నియంత్రణ నా చేతుల్లో లేదు... ఎలా?!

17 Jan, 2016 11:03 IST|Sakshi
నియంత్రణ నా చేతుల్లో లేదు... ఎలా?!

సందేహం
నా వయసు 34. పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మధ్య కొన్ని నెలలుగా నాకు యూరినరీ సమస్య మొదలైంది. యూరిన్ వస్తే అస్సలు ఆపుకోలేకపోతున్నాను. ఇంట్లో అయితే ఫర్వాలేదు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు టాయిలెట్లు అందుబాటులో ఉండవు కదా! అలాంటప్పుడు కాసేపు ఆపుకుందామంటే నావల్ల కావడం లేదు. యూరిన్ బయటకు వచ్చేస్తోంది. ఎందుకిలా అవుతోందో అర్థం కావడం లేదు. సడెన్‌గా నాకీ సమస్య ఎందుకు వచ్చినట్టు?
 - జయంతి, కాశీపేట
 
కొంతమందికి యూరిన్‌లో ఇన్ఫెక్షన్ వల్ల, ఈస్ట్రోజన్ హార్మోన్ లోపం వల్ల లేదా మూత్రాశయం కిందికి జారడం వల్ల, మూత్రాశయంలో ఇతరత్రా ఏదైనా సమస్య వల్ల, మూత్రాశయ నరాల్లో, కండరాల్లో బలహీనత వల్ల మూత్రం ఆపుకోలేకపోవడం జరుగుతుంది. మీ కాన్పులు సాధారణ కాన్పులా లేక సిజేరియన్ పడిందా అన్నది రాయలేదు. కొన్నిసార్లు సాధారణ కాన్పుల్లో ఎక్కువసేపు నొప్పులు రావడం, బిడ్డ బరువు ఎక్కువ ఉండటం వంటి పలు అంశాల వల్ల మూత్రాశయం కిందికి జారుతుంది. లేదా దాని కండరాలు బలహీనపడతాయి. తర్వాతి కాలంలో ఎక్కువ బరువు పెరగడం లేదా బరువు పనులు చేయడం, బాగా బలహీనపడటం వంటి ఎన్నో ప్రేరేపిత కారణాల వల్ల మూత్రం మీద అదుపు తప్పడం జరుగుతుంది. మీరు ఓసారి గైనకాలజిస్టును కాని, యూరాలజిస్టును కాని సంప్రదిస్తే... పరీక్ష చేసి, కారణాన్ని కనిపెట్టి చికిత్స చేస్తారు. ఈ చికిత్సలో భాగంగా యాంటి బయొటిక్స్, పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు, తగిన మందులు, జీవనశైలిలో మార్పులు, బ్లాడర్ ట్రైనింగ్ వంటివి ఉంటాయి.
 
నా వయసు 22. రెండు నెలల క్రితమే పెళ్లయ్యింది. అప్పుడే పిల్లలు వద్దను కుంటున్నాం. మావారేమో కండోమ్ వాడటానికి ఇష్టపడటం లేదు. ఫీల్ రావడం లేదని అంటున్నారు. కాంట్రాసెప్టివ్ పిల్స్ వేసుకుందామంటే నేను ఒక్కోరోజు మర్చిపోతున్నాను. ఆడవాళ్ల కండోమ్స్ కూడా ఉంటాయని ఎక్కడో చదివాను. అది నిజమేనా? వాటిని ఎలా వాడాలో చెబుతారా?
 - ప్రియంవద, గుడివాడ
 
మన దేశంలో ఆడవాళ్ల కండోమ్స్ ఇప్పుడు వెల్వెట్, ఫెమిడమ్, కాన్ఫిడమ్ అనే రకరకాల పేర్లతో దొరుకుతున్నాయి. ఇవి నైట్రైల్ అనే పదార్థంతో తయారవు తాయి. 17 సెంటీమీటర్ల పొడవు ఉండి, చాలా పలుచగా ఉంటాయి. రెండువైపులా సన్నటి రింగుల్లాంటివి ఉంటాయి. ఓవైపు మూసి, మరోవైపు తెరిచి ఉంటుంది. కలయికకు ముందు వీటిని మూసివున్న వైపు నుంచి యోని లోపలికి మెల్లగా నెట్టాలి. తెరచివున్న వైపు రింగును యోని బయటకు ఉండేలా చూసుకోవాలి. ఇవి మేల్ కండోమ్స్ కంటే చాలా పలుచగా ఉంటాయి. మేల్ కండోమ్‌లోని లేటెక్స్ మెటీరియల్ పడనివాళ్లు వీటిని వాడి చూడవచ్చు. అయితే మేల్ కండోమ్‌లాగానే వీటిలో కూడా ఫెయిల్యూర్ రేటు ఐదు నుంచి పది శాతం ఉంటుంది. సరిగ్గా వాడితే ఫెయిల్యూర్ రేటు తగ్గుతుంది. మేల్ కండోమ్‌తో పోలిస్తే వీటి ఖరీదు కూడా కాస్త ఎక్కువే. అయితే వీటివల్ల సుఖవ్యాధులను, అవాంఛిత గర్భాలను చాలా మేరకు నివారించవచ్చు.

నా వయసు 28. మావారి వయసు 29. పెళ్లై సంవత్సరం అవుతోంది. ఈ మధ్య మావారికి ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే గనేరియా వ్యాధి ఉందని తెలిసింది. అది సుఖవ్యాధి అని డాక్టర్ చెప్పడంతో మావారిని నిలదీశాను. ఆయనకు పెళ్లికి ముందు ఎవరితోనో సంబంధం ఉందని, దానివల్లే వచ్చి ఉంటుందని అన్నారు. అది నాక్కూడా వచ్చిందేమోనని నాకు చాలా భయంగా ఉంది. ఏయే టెస్టులు చేయించుకుంటే ఆ విషయం తెలుస్తుంది? ఇది ప్రాణాంతకమైన వ్యాధా? మావారికి, ఒకవేళ వచ్చివుంటే నాకూ ఏదైనా ప్రమాదం ఉందా? అసలు మేమిద్దరం ఇకమీదట కలవొచ్చా?
 - మంజూష, హైదరాబాద్
 
గనేరియా అనేది గోనోకోకై అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. ఇది కలయిక ద్వారా ఒకరి నుంచి ఒకరికి అంటుకునే సుఖవ్యాధి. దీనివల్ల ఆడవారిలో ఎక్కువగా తెల్లబట్ట, కొంచెం పసుపు పచ్చని డిశ్చార్జి యోని నుంచి బయటకు రావడం, దురద, మంట, వాసన, మూత్రంలో మంట వంటి లక్షణాలు ఉండవచ్చు. అశ్రద్ధ చేస్తే గర్భాశయంలోకి పాకి, తద్వారా ట్యూబులోకి, పొత్తి కడుపులోకి పాకి, పిల్లలు పుట్టడానికి అడ్డంకి కావొచ్చు. కాబట్టి వెంటనే గైనకాలజిస్టును సంప్రదించి... స్పెక్యులమ్ పరీక్ష, వెజైనల్ స్మియర్ ఫర్ కల్చర్, గ్రామ్‌స్టెయిన్ వంటి పరీక్షలు చేయించుకోండి. అప్పుడు గనేరియా మీకు కూడా సోకిందా లేదా అనేది నిర్ధారణ అవుతుంది. ఒకవేళ సోకి ఉంటే, వ్యాధి తీవ్రతను బట్టి ఇద్దరూ పూర్తిగా రెండు వారాల పాటు చికిత్స తీసుకుంటూ కలవకుండా దూరంగా ఉండండి. చికిత్స పూర్తయిన తర్వాతే దగ్గరవ్వండి.
 
నా వయసు 22. నాకు పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి వస్తుంది. అయితే ఆ నొప్పి సాధారణంగా కడుపులోనే వస్తుందని విన్నాను. కానీ నాకు కడుపుతో పాటు వెజైనాలో కూడా వస్తోంది. సూదులతో గుచ్చుతున్నట్టు పొడుస్తోంది. కుడి కాలు కూడా బాగా గుంజేస్తోంది. మెచ్యూర్ అయినప్పట్నుంచీ ఇలా లేదు. రెండు మూడేళ్ల తర్వాత నుంచి ఈ సమస్య మొదలైంది. దీనికి పరిష్కారం ఏమిటి?
 - వాణి, కర్నూలు

పీరియడ్స్ సమయంలో ప్రోస్టా గ్లాండిన్స్ అనే హార్మోన్లు విడుదలవు తాయి. వీటి ప్రభావం వల్ల గర్భాశయం ముడుచుకున్నట్లయ్యి, బ్లీడింగ్ బయటకు వస్తుంది. గర్భాశయం కుదించుకున్నట్లు అయ్యి, పట్టి వదిలినట్లు ఉండి, క్రాంప్స్ లాగా రావొచ్చు. ప్రోస్టాగ్లాండిన్స్ కొందరిలో ఎక్కువగా, కొందరిలో తక్కువగా విడుదలవుతాయి. విడుదలైన దాన్ని బట్టే నొప్పి తీవ్రత ఉంటుంది. కొందరిలో అసలు ఏ ఇబ్బందీ ఉండదు. పీరియడ్స్‌లో విడుదలయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ కొందరిలో గర్భాశయం మీదే కాకుండా, మిగతా అవయవాల మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అలాంటప్పుడు శరీర తత్వాన్ని బట్టి కొందరిలో పొత్తి కడుపులో నొప్పితో పాటు నడుము నొప్పి, వికారం, తలనొప్పి, కీళ్లనొప్పుల వంటివి ఉండవచ్చు. మరికొందరిలో ఇవే కాకుండా ఎండో  మెట్రియాసిస్ అనే సమస్య కూడా ఏర్పడు తుంది. ఈ సమస్య వస్తే... పీరియడ్స్ సమయంలో గర్భాశయ లోపలి పొర అయిన ఎండో మెట్రియమ్ యోని ద్వారా బ్లీడింగ్‌తో పాటు బయటకు వచ్చేస్తుంది. అలానే కొంత ఎండోమెట్రియమ్ బ్లీడింగ్ ట్యూబ్స్ ద్వారా పొత్తి కడుపులోనికి వెళ్లి... పేగుల పైన, గర్భాశయం వెలుపల, అండాశయాల పైన అతుక్కుంటుంది. నెలనెలా పీరియడ్స్ అయినట్లే, ఈ పొరలో కూడా కొద్ది కొద్దిగా బ్లీడింగ్ అయ్యి, పైన చెప్పిన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి మీరు ఓసారి గైనకాలజిస్టును సంప్రదించి, మీకు ఈ సమస్య ఏర్పడ్డానికి కారణం ఏమిటో తెలుసుకోండి.
 
నా వయసు 24. మూడు నెలల క్రితం పెళ్లయ్యింది. కానీ ఇప్పటికీ కలయిక కష్టంగానే అనిపిస్తోంది. ఎంత ప్రయత్నించినా నా యోనిలో ద్రవాలు ఊరడం లేదు. మామూలుగా కూడా మొదట్నుంచీ నా యోని చాలా డ్రైగా ఉంటుంది. కానీ శృంగార భావనలు కలిగినప్పుడు ద్రవాలు వాటంతటవే ఊరతాయని చదివాను. మరి నాకెందుకు అలా అవ్వట్లేదు? మావారంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో ఆనందంగా గడపాలని ఉంది. కానీ ఈ సమస్య వల్ల మంట పుట్టి సరిగ్గా సహకరించలేకపోతున్నాను. ఏం చేయాలో సలహా ఇవ్వండి.
 - రామలక్ష్మి, జమ్మికుంట
 
కొంతమందిలో ఏదైనా హార్మోన్‌లో అసమతుల్యత ఉన్నా... మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, ఇతరత్రా కారణాలు ఉన్నా కూడా యోనిలో ద్రవాలు ఊరవు. దాంతో యోని పొడిగా ఉండి, కలయిక సమయంలో ఇబ్బందిగా ఉంటుంది. యోనిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇలా యోని పొడిబారవచ్చు. కొన్ని రోజుల పాటు కేవై జెల్లీ, లూబిక్ జెల్ వంటి లూబ్రికేటింగ్ క్రీముల్ని కలయిక సమయంలో యోనిలో రాసుకోండి. అయినా కూడా అలాగే అనిపిస్తే గైనకాలజిస్టును సంప్రదించండి. పరీక్ష చేసి, కారణం తెలుసుకుని, పరిష్కారం సూచిస్తారు.
 
నా వయసు 22. బరువు 50 కిలోలు. ఎత్తు 5.3. నా ఛాతి చాలా తక్కువగా ఉంటుంది. దాంతో పుష్ అప్ బ్రాలు వేసుకుంటున్నాను. అయితే అవి వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందని నా ఫ్రెండ్స్ అంటున్నారు. అది నిజమేనా? మీరు గతంలో ఒకరికి చెప్పింది చదివి పోషకాహారం తీసుకుంటున్నా ఫలితం లేదు. ఆరు నెలల క్రితం పెళ్లయ్యింది. సిగ్గుతో నా భర్తని నా ఛాతి మీద చేయి కూడా వేయనివ్వడం లేదు నేను. మందులు, ఇంజెక్షన్లు ఏం వాడమన్నా వాడతాను. దయచేసి పరిష్కారం చెప్పండి.
 - అంజలి, మెయిల్
 

మందులు, ఇంజెక్షన్ల వల్ల వక్షోజాల సైజు ఏమాత్రం పెరగదు. ప్రకటనల్లో చూపే మందులతో తాత్కాలిక మార్పు కనిపించినా... వాటి వల్ల అలర్జీ, దద్దుర్లు తదితర దుష్ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి వాటిని వాడటం కంటే కాస్త బరువు పెరగడం మంచిది. అలాగే వక్షోజాలను క్రమ పద్ధతిలో మసాజ్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల రక్త ప్రసరణ పెరిగి, వక్షోజాల పరిమాణం కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. మీ శరీరం గురించి మీరే సిగ్గుపడి, మీవారి దగ్గర దాచాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండండి.
 
 డా॥వేనాటి శోభ
 లీలా హాస్పిటల్
 మోతీనగర్, హైదరాబాద్

మరిన్ని వార్తలు