ప్రతిసారీ ఎందుకిలా?

25 Sep, 2016 00:57 IST|Sakshi
ప్రతిసారీ ఎందుకిలా?

సందేహం
నా వయసు 22. బరువు 41 కిలోలు. తరచూ యూరిన్ ఇన్‌ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతూ ఉంటున్నాను. నేను చాలా జాగ్రత్తగా శుభ్రంగా ఉంటాను. అయినా ప్రతిసారీ ఇలా ఎందుకవుతుందో అర్థం కావడం లేదు.                                                
- దివ్య, కర్నూలు

ఆడవారిలో మూత్రం బయటికి వచ్చే రంధ్రం, యోని రంధ్రం, మలం బయటకు వచ్చే రంధ్రం చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి. మూత్రాశయం నుంచి మూత్రం బయటకు వచ్చే మూత్రం వైపు (యురెత్రా) ఆడవారిలో కేవలం 4సె.మీ. పొడవే ఉంటుంది. అదే మగవారిలో 15 సె.మీ పైన ఉంటుంది. అందువల్ల, మలాశయం నుంచి వచ్చే క్రిములు తొందరగా మూత్రం పైపు ద్వారా మూత్రాశయంలోకి పాకి, యూరిన్ ఇన్‌ఫెక్షన్స్ ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి మాటిమాటికి వస్తుంటాయి. కొందరిలో రక్తహీనత ఉన్నా, షుగర్ వ్యాధి ఉన్నా, కిడ్నీలో సమస్యలు, ఇంకా ఎన్నో కారణాల వల్ల కూడా యూరిన్ ఇన్‌ఫెక్షన్స్ మాటిమాటికీ వస్తుంటాయి.

మంచినీళ్లు తక్కువగా తాగడం వల్ల కూడా యూరిన్ ఇన్‌ఫెక్షన్స్ వస్తుంటాయి. రోజుకు కనీసం 2-3 లీటర్ల నీళ్లు త్రాగాలి. మలవిసర్జన తర్వాత, ముందు నుంచి వెనక్కి శుభ్రం చేసుకోవాలి. వెనకాల నుంచి ముందుకి శుభ్రం చేసుకోవడం వల్ల మల ద్వారం దగ్గర క్రిములు, మూత్రాశయంలోకి తొందరగా పాకే అవకాశాలు ఉంటాయి.

ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి, సీయూఈ, యూరిన్ కల్చర్ చేయించుకుంటే ఇన్‌ఫెక్షన్ ఎంత ఉంది, ఏ యాంటిబయాటిక్ వాడితే తొందరగా తగ్గుతుందో తెలుస్తుంది. దానినిబట్టి ఇన్‌ఫెక్షన్‌కి తగ్గ మందులు వాడవచ్చు. అశ్రద్ధ చేస్తే ఇన్‌ఫెక్షన్ కిడ్నీలకు పాకి అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. భయపడడం మాని డాక్టర్‌ని సంప్రదించి, చికిత్స తీసుకోవడం మంచిది.
 
నా వయసు 24. పెళ్లై మూడేళ్లు అవుతోంది. ఇప్పుడు ఆరు నెలల బాబు ఉన్నాడు. నార్మల్ డెలివరీ కష్టమని, సిజేరియన్ చేశారు. కొన్ని రోజులకే ట్యూబెక్టమీ కూడా చేయించుకున్నాను. ఇప్పుడు నేను ఎన్నిరోజుల తర్వాత నా భర్తను శారీరకంగా కలవచ్చు?  కలిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?                         
- నళిని, ఊరు పేరు రాయలేదు
 
సిజేరియన్ తర్వాత కుట్లు మానిపోయి కడుపులో నొప్పి, ఇంకా ఇతర ఇబ్బందులు లేనప్పుడు మూడునెలలు పూర్తయిన తర్వాత నుంచి కలవవచ్చు. సాధారణంగా కాన్పు తర్వాత ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, మామూలు స్థితికి రావడానికి మూడు నుంచి ఆరునెలలు పట్టవచ్చు. నీకు ఆపరేషన్ అయ్యి ఆరు నెలలు అయ్యింది. అలాగే ట్యూబెక్టమీ కూడా చేయించుకున్నావు కాబట్టి కలవడానికి ఎలాంటి జాగ్రత్తలు అవసరం లేదు.
 
నాకు పెళ్లై ఏడాది కూడా కాలేదు. మొదట్నుంచి నాకు పీరియడ్స్‌కు వారం రోజుల ముందు నుంచి ఒళ్లు నొప్పులు, కాళ్ల నొప్పులు విపరీతంగా ఉంటాయి. అలాగే వక్షోజాలు కూడా భరించలేనంత నొప్పిగా ఉంటాయి. పీరియడ్స్ పూర్తయ్యాక గానీ నొప్పులు తగ్గవు. డాక్టర్‌ను సంప్రదిస్తే, కొందరి శరీరతత్వం ఇలా ఉంటుందని, పెళ్లయ్యాక తగ్గుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు పెళ్లైనా తగ్గడం లేదు. నెలకు పదిహేను రోజులు శారీరకంగా కలవకుండా ఉండడంతో మా వారికి కోపం, చిరాకు వస్తున్నాయి. నాకు ఈ నొప్పులతో ఇబ్బందిగా ఉంటోంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి.            
- కిరణ్మయి, మియాపూర్
 
కొందరిలో పీరియడ్స్‌కు వారం పదిరోజుల ముందు నుంచి ఒంట్లో నీరు చేరి, వక్షోజాలు బరువు ఎక్కి నొప్పి పుట్టడం, కీళ్లనొప్పులు, కాళ్ళవాపులు వంటివి వచ్చి, పీరియడ్స్ అవగానే తగ్గిపోతాయి. కొందరిలో శారీరక మార్పులే కాకుండా మానసిక మార్పులు అంటే కోపం, చిరాకు, డిప్రెషన్ వంటివి కూడా ఏర్పడవచ్చు. దీనినే ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) అంటారు. ఈ లక్షణాలు అన్నీ అందరిలో ఉండాలని లేదు. ఒక్కొక్కరిలో ఒక్కోలాగ ఉండవచ్చు. 85 శాతం మందిలో చిన్నపాటి లక్షణాలు ఉంటాయి. 5 నుంచి10 శాతం మందిలో లక్షణాలు తీవ్రంగా ఉండవచ్చు.

పీరియడ్స్ ముందు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్‌లలో మార్పులు, కొన్ని రకాల మినరల్స్ లోపాలు, ఇంకో ఎన్నో తెలియని కారణాల వల్ల ఈ లక్షణాలు ఏర్పడవచ్చు. వీటికి చికిత్సలో భాగంగా మందులతో పాటు, జీవనశైలిలో మార్పులు, మానసిక, శారీరక ఒత్తిడిని అధిగమించడం, యోగా, మెడిటేషన్, వ్యాయామాలు కూడా చెయ్యవలసి ఉంటుంది. ఈ సమయంలో కాఫీ, టీ, ఉప్పు, చక్కెర వంటివి తగ్గించుకోవడం, పండ్లు, కూరగాయలు, నీళ్ళు అధికంగా తీసుకోవడంతో పాటు, తగిన విశ్రాంతి ఉండేలా చూసుకోవలసి ఉంటుంది. చికిత్సలో భాగంగా విటమిన్ బి-6, ఈ వంటి విటమిన్స్, కాల్షియం, మెగ్నీషియం, మినరల్స్, పైమ్‌రోజ్ ఆయిల్‌తో కూడిన మందులు మూడు నుంచి ఆరు నెలలు పైగా వాడి చూడవలసి ఉంటుంది. నొప్పులు మరీ ఎక్కువగా ఉంటే పారసెటమాల్ టాబ్లెట్ అప్పుడప్పుడు వాడుకోవచ్చు.
- డా॥వేనాటి శోభ
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్

మరిన్ని వార్తలు