మనుషుల్లా మారిపోతున్నారు..

12 Apr, 2020 08:59 IST|Sakshi

ఈవారం కథ

మనిషి రూపం రోజురోజుకు వింతగా  మారిపోసాగింది. అన్యాయానికి నోరు చాలా పెద్దదిగా పెరిగి పోసాగింది.  తలలనిండా కొమ్ములు మొలుచు కొస్తున్నాయి. జిత్తులమారి నక్కల రూపం వచ్చేసింది. 
కాళ్లు చేతులు పొడవుగా భయానకంగా వికృతంగా పెరిగిపోతున్నాయి. గోళ్ళు పొడవుగా...చీల్చడానికి వీలుగా...పదునెక్కుతున్నాయి.   
భయంకర...రాక్షసాకార రూపంతో విచ్చలవిడిగా లోకం మీద పడిపోతున్నాడు.
మనిషే దోపిడీగా రూపాంతరం చెందాడు. 
కళ్ళు ఎర్రటి  అగ్నిగోళాల్లా మండసాగాయి.
నిలువెల్లా విషం ఆవరించసాగింది. 
కోరలు పొడవుగా పెరిగాయి. జుట్టు విరబోసుకుని, చేతులు బార్లా చాపి, రోడ్డు మీద బోర విరుచుకుని నడవసాగాడు.
రోజు రోజుకు మనిషి రూపం మారిపోయి నరకాసురుడులా మారిపోతున్నాడు. 
బుర్రమీసాలు వచ్చేశాయి. డేగ కళ్ళు తెరిచాడు.
రాక్షసరూపు వచ్చేసింది. ఒళ్ళంతా పొలుసులు పొలుసులుగా రూపాంతరం చెందాడు.
పొడవాటి నోటిలో రంపపుపళ్ల  మొసలి లక్షణాలు పొడచూపుతున్నాయి. 

పులి, సింహం, తోడేలు అన్నింటి క్రూరత్వాన్ని ఒడిసి పట్టుకున్నాడు. కనబడ్డ వాళ్ల రక్తం కళ్ళజూడసాగాడు. తన పరభేదాలు మరచిపోయాడు. అరాచకాలు లేకుండా నిద్ర పట్టడం లేదు.   
జనంపై చెలరేగిపోయాడు. పిచ్చి, చాదస్తం ఆభరణాలు అయ్యాయి. ఉన్మాదం తలకెక్కింది. డబ్బు, భూమి, స్థలాలు, పొలాలు, బంగారం, వెండి, నగలు, ఇళ్లు,  ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు...వీటిని అన్యాయంగా సంపాదించడం అలవాటుగా చేసుకున్నాడు.
అవసరమైతే పక్కవాడిది లాక్కోవడం హక్కుగా మార్చుకున్నాడు.
రాబందు, పులి, సింహం,తోడేలు, మొసలి, పాముల తలలు  పొడుచుకు వచ్చేశాయి.
 నాలుగు రోడ్ల కూడలిలో  గుంపులు గుంపులుగా చేరి కొట్లాటలకు కాలు దువ్వసాగారు. తెల్లారి లేచింది మొదలు అర్ధరాత్రి వరకు ఆంబోతుల్లా విచ్చలవిడిగా వీరవిహారం చెయ్యసాగారు.  
దూరం తెలియదు. గమ్యం లేదు. వెనకా ముందు చూసేదే లేదు. అందినంత మేరా ఆబగా అల్లుకు పోసాగాడు. ఈ గుంపుల కాళ్ళ కింద పడి ఎన్నో మూగజీవాలు నలిగిపోతూ ఉన్నాయి.
ఎందరో ఆడవాళ్ళు, పిల్లలు అసువులు బాస్తున్నారు.
అమాయకులు ఎందరో బలైపోతున్నారు. అయినా గుంపులు పట్టించుకోవడం లేదు.

డబ్బు... సంచులు... సంచులు.... గోతాలు... గోతాలు.. లారీలు... లారీలు చేతులు మారిపోతున్నాయి. డబ్బు పోగు పడుతుంది. హింస మితిమీరిపోతుంది. తలలు మొండాల నుండి వేరై పోతున్నాయి. కాళ్లు చేతులు విరిగి పడిపోతున్నాయి.  రోజు రోజుకు మృగా రూపాలు ఇంకా  పెరిగిపోతూనే ఉన్నాయి. కోరలు సాచి విషం కక్కుతున్నాయి. పంజా విసురుతున్నాయి. డేగ కళ్లతో వేట జోరుగా సాగుతోంది.
కత్తులు, కొడవళ్ళు, గొడ్డళ్లు, విల్లంబులు, బరిసెలు, ఈటెలు సరికొత్త రూపాలలో తయారవుతున్నాయి. అవసరమనుకుంటే ఏ ఆయుధానికైనా పని చెప్పడానికి  వెనుకాడడం లేదు. 
వాళ్ళకు ఏడుపులు వినబడవు. పెడబొబ్బలు పెట్టినా వదలరు.  పిల్లలు, స్త్రీలు, వృద్ధులు, అవిటి వాళ్ళు ఎవరైనా సరే అడ్డు వచ్చారంటే అడ్డు తొలగించుకోవడమే.
గుంపులు, గుంపులుగా కొండలు ఎక్కేస్తున్నాయి. గుంపులు, గుంపులుగా గుట్టలెక్కేస్తున్నాయి. అడవులకు అగ్గి ముట్టించి వేస్తున్నాయి. భూమిని  పాతాళ లోకంలోకి తొవ్వేస్తున్నాయి. దేనినైనా సరే తనకు కావాలనుకుంటే సర్వ నాశనం చేసేస్తున్నాయి. అడ్డు అదుపు లేకుండా ప్రకృతి అస్తవ్యస్తం చేసేస్తున్నాయి.

రోజురోజుకు గుంపుల నోళ్లు గుహల్లా విస్తరించసాగాయి. దేనినైనా మింగేసే స్థాయికి వచ్చేస్తున్నాయి. మితిమీరిన దాహంతో ఊరేగుతున్నాయి. 
అడవులు హరించుకు పోతున్నాయి. భూములు హారతి కర్పూరం అయిపోతున్నాయి. కొండలు పిండి అయి పోతున్నాయి. ఊళ్లకు ఊళ్లు సర్వనాశనం అయిపోతున్నాయి.
అయినా సరే గుంపుల పరుగు ఆగడం లేదు. పడగలు విప్పుతూనే ఉన్నాయి. కొత్త కొత్త ఆయుధాలు కొత్త కొత్త  ఎత్తుగడలతో ఉరకలు వేస్తూనే ఉన్నాయి. పరుగులు తీస్తూనే ఉన్నాయి. పడుతూ లేస్తూ సాగిపోతూనే ఉన్నాయి. చిన్నచిన్న గుంపులు పెద్ద పెద్ద గుంపుల వేటకు తట్టుకోలేక  చావుల రేవుల్లోకి చేరుతున్నారు.   అయినా గుంపులు లెక్క చేయకుండా  పెరుగుతూనే ఉన్నాయి. ముందుకు సాగుతూనే ఉన్నాయి. గుంపులు  గుంపులుగా చెలరేగి పోతూనే ఉన్నాయి.

పాదాల పరిమాణం పెరిగి పెరిగి ఏనుగుల పాదాలుగా మారిపోయాయి. వాటి కాళ్ల కింద పడి నలిగి పోయేవాళ్ల సంఖ్యకు లెక్కేలేదు. కళ్ళ ముందు  ఏముందో చూసే దశను దాటి పోయాయి. ఏడుపులు వినిపించడం లేదు. మనుషులను కంటితో చూడడం లేదు. 
తల్లులు, పిల్లలు ఎవరూ కంటికి కనిపించడం లేదు. బంధువులు, స్నేహితులు అనే మాటకు తావే లేదు. వెళ్లడమే ముందుకు వెళ్ళడమే. పోవడమే దూసుకుపోవడమే.  పచ్చని పల్లెటూళ్ళు ఎర్రటి రక్త కాసారాలు అవుతున్నాయి. 
రాతి కట్టడాల అరణ్యాలు పెరిగిపోతున్నాయి. ఆకాశాన్ని అందుకునే గోడలు లేస్తున్నాయి. అలా...అలా...తిరిగాయి....తిరిగాయి...గుంపులు చాలా....చాలా ....దూరం తిరిగాయి. చాలాకాలం తిరిగాయి.
అప్పుడు వెనక్కి  చూశాయి. 
గుంపులకు ఎక్కడున్నామో అర్థం కాలేదు. అలుపు వచ్చేసింది. నవనాడులు కుంగిపోతున్నాయి. కళ్ళు మూతలు పడుతున్నాయి. తలలు విదిలించుకున్నాయి. శక్తి సన్నగిల్లుతుంది. ఎక్కడికక్కడ పడిపోతున్నారు. మళ్ళీ లేచి నిలబడుతున్నారు. గట్టిగా ఊపిరి పీల్చుకొంటున్నారు. ధైర్యం  కూడగట్టుకుంటున్నారు.

‘‘ఆ....చాలా...చాలా దూరం వచ్చేశాం. ఇంకా ముందుకు పోవాలి. ఇంకా పైకెదగాలి’’ అనుకుంటూ సామాన్యులపై రకరకాల  అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. సామాన్య మానవులు కకావికలైపోతున్నారు. పరుగులు పెడుతూ చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతున్నారు. ఆడవాళ్ళనైతే లెక్కేలేదు. చిన్నా పెద్దా తేడా లేదు. చిదిమేస్తున్నారు. ఎక్కడ కనిపించినా, ఎవరు కనిపించినా చీలికలు పీలికలు చేసేస్తున్నారు.    వెంటబడి వెంటబడి వేటాడుతున్నారు. పేగులు మెడలో  వేలాడదీసుకు తిరుగుతున్నారు. రక్తాన్ని జుర్రుకుంటున్నారు. చాలా చాలా దూరం వచ్చేశాయి గుంపులు.
ఇంకా... ఇంకా.. పైకి... పైపైకి... తప్ప కింద చూపే ఆనడం లేదు. ఎంత దూరం వెళ్ళినా ఇంకా ముందుకే అడుగులు పడుతున్నాయి. వెళ్లాయి ...వెళ్లాయి ...వెళ్తూనే ఉన్నాయి ... ఇంకా...ఇంకా...ముందుకు...ముందుకు... పైకి...పైకి...అలా...అలా అందనంత దూరం వెళ్ళాయి.
అక్కడ మొదలైంది...ఏమిటిది? ఎందుకిలా? ఎవరికి ఎవరు?
ఎంత దూరం? ఎంతకాలం? ఏమిటి గమ్యం?
గుంపుల్లో ఆలోచన మొదలైంది.
ఒక్కసారిగా అయోమయం వ్యాపించింది. 

ఎక్కడున్నాం మనం? ఏం చేస్తున్నాం మనం? అని ఆలోచించడం మొదలు పెట్టాయి.
వెనక్కి తిరిగి చూశాయి. అంతా శూన్యంగా కనిపించసాగింది. కనుచూపుమేరలో ఏమీ కనిపించడం లేదు. ఎటు...చూసినా...ఎడారే. దాహం వెయ్యసాగింది. నోరు పిడచ కట్టుకుపోతుంది. చుక్క నీళ్లు ఇచ్చేవాళ్లే కరువయ్యారు.
 ఆకలి వేస్తుంది. నోటికింపైన తిండి పెట్టే వాళ్ళే లేరు.
 కనుచూపుమేరా మనుషుల జాడే లేదు. అక్కడక్కడా చావులు కూడా సంభవిస్తున్నాయి. పోయిన వాళ్లకు కర్మకాండలు చేసే దిక్కు కూడా కనిపించడం లేదు. అయినా గుంపుల్లో మార్పు కనిపించడం లేదు. పైపైకి అనుకునేవాళ్ళే పెరిగిపోతున్నారు.
చాలా దూరం...మనుషులకు అందనంత దూరం.... పైకి పోయే గుంపులు...తమకు తాము చూసుకుంటున్నారు. ఒంటినిండా అసహ్యకరమైన అవాంఛితమైన రోమాలు పెరిగిపోయి ఉన్నాయి. పొడవాటి కొమ్ములు పొడుచుకు వస్తున్నాయి. కోరపళ్ళు పొడవుగా నాలుకలు సాచి బుసలు కొడుతున్నాయి. జడలు కట్టిన వింత వింత ఆకారాలు కనిపిస్తున్నాయి.
కళ్ళల్లో మంటలు మండుతున్నాయి. తమ రూపం తమకే వికృతంగా  అనిపించసాగింది.
అందరూ ఏకమయ్యారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. అన్నీ జంతువుల తలలే. మృగాల లక్షణాలే కనిపిస్తున్నాయి. ఎవరికి ఎవరు ఏమవుతారో ఎంత గుర్తుకు తెచ్చుకోవాలన్నా గుర్తే రావడంలేదు.

గతమంతా మరుగున పడిపోయింది. మాటలే మర్చిపోయారు. నోళ్లు  పెగలడం లేదు. 
 సంతోషం అంటే ఏమిటో తెలియడం లేదు. రంగు రుచి వాసన అర్థమే కావడం లేదు. స్పర్శ మాయమైంది.
నవ్వడం అంటే ఎలా ఉంటుందని అందరినీ అడగసాగారు. ఏడుపు  ఎలా ఏడవాలో తెలియడం లేదు. పిల్లల కోసం వెతికారు. బంధువుల కోసం చూశారు. పెద్దల కోసం చూశారు. మనం ఎవరిమి అనుకుంటూ ఒకరికొకరు మొహాలు చూసుకుంటున్నారు. ఎవరికీ ఏమీ తెలియడం లేదు. అంతా అయోమయంగా ఉంది. జంతువుల దగ్గరగా వెళ్ళి చూశారు. వాటికీ  తమకూ దగ్గర సంబంధం ఉన్నట్టు అనిపించింది. అలా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న గుంపులు వెతుకులాటలో పడిపోయాయి.
వెతగ్గా వెతగ్గా దూరంగా ఎక్కడో మసక మసగ్గా మనుషులు కనిపించసాగారు. 
వాళ్ల దగ్గరకు పోతుంటే భయపడి దూర దూరంగా జరుగుతున్నారు.

‘‘అయ్యో మిమ్మల్ని ఏమీ చెయ్యము. మేము ఎవరిమో మర్చిపోయాం. గుర్తు చేయరా’’ అంటూ బతిమాలసాగారు.
అయినా మనుషులకు నమ్మశక్యంగా లేదు. వీళ్ళందరూ ఇంతకుముందు ఎప్పుడో ఓసారి ఈ గుంపుల కాళ్ళ కింద పడి నలిగిపోయిన వాళ్ళే. తమ పిల్లల్నీ  ఇళ్ళనీ, పుస్తెలనీ వీళ్ళకి అర్పించిన వాళ్ళే. వీళ్ళ చేతిలో చావు దెబ్బలు తిన్న వాళ్లే.
అందుకే ఎంత బతిమాలుతున్నా తప్పించుకుపోతున్నారు. ఏ ఎత్తుగడలో ఇవి అని దూరదూరంగా తొలగి పోతున్నారు.
గుంపులకు పిచ్చి లేస్తుంది.  వాళ్ళని ఎలా నమ్మించాలో అర్థం కావడం లేదు.  తమ వైపు తాము చూసుకున్నారు. తమ వింత ఆకారాన్ని చూసి తామే నమ్మలేక పోయారు. చేతుల నిండా ఆయుధాలు ఉన్నాయి. వాటన్నిటినీ కుప్పగా పోసి నిప్పంటించారు. తమ శరీరాలపై అసహ్యంగా పెరిగిన జంతు లక్షణాలన్నింటినీ ఒక్కొక్కటి తొలగించుకోసాగారు. మర్చిపోయిన విషయాలు కొద్దికొద్దిగా గుర్తుకు రాసాగాయి. భక్తి భావన తోటి గుళ్ళూ గోపురాల మెట్లెక్క సాగారు. అక్కడ వీళ్ళ మొఖాలు చూసిన వాళ్లు... పాత జంతువుల ఆనవాళ్లను గుర్తుపట్టి.. దూరదూరంగా తొలగిపోసాగారు.
వీళ్ళలో వస్తున్న మార్పులను చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తున్నారు. దూరం జరుగుతున్న వాళ్లు కాస్తా అసహ్యించుకోవడం తగ్గించారు.
కన్న బిడ్డలు తమ తల్లిదండ్రుల్ని పోల్చుకోసాగారు. బంధువులు ఆహ్వాన పత్రికలు పంపసాగారు. తోడబుట్టిన వాళ్ళు ఆశగా చూడసాగారు.

అందరూ కూడబలుక్కొని ప్రత్యేకమైన మాటల కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకమైన శిక్షకులను రప్పించుకున్నారు. మనుషుల భాష మళ్లీ నేర్చుకోసాగారు. పోగొట్టుకున్న బంధాలేవో మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని మననం చేసుకోసాగారు.   
ఊళ్ళెలా ఉంటాయో, ఊళ్లలో మనుషులు ఎలా ఉంటారో బొమ్మలు గీయించుకుని మురిసిపోసాగారు.  తమ ఇళ్ళు ఆనవాళ్లు చూయించుకొని ఆనందపడసాగారు. వాటికి సంబంధించిన పాఠాలు చెప్పించుకోసాగారు.
పక్షులు, లేళ్ళు, సెలయేళ్ళు, ఊళ్లు, ఊళ్లలో ఇళ్ళు, బావులు,  ఎగిరే పక్షులు, పురివిప్పిన నెమళ్లు,  నీటిలో ఈదే చేపలు, రంగు రంగుల సీతాకోక చిలుకలు, పచ్చటి తివాచీలా పరుచుకున్న పచ్చికలు చూసి...ఆహా అనుకుంటూ మైమరిచిపోసాగేరు. 
మళ్ళీ మళ్ళీ వచ్చి పలకరించే పండుగలు. పండుగల్లో అందరూ కలిసి కలబోసుకునే ఆనందాలు, సుందరమయంగా కనిపించే సుందరీమణుల్ని చూసి మురిసి పోసాగారు. సందడి చేసే కళాకారుల్ని చూసి తన్మయత్వం చెందసాగేరు.
అసలు జీవితం అంటే ఏమిటో, సంతోషంగా ఎలా బతకాలో తెలిసి వస్తుంది. గుళ్ళూ గోపురాలు, దేవుళ్ళు దేవతలు కొలుపులు జాతర్లూ చేసుకుంటూ, ఊళ్లలో నడిబొడ్డున బొడ్రాయి ప్రతిష్టలు చేసుకుంటూ వాటి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చెయ్యసాగారు.

తాము చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలలకు వెళ్లి అక్కడ  పిల్లలతో మాట్లాడి ఆనందపడసాగారు. గత స్మృతులను నెమరు వేసుకోసాగారు. తన తల్లిదండ్రులు  పెరిగిన తావులేవో  తెలుసుకుని నవ్వుకోసాగారు.  తమ కుటుంబాల వాళ్ళను...కులాల వాళ్లను...గోత్రాల వాళ్లను... కలుపుకొని సమావేశాలు నిర్వహించ సాగారు. కన్న తల్లిదండ్రులు  గురించి ఆరా తియ్యసాగారు. బంధువుల  గురించి చెప్పించుకోసాగారు. పోయిందేదో పోగొట్టుకున్నదేదో గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మర్చిపోయిన వాటిని నేర్చుకుంటూ ఒకరినొకరు ఓదార్చు కుంటున్నారు.
మానవ లక్షణాలు అలవర్చుకుంటున్నారు. దూరదూరంగా జరిగిన వాళ్ళందరూ అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరగా జరగసాగారు.
 ‘ఇది కదా  జీవితం! ఇలా కదా బతకాల్సింది!’ అనుకుంటూ నెమ్మది నెమ్మదిగా లోకాన్ని పరిచయం చేసుకో సాగారు.
 జీవించే  విధానాలకు సంబంధించిన పుస్తకాలు ముద్రించుకొని చదువుకుంటూ తాము పొందిన దేమిటో, పోగొట్టుకున్నదేమిటో గుర్తుకు తెచ్చుకోసాగారు.

మానవత్వం అంటే ఏమిటో అర్థమవుతూ ఉండడంతో నెమ్మది నెమ్మదిగా మనుషులుగా మారసాగారు. గుంపులన్నీ విడిపోయి కుటుంబాలను గుర్తించ సాగారు. సంస్కృతీ సంపదను పెంచుకోసాగారు. మానవ సంబంధాలు ప్రేమాభిమానాలు తెలుసుకోసాగారు.
ఆహారంలోనూ, విహారంలోనూ మార్పులు  చేసుకోసాగారు.
గానుగు నూనెలు వాడసాగారు. మందులు మాకులు వేయని పంటలు పండించుకోసాగారు. ఆకులు అలములుతో కషాయాలు తయారుచేసుకుని తాగసాగారు. తరచూ పల్లెటూళ్ళను సందర్శించి స్వచ్ఛమైన గాలిని పీల్చసాగారు. ఒంటరితనాన్ని వీడి ఎక్కువ కాలం మనుషుల మధ్య జీవించడానికి ఇష్టపడుతున్నారు. దానధర్మాలు చేస్తున్నారు. పేద వాళ్ళను చూసి ‘అయ్యో పాపం’ అంటున్నారు. చేతనైనంత సహాయం చేయసాగారు. ముఖాలలో ప్రశాంతత చోటుచేసుకుంటుంది.
మనుషుల తోటిదే కదా అందమైన ప్రపంచం, ఇది కదా నిజమైన జీవితం అని గుర్తించసాగారు. ఇంతకాలం దీన్ని కాలదన్నుకున్నామే ఇప్పటికైనా తెలుసుకున్నాము...అంతే చాలు అనుకుంటూ ఆనంద లోకాల వైపుకు పయనించసాగారు. -శాంతివనం మంచికంటి  

మరిన్ని వార్తలు