మనిషికి ఎన్ని రూపాలో..

25 Aug, 2019 11:03 IST|Sakshi

ఈవారం కథ

‘‘నిరుడు మీ నాయిన స్నేహితుడు సుబ్బారెడ్డి చచ్చిపోయినాడు. అప్పుడు ఏదో పనుండాదని నువ్వు రాలేదు. పోయిన నెలలో ఆయన సంత్సరీకం కూడా ఎల్లిపాయె. అప్పుడూ నువ్వు రాలేకపోయినావు. పోయిన వానాకాలం మీ ఇంటి పెంకులు మార్పించినాను. నువ్వుండకపోతివి.  దేనికైనా మనం ఉండాల్సిన టయాంలో ఉండాలి నాయినా. ఆ టయిములో ఎవురు ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలానే ఉండాలి.’’ హోరుమంటున్న లారీల హైవే హారన్‌ మోతల మధ్య బస్సుకోసం నుంచున్న కొండలికి చిన్నాయిన మాటలు మళ్ళీ గుర్తుకొచ్చాయి.
‘అవును. ఊరెల్లక సంవత్సరం దాటిపోయింది’ అనుకున్నాడు కొండలు మనసులో. 
అప్పటికే రాత్రి పదిన్నర దాటింది. ఎల్‌.బి.నగర్‌ స్టాపులో విజయవాడ వెళ్ళే బస్సు కోసం నిలబడి గంటైంది. ముందే అనుకోని ప్రయాణం. రిజర్వేషను లేదు. వచ్చిన కొన్ని బస్సులు ఆగినట్లే ఆగి సరాసరి వెళ్ళిపోతున్నాయి.
సిటీ బస్టాండు నిండా రోడ్డుకి ఒకవార ఊళ్ళకి పోయే పండగ జనం. కొందరు భుజాలమీద బ్యాగులు మోస్తూ నిలబడి ఉంటే, మరికొందరు అక్కడే నేలమీదే లగేజి పరిచి చలికి ముడుచుకు కూర్చున్నారు. అక్కడే జనం మధ్య తోపుడుబళ్ళు, అమ్ముకునేవాళ్ళతోపాటు రోడ్డుమీద వెళ్ళే కార్లు సిటీబస్సుల వాహనాల ట్రాఫిక్‌ రద్దీ. 

ఇంతలో ఆర్టీసీ బస్సోకటి ఒగరుస్తూ కొండలు ముందు భారంగా ఆగింది. చంకలో సర్వీసుచార్టు పెట్టుకున్న లావుపాటి ఖాఖీడ్రెస్సు డ్రైవరు హడావుడిగా బస్సుదిగి కౌంటరువైపు పరిగెత్తాడు. సగం నెరిసిన నెత్తి నడివయసు మనిషెవరో పరిగెత్తుకుంటూవచ్చి చేతిలో టికట్‌ కాపీతో అటూఇటూ హడావుడి చేసి చివరికి లగేజితో సహా ఇద్దరు ముసలోళ్ళని బస్సెక్కించి, దిగబోతూ మళ్ళీ బస్సెక్కబోతున్న డ్రైవరుకి ఏవో జాగ్రత్తలు చెప్పి బస్సు దిగిపోయాడు. 
డ్రైవరు బస్సు స్టార్టు చేస్తూ కొండల్ని ఎగాదిగాచూసి ‘‘సీట్లు లేవు. క్యాబిన్‌లో ఖాళీఉంది. కూర్చుంటారా’’ అన్నాడు.
 నల్లటి మొహం మీద మెరుస్తున్న తెల్లటి కళ్ళు. భారీకాయం. చెవులను కప్పేసిన పొడవాటి దట్టమైన జుట్టు. 
ఈ రద్దీలో ఏ బస్సూ దొరికేలాలేదు. దొరికినా సీటు దొరకదు.
కొండలు భుజం మీద బ్యాగు పైకి లాక్కుని బస్సెక్కి ముందువైపు డోరు పక్కనే ఉన్న సీటుని బెంచీలా మడుచుకుని కూర్చున్నాడు.  బస్సు బయలు దేరాక తెరచిఉంచిన డోరు నుంచి సన్నటి చలి లోపలికి కొట్టసాగింది.

‘చిన్నాయినకేమి? ప్రతిసారీ రమ్మని చెబతానే ఉంటాడు. ఉన్న ఇద్దరాడపిల్లల్ని ఊరికి దగ్గిర పక్కూళ్ళలోనే ఇచ్చాడు. ఎవురోకరు ఎప్పుడూ వచ్చి వెళ్తానే ఉంటారు. ఊళ్ళో ఎప్పుడు ఏ కార్యం జరిగినా  ముందే పరిగెత్తుకుంటూ వస్తారు. కూతుళ్ళు, మనుమలు, మనువరాళ్ళతో ఎప్పుడూ సందడిగానే ఉంటది చిన్నాయిన ఇల్లు.’ 
‘‘నాకూ రావాలని ఉంటదిగాని రాలేను చిన్నాయినా?’’ అన్నాడు చివరిసారి ఊరెళ్ళినప్పుడు.
‘‘అదే తప్పురా’’ అన్నాడు చిన్నాయిన. 
‘‘నీకు రావాలని అనిపించకపోతే అది వేరే సంగతి’’.
బస్సు క్యాబిన్‌ లోపల వెలుతురుకంటే చీకటే ఎక్కువగా ఉంది. క్షణిక కాలంపాటు మెరిసి ఆరిపోయే లైట్ల వెలుతురులో మధ్య అప్పుడప్పుడూ మనకమసగ్గా కనిపిస్తున్నాయి లోపల వస్తువులు. 
బస్సు కొద్దిసేపు హయత్‌నగర్‌లో కొద్దిసేపు ఆగి మళ్ళీ బయలుదేరింది. డ్రైవరు లైటు తీసేసాడు. క్యాబినులో ఉన్న కొద్దిపాటి వెలుగూ మాయమైంది. 
కొండలు లోపలికి తొంగి చూసాడు. తెలుగు సినిమా హడావుడి చేస్తున్న టీవి సీట్లలో వాలి కూర్చున్న ప్రయాణికుల మొహాలమీద వెలుగు ప్రసరిస్తూ ఉంది. కొందరు కళ్ళు విప్పార్చుకుని చూస్తూ ఉంటే కొందరు బయటి ప్రపంచంతో తమకేమీ సంబంధంలేనట్లు సీట్లలో వెనక్కి చేరగిలబడి కళ్ళుమూసుకుని నిద్రలోకి జారుకుంటున్నారు.

‘‘ఎన్ని బొస్సులేసినా ఈ పండగ జనానికి సరిపోవు’’ అన్నాడు డ్రైవరు. 
ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలీదు. గాలిలో ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా ఉంది. 
కొండలు అవునన్నట్టు మొహమాటంగా నవ్వి బయటికి మళ్ళీ తలతిప్పుకున్నాడు. 
మళ్ళీ డ్రైవరు ఏదో మాట్లాడాడుగాని బస్సు రొదలో ఏదీ వినిపించలేదు. 
‘‘ఎహె దీనెమ్మ చలి!.’’ అని ఈసారి చలి ఎంత ఆలస్యంగా వచ్చిందో శివరాత్రికి ఎలా పోతుందో చెప్పుకొచ్చాడు. 
ఉలిక్కి పడ్డాడు కొండలు. 
‘ఈ డ్రైవరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు?’
అప్పుడు చూసాడు బస్సు డ్రైవరు వంక.. అప్పటిదాకా అతడిని సరిగా గమనించలేదు. ఎవరితోనో ఫోనులో మాట్లాడుతున్నాడేమో అనుకున్నాడు. 
స్టీరింగు ముందు కూర్చున్న నల్లటి భారీ ఆకారం. ఎర్రకళ్ళ నల్లమనిషి. అతడు వేసుకున్న ఖాఖీ చొక్కా చీకట్లో నల్లగా కలిసిపోయింది. గుండ్రపాటి తలకాయమీద ముసురుకున్న జుట్టు గాలికి నుదుటమీద కొట్టుకుంటూ ఉంది. మెరుస్తున్న కళ్ళు. నవ్వినప్పుడల్లా బయటపడుతున్న తెల్లటి పళ్ళు. లోపలికి పడే వెలుతురును బట్టి ఒకసారి ఎర్రగా మరోసారి తెల్లగా మెరుస్తూ కనిపించే కళ్ళు.
అతడు ఊరికే తనలో తను మాట్లాడుకుంటున్నాడు. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతుండటం అలవాటులా ఉంది. దారిలో తనకు కనిపించిన, తనకు అనిపించిన ప్రతిచోటా అతడు ఏదో ఒకటి ఏకరువు పెడుతూ ఉన్నాడు.

తన మాటలు ఎవరు వింటున్నారా అనే ఎరుక అతడికి లేదు. దారిపక్కనున్న చెట్లు, బళ్ళమీద వెళ్తున్న మనుషులు, పక్కనుంచి వెళ్తున్ను లారీలు.. ఏదో ఒకటి.. ఊరికే ఉండే మనిషిలా లేడు. 
ఇంతలో అతడి ఫోను మోగినట్లుంది. ఇంజను చప్పుడులో వినపడీ వినపడని మాటలు. 
‘‘రేపొద్దున్న వస్తా.. మళ్ళీ ఎల్లుండి డ్యూటీ. పెరట్లో సొరకాయ వండు’’ అని ఫోను పెట్టేసి మళ్ళీ అతడు ఎందుకో నవ్వాడు.
ఫోనులో అవతలివైపు మాట్లాడింది..అతడి తల్లి... కాదు భార్య కావొచ్చు..చివరలో మరలా ఎందుకు నవ్వాడు? భార్య కూడా కాదేమో?  ఇంకెవరై ఉంటారు? 
బస్సు అద్దాల్లోంచి చీకట్లోకి ఏకాగ్రతగా చూపుసారించి కూర్చున్నాడు కొండలు. రోడ్డుమీద పోయేకొద్దీ అవిరామంగా పరుచుకుంటున్న నల్లటి నిశీధి, స్టీరింగ్‌ ముందు కూర్చుని తనలో తనే మాట్లాడుకునే ఆ డ్రైవరు తప్ప మరేది కనిపించడంలేదు. 
రోడ్డుకిరువైపులా వీథి దీపాలు క్రమంగా తగ్గిపోతూ దూరంగా ఇళ్ళలో వెలిగే లైట్లు మాత్రమే ఒంటరిగా అక్కడక్కడా మిణుక్కుమంటున్నాయి. దూరం పోయే కొద్ది నిశ్శబ్దం మరింత పేరుకుంటూ ఉంది. ఒకదానికొకటి దూరదూరంగా కనిపిస్తున్న ఇళ్ళు చీకట్లో చలికి ముడుచుకుని పడుకున్నాయి.
సమయం గడిచేకొద్దీ చీకటి ఎక్కువవుతూ ఉంది. చీకటి ఎక్కువయ్యే కొద్దీ చలి ఇంకా పెరుగుతూఉంది. 
డ్రైవరు చెయ్యి బయటికిపెట్టి ఏదో చెబుతున్నాడు. హారను కొట్టి ఏదో గొణుగుతున్నాడు.
అతడి మాటలనుబట్టి వెనక బస్సో లారీనో ముందుకు పోవడానికి ఆ డ్రైవరు సైడివ్వమని అడుగుతున్నట్లున్నాడు. ఈ డ్రైవరు తొందర పడొద్దంటున్నాడు.
వెనకనుంచి మళ్ళీ హారన్‌ మోగింది.

చివరికి తనే సైడు తీసుకుని ‘‘పోరా నాయనా పో’’ అని కిటికీలోంచి బయటికి చెయ్యూపాడు. మళ్ళీ స్టీరింగ్‌మీద ఉన్న చేతులు ముందుకు మడిచి, వంగి చిన్నపిల్లాడిలా ‘మనంకేం తొందరలేదులే’ అన్నాడు. 
బస్సు పక్కనుంచి సర్రుమని లారీ ముందుకెళ్ళింది. లారీలో అవతలివైపు ఒంటిమీద కేవలం బనీను వేసుకుని స్టీరింగు పట్టుకున్న డ్రైవరు, ఇవతల కిటికీలోంచి కాళ్ళు బయటికిపెట్టి బీడీ కాలుస్తున్న క్లీనరు క్షణికకాలంపాటు కనిపించారు. 
ఒక్కసారిగా వెలిగి ఆగిపోయిన వెలుగులో మెరిసిన దుమ్ము, విసిరికొడుతున్న చలిగాలిలో చేతులూ ఊపుతూ నవ్వుతున్న మనుషులు.
‘‘పోపో..తొందరగా పో. నీకోసం ఎదురుచూస్తన్నారక్కడ’’ అన్నాడు అవతలిపక్క లారీ డ్రైవరునుద్దేశించి. 
వాళ్ళు ఏదో బూతుమాట తిట్టారుగాని ఆ రొదలో ఒకరు చెప్పింది మరొకరికి వినిపించలేదు. లారీ ముందుకెళ్ళిపోయింది.
ముందుకెళ్ళిన లారీ అటూ ముందుకూ వెళ్ళడంలేదు. ఇటు బస్సుకి సైడూ ఇవ్వడంలేదు. 
‘‘ఈడు యనకామాలున్నప్పుడు ముందుకెళ్తానని తొందరపెట్టాడు. ఇప్పుడు వాడు ముందుకుపోడు. మనల్ని పోనీడు. అయినా మనకి తొందేముందిలే’’ అన్నాడు.
బస్సు హెడ్‌లైట్ల వెలుతురులో లారీ వెనకభాగం కనిపిస్తూ ఉంది. లారీ వెళ్ళే వేగానికి వెనకభాగం అటూఇటూ ఊగుతూ ఒక లయను జోడించుకుని ముందుకు పోతూవుంది. 
‘‘ఖాళీ లోడేగా.. ఆడికెందుకో ఈ తొందర.. ఈ రేత్రికే ఇంటికెళ్లిపోవాల కామోలు. ఇంటికెళ్ళి పెళ్ళాంపక్కలో తొంగోవాలనా..’’ అని ఆకస్మాత్తుగా  ‘‘వార్నీ...’’  అని పెద్దగా అరిచాడు దేన్నో చూస్తూ. చీకట్లో అతడి తెల్లటి కళ్లు పెద్దవయ్యాయి.

‘‘రేయ్‌ నా..కొ..కా..’’ అని మళ్ళీ గట్టిగా అరిచాడు డ్రైవరు.  కొండలు బిత్తరపోయి ఆదుర్దాగా లేచినుంచుని బయటికి రోడ్డుమీదకి చూసాడు. 
బస్సుకి సరిగ్గా ఇరవై అడుగుల దూరంలో ఎదురుగా బస్సులైట్ల వెలుతురులో నల్లటి రోడ్డుమీద రక్తపు మడుగులో చితికిన నాలుగుకాళ్ళ జీవి సగం నేలకి కరుచుకుని అతుక్కుపోయి సగం ఊపిరికోసం మోర ఎత్తి పైకిలేస్తూ భూమికీ ఆకాశానికి మధ్య ప్రాణాలతో విలవిలమని కొట్టుకుంటూ ఉంది. 
డ్రైవరు వెంటనే స్టీరింగు పక్కకి తిప్పాడు. సీదాగా పొయ్యే బస్సు ఒకపక్కకి ఒరిగినట్టు తిరిగి మళ్ళీ మామూలు దిశకి వచ్చింది. 
బస్సు చక్రాల కింద కటుక్కుమని నలిగిన చప్పుడు..
‘‘సంపితే పూర్తిగా సంపాల’’ అన్నాడు డ్రైవరు గట్టిగా ఎవరినో మందలిస్తున్నట్లు.
కొండలికి ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు. కళ్ళముందే జరిగిపోయిందా సంఘటన. 
క్షణిక కాలంలో జరిగిపోయింది. నిలబడి లేచి కళ్ళతో చూసి తేరుకునేలోపే అంతా జరిగిపోయింది. జరిగిన దానిని వెనక్కి లాగలేం.  
‘‘ఎంతటి ఘోరం! అనుకున్నాడు కొండలు చీకట్లోకి విచారంగా చూస్తూ. 
బస్సు ఏమీ తెలియనట్లు తనమానాన తను చీకటిని చీల్చుకుంటూ పోతూ ఉంది. లోపలా బయటా ఒకటే చలి. అనంతమైన చీకటి.

స్టీరింగు మీద బరువుగా వాలిపోయినట్లు కూర్చున్న డ్రైవరు ఉన్నట్లుండి వికృతంగా నవ్వాడతడు. జరిగినదానికి సంతోషపడుతున్నట్లుంది అతడి వ్యవహారం. చురుకైన రెండు తెల్లటి కళ్లు చీకట్లో మెరుస్తున్నాయి. 
‘‘ఆడు సంపదల్చుకుంటే పూర్తిగా సంపేయాల’’ అన్నాడు అతడు మళ్ళీ కోపంగా మొహం పెట్టి. కోపానికి కళ్ళు పెద్దవయ్యాయి.
కొండలు ఒకపక్క బస్సు అద్దాలలోంచి బయటకి చూస్తూనే డ్రైవరును గమనిస్తూ అతడి మాటలు వింటున్నాడు.  
కొద్దిసేపటి మౌనం తరవాత మళ్ళీ అతడే అన్నాడు. 
‘‘మన్దేముందిలే. మనపని మనం కానిచ్చాం. అంతకన్న చేసేదేముంది.’’ మళ్ళీ చీకట్లో అదే నవ్వు. నల్లటి మొహంలో మెరుస్తున్న తెల్లటి కళ్ళు. 
‘‘మనం కాకపోతే ఇంకోడు. ఆ జీవికి ఋణం అంతే’’ అన్నాడు రెండు నిమిషాలాగి కొద్దిసేపు మౌనం తరవాత డ్రైవరు మళ్ళీ తనలో తనే మాట్లాడుకుంటున్నట్టుగా అన్నాడు. 
‘‘అయినా మనమే ఎందుకు కావాల? మనకే ఎందుకు పడాల?’’ ఎదురుగా పొడుచుకొస్తున్న నల్లటి చీకటి.
అదే అతడి ఆఖరు మాట. ఆ తరువాత అతడు ఇంకేమీ మాట్లాడలేదు. పూర్తిగా తన పనిలో తను నిమగ్నమైపోయాడు. 
అంతవరకూ కొండలికి కళ్ళమీద తారాట్లాడిన నిద్ర జరిగిన ఆ దెబ్బతో పూర్తిగా వదిలిపోయింది. ఒక్క క్షణం మళ్ళీ చిన్నాయిన మెదిలాడు. బక్కపలచని పొడవాటి మనిషి. నల్లటి మొహం. తెల్లటి జుట్టు. చేతిలో ఎప్పుడూ ఉండే సన్నటి కర్ర.

అప్పటిదాకా ఎదురుగా కనిపించిన లారీ ఎటో చీకట్లో కలిసిపోయింది. 
అప్పటిదాకా తనలో తను మాట్లాడుకొనే డ్రైవరు మాటలు లేకుండా నిశ్శబ్దంగా చీకట్లో తపస్సు చేసుకుంటున్న మునివలే  తనపని తను చేసుకుంటూ కూర్చున్నాడు నిర్విచారంగా. అతడి తెల్లటి కళ్ళు ఎర్రగా మారాయి. 
బయట చలి చిక్కబడుతూ ఉంది. అంతటి చలిలోనూ కొండలు రోడ్డు వంక బయట చీకట్లోకి సుదీర్ఘంగా చూపు సారించాడు.
ఇద్దరి మధ్యా చీకటిలా నిశ్శబ్దం.
కొండలు మొదటినుంచి చివరిదాకా జరిగినదంతా మననం చేసుకున్నాడు. వెనకనున్న లారీ ముందుకు రావడం...కళ్ళ ముందే రోడ్డుమీద కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ప్రాణం... ‘అవును. ఆ క్షణంలో ఎవరున్నా అదేపని చేస్తారు. అక్కడ తనున్నా అదే పని చేసేవాడు.’ 
‘మరి ఆ నవ్వు?’
పెద్ద చీకటి గుహని వెలుతురు తొలుచుకుపోతున్నట్లు హైవే మీద చీకట్లో బస్సు ముందుకు పోతూ ఉంది.
చూస్తుండగానే బస్సు కోదాడలో ఆగింది. లోపలినుంచి భుజం మీద సంచితో, చేతిలో గోనెసంచి మూటతో దిగాడు ఎవరో యువకుడు.  రోడ్డుమీద ఎవరూలేరు. రోడ్డు పక్కన షెటరు మూసిన వీధి అరుగుమీద కుక్క ఒకటి చలికి ముడుచుకుని కూర్చుంది. సెంటరులో నడిరాత్రి దాటినా తెరచిన టీకొట్టుముందు ఇద్దరు ముగ్గురు మనుషులు చలికి చేతులు మడుచుకుని నుంచున్నారు. 

ఏమనుకున్నాడో ఏమో డ్రైవరు సీటులోంచి టీ కోసం లేచాడు. కొండలు కూడా టీ తాగుదామని బస్సు దిగాడు. 
తాటాకులు పరిచిన పందిరికింద టీ బంకు లైటు వెలుతురులో మరుగుతున్న పొయ్యి పొగలుగక్కుతూ ఉంది.
కొట్టుకి కొంతదూరంలో రోడ్డుపక్కన  వేసిన చలిమంట చుట్టూ ముగ్గురునలుగురు మనుషులు కూర్చుని చలి కాచుకుంటున్నారు. 
కొండలు టీ తాగుతూనే అటుతిరిగి నుంచున్న డ్రైవరువంక చూసాడు. 
నడుము మీద చెయ్యేసుకుని నిటారుగా అటువైపు తిరిగి నుంచున్న అతడు మూతికి గ్లాసు పెట్టుకుని చీకట్లో ఎటు చూస్తున్నాడో తెలీడంలేదు. 
కొట్టువాడికి డబ్బులిస్తూ కొండలివంక అంతకుముందెప్పుడూ తెలియనట్లు చూసి బస్సెక్కాడు. 
బస్సు మళ్ళీ బయలుదేరింది. కోదాడ దాటాక అన్నాడు డ్రైవరు. 
‘‘ఎనకాల సీటు ఖాళీ అయింది. పోయి కూర్చోండి. ఈ చలిలో ఎందుకు?’’
కొండలు బ్యాగు తీసుకుని లోపలికి వెళ్ళి ఖాళీగా ఉన్న సీటులో వెనక్కి చేరగిలబడి కూర్చున్నాడు. నిద్ర వచ్చే సమయం దాటిపోయింది. లోపల అందరూ ముసుగులుపెట్టి నిద్రపోతున్నారు. కొండలకి పక్కన కిటికీ పక్కన కూర్చున్న వ్యక్తి తల అవతలకి తిప్పుకుని గాఢనిద్రలో ఉన్నాడు.

ఎవరో రాత్రి తలలో తురుముకున్న మల్లెపూలు తెల్లారికి నలిగిపోయినా వాసన ఇంకా ఘుమాయిస్తూనే ఉంది. 
లోపల కొందరు గాఢనిద్రలో ఉంటే మరికొందరు రాత్రంతా నిద్రకాచిన కళ్ళతో చీకట్లో చివరి గమ్యంకోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. 
ఇవతల పక్క ముడుక్కుని కూర్చున్న ముసలాయన ఒంటిమీద స్వెటరుతో తలమీద మఫ్లరుతో కునికిపాట్లు పడుతున్నాడు. ఆయనకి అటువైపు కిటికీ పక్కన ముసలావిడ కాళ్ళు సీటుమీదకి లాక్కుని దుప్పట్ల మధ్య ఒక పక్కకి ఒరిగి పడుకుంది. రెండు గంటలక్రితం అతడి కళ్ళముందు జరిగిన సంఘటన చీకట్లో కనుమరుగైపోయింది. ఎక్కడ్నుంచో మూయని అద్దం కిటికీలోంచి ఎడతెగని చల్లటిగాలి లోపలికి కొడతాఉంది. 
చీకటి ప్రవాహంలో నిద్రపోతున్న ఊళ్లు, ఒంటరిగా మిణుక్కుమంటున్న వీథిదీపాలు వెనక్కివెళ్ళిపోతున్నాయి.  
కొండలికి సగం నిద్ర సగం మెలకువ కళ్ళు మూతలు పడుతున్నంతలో రోడ్డుకి ఒక పక్కన ఆగింది బస్సు. 
‘దిగేవాళ్ళు ఎవరూ లేరు కదా..ఎవరూ అడగందే ఎందుకు ఆపాడో’ అనుకున్నాడు కొండలు. 
అందరూ సీట్లలో వెనక్కి వాలి సుదీర్ఘ నిద్రలో ఉన్నారు. కొందరు నిద్రనుంచి మేలుకొని కిటికీల్లోంచి బయటకి చూస్తూ కొందరు నిద్ర లేని కళ్ళతో ఎప్పుడు గమ్యానికి చేరతామా అని ఎదురుచూస్తూ.. 
‘‘దుర్గగుడి.. దుర్గగుడి వచ్చింది దిగండి’’ మళ్ళీ పిలిచాడు డ్రైవరు. 
మెలకువలో ఉన్నవారు ఎవరూ సీట్లలోంచి కదల్లేదు. పడుకున్నవారు ముసుగులు తీయలేదు. 

‘‘ఏమయ్యా.. మిమ్మల్నే సీట్‌ నెంబర్‌ పదకొండు.. పన్నెండు!’’ 
అతడికెలా గుర్తున్నాయో ఆ సీట్‌ నెంబర్లు. కొండలికి రాత్రి జాగ్రత్తలు చెప్పిన సగం నెరిసిన నడివయసు మనిషి గుర్తుకొచ్చాడు.
డ్రైవరు పిలుపుకి ఎవరూ కదలలేదు. కొండలు వెనక్కితిరిగి చూసాడు. మెలకువలో ఉన్నవారెవరూ తమని కాదన్నట్టు కదలటంలేదు. నిద్రలో ఉన్నవాళ్ళెవరూ ఇప్పట్లో లేచేలా కనపడలేదు. 
డ్రైవరు సీటులోంచి లేస్తున్నట్లు అతడి కాలు కనిపించింది. అతడు లోపలికి వచ్చి నుంచున్నాడు. రాత్రి టీ కొట్టులో చూసిన నిశ్చలమైన మొహమే. అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు. అంతకుముందులా లేడు. గాలికి చిందరవందరగా చెదిరిన జుట్టు.
చలిలో నానిన నిద్రలేని మొహం. రాత్రంతా నిద్రలేకున్నా అలసట లేదు. 
‘‘ఏమమ్మా 11.. 12.. పిలిచేది మిమ్మల్నే. దుర్గగుడి వచ్చింది. దిగండి..!! దిగండి!!’’ అని కొండలికి అవతలపక్కన కూర్చున్న ముసలాళ్ళని కుదిపాడు. 
చలికి ముసుగులు కప్పుకున్న ముసలాళ్ళిద్దరూ ఉలిక్కిపడి నిద్రలేచారు.
‘‘దుర్గగుడి వచ్చిందా’’ అన్నాడు ముసలాయన నెత్తిమీద ముసుగుతీసి.
ముసలావిడ కంగారుగా కదిలి కప్పుకున్న శాలువాలు సర్దింది. 
డ్రైవరు ఒక చేత్తో స్టీలుక్యాను మరొకచేత్తో బ్యాగు అందుకుని ‘‘దిగండి...దిగండి’’ అని కిందకు దిగాడు.

ముసలాళ్ళిద్దరూ వొణుకుతున్న శరీరాలతో అడుగులేస్తూ బస్సు దిగారు. డ్రైవరు మళ్ళీ లోపలికివచ్చి వాళ్ళు కూర్చున్న సీట్లో ఇంకేమన్నా వదిలేశారేమోనని చూసుకున్నాడు. 
కొండలు కిటికీలోంచి బయటకు చూసాడు. ఇంకా తెల్లారని చీకటి. వీథిలైట్ల వెలుతురులో రోడ్డుపక్కన ఫుట్‌పాత్‌మీద నిద్రలేచిన భిక్షకులు పక్కబట్టలు సర్తుకుంటున్నారు. వీథుల్లో భక్తులు కొండపై దర్శనానికి బయలుదేరుతున్నారు. 
ఆపుకున్న అంత నిద్రమత్తులోనూ కొండలికి చిన్నాయిన మాటలు చెవిలో వినిపించాయి.
‘‘అట్లనబాకరా! మనిషి ఉండే టయివులో ఉండాలి. ఎప్పుడు యాడున్నా సరే. దేనికైనా అవుసరం రాబడొచ్చు. ఎవురికైనా..’’
కొండలికి రాత్రంతా బలవంతంగా ఆపుకున్న నిద్రమత్తు ఒదిలి అప్పుడే స్నానం చేసినట్లయింది. నిద్ర లోపలికి ఏటో వెళ్ళిపోయి మెలుకువ ముందుకొచ్చింది. మళ్ళీ మామూలు స్థితికి వచ్చి వెనక్కి చేరగిలబడినవాడు కాస్తా ముందుకు జరిగి కుదురుగా కూర్చున్నాడు.
బస్సు ఆగిన అలికిడికి మరికొందరు నిద్రలేచి సామాను సర్దుకుంటున్నారు. డ్రైవరు బస్సు స్టార్టు చేసాడు. 
కృష్ణలో స్నానం చేసిన సాధువెవరో వణుకుతూ ఒడ్డుకు వస్తున్నాడు. 
లాకులు కనిపిస్తున్న కృష్ణ కాలవ దాటాక బస్సు స్టాండువైపుకు మలుపు తిరిగింది.
- బి. అజయ ప్రసాద్‌

మరిన్ని వార్తలు