షార్ కాలనీలో హత్యా!?

19 Apr, 2015 01:01 IST|Sakshi
షార్ కాలనీలో హత్యా!?

బెస్ట్ కేస్ (క్రైమ్ స్టోరీ)
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కాలనీ. ఆ కాలనీ లోపలికి ఎవరు పడితే వాళ్లు వెళ్లడానికి వీలుండదు. క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి పంపుతారు. అలాంటి కాలనీలో ముగ్గురిని హత్య చేశారనే విషయం నా చెవినపడగానే ఆశ్చర్యపోయాను. 1996లో నేను నెల్లూరు అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన అది. కట్టుదిట్టమైన భద్రత గల షార్ కాలనీలో జరిగిన ఆ హత్యలు పెను సంచలనం సృష్టించాయి.

ఆ కాలనీలో నివసించే ఒక సైంటిస్టు భార్యని, ఇద్దరు పిల్లల్ని అతి కిరాతకంగా చంపినట్టు తెలియగానే ఆగమేఘాలపై మావాళ్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నేను కూడా స్పెషల్‌టీమ్‌తో వెళ్లాను. సైంటిస్టు ఇంట్లోలేని సమయంలో హత్యలు జరిగాయి. అతని భార్యని నైలాన్‌తాడుని గొంతుకి బిగించి చంపారు. ఎనిమిది, పదేళ్ల వయసు అమ్మాయి, అబ్బాయిని గొంతు పిసికి చంపారు. ఆమె ఒంటిపై మాయమైన బంగారం వివరాలను బట్టి ‘మర్డర్ ఫర్ గెయిన్’ కేసని అర్థమైపోయింది.
 
భర్తని అనుమానించాం...
సైంటిస్టు తమిళనాడుకి చెందినవాడు. ముందుగా ఆయన్ని ప్రశ్నించాం. భార్యా పిల్లల్ని పోగొట్టుకున్న షాక్‌లో ఉన్న ఆ సైంటిస్టుకి ఏ పాపం తెలీదని మాకు అర్థమయ్యాక బయటివారిపై దృష్టి పెట్టాం. ఈలోగా పైనుంచి ప్రెజర్ మొదలైంది. శ్రీహరికోట దగ్గర షార్ కాలనీలో హత్యలు జరిగిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఒక పక్క హైదరాబాద్ నుంచి హోమ్ శాఖ అధికారుల నుంచి ఫోన్లు, మరోవైపు కేంద్ర హోంశాఖ దగ్గర నుంచి.. ముందుగా సెక్యురిటీవారి నుంచి ఆ రోజు కాలనీ లోపలికి వెళ్లినవారి సమాచారం సేకరించాం.

పర్మిషన్ లేకుండా, పది రకాల ప్రశ్నలడక్కుండా లోపలికి చీమనైనా పంపని షార్ సెక్యురిటీ వాళ్లు కూడా హంతకుడు లోపలికి ఎలా జొరబడ్డాడో తెలియదంటున్నారు. అంత బందోబస్తున్న షార్ కాలనీలో హత్య అనగానే అంత త్వరగా హత్యానేరాన్ని బయటివారికి కనెక్ట్ చేయలేం. ఆ రోజు కాలనీ లోపలికి వచ్చినవారి లిస్టు దగ్గర పెట్టుకుని వివరాలు సేకరించడం మొదలుపెడితే ఒక వ్యక్తి దగ్గర చిన్న అనుమానం వచ్చింది.
 
ఫొటో ఆధారంగా...
మాకు అనుమానం వచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడో సెక్యురిటీవారిని అడిగి నిందితుడి ఊహచిత్రాన్ని గీయించాం. దాన్ని నెల్లూరులోని అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపించాం. పదిరోజులపాటు అన్నిరకాల దారుల నుంచి ప్రయత్నాలు చేయగా చివరికి పట్టుపట్టాడు. నిందితుడి పేరు బొట్టు వెంకటరెడ్డి అలియాస్ చిరు. దోపిడీలు చేసుకుంటూ బతికేవాడు.మొదట తనకేం తెలియదన్నాడు. చివరికి ఒప్పుకున్నాడు.

దొంగతనం చేయడం కోసం షార్ కాలనీకి ఎందుకెళ్లావని అడిగితే ఇంటరెస్టింగ్ లవ్‌స్టోరీ చెప్పుకొచ్చాడు. హత్య చేయడానికి అతను షార్ కాలనీలోకి వెళ్లలేదు, ప్రియురాలిని చూద్దామని వెళ్లాడు. దానికోసం రేషన్‌కార్డులు పంపిణీదారుడి పేరుతో లోపలికి చొరపడ్డాడు. ఒంటిమీద దండిగా బంగారంతో ఉన్న మహిళ కంట్లో పడగానే, బంగారం కోసం హత్యకు పాల్పడ్డాడు.
 
అమ్మాయికోసం...
బొట్టు వెంకటరెడ్డిపై అప్పటికే చాలా కేసులున్నాయి. వీడు దోపిడీలు చేయడంతో పాటు చాలాకాలంగా ప్రేమ పేరుతో తన వీధిలో ఉన్న అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు. ఆమె వెంటపడడమే కాకుండా ఆమె ఇంటి చుట్టపక్కలవారితో ఆ అమ్మాయి తనని ప్రేమిస్తుందంటూ ఏవో ప్రచారాలు కూడా చేశాడు. అమ్మాయి ఇంట్లోవాళ్లు చాలాసార్లు వీడికి వార్నింగ్ ఇచ్చారు. అయినా వెంకటరెడ్ది తన తీరు మార్చుకోకపోయేసరికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెని షార్ కాలనీలో ఉన్న బంధువుల ఇంట్లో పెట్టారు.

అక్కడికి ఈ దొంగ రాలేడని వాళ్లనుకున్నారు. అయినా వీడు ఆమెను వదల్లేదు. ఆ కాలనీలోకి ఏదో ఒక రూపంలో చొరబడి ఆమెను వేధించాలనుకున్నాడు. వీడికి మండల కార్యాలయంలో తెలిసిన అధికారి ఉన్నాడు. అతని సాయంతో రేషన్‌కార్డులు పంచే అవతారం ఎత్తాడు. ఎంచక్కా పేరు, గెటప్ మార్చుకుని షార్ కాలనీ గేటు దగ్గరికి వచ్చాడు. అక్కడి సెక్యూరిటీవాళ్లు ఇతని చేతిలో ఉన్న రేషన్‌కార్డులు చూసి నమ్మి లోపలికి పంపించారు. నిందితుడి పేరు బొట్టు వెంకటరెడ్డి అలియాస్ చిరు. దోపిడీలు చేసుకుంటూ బతికేవాడు.
 
ఆమె ఇల్లు అనుకుని...
వెంకటరెడ్డి అలియాస్ చిరు... షార్ కాలనీలో అడుగుపెట్టగానే తన ప్రియురాలు ఏ ఇంట్లో ఉందో తెలుసుకునే పనిలో భాగంగా అందరి ఇళ్ల తలుపు కొట్టడం మొదలెట్టాడు. ఆ వరుసలోనే సైంటిస్టు ఇంటికి కూడా వెళ్లాడు. తలుపు తెరిచిన మహిళ ఒంటిపై బంగారం బాగా కనిపించడంతో కుటుంబ సభ్యుల వివరాలు కావాలంటూ లోపలికి వెళ్లి కూర్చున్నాడు. దాహంగా ఉంది నీళ్లు కావాలని అడిగాడు. మంచినీళ్ల కోసం ఆమె వంటింట్లోకి వెళ్లింది. అంతే ఇతను కూడా ఆమె వెనకే వెళ్లి వెనక నుంచి నైలాన్‌తాడుతో ఆమె మెడను బిగించి చంపేశాడు.

ఆమె కిందపడగానే మెడలో ఉన్న నాలుగు తులాల మంగళసూత్రాల గొలుసు, ఆరు తులాల గాజుల్ని తీసుకుని జేబులో పెట్టుకుని వెనక్కి తిరిగి చూసే సరికి ఆటలాడుకుని అమ్మా... అంటూ వచ్చిన ఇద్దరు పిల్లలూ ఎదురుగా నిలబడ్డారు. తల్లి కిందపడి ఉన్న విషయాన్ని గమనించి ‘అమ్మా...’ అంటూ గట్టిగా అరవబోయారు. వాళ్లిద్దరినీ అలాగే వదిలేస్తే కాలనీగేటు దాటి బయటికెళ్లే పరిస్థితి ఉండదు. పోనీ గదిలో పెట్టి బంధిస్తే మర్నాడు పోలీసులకు సాక్షులుగా మిగిలిపోతారనే భయంతో వెంకటరెడ్డి ఆ ఇద్దరు చిన్నారులను కర్కశంగా గొంతు నులిమి చంపేశాడు.
 
నెలరోజులు పట్టింది...
హత్యలు జరిగిన నాటి నుంచి నిందితుడు మా చేతికి చిక్కడానికి దాదాపు నెల రోజులు పట్టింది. మొదట్లో దృష్టి అంతా కాలనీవాసులపైనే ఉంచడం వల్ల సమయం వృథా అయిపోయింది. చివరికి దొంగ దొరికాక కేసుకున్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని కేసుని ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకి తరలించారు. మామూలుగా కోర్టుకి ప్రతిసారి ఎస్‌ఐ స్థాయి అధికారులు వెళితే సరిపోతుంది. కానీ నేను ఈ కేసుని ప్రత్యేకంగా భావించి ప్రతి వాయిదాకి స్వయంగా వెళ్లేవాణ్ణి.

వెంకటరెడ్డి ఈ హత్యకు పాల్పడినట్టు కోర్టుకి సాక్ష్యాలన్నీ పకడ్బందీగా సమర్పించాం. ఏ దశలోనైనా కేసు పక్కదోవ పట్టకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం. ఏడాదిలోగానే తీర్పు వచ్చింది. నిందితుణ్ణి హంతకుడిగా నిర్ధారిస్తూ కోర్టు ఉరిశిక్ష విధించింది. అతను తిరిగి హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ అతనికి యావజ్జీవకారాగార శిక్ష పడింది.
 రిపోర్టింగ్: భువనేశ్వరి

మరిన్ని వార్తలు