికి సంబంధించిన మినిస్టర్‌ మీరై ఉండి కూడా మీరేం చేస్తున్నారని...’’ సూటిగా వాడిగా అడిగింది రిపోర్టర్‌ అనిత.‘‘మళ్లా ఏంజేస్తున్నారంటవ్‌...చెప్పిన కదా... ఖండిస్తున్నాను’’ మరోసారి బలంగా ఖండించాడు గురునారాయణ.‘‘మళ్లీ ఖండిస్తున్నానంటున్నారు. అసలు ఏ విషయాన్ని ఖండిస్తున్నారో తెలుసా మీకు?’’ అసహనంగా అడిగింది అనిత,‘‘ఏందమ్మో ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నవ్‌’’ అని గయ్యిన లేచాడు నర్సింగ్‌.‘‘ష్‌ష్‌ష్‌’’ అన్నాడు లాయర్‌సాబ్‌.

ఆయన ‘ష్‌ష్‌ష్‌’ని  గౌరవిస్తున్నట్లుగా అందరూ సైలెంటైపోయారు.ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మరో ప్రశ్న అడిగింది రిపోర్టర్‌...‘‘సర్కార్‌ని విడిపించడంలో మీ చేయి కూడా ఉందని ఒక రూమర్‌ ఉంది. దాని గురించి మీ కామెంట్‌ ఏమిటి?’’‘‘సర్కారా? గాడెవడ్రో’’ అని నాటకీయంగా ఆశ్చర్యపోయాడు గురునారాయణ.ఇలా అన్న కొద్దిసేపటికే ఆ సర్కార్‌ గురునారాయణ ఇంట్లోకి పరుగెత్తుకు వచ్చాడు.  ప్రత్యర్థి గ్యాంగ్‌ అతడివెంటబడుతుంది.సర్కార్‌ని చూసి అక్కడున్నవాళ్లు అదిరిపోయారు.‘‘అన్నా. పక్కకు పోదం. రూమ్‌లోకి పా’’ అని సర్కార్‌ని పక్క గదిలోకి తీసుకెళ్లాడు నర్సింగ్‌.‘‘అతనే సర్కార్‌ కదూ’’ అడిగింది అనిత.అబద్ధాలు బాగా నమిలి జీర్ణించుకున్న గురునారాయణ నీళ్లు నమలలేదు.ఈలోపే సర్కార్‌ని పట్టుకోవడానికి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆ ఇంట్లోకి దూసుకొచ్చాడు.అతడిని చూసి...‘‘ఏంద్వయ్యా గిట్ల జొర్రబడితివి.ఈడ నీకేం పని?’’ అరిచాడు గురునారాయణ.‘‘సర్కార్‌ని అరెస్ట్‌ చేయడానికి వచ్చాను’’ దృఢంగా అన్నాడు ఇన్‌స్పెక్టర్‌.‘‘గాన్ని అరెస్ట్‌ చేస్తావా? నీ తాన వారంటు ఉందా? నేను పాలిట్రిక్స్‌ మంత్రిని.ఖబడ్దార్‌’’ అని హెచ్చరించాడు గురునారాయణ.‘‘సర్కార్‌ ఎవరో తెలియదు అన్నారు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు?’’ అడిగింది రిపోర్టర్‌.‘‘ఆ...గాడు నా నియోజకవర్గం ఓటరు. జర్రంత డేంజర్‌ల పడి ఉంటడు. హెల్పింగ్‌ కోసం ఇంట్ల దూరిండు. దీనికి పెద్ద పంచాయితీ జేస్తున్నారే...ఆ...’’ అని గట్టిగా అరిచాడు గురునారాయణ.
 

మరిన్ని వార్తలు