విడ్డూరం: షాజహాన్ వారసుడు!

10 Aug, 2013 21:28 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖాద్రీకి తన భార్య అంటే ప్రాణం. అందుకే ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయాడు. ‘మనకి పిల్లలు లేరు, చనిపోయాక మనమెవరికీ గుర్తే ఉండం’ అంటూ చనిపోయే ముందు బార్య అన్న మాటల్ని మర్చిపోలేకపోయాడు. ఆమెను అందరికీ గుర్తుండిపోయేలా చేసేందుకు ఓ ప్రేమ మందిరాన్ని నిర్మించాలనుకున్నాడు. ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్‌ని చూసి వచ్చాడు. తన భార్య కోసం తను కూడా తాజ్‌మహల్ నిర్మించడం మొదలుపెట్టాడు. పాలరాతితో కాకపోయినా, తన స్తోమతకు తగినట్టుగా కట్టిస్తున్నాడు. పోయాక తననూ అందులోనే సమాధి చేయమంటున్నాడు. కొందరతణ్ని పిచ్చోడు అంటుంటే, కొందరు మాత్రం షాజహాన్ వారసుడు అంటున్నారు!
 
 ఊరంతా గొడుగులే!
 పోర్చుగల్‌లోని అగెడా ప్రాంతానికి ఇప్పుడు కనుక వెళ్తే, అక్కడి వీధుల నిండా రంగురంగుల గొడుగులు వేళ్లాడుతూ ఉంటాయి. కొత్తవాళ్లకి ఈ గొడుగుల గొడవేమిటి అనిపిస్తుంది కానీ, పోర్చుగల్ వారికి ఇది అలవాటైన, చాలా ముఖ్యమైన వేడుక. అంబ్రెల్లా స్కై ప్రాజెక్ట్ పేరుతో పిలిచే ఈ వేడుక యేటా జూలై నుంచి సెప్టెంబర్ వరకూ జరుగుతుంది. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఎప్పుడు మొదలయ్యిందో సరిగ్గా తెలియదు కానీ, కొన్ని వందల యేళ్లుగా పోర్చుగల్‌లో గొడుగుల పండుగ జరుగుతోంది. జూలై నెల రాగానే గొడుగులను వేళ్లాడదీయడం మొదలవుతుంది. అందరూ గొడుగులను తెచ్చి ఇలా వేళ్లాడదీస్తారు. దానివల్ల తమ ఊరికి మంచి జరుగుతుందని, తమకు క్షేమం కలుగుతుందని భావిస్తారు. కేవలం ఈ గొడుగులను చూడ్డానికే విదేశాల నుంచి సందర్శకులు రావడం విశేషం!

>
మరిన్ని వార్తలు