ఎందుకిలా?

22 Nov, 2015 01:09 IST|Sakshi
ఎందుకిలా?
 
 రాత్రి పదకొండు కావస్తోంది. స్టడీరూమ్‌లో లైట్ ఆఫ్ చేసి బయటకు వచ్చాడు శ్రీకర్. తన గదిలోకి వెళ్లబోతూ తమ్ముడు స్వరూప్ గదివైపు చూశాడు. ఇంకా లైటు వెలుగుతూనే ఉంది. అంటే ఇంకా పడుకోలేదన్నమాట. ‘‘ఈ స్వరూప్‌కి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. త్వరగా పడుకుని త్వరగా లేవరా అంటే వినడు. అర్ధరాత్రి వరకూ సినిమాలు చూడ్డం, పొద్దున్నే కాలేజీకి ఆలస్యమయ్యిందంటూ గంతులు వేయడం’’ అంటూ తమ్ముడి గదివైపు నడిచాడు శ్రీకర్. తలుపు కొంచెం తెరిచే ఉంది. నెట్టుకుని లోనికి వెళ్లాడు.
 
 ‘‘హాయ్ అన్నయ్యా... ఏంటి, ఇంకా పడుకోలేదా’’ అన్నాడు స్వరూప్ అన్నను చూస్తూనే. ‘‘నా సంగతి తర్వాత. నువ్వేం చేస్తున్నావ్? చదువుకుంటున్నావా?’’ అన్నాడు శ్రీకర్. ‘‘అవునన్నయ్యా’’... తడుముకోకుండా ఠక్కున అన్నాడు స్వరూప్. శ్రీకర్ నవ్వాడు. ‘‘చాల్లే అబద్ధాలు. నీ ఒళ్లో ల్యాప్‌లాప్ చూస్తేనే తెలుస్తోంది, మళ్లీ ఏదో సినిమా చూస్తున్నావని. ఈ సినిమాల పిచ్చేంట్రా నీకు?’’ అన్నాడు తమ్ముడి పక్కనే కూర్చుంటూ.
 
 ‘‘ఏమో అన్నయ్యా. రోజుకొక సినిమా అయినా చూడకపోతే మనసు లాగేస్తుంది నాకు. అయినా చదువులో వెనకబడటం లేదు కదా, ఇంకెందుకు నీకు భయం?’’ అన్నాడు బుంగమూతి పెడుతూ. ‘‘అలా అని కాదురా. అర్ధరాత్రిళ్ల వరకూ ఇలా సినిమాలు చూడ్డం, పొద్దున్న కాలేజీకి పరుగులు పెట్టడం ఎందుకింత టెన్షన్! నిద్ర సరిపోకపోతే ఆరోగ్యం పాడవదూ?’’
 
 అవునన్నట్టు తలూపాడు స్వరూప్. ‘‘నిజమే అనుకో. కానీ ఏం చేయనన్నయ్యా? సినిమా నా వీక్‌నెస్. అందులోనూ హిచ్‌కాక్ సినిమాలంటే మరీను. నేను కూడా డెరైక్టర్నయ్యి అలాంటి సినిమాలే తీస్తా.’’ ‘‘గట్టిగా అనేవు. నాన్నగారు విన్నారంటే తాట తీస్తారు. నన్ను మెకానికల్ ఇంజినీర్‌ని చేశారు. నువ్వు ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదవాలన్నది ఆయన కోరిక. సినిమా గినిమా అన్నావో... ఇక అంతే’’ అన్నాడు శ్రీకర్ నవ్వుతూ.
 
 ‘‘అబ్బో... నావల్ల కాదు. పట్టుబట్టి చదవమంటే చదివేస్తాను కానీ ఆ ఫీల్డ్‌లో మాత్రం సెటిలవ్వను. చక్కగా డెరైక్టర్నయిపోతా. హిచ్‌కాక్ తర్వాత అలాంటి సినిమాలు తీసింది నేనేనని అనిపించుకుంటా. ఏం డెరైక్టర్ అన్నయ్యా ఆయన. ఇదిగో చూడు. ‘ద బర్డ్స్’ సినిమా చూస్తున్నా. ఎంత బాగుందో. టెన్షన్ వచ్చేస్తోంది’’ అన్నాడు పెద్దవి చేసి.
 
 ‘‘అంతగా ఏముందా సినిమాలో?’’
 ‘‘సినిమా అంతా పక్షుల మీదే తీశారు. అవి విచిత్రంగా ప్రవర్తించడం, మూకుమ్మడిగా దాడి చేయడం, అందరినీ భయపెట్టడం... టెన్షన్ పెట్టే థ్రిల్లర్ అనుకో’’... ఎంత థ్రిల్ ఫీలవుతున్నాడో స్వరూప్ ముఖంలోనే కనిపిస్తోంది. ‘‘అవునా. నువ్వు సినిమా చూసే మురిసిపోతున్నావ్. మన దేశంలో పక్షులకు సంబంధించిన ఓ పెద్ద మిస్టరీ ఉందని తెలుసా?’’అన్న అలా అన్నాడో లేదో, నిటారుగా అయ్యాడు స్వరూప్. ‘‘మిస్టరీనా? ఏమిటన్నయ్యా అది?’’ అంటూ ఆసక్తిగా అడిగాడు ల్యాప్‌టాప్ పక్కన పెట్టేస్తూ.‘‘అసోంలో జతింగా అనే ఓ ప్రాంతం ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం చలికాలంలో కొన్ని వందల, వేల పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయి.’’
 
 ఆశ్చర్యంగా చూశాడు స్వరూప్. ‘‘పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయా? అదేంటి? అలా ఎక్కడైనా జరుగుతుందా? అది నిజమేనా అసలు?’’... ప్రశ్నల వర్షం కురిపించాడు.‘‘నిజమేరా. చాలా సంవత్సరాలుగా అలా జరుగుతోందట. కారణమేంటో ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఇప్పటికీ అది పెద్ద మిస్టరీగానే ఉంది.’’‘‘అవునా... అయితే మనం అక్కడికి వెళ్దామా అన్నయ్యా?’’... ఆసక్తిగా అడిగాడు స్వరూప్.‘‘నావల్ల కాదు బాబూ. నీకేమైనా సరదాగా ఉంటే వెళ్లిరా. నాకు నిద్రొస్తోంది పడుకుంటా’’ అంటూ వెళ్లిపోయాడు శ్రీకర్.
 
 స్వరూప్‌కి మాత్రం నిద్ర రాలేదు. అన్నయ్య చెప్పిన మిస్టీరియస్ ప్లేస్ గురించే ఆలోచిస్తున్నాడు. అప్పటి వరకూ చూసిన సినిమా మీద కూడా ఆసక్తి పోయింది. ల్యాప్‌టాప్ మూసి పక్కన పడేశాడు. జతింగా, అక్కడి పక్షులు, వాటి ఆత్మహత్య... ఇవే బుర్రలో తిరుగుతున్నాయి. ఎలాగైనా సరే... అక్కడికి వెళ్లి తీరాలని నిర్ణయించుకున్నాడు.స్వరూప్ మాత్రమే కాదు... జతింగా గురించి విన్నవాళ్లెవరైనా కూడా అలానే ఆలోచిస్తారు. అక్కడికి వెళ్లాలనే ఆరాటపడతారు. అక్కడి మిస్టరీ ఏమిటో తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతారు. అసలింతకీ అక్కడ ఏం జరుగుతోంది? పక్షుల ఆత్మహత్య అన్నమాటలో వాస్తవం ఎంత???
       
 అసోం రాజధాని గౌహతికి దక్షిణాన... మూడు వందల ముప్ఫై కిలోమీటర్ల దూరంలో... హాఫ్లాంగ్ నగరానికి తొమ్మిది కిలోమీటర్ల చేరువలో ఉంది జతింగా. ఇక్కడి ప్రకృతి అందాలు చూపరులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. పచ్చని చెట్లు, నదీజలాలు, ఎత్తయిన పర్వతాలు... ఎటు చూసినా అందమే. అయితే అన్నిటి కంటే ఎక్కువ ఆకర్షించేది మాత్రం... ఇక్కడి పక్షులు. రకరకాల పక్షి జాతులకు ఆలవాలం జతింగా. స్థానికంగా ఉండే పక్షులే కాకుండా... ఎక్కడెక్కడి నుంచో వందలాది పక్షులు వలస వచ్చి ఇక్కడ వాలతాయి. దాంతో జతింగా... పక్షుల సందర్శనా కేంద్రంగా మారింది. అయితే అలాంటి జతింగాలో కొద్ది సంవత్సరాల క్రితం ఓ దారుణం జరిగింది. అది ఒక్కసారి జరిగి ఆగిపోలేదు. మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంది. 
 
 ఆ యేడు... అప్పుడప్పుడే అసోంను చలి దుప్పటి కప్పుతోంది. జతింగా కూడా చిన్నగా చలికి వణుకుతోంది. ఆ సాయంత్రం పూట కొందరు సరదాగా చలి మంట వేసుకున్నారు. అందరూ దాని చుట్టూ కూర్చుని చలి కాచుకుంటున్నారు. ఉన్నట్టుండి ఏదో రొద. పక్షులన్నీ కీచు కీచుమంటూ అరుస్తున్నాయి. ఆ అరుపులు అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. అందరూ ఆకాశం వైపు దృష్టి సారించారు. 
 
 వందలాది పక్షులు ఆకాశంలో ఎగురు తున్నాయి. ఓ పద్ధతిలో కాదు. ఎలా పడితే అలా. ఎటు పడితే అటు. ఇష్టం వచ్చినట్టు ఎగురుతున్నాయి. ఉన్నట్టుండి ఒక్కో పక్షీ నేలవైపు దూసుకు రావడం మొదలైంది. పక్షులు కిందికి వస్తున్నాయి. కొన్ని నిర్జీవంగా నేలమీద పడిపోతున్నాయి. కొన్ని అడ్డదిడ్డంగా ఎగురుతూ ఇళ్లకు, చెట్లకు, స్తంభాలకు గుద్దుకుంటున్నాయి. గాయాలపాలై నేలరాలి మరణిస్తున్నాయి. అందరూ అవాక్కయిపోయారు. ఏం జరుగుతోందో వారికి అర్థం కాలేదు. ఉన్నట్టుండి ఈ పక్షులకు ఏమయ్యింది? ఎందుకిలా చనిపోతున్నాయి? ఏమీ తెలియలేదు. అలా ఆ అమావాస్య రాత్రి కొన్ని వందల పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. ఉదయం లేచి చూస్తే ఊరి నిండా పక్షుల మృతదేహాలే. వాటన్నిటినీ గోతులు తీసి పూడ్చి పెట్టారు. 
 
 ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఆర్నిథాలజీ విభాగానికి తెలిసింది. వెంటనే శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. పక్షుల మరణానికి కారణం ఏమిటో అన్వేషించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లకు ఏమీ అర్థం కాలేదు. దాంతో విసుగుచెంది తమ ప్రయత్నాలను విరమించుకున్నారు. అక్కడితో అంతా అయిపోయిందిలే అనుకున్నారు జతింగా గ్రామస్థులు. కానీ అయిపోలేదు. అప్పుడే మొదలైంది. మరుసటి సంవత్సరం... మళ్లీ చలికాలం... ఓ అమావాస్య రాత్రి... మరోసారి అదే ఘోరం. అదే దారుణం. పక్షులన్నీ పిచ్చి పట్టినట్టు అరిచాయి. ఇష్టం వచ్చినట్టు వాటినీ వీటినీ గుద్దుకున్నాయి. క్షణాల్లో ప్రాణాలు వదిలేశాయి. మళ్లీ అందరి మనసుల్లో వంద సందేహాలను రేకెత్తించాయి. 
 
 అలా ప్రతి యేటా చలికాలంలో... సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఏదో ఒక అమావాస్య రాత్రి పక్షులన్నీ ప్రాణాలు విడుస్తూనే ఉన్నాయి. మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నాయి. అలా ఎందుకు జరుగుతోందో ఇప్పటికీ తెలియడం లేదు. ఎంతోమంది పక్షి శాస్త్రవేత్తలు దీనికి కారణాన్ని వెతకడంలో మునిగిపోయారు. స్వర్గీయ ఇ.పి.గీ (ప్రముఖ పర్యావరణవేత్త), ప్రముఖ ఆర్నిథాలజిస్టు సలీమ్ అలీ వంటి వారు కూడా ఈ విషయంపై పరిశోధనలు జరిపారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ఈ మిస్టరీని ఛేదించ డానికి సుధీర్ సేన్ గుప్తా అనే శాస్త్రవేత్తను ప్రత్యేకంగా నియమించింది. వీరంతా పరిశోధనలు జరిపి, పక్షుల మరణాలకు కొన్ని కారణాలను వెల్లడించారు. 
 
 అసోంలో వరదలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటాయి. దానివల్ల పక్షులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా వలస వచ్చిన పక్షులు మరింత ఇబ్బంది పడతాయి. అవి తిరిగి వెళ్లే ప్రయత్నంలో వాతావరణంలోని అలజడిని తట్టుకోలేక అలసిపోయి, నీరసించి మరణిస్తున్నాయన్నది ఓ కారణం. చలికాలపు రాత్రుల్లో చిక్కటి చీకటి అలముకుంటుంది. దాంతో జతింగా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు చలి మంటలు వేస్తూ ఉంటారు.
 
 అవి రాత్రంతా వెలుగుతూనే ఉంటాయి. ఆ వెలుతురుకు ఆకర్షితమై పక్షులు కిందికి దిగే ప్రయత్నం చేస్తున్నాయని, ఆ ప్రయత్నంలోనే వాటినీ వీటినీ గుద్దుకుని మరణిస్తున్నాయనీ మరో వాదన వినిపించారు నిపుణులు. కానీ ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదని అందరూ అన్నారు. ఇంకా వాతావరణంలో మార్పులు, గాలి విషపూరితం కావడం అంటూ పలు రకాల వాదనలు బయటకు వచ్చాయి కానీ ఏవీ నిజమని నమ్మే ఆధారాలు దొరకలేదు.
 
 అయితే జతింగా వాసులు మాత్రం ఈ పక్షుల మరణాలకు కారణం కొన్ని దుష్టశక్తులు అంటున్నారు. కొన్ని రకాల దుష్టశక్తులు ఆకాశంలో సంచరిస్తూ ఉంటాయని, అవే పక్షులను ఇలా పొట్టన పెట్టుకుంటున్నాయని అంటున్నారు. దుష్టశక్తులను చల్లబరచడానికి కొన్ని రకాల పూజలు, హోమాలు కూడా చేయించారు. శాంతి కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఏం చేసినా ఫలితం లేకపోయింది. పక్షుల ఆత్మహత్యలకు ఫుల్‌స్టాప్ పెట్టడం ఎవరి వల్లా కాక పోయింది. దాంతో ఈ విషయం ఇప్పటికీ ఓ పెద్ద మిస్టరీగానే మిగిలి పోయింది. 
 
 ఇలా పక్షులు విచిత్రంగా ప్రవర్తించడం, మూకుమ్మడిగా చనిపోవడం అన్నది కేవలం జతింగాలోనే కాదు, మరికొన్ని చోట్ల కూడా జరిగిందని అంటున్నారు శాస్త్రవేత్తలు. స్విట్జర్లాండ్, ఫిలిప్పైన్‌‌స, మలేషియా దేశాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయనడానికి ఆధారాలు చూపిస్తున్నారు. అయితే అలా జరిగితే జరిగి ఉండొచ్చు కానీ అక్కడ ఒక్కసారితో ఆగిపోయింది. కానీ జతింగాలో అలా కాదు కదా! యేటా ఇలా జరుగుతూనే ఉంది. మరణించే పక్షుల సంఖ్యలో తేడా ఉంటోంది తప్ప మరణాలు ఆగట్లేదు!

 

మరిన్ని వార్తలు