అవి ఉంటే ప్రమాదమా?

30 Jun, 2019 11:29 IST|Sakshi

సందేహం 

నాకు నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువ అవుతోంది. తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తోంది. గర్భసంచిలో గడ్డల వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. అసలు గర్భసంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి? ఇది ప్రమాదకరమా? చికిత్స పద్ధతులు ఏమిటి?
– ఆర్‌.ఎన్‌ నిజామబాద్‌
నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువ కావడానికి గర్భసంచిలో గడ్డలే కాకుండా, అండాశయాల్లో కణితులు, ఇన్ఫెక్షన్లు వంటి అనేక కారణాలు ఉండవచ్చు. మూత్రంలో ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లవలసి వస్తుంది. మీరు డాక్టర్‌ను సంప్రదించకుండా, సమస్యకు కారణం తెలుసుకోకుండా గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని అనుమానించడం సరికాదు. ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, పెల్విక్‌ స్కానింగ్‌ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకుని, సమస్యను బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. సాధారణంగా గర్భసంచిలో గడ్డలను ఫైబ్రాయిడ్స్‌ అంటారు. ఒక్కొక్కసారి శరీరతత్వాన్ని  బట్టి, హార్మోన్ల అసమతుల్యత వల్ల, జన్యుపరమైన మార్పుల వల్ల, తెలియని అనేక కారణాల వల్ల ఇవి ఏర్పడవచ్చు. వీటి పరిమాణం, ఇవి గర్భసంచిలో ఉండే పొజిషన్‌ను బట్టి లక్షణాలు ఉంటాయి. ఇవి ప్రమాదకరం కాదు గాని, లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే, నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవలసి ఉంటుంది.

ఫైబ్రాయిడ్స్‌ గర్భసంచి బయటి పొరలో ఉండి, పరిమాణం చిన్నగా ఉంటే లక్షణాలు ఏమీ ఉండవు. పరిమాణం పెద్దగా ఉంటే వాటిని తొలగించవలసి ఉంటుంది. వీటికి కొన్ని హార్మోన్‌ ఇంజెక్షన్స్, కొన్ని మందులు వాడటం వల్ల వీటి పరిమాణం కొంత తగ్గి, లక్షణాల తీవ్రత తగ్గుతుంది. కాని వాటిని ఆపేసిన తర్వాత ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి మళ్లీ పరిమాణం పెరగవచ్చు. కొందరిలో ఫైబ్రాయిడ్స్‌కు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను ‘యుటెరైన్‌ ఆర్టరీ ఎంబోలిజమ్‌’ పద్ధతి ద్వారా బ్లాక్‌ చేయడం ద్వారా ఫైబ్రాయిడ్స్‌ పరిమాణం తగ్గుతుంది. కొందరిలో ఎంఆర్‌ఐ గైడెడ్‌ వేడి అల్ట్రాసౌండ్‌ తరంగాలను పెల్విక్‌ భాగంలోకి పంపడం ద్వారా ఫైబ్రాయిడ్స్‌ చాలా వరకు కరుగుతాయి. ఫైబ్రాయిడ్‌ సైజు మరీ పెద్దగా ఉండి, లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే, మయెమెక్టమీ అనే ఆపరేషన్‌ ద్వారా తొలగించడం జరుగుతుంది. ఇది పొట్ట కోసి, లేదా పరిమాణాన్ని బట్టి ల్యాపరోస్కోపీ ద్వారా చేయవచ్చు. ఫైబ్రాయిడ్ల సంఖ్య ఎక్కువగా ఉంటే గర్భసంచి తొలగించడం జరుగుతుంది.

నా వయసు 28 సంవత్సరాలు. నేను ప్రెగ్నెంట్‌. గర్భిణులు తప్పనిసరిగా హెపటైటిస్‌–సి టెస్ట్‌ చేయించేకోవాలని చదివాను.  దీని గురించి వివరంగా తెలియజేయగలరు. నేను సన్నగా ఉంటాను. పుట్టిన బిడ్డ బరువు తక్కువగా పుడితే, బరువును పెంచడం కోసం ఏమైనా విధానాలు ఉన్నాయా?
– కె.నీరజ, హైదరాబాద్‌
హెపటైటిస్‌–సి అనేది హెపటైటిస్‌–సి వైరస్‌ వల్ల వచ్చే వ్యాధి. హెపటైటిస్‌–సి ఉన్నవారి రక్తాన్ని సరిగా పరీక్షించకుండా ఎక్కించడం వల్ల, ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి ఉపయోగించిన సిరంజ్‌లు వాడటం వల్ల, సెక్స్‌ ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. గర్భిణులకు ఈ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లయితే, కొన్నిసార్లు బిడ్డకు సోకి నెలలు నిండకుండానే ప్రసవం కావడం, బిడ్డ బరువు తక్కువగా పుట్టడం వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. తల్లిలో ఇది లివర్‌పై ప్రభావం చూపి, నీరసం, వాంతులు, ఆకలి లేకపోవడం, వంటి సమస్యలు తలెత్తవచ్చు.

గర్భిణులకు ఇప్పుడు హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ వంటి రక్తపరీక్షలు చేస్తున్నామో, అలాగే హెపటైటిస్‌–సి వైరస్‌ టెస్ట్‌ కూడా చేయించుకోవడం మంచిది. ఒకవేళ ఈ పరీక్షలో వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు నిర్ధారణ జరిగితే, ఆ ఇన్‌ఫెక్షన్‌ పాతదా కాదా, వైరస్‌ లోడ్‌ ఎంత ఉన్నదీ తెలుసుకునేందుకు అవసరమైన పరీక్షలు చేయించుకుని, డాక్టర్ల పర్యవేక్షణలో తల్లికి బిడ్డకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ, కాంప్లికేషన్స్‌ ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. మీరు సన్నగా ఉన్నంత మాత్రాన బిడ్డ కూడా సన్నగా పుట్టాలనేమీ లేదు. గర్భిణి సమయంలో సరైన పోషకాహారం తీసుకోవాలి. అలాగే డాక్టర్‌ దగ్గరకు సక్రమంగా చెకప్‌లకు వెళ్లాలి. గర్భంతో ఉన్నప్పుడు తల్లి నుంచి బిడ్డకు రక్తసరఫరా సరిగా లేకపోయినా, ఉమ్మనీరు తక్కువగా ఉన్నా, బీపీ పెరగడం, ఇన్ఫెక్షన్లు, తల్లిలో పోషకాహార లోపం వంటి ఎన్నో కారణాల వల్ల బిడ్డ తక్కువ బరువుతో పుట్టవచ్చు.

పీరియడ్‌ సమయంలో తలకు షాంపు ఉపయోగించకూడదని, హెయిర్‌ స్పాకు వెళ్లకూడదని, వ్యాయామాలు చేయకూడదని  విన్నాను. ఇది ఎంత వరకు నిజం? ఈ టైమ్‌లో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు,  ఆహారం గురించి తెలియజేయగలరు. పీరియడ్‌ టైమ్‌లో సెక్స్‌లో పాల్గొనవచ్చా?
– డీఆర్, ఒంగోలు
పీరియడ్స్‌ అనేది ఆడవారి శరీరంలో నెలనెలా జరిగే మార్పులలో ఒకటి. ఈ సమయంలో తలకు షాంపూ ఉపయోగించకూడదు, హెయిర్‌ స్పాకు వెళ్లకూడదని ఏమీ లేదు. మామూలు సమయంలో ఎలా ఉంటారో ఈ సమయంలో కూడా అలాగే ఉండి అన్ని పనులూ చేసుకోవచ్చు. బ్లీడింగ్‌ మరీ ఎక్కువగా లేకుండా, ఇబ్బంది ఏమీ లేకపోతే చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవచ్చు. ఈ సమయంలో వ్యాయామాలు చేయడం వల్ల శరీరం తేలికగా ఉండి, కడుపునొప్పి కూడా తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో బ్లీడింగ్‌ అవడం వల్ల కొందరిలో నీరసంగా ఉంటుంది. కాబట్టి ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్, మంచినీళ్లు వంటి పోషకాహారం తీసుకోవాలి. పీరియడ్స్‌ టైమ్‌లో బ్లీడింగ్‌ బయటకు రావడానికి గర్భాశయ ముఖద్వారం కొద్దిగా తెరుచుకుంటుంది. ఈ సమయంలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల గర్భాశయానికి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే బ్లీడింగ్‌ వల్ల అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమయంలో శారీరక పరిశుభ్రత, జననేంద్రియాల పరిశుభ్రత చాలా ముఖ్యం. న్యాప్‌కిన్స్‌ తరచుగా మార్చుకుంటూ ఉండాలి. చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి.
-డా.వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో
హైదరాబాద్‌

మరిన్ని వార్తలు