సన్యాసికి లోకమంతా ఇల్లే

14 Jul, 2019 08:48 IST|Sakshi

శంకర విజయం 5

ఆదిశంకరాచార్యుల జీవితచరిత్ర

‘‘శంకరా!’’ అని అరుస్తూ ఆర్యాంబ పరుగు పరుగున వచ్చింది. నదిలో పరిస్థితి కల్లోలంగా ఉంది. శంకరుడు మునిగిపోతున్నట్లున్నాడు. ఎవరో లాగుతున్నట్లుగా లోపలికి వెళ్లిపోతున్నాడు. మధ్యమధ్య చేతులు పైకి లేపుతూ ‘‘అమ్మా!’’ అని అరుస్తున్నాడు.
ఆర్యాంబకు మతిపోతోంది. నదిలో దిగే సాహసం ఆమెకు లేదు. దిగినా తాను కుమారుణ్ణి కాపాడుకోగలననే ఆశ లేదు. దానికి తోడు మధ్యమధ్య శంకరుడు, ‘‘అమ్మా! నువ్వు లోపలికి రావొద్దు’’ అని అరుస్తున్నాడు.
నది గట్టున ఉన్నవారెవరినో ఆర్యాంబ బతిమాలుతోంది. కానీ వాళ్లెవరూ నదిలో దిగేందుకు సిద్ధపడడం లేదు. 
‘‘మొసలి పట్టుకున్నట్లుంది. ఆశ వదులుకోవడమే మంచిది’’ అన్నారు వాళ్లలో ఎవరో.
తల్లికి ఆ మాటతో ఒక్కసారిగా కన్నులముందు చీకటి అలముకున్నట్లు అనిపించింది. రోదిస్తూ గట్టున కూలబడిపోయింది. ‘‘శంకరా! శంకరా!’’ అని పిలుస్తూనే ఉంది. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు కానీ, ఉన్నట్లుండి తల్లి కళ్లు మెరిశాయి. ఆశారేఖ కనిపించింది. బారలు బారలుగా ఈదుతూ గట్టువైపుకు వేగంగా దూసుకొస్తున్నాడు శంకరుడు.

తీరానికి సమీపంలో ఉన్న రాళ్ల వద్దకు వచ్చేసరికి శంకరుని వేగం తగ్గింది. అతడొక రాయిని పట్టుకున్నాడు.  ఆనాడు మార్కండేయుడు శివలింగాన్ని పట్టుకున్నట్లు రెండు చేతులా కౌగిలించి పట్టుకున్నాడు. అతని పాదం మరోసారి మకరం నోటికి చిక్కినట్లుంది. శంకరుడు విలవిల లాడుతున్నాడు. రాయి పట్టుతో శంకరుడు, నీటిలో బలం వల్ల మకరం పోరాటం హోరాహోరీగా ఉంది. గట్టుపై నుంచి తల్లి మాటిమాటికీ కుమారుణ్ణి పిలుస్తూ విలపించడం తప్ప మరేమీ చేయలేకుండా ఉంది. 
‘‘అమ్మా! ఇంక నాకు పోరాడే శక్తి లేదు. నా ఆయువు తీరినట్లే ఉంది’’ అన్నాడు శంకరుడు.
ఆర్యాంబ తెగించి నదిలో దూకబోయింది.
‘‘అమ్మా! ఆగు. నాతో పాటు నువ్వు కూడా ఈ మొసలి బారిన పడడం కంటే లాభం ఉండదు. చనిపోయే ఈ చివరి క్షణంలో అయినా నాకు సన్యసించేందుకు అనుమతి ఇవ్వు.’’ అన్నాడు శంకరుడు.
ఆర్యాంబకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.
‘‘నేను సన్యసిస్తే ఈ మొసలి నన్ను విడిచినా విడిచేయవచ్చు. నేను బతకవచ్చు. సన్యాసినై నన్ను బతకమంటావా? ఇలాగే చనిపోమంటావా చెప్పమ్మా?’’ అడిగాడు శంకరుడు.
బిడ్డ బతుకుతాడంటే తల్లి ఏ త్యాగానికైనా వెనుదీయదు కదా! 
‘‘సరే.. నీ ఇష్టమొచ్చినట్లే కానివ్వు’’ అన్నది కడుపు తీపితో.
శంకరుడు వెంటనే ‘సన్యస్తోహం’ అన్నాడు గట్టిగా. ఆ మాట యమపాశాన్ని ఛేదించిన శివుని త్రిశూలం అయింది. మకరం తన పట్టును సడలించింది. గంధర్వ రూపం ధరించి శంకరుని పాదాన్ని స్పృశించి, కళ్లకద్దుకుని మాయమైంది. 
శంకరుడు మెల్లిగా గట్టుమీదికి వచ్చాడు. అప్పటివరకూ జీవన్మరణ పోరాటం చేసిన ఛాయలేవీ ముఖాన కనపడడం లేదు. మరింత ప్రకాశంతో వెలిగిపోతున్నాడు. తల్లి ఆత్రంగా అతని కాలివంక చూసింది. గాయాల జాడలేదు.

శంకరుడు తల్లి పాదాలు తాకి నమస్కరించాడు. ఆమె దుఃఖం ఇంకా ఆగడం లేదు. చాలాసేపటి వరకూ ఆమె తేరుకోనే లేదు. శంకరుణ్ణి మొసలి పట్టుకుందనే వార్త తెలిసిన గ్రామ ప్రజలందరూ క్రమక్రమంగా అక్కడికి చేరుకున్నారు. దూరంగా నిల్చుని తల్లీకొడుకులను గమనిస్తూనే ఉన్నారు వారు. పండితులైన వారు మాత్రం, ‘బ్రహ్మచర్యం నుంచి నేరుగా సంన్యాసం తీసుకోవడం సరైన పద్ధతేనా కాదా’ అని తమలో తాము చర్చించుకుంటున్నారు. 
తెప్పరిల్లిన తల్లి, ‘‘శంకరా! నాకింక దిక్కెవరు?’’ అన్నది దీనంగా.
‘‘అమ్మా! సన్యాసి తల్లిదండ్రులే కాకుండా ఏడు పురుషాంతరాల వరకూ తరిస్తారని శాస్త్రం చెబుతోంది. నేను సన్యాసినైనా నీ సేవలో ఏమరుపాటు వహించను. ఇప్పటికంటే వందరెట్లు ఎక్కువ శ్రద్ధ చూపిస్తాను’’ అన్నాడు శంకరుడు హామీ ఇస్తున్నట్లుగా.
‘‘అయితే కుటీచక సన్యాసివై నా కంటిముందే ఉండు. ఏదోవిధంగా నా కొడుకు నాకు దక్కాడని సంతోషిస్తాను’’ అన్నది ఆర్యాంబ.
‘‘వద్దమ్మా! మరణవేళ తీసుకున్న ఆతుర సన్యాసం ఆ ప్రయోజనానికే పరిమితం. ప్రాణాలు నిలబడిన తరువాత ఇప్పుడిక నేను క్రమ సన్యాసం స్వీకరించాలి. అందుకు తగిన గురువును అన్వేషించాలి. ఇప్పుడే బయలుదేరుతాను. సెలవిప్పించు.’’ 
‘‘మరి నా సంగతేమిటి? నేనూ నీతోటే వస్తాను.’’
‘‘వద్దమ్మా! ఆ కష్టం పడలేవు నువ్వు.’’
‘‘అయితే మళ్లీ ఎప్పుడు కనిపిస్తావు?’’
‘‘నీ మనసులోనే ఉంటాను కదా! నీ మనసుతో నువ్వెప్పుడైనా నాతో మాట్లాడవచ్చు. ఎప్పుడు కన్నులు మూసుకున్నా కనిపిస్తాను.’’
‘‘అలాకాదు... నేను కన్ను మూసిన తరువాత అయినా నువ్వు రావాలి. నీ చేతుల మీదుగా మాత్రమే నా అంత్యక్రియలు జరగాలి’’ అశాస్త్రీయమైన కోరిక కోరింది ఆర్యాంబ.
‘‘అలా చేస్తానని నాకు మాట ఇవ్వు’’ అంటుంటే శంకరుడు తల్లి చేతిలో చేయి వేసి ప్రమాణం చేశాడు.

గ్రామస్థులందరూ ఆ సన్నివేశం చూసి చలించి పోయారు.
శంకరుడు తన తల్లిని జ్ఞాతులకు అప్పగించాడు. కేవలము దండధారియై ఇంటి నుంచి బయలుదేరాడు. కొందరు అభిమానులు పొలిమేరల వరకూ దిగవిడిచి రావడానికి అతనితో కలిసి నడుస్తున్నారు. పదడుగులు ముందుకు వేశాడో లేదో, ‘‘శంకరా! నా సంగతి ఏం చేశావయ్యా!’’ అనే మాటలు వినిపించాయి. వెంటనే శంకరుడు ఎడమవైపుకు మళ్లాడు.
అందరికీ ఆ మాటలు వినిపించాయి. కానీ తమలో ఎవరు ఆ మాట అన్నారో ఎవరికీ అంతు పట్టలేదు. 
శంకరుడు శ్రీకృష్ణాలయం దిశగా మళ్లాడు. పూర్ణానది ముంచెత్తడంతో ఆలయ ప్రాకారపు గోడ కూలి పడివుంది. నీళ్లు ప్రధానాలయం దాపుల వరకూ వచ్చేశాయి. నేలంతా బురదమయంగా మారిపోయింది. శంకరుడు అందరినీ ఆలయం బయటే ఉండమని ఆజ్ఞాపించాడు.
కమనీయమైన కృష్ణాష్టకాన్ని ఆలపిస్తూ లోపలకు వెళ్లాడు శంకరుడు. నల్లమబ్బులాంటి శరీరం ఉన్న పరమాత్ముడు వెండి మెరుపు కాంతులతో  ప్రకాశిస్తున్నాడు. అడవిపూల మాలలతో శోభిస్తున్న వక్షస్థలం, నల్లని పాదాలు, ఎర్రకలువల్లాంటి కన్నులున్న శ్రీకృష్ణా! నిన్ను భజిస్తున్నాను అన్నాడు. 
శ్రీకృష్ణ విగ్రహం చిరునవ్వు నవ్వింది.
ఉంగరాలు తిరిగిన జుత్తు కదలాడినట్లు అనిపించింది. రత్నాలు పొదిగిన కుండలాలు, కంటె, హారాలు, కేయూరాలు, కంకణాలు, గజ్జెలు సన్నగా కదలాడి ఘల్లుమన్న సవ్వడి వినిపించింది.

శంకరుడు ఆలయం నుంచి బయటకు వచ్చాడు. అక్కడ నిలబడి ఉన్నవారంతా అప్రతిభులై ఉన్నారు. ఎవరికీ నోటివెంట మాట పెగలడం లేదు. శంకరుడు ఒంటరియై అక్కడి నుంచి నడిచి, ప్రధాన రహదారిపైకి వెళ్లిపోయాడు. గుడి లోపలి నుంచి...
అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం 
ప్రేమతః ప్రత్యహం పూరుష సస్పృహమ్‌
వృత్తతః సుందరం కర్తృ విశ్వంభరః
తస్యవశ్యో హరిర్జాయతే సత్వరమ్‌
సుందర వృత్తాలతో కూడుకున్న ఈ అచ్యుతాష్టకాన్ని, ప్రతి నిత్యం అర్థం తెలిసి పఠించిన భక్తునికి శ్రీహరి వశుడైపోతాడు... అని వినిపించింది.
ఆ అవ్యక్త మధురగానం ఆలకించిన తరువాత అక్కడున్న వారిలో ఆదమరపు నశించింది. కాళ్లకింద బురద మాయమైనట్లు మొదటిగా అప్పుటికి గుర్తించారు వారు. వెనక్కి తిరిగి చూస్తే, శంకరుని ఇంటికి సమీపంగా ఆలయం తనంత తానుగా జరిగి వచ్చినట్లు తెలుసుకోగలిగారు. వారి ఆశ్చర్యానికి మేర లేదు.

దూరంగా శంకరుడు వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. అస్తమిస్తున్న సూర్యుడు ఎర్రగా కనిపిస్తున్నాడు. భేదవాదులు మళ్లించుకుపోతున్న వేదగోవులను తిరిగి తేవడానికి బయలుదేరిన గోపాలకుని చేతిలో ములుగర్రలా శంకరుని చేతిలో దండం కదలాడుతోంది. నాలుగుసార్లు భరతఖండాన్ని చుట్టివచ్చిన సాక్షాత్‌ శంభుమూర్తి తన తొలియాత్రను గోధూళివేళ ప్రారంభించాడు.
శంకర విరాగి నిస్సంగ వృత్తితో ఏకాంతాన్ని భజిస్తున్నాడు. దైవికంగా తనకు దొరికిన వస్తువులతో మాత్రమే తృప్తి చెందుతూ, ఆలయాలలోనూ గో, గజశాలల్లోనూ మాత్రమే విడిది చేస్తున్నాడు. పశ్చిమ సాగరం వెంబడి ఉత్తరదిశగా ప్రయాణం కొనసాగిస్తున్నాడు. నేను, నాది, నా ఇల్లు, నా దేహం అనే అహంకార మమకారాలను పూర్తిగా విడిచిపెట్టాడు. కంటితో చూస్తున్నదంతా శివమయంగా భావన చేస్తూ ముందుకు సాగిపోతున్నాడు.

పరశురామ క్షేత్రానికి పాదపీఠం వంటి కేరళ దేశం నుంచి బయలుదేరిన శంకరుడు, ఆ క్షేత్రానికి శిరఃస్థానం వంటి గోకర్ణ క్షేత్రానికి చేరుకున్నాడు. కోటితీర్థంలో మునకలేసి, అన్నపూర్ణాదేవి చేతి తక్కెడ గోకర్ణం దిశగా మొగ్గి ఉండడాన్ని గమనించాడు. తామ్రగౌరీదేవిని మనసారా అర్చించి, మహాబలేశ్వరుణ్ణి అభిషేకించాడు. ఆలయం వెలుపల ఆత్మలింగ సంరక్షకుడైన వినాయకుణ్ణి మరోసారి దర్శించి, సెలవు కోరాడు.
ఫాలభాగాన చేతులు జోడించి వినాయకునికి మొక్కుతుండగా, అర్చకుడు గబగబా బయటకు వచ్చాడు.
‘‘శంకరా! నువ్వేనా?’’ అన్నాడు ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వు ముఖాన మొలిపిస్తూ. అతడు విష్ణుశర్మ. గురుకులంలో తనకు సహాధ్యాయి. తనకంటే చిన్నవాడైన శంకరునితో హృదయమిచ్చి స్నేహం చేసినవాడు. 
‘‘విష్ణూ!’’ ఆప్యాయంగా పిలిచాడు శంకరుడు. ‘‘అమ్మ అనుమతి లభించింది. విచిత్రమైన పరిస్థితుల్లో ఆతుర సంన్యాసం స్వీకరించాను. క్రమసన్యాసం అనుగ్రహించే నిజగురువును వెతుక్కుంటూ బయలుదేరాను. ఇక్కడ ఈ ఆత్మబంధువును చూశాను’’ అన్నాడు.
‘‘ఇక్కడికి వచ్చి ఎంతకాలమైంది? ఇప్పుడు ఎటువైపు ప్రయాణం?’’ 
‘‘ఏమో! శైవక్షేత్రాలన్నీ వెతుక్కుంటూ గురుసన్నిధి చేరుకోవడమే లక్ష్యం.’’
‘‘బాగుంది. నీకు తగ్గ మహాగురువులు సముద్రతీరాల్లో లభిస్తారా... కొండకోనల్లో వెతికితే ఏమైనా ప్రయోజనం ఉండవచ్చు.’’
‘‘మంచి ఆలోచనే. ఇక మీదట ప్రయాణదిశ మార్చుకుంటాను.’’
‘‘నీతోపాటు నేనూ వస్తాను.’’
‘‘నువ్వెందుకయ్యా! తల్లిదండ్రులను, భార్యా పిల్లలను విడిచిపెట్టి ఇలా సన్యాసుల వెంట పడడం వల్ల ప్రయోజనం ఏమిటి?’’
‘‘శంకరా! నేను నీలాగా తల్లిదండ్రులకు ఏకైక సంతానాన్ని కాను నేను. ఇంతవరకూ పుస్తె కట్టనే లేదు కనుక భార్యాపిల్లల సమస్య లేదు. ముక్తికి మూసిన కవాటం లాంటి కామమనే చీకటి కొట్టులో పడివుండిపోవడం నాకిష్టం లేదు. నీవంటి దారి చూపగలిగిన మహనీయుడు తారసపడినప్పుడు ఒకవేళ వారంతా అడ్డుపడినా లెక్క చేయను. గురుకులంలో నిన్ను చూసిన మొదటిక్షణం నుంచి ఏవేవో పురాతన జ్ఞాపకాలు నన్ను వెన్నాడుతున్నాయి. అవేమిటో కాస్త గుర్తు తెచ్చుకుంటాను. నీ ప్రయాణంలో నేనో సేవకునిలా వ్యవహరిస్తాను. నన్ను కాదనకు’’ అభ్యర్ధనగా అడిగాడు విష్ణుశర్మ.

‘‘మంచిది’’ అన్నాడు శంకరుడు.
గోకర్ణం నుంచి వారి ప్రయాణం తూర్పుదిశగా సాగింది. తోవలో నదీనదాలు, నగరాలు, పర్వతాలు, అడవులను, మనుషుల వేషభాషలను, ఆచార వ్యవహారాలను ఆసక్తిగా గమనిస్తూ ముందుకు వెళుతున్నారు వారు. దైవమనే ఇంద్రజాలికుని మాయా సంకల్ప శక్తితో నిర్మితమైన సృష్టి విచిత్రాలను ‘ఈశావాస్యమిదం జగత్‌’ అనే స్ఫురణతో పరికిస్తున్నారు. వాయువేగం వారి వేగాన్ని అందుకోలేక వెనక బడుతోంది. మనోవేగం శివపదంలో నిశ్చలమై పాదగమనానికి అలుపు, ఆపు లేకుండా చేస్తోంది. 

పశ్చిమ ద్వారం నుంచి శ్రీశైల పర్వతాన్ని సునాయాసంగా అధిరోహించారు. సాక్షి గణపతిని ఆరాధించి శివస్థానానికి చేరుకున్నారు. మల్లికార్జున జ్యోతిర్లింగం ముందు చేతులు కైమోడ్చి....
సంధ్యారంభ విజృంభితం శ్రుతిశిర స్థానాంతరాధిష్ఠితం
సప్రేమ భ్రమరాభిరామ మసకృత్‌ సద్వాసనాశోభితమ్‌ 
భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కతం
సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం
–  అనే శ్లోకాన్ని ఆశువుగా చెప్పాడు శంకరుడు.

‘‘ఈశ్వరుడు శ్రుతుల శిరస్సులపై సంధ్యాతాండవం చేస్తున్నాడు. ఉపనిషత్తులు పూవులుగా మారి ఆయనను అలంకరించాయి. మల్లికార్జున పుష్పాలు సద్వాసనలు విరజిమ్ముతున్నాయి. ఈశ్వరునికి సాధుభావన సహజ వాసనగా ఒప్పారింది. భోగీంద్రుడైన వాసుకిని ఆభరణంగా చేసుకున్న మహాదేవుడు సర్వదేవతలచే పూజలందుకుంటున్నాడు. మల్లికార్జునుడు భ్రమరాంబతో కలిసివుంటే అర్జున వృక్షమనే తెల్లమద్దిచెట్టు భ్రమరాలతో నిండి ఉన్నట్లు కనిపిస్తున్నాడు. మల్లికార్జున మహాలింగం మల్లెతీగ అల్లుకున్న మద్దిచెట్టులా ఉంది. అటువంటి శ్రీగిరి మహాలింగాన్ని సేవిస్తున్నాను. ఆహా శంకరా! నీకు తొలిశ్రోతనైనందుకు నా జన్మ ధన్యమయ్యింది’’ అన్నాడు విష్ణుశర్మ.
‘హే విభో! శ్రీశైలవాసా! తుమ్మెదరేడా! మోహినీరూపుడైన మాధవుని యందు వసంత కాలమందు విహరించినట్లుగా, నా చిత్తకమలంలో ఎడబాయక విహరించు’ అనే అర్థం వచ్చే మరో శ్లోకాన్ని శంకరుడు చెప్పాడు.
‘‘శివుడు ఆనందలహరియై నీ కవిత్వంలో ప్రవహిస్తున్నాడు శంకరా!’’ అన్నాడు విష్ణుశర్మ తన్మయంగా.
‘‘కవిత్వం నా జీవలక్షణమే కానీ, చరమగమ్యం కాదు విష్ణూ! ఆత్మజ్ఞానం కోరి ఈ శ్రీశైల భూమిలో కొద్దికాలమైనా తపించాలని ఉంది’’ అన్నాడు శంకరుడు.
‘‘దానికేం’’ అన్నాడు విష్ణుశర్మ.
తపోదీక్షకు అనువైన స్థలాన్ని ఎన్నుకుని శంకరుడు, వెన్నెముక నిటారుగా ఉంచి పద్మాసనంలో కూర్చున్నాడు.
- నేతి సూర్యనారాయణ శర్మ

మరిన్ని వార్తలు