నమామి దేవి నర్మదే!

28 Jul, 2019 10:21 IST|Sakshi

శంకర విజయం 7

ఆదిశంకరాచార్యుల జీవితచరిత్ర 

‘‘గురువు లభించడం అర్హతను బట్టి ఉంటుంది. సరైన శిష్యుడు లభించాలన్నా అంతే! సందేహాలు పటాపంచలు కావాలని శిష్యుడెంతగా అల్లాడిపోతూ ఉంటాడో.. తన విద్యను సాకల్యంగా అర్థం చేసుకుని ముందుకు తీసుకుపోయే శిష్యుడు కావాలని గురువు కూడా అంతగానూ తపిస్తూ ఉంటాడు. ఇద్దరూ ఒకచోట జతగూడతారా లేదా అనేది కాలం చేతిలో ఉంటుంది. శిష్యుడు ఒక్క మెట్టు ఎక్కే లోపల గురువు వంద మెట్లు అధిరోహిస్తాడు. తనతో సమానుడు అయ్యేంత వరకూ గురువు పరీక్షించి, చివరకు విద్యాదానం చేస్తాడు. లేకపోతే లేదు. గురువు పెట్టే పరీక్షలన్నీ తట్టుకోగలవా మరి?!’’ అడిగాడు సాధువు.

శంకరుడు తల పంకించాడు. 
అప్పటికి వాళ్లు ఓంకారేశ్వరుని ఆలయం మెట్లు దిగి, ఎడమవైపున నర్మదకు వెళ్లే దారిలో ఉన్నారు. శంకరుణ్ణి అక్కడ నిలువరించి, సాధువు ఇలా కథ చెప్పడం మొదలుపెట్టాడు.
‘‘వేదవ్యాసుని కుమారుడు శుకుడు. రాగద్వేషాలకు అతీతుడై, పుట్టిన వెంటనే సన్యసించాడు. ఆదిశేషుని అవతారంగా ప్రభవించిన పతంజలి మహర్షి ఆయనకు శిష్యుడయ్యాడు. యోగవిద్యను లోకానికి అందించి చిత్తంపై అధికారం సాధించడం ఎలాగో నేర్పాడు. వ్యాకరణవేత్తగా పతంజలి భాషను సంస్కరించాడు. వైద్యుడై శరీరాన్ని ఎలా సంరక్షించుకోవాలో చెప్పాడు. వేయి శిరస్సులతో ఆయన విద్య బోధిస్తుంటే ఆ తేజస్సును శిష్యులు తట్టుకోలేరని తెరలు కట్టి ఉంచేవారట. ఓసారి తెర తొలగించి చూస్తే పతంజలి అసలు రూపం కనిపించింది. కంఠం వరకూ మానవదేహం, పాము శిరస్సు గోచరమయ్యాయి.

అటువంటి పతంజలికి గౌడపాదుడు శిష్యుడయ్యాడు. శ్రీవిద్యా రత్నసూత్రాలను, సుభగోదయ స్తుతిని రచించిన వాడాయన. మాండూక్యోపనిషత్తుకు కారికను రచిస్తూ... సృష్టి ఒకప్పుడు ఉండడం మరొకప్పుడు లేకపోవడం అనేది లేదు, అది అనాది అని ప్రతిపాదించాడు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రవచించాడు. అనుకోని రీతిలో గౌడపాదుడికి గురువు ఒక శాపంలాంటి షరతు పెట్టాడు. నువ్వు నీ విద్యను కేవలం ఒక్కడికే బోధించాలి అన్నాడు. 
గౌడపాదుడు తగిన శిష్యుని కోసం దేశమంతా గాలించాడు. చివరకు ఉజ్జయిని అని పిలిచే అవంతికా పురంలో చంద్రశర్మను కనుక్కున్నాడు. అతనిలో తన గురువైన పతంజలి లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించాయి. ఆ చంద్రశర్మకు తురీయమిచ్చి గోవింద భగవత్పాదాచార్యునిగా యోగనామం ఇచ్చాడు. తన విద్యలన్నింటికీ వారసునిగా తీర్చిదిద్దాడు. గోవిందులు ఈ ఓంకార క్షేత్రంలోనే ఆశ్రమం ఏర్పరచుకుని వేలాదిమందికి విద్యాదానం చేశారు. ఇదంతా వెయ్యేళ్ల క్రిందటి ముచ్చట.

గోవిందులు తనకు లభించిన శిష్యులెవరూ తనంతటి వారు కాలేకపోయారని దిగులు చెందారు. తన గురువులాగా సమర్ధుడైన శిష్యునికోసం ఆయన అన్వేషణ చేయలేదు. అదుగో... ఆ కనిపిస్తున్న గుహలో ప్రవేశించి ఈ వెయ్యేళ్ల నుంచి తపస్సు చేస్తున్నారు.’’
సాధువు వేలుపెట్టి చూపించిన వైపు చూశారు శంకరుడు, విష్ణుశర్మ.
ఆశ్చర్యాన్ని అదుపు చేసుకోలేక గబగబా వెళ్లి ఆ గుహ ద్వారాన్ని చేయిపెట్టి కొలిచాడు విష్ణుశర్మ. సరిగ్గా జానెడు ఉందది. ‘‘ఇదేదో కలుగులా ఉంది స్వామీ! దీని వెనుక గుహ ఉందంటారా? ఇందులో ఓ మనిషి దూరి వెయ్యేళ్లుగా తపస్సు చేస్తున్నాడంటారా? నమ్మశక్యంగా లేదే??’’ అన్నాడు.
శంకరుడు పెదిమలపై కుడిచేతి చూపుడు వేలిని పెట్టుకుని తప్పు.. అలా మాట్లాడ వద్దన్నట్లుగా సంజ్ఞ చేశాడు.
‘‘గోవింద భగవత్పాదులు ఇంకా ఈ సమాధిలోనే ఉన్నారని మా అందరి విశ్వాసం. ఇప్పటివరకూ ఎందరో మహామహులు ఆయన బయటకు వస్తే దర్శించి తరిద్దామని ప్రయత్నించారు. ఆయన రానేలేదు.  నువ్వూ ప్రయత్నించు. అదృష్టం బాగుంటే గురుదర్శనం లభిస్తుంది. నీ స్థితి చూస్తుంటే ఇప్పటి వరకూ క్రమ సన్యాసం స్వీకరించినట్లు లేదు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకో. నువ్వెవరో గురువుకు ఎరుక పరుచు. నీ అర్హతలేమిటో చెబుతూ విద్యాభిక్షను అర్థించు’’ అన్నాడు సాధువు.

శంకరుడు బిగ్గరగా గొంతెత్తి తన అవతార పరమార్ధాన్ని చాటుతూ, తన అర్హతలు గురువు చెవిన పడాలని సంకల్పించి నిర్వాణ మంజరిని చెప్పడం మొదలుపెట్టాడు.
నేను దేవతను కాను. మానవుడను కాను. రాక్షస, గంధర్వ, యక్ష, పిశాచాలలో ఎవ్వడనూ కాను. స్త్రీ, పురుష, నపుంసక మూర్తిని కాను. శరీర సంబంధమైన అవస్థా భేదాలకు నేను అతీతుణ్ణి. అందువల్ల బాల్య యవ్వన వృద్ధాప్యాది దశలు నాకు వర్తించవు. బ్రహ్మచర్య, వానప్రస్థ, గృహస్థ, సన్యాసాశ్రమ ధర్మాలు నాకు వర్తించవు అని ప్రకటించాడు శంకరుడు.
అష్టవిధాలైన శ్రాద్ధ క్రతువులను నిర్వహించాడు. అందులో భాగంగా ఆత్మపిండం వేసుకున్నాడు. శిఖను తొలగించుకుని, యజ్ఞోపవీతాన్ని విసర్జించాడు. నర్మదలో మునిగి దిగంబరుడయ్యాడు. గుహకు అభిముఖంగా త్వరత్వరగా అడుగులు వేశాడు. అక్కడ రెండు చేతులూ జోడించి నిలబడ్డాడు.

‘‘ఏదో ఒక కార్యం లేకుండా అజ్ఞానానికి ప్రకాశత్వం ఉండదు. ఈ సంసారం అటువంటి అజ్ఞాన కార్యరూపమే. నాకు సంసారయాత్రా ప్రవాహమంటే వాంఛ లేదు. అలాగని ప్రయత్నపూర్వకంగా ఈ బుద్ధిని తొలగించుకోవాలనే ప్రయత్నమూ చేయడం లేదు. ఎందుకంటే నేను బుద్ధిని కాను. తలపెట్టిన కార్యం సఫలమవుతుందా లేదా అనే సందేహం లేదు.  నేను శరీరం కాదు. కనుక ఏ అవయవమైనా పాడవుతుందేమో బెంగలేదు’’ అని పాడాడు శంకరుడు.
గుహ లోపలి భాగం నుంచి పాంచజన్య నినాదంలాంటి పలుకులు వెలువడ్డాయి.
‘‘ఇంతకూ ఎవరు నువ్వు? నువ్వు ఏది కాదో చెప్పినంత మాత్రాన నీ ఆనవాళ్లు చెప్పుకున్నట్లు కాదు. ఏది అవునో చెప్పు.’’
శంకరునికి ఆ పలుకులు అమృతతుల్యంగా చెవిని సోకాయి. విష్ణుశర్మతో పాటు అక్కడ గుమికూడిన మరికొందరు కూడా జరుగుతున్నదంతా చూస్తూనే ఉన్నారు. తాము పుట్టి బుద్ధెరిగిన తరువాత ఆ గుహలోపలి నుంచి అటువంటి పలుకులు వెలువడడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

శంకరుడు తానెవరో చెప్పడం మొదలుపెట్టాడు.
చిత్తవృత్తులను నిరోధించుకుని, ప్రకాశింప చేసుకున్న పరమశివుణ్ణి నేను. శ్రేష్ఠ ప్రకాశ స్వరూపమైన శివుడనే నేను. జగత్తు సృష్టి స్థితి లయలకు ఒకే ఒక కారణమైన శివుడనే నేను. హృదయాకాశంలో చరించే సచ్చిదానందాన్ని. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయో అదే నేను. ఎందులో నాలుగోవంతుగా ఈ జగత్తు అంతా తయారైందో అది నేనే. కాలరూపమైన మృత్యువుకు సైతం నేనంటే భీతి. దేవతలకు వెలుగునిచ్చే వాడనే నేను.
‘‘నువ్వు శివునివే అయితే నా ముందు చేతులు జోడించడం దేనికి?’’ గుహలో నుంచి రెండో ప్రశ్న వెలువడింది.
దానికి వినయంతో కూడిన విస్పష్టమైన సమాధానాన్ని శంకరుడు ఇలా చెప్పాడు.
యదాకాశవత్‌ సర్వగం శాంతరూపం
పరంజ్యోతిరాకార శూన్యం వరేణ్యం
యదాద్యంత శూన్యం పరం శంకరాఖ్యం
యదంతర్విభావ్యం తదేవాహమస్మి
– నేను ఆకాశంలా సర్వవ్యాపిని. శాంతరూపాన్ని. పరంజ్యోతిని. నిజానికి నిరాకారిని. ఆద్యంత రహితుణ్ణి.  ఎవరైనా సరే... ఏరికోరి మనసు లోపల ధ్యానించదగిన వాణ్ణి. నాలుకతోనూ ఉచ్చరించదగిన ఏకైక పేరు కలవాణ్ణి... నేను శంకరుణ్ణి!!

గుహద్వారం తేజోమయం అయింది. సూర్యుని కాంతిని తలదన్నేలా వెలుగులు విరజిమ్మింది. శంకరుడనే మహావృక్షానికి కాషాయాంబరం కాసింది. 
ఆ గుహద్వారం నుంచి తెల్లగా మెరిసిపోతున్న రెండు పాదాలు బయటకు వచ్చాయి.
శంకరుని మానసం ఉప్పొంగింది. రెండు చేతులా గురుని పాదాలను పట్టుకున్నాడు. పువ్వుల్లా మెత్తగా తగిలాయవి. వినయంగా ఆ పాదాలకు శిరస్సును చేర్చాడు శంకరుడు.
ఓంకారనాదం ఆ పర్వతమంతా ప్రతిధ్వనించింది. మెల్లగా గురుని పాదాలు మళ్లీ వెనక్కు వెళుతున్నాయి. ఆ పాదాలను ఆశ్రయించుకుని ఉన్న శంకరుడు కూడా మెల్లగా గుహలో ప్రవేశించాడు. 
చూస్తున్న వారందరికీ మతులు పోతున్నాయి. విష్ణుశర్మకు ఆరాటం ఎక్కువైపోయింది. శంకరుణ్ణే ఆరోప్రాణంగా భావించి, అతనికోసమే ఇంతదూరం ఇల్లువాకిళ్లు వదులుకుని వచ్చాడతను. అటువంటిది శంకరుని సత్సాంగత్యం ఇంతత్వరగా దూరమవుతుంటే తట్టుకోలేకపోయాడు. విలవిలలాడాడు. శంకరా! అని పిలుస్తూ విలపిస్తూ రెండురోజులు నిద్రాహారాలు మాని అక్కడే పడిగాపులు కాశాడు. శంకరుడు తిరిగి వచ్చేవరకూ ఈ ఓంకార క్షేత్రాన్ని వదిలేది లేదని మనసులో శపథం చేసుకున్నాడు.

రోజులు గడిచిపోతున్నాయి. శిశిర, వసంతాలు గడిచిపోయి గ్రీష్మరుతువు ప్రవేశించింది. ఎండలు మండించడం మొదలుపెట్టాయి. తదుపరి వర్షకాలంలో వానచుక్క పడలేదు. శంకరుడక్కడ గురుసన్నిధిలో ఎలా ఉన్నాడో తెలియదు. ఏం చదువుతున్నాడో తెలియదు. ఆయన నేర్పుతున్నదేమిటో, ఈయనకు ఇంకా నేర్వవలసిన విద్యలేమిటో ఇతరులు ఊహించలేరు. పాండిత్యం పుష్కలంగా సాధించినా, గురువు ఆమోదం, తీర్మానం సంపూర్ణంగా దొరకకపోతే విద్య పూర్తయినట్లు కాదు. చెప్పింది చెప్పినట్లుగా నేర్చుకునే శిష్యుడు లభిస్తే గురువుకు రాత్రీపగలు తేడా తెలియదు. గుహలోపల వారికి అన్నాదులు ఎలా సమకూరుతాయో ఇతరులకు తెలియదు. నిజంగా వారక్కడే ఉన్నారా, బిలమార్గాన్ని అనుసరించి మరెక్కడికైనా వెళ్లిపోయారా... ఇటువంటి ఊహలే వృథా కదా!

బయట వేచివున్న విష్ణుశర్మకు ఎప్పుడూ శంకరుని ధ్యాసే. త్వరలో మళ్లీ అతణ్ణి చూడగలనని ఆశ. మొత్తంమీద శుభకృతు నామ సంవత్సరంలో శుభాలేవీ జరగలేదు. చుట్టుపట్ల పచ్చని మొక్క కరువైంది. ఆ ఏడాది పూర్తయ్యేసరికి నర్మద చిక్కిపోయి నామమాత్రావశిష్టగా మారింది. శోభకృతులో ప్రవేశించడానికి వసంతం మొరాయించింది. అప్పటికి కలియుగం ప్రవేశించి 2603 (క్రీ.శ. 497) సంవత్సరాలైంది.  తాగునీరు లేక జ్యేష్ఠ గ్రీష్మంలో కరవు సూచనలు స్పష్టమయ్యాయి. ప్రజల హాహాకారాలు మిన్నుముట్టాయి.
ధ్యానమగ్నుడై శంకరుణ్ణే స్మరిస్తున్న విష్ణుశర్మకు ఆకాశవాణి వినిపించింది. ‘‘వరుణదేవా! నీకు శంకరునిపై గల మమకారం ప్రకృతి విలయాన్ని సృష్టిస్తోందయ్యా! నీ శంకరుడు నీకు మళ్లీ దక్కాలంటే ఈ తాపం కట్టిపెట్టు. సృష్టిని మళ్లీ నీ కరుణామృత వర్షంతో సేదదీరనివ్వు.’’ విష్ణుశర్మ కన్నులు తెరిచాడు. శంకరుడు మళ్లీ తనకు కనిపిస్తాడనే స్పష్టమైన సంకేతం అతడి మనసుకు హాయినిచ్చింది. ఆ క్షణంలోనే ఆషాఢమేఘం కరిగి నీరయ్యింది.

చిరుజల్లు చిత్తడిజల్లై క్రమంగా కుండపోతగా మారింది. మబ్బు ముసురేసి పగలు సూర్యుణ్ణి, రాత్రి చంద్రుణ్ణి కనిపించనీయకుండా దాచేసింది. నర్మదా తీరవాసులకు మూడురోజులపాటు రాత్రింబవళ్లు ఏకమయ్యాయి. నదీ పరీవాహక ప్రాంతాలైన కిరాత, సూత, బాడబ, శఠదేశాలు ముంపుకు గురయ్యాయి.
ఆషాఢ పౌర్ణమి నాటికి పరిస్థితి ఏమిటంటే, ఓంకార పర్వతానికి పశ్చిమాన కావేరీ, నర్మదా సంగమస్థానంతో వరద ఉధృతి ప్రారంభించింది. వరుసగా పర్వతాన్ని ఆక్రమిస్తూ ఆలయాభిముఖంగా సాగుతోంది. పర్వతేయులందరూ హాహాకారాలు చేస్తూ వచ్చి, ఆలయంలో తలదాచుకున్నారు. ఉత్తరదిక్కున ఉన్నవారికి, తూర్పుదిక్కున ఉన్నవారికి కూడా ఓంకారనాథుడే ఆశ్రయమిచ్చాడు. వరదపోటు కంటే జనం కిక్కిరిసి నందువల్ల ఆలయస్తంభాలు ఊడిపడతాయేమో అన్నట్లుంది పరిస్థితి. అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. విష్ణుశర్మకు ఆరోప్రాణం ఆగిపోతున్నంత పనైంది.

మరో ఆరుగజాల ఎత్తు నీరు వస్తే ఆలయం మునిగిపోతుంది. సరిగ్గా అక్కడే గోవింద భగవత్పాదుని గుహద్వారం ఉంది. వరదనీరు బిలద్వారం వరకు తన్నుకుంటూ వెళుతున్నట్లుంది. 
అకస్మాత్తుగా సూర్యోదయమైంది. గుహద్వారం సంపూర్ణంగా తెరువబడి శంకరసూర్యుడు వెలికి వచ్చాడు. జ్ఞానదండం చేయి మార్చుకున్నాడు. పొంగులెత్తుతున్న నర్మదలో కమండలువు ముంచాడు. బుడుంగు బుడుంగుమంటూ నదినీరు లోపలికి వెళుతోంది.
సబిందు సింధు సుస్ఖలత్తరంగ భంగ రంజితం
ద్విషత్సుపాప జాత జాతకాది వారి సంయుతం
కృతాంత దూతకాల భూతభీతి హారి వర్మదే
త్వదీయ పాదపంకజం నమామి దేవి నర్మదే
– నీలో గ్రుంకులిడిన వారికి యమదూతల నుంచి సైతం రక్షణ కల్పించే పాదపద్మం నీది. నిన్ను ద్వేషించే పాపాత్ములను అరికట్టేందుకు ఈ అవతారం ధరించావా? నీలో నిత్యం సంచరించే జీవజాలం భీతిల్లుతోంది. మహాభయంకరమైన జగత్‌ ప్రళయంలో మార్కండేయునికి నివాసం కల్పించేదానవు నీవే కదా! భక్తులకు కలిగే ఆపదలనే పర్వతాలను బద్దలు కొట్టవమ్మా. పుణ్యమనే కవచాన్ని ప్రసాదించి రక్షించు. నీ ఒడ్డున ఆడుకునే జీవరాశికి పునరావాసం కల్పించు. సర్వప్రాణులకూ సుఖములిచ్చి, నీ అడుగుల సవ్వడి మదిలో స్మరించగానే ముక్తి ప్రసాదించు అని స్తోత్ర పూర్వకంగా వేడుకున్నాడు.
నర్మదానదీ మహాప్రవాహమంతా శంకరుని కమండలువులోకి జారిపోయి, ఒదిగిపోయింది. వరదపొంగు చల్లారి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ‘శంకరా!’ అని పిలుస్తూ వచ్చి విష్ణుశర్మ దగ్గరగా వచ్చి ఆగిపోయాడు. పొంగు తగ్గిన నదిలోనుంచి ఇద్దరు మహర్షులు నడుచుకుంటూ వచ్చారు.
‘జగద్గురూ!’ అని శంకరుణ్ణి సంబోధించారు. శంకరునితో సహా అందరూ వారికి అభివాదం చేశారు.
- నేతి సూర్యనారాయణ శర్మ

మరిన్ని వార్తలు