విడ్డూరం: ఇదేం ఆర్టు నాయనా!

3 Aug, 2013 20:51 IST|Sakshi
విడ్డూరం: ఇదేం ఆర్టు నాయనా!

న్యూజిలాండ్‌కు చెందిన షే హోరే (34) చాలా ప్రదర్శనలు ఇస్తుంటాడు. వాటిని చూడటానికి జనం తండోపతండాలుగా వస్తుంటారు. పిల్లలయితే అతడి పేరు చెబితేనే సంబరపడిపోతారు. ఇంతకీ అతడు ప్రదర్శించే కళ ఏమిట నుకుంటున్నారు! ఓ ప్లేట్ నిండా రబ్బర్‌బ్యాండ్లు వేసుకుంటాడు. ఒక్కోటీ తీసి ముఖానికి పెట్టుకుంటాడు (ఫొటోలో చూపిన విధంగా). అలా ఎన్ని వీలైతే అన్ని పెట్టుకుని సాధ్యమైనంత వికృతంగా తయారవుతాడు. ఆపైన విచిత్రమైన హావభావాలు ప్రకటిస్తాడు. వాటిని చూసి పిల్లలు పడీ పడీ నవ్వుతారు. పెద్దలు కూడా శృతి కలుపుతారు. అదీ సంగతి. ఇదేం కళ అని అనుకోకండి. ఈ కళే హోరేని  సెలెబ్రిటీని చేసింది!
 
 35 రోజులు... కుక్కల బోనులో!
 వెబ్ డిజైనర్ అయిన షాన్‌కి కుక్కలంటే అమితమైన ప్రేమ. అందుకే కుక్కల సంక్షేమానికై పాటుపడే ఓ సంస్థలో వాలంటీర్‌గా చేరాడు. వీధి కుక్కలను చేరదీసి ప్రేమను పంచమని అందరికీ చెప్పాలనుకున్నాడు. ఓ పేద్ద కుక్కల బోను తయారు చేయించాడు. దాన్ని మెయిన్‌రోడ్డు మీదికి కనిపించేలా ఒకచోట అమర్చి, తన పెంపుడుకుక్కతో సహా అందులోకి వెళ్లాడు. 35 రోజుల పాటు అందులోనే ఉన్నాడు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి మాత్రం రోజుకొక్కసారి బయటికొచ్చేవాడు. అక్కడికి వచ్చి వింతగా చూస్తున్నవాళ్లందరికీ తాను చెప్పాలనుకున్న విషయాలను చెప్పేవాడు. మామూలుగా చెబితే వినరని, ఈ వెరైటీ విధానాన్ని ఎంచుకున్నాడట. షాన్ చేసిన ఈ బోనువాసం కుక్కలకు ఎంత మేలు చేసిందో తెలీదు కానీ... అతడి పేరు మాత్రం అమెరికా అంతటా మారుమోగుతోంది!

మరిన్ని వార్తలు