శిలలు

8 Feb, 2015 00:41 IST|Sakshi
శిలలు

కథ
 
- ఎమ్వీ రామిరెడ్డి
 
కర్నూలు పట్టణం దాటాక, ఓ ప్రైవేటు పాఠశాల.
పది ఎకరాల విస్తీర్ణంలో స్వస్తిక్ ఆకారంలో భవన సముదాయం. ఎడమవైపు తరగతి గదులు, కుడివైపు బాలబాలికలకు ప్రత్యేక వసతిగృహాలు. ఆడుకోవడానికి విశాలమైన మైదానమూ ఈతకొలనులూ.
 
జాతీయ రహదారి నుంచి పావు కిలోమీటరు లోపలికి ప్రయాణిస్తే, పాఠశాల ప్రధాన ద్వారం వస్తుంది. అక్కడ సెక్యూరిటీ గార్డుల్ని దాటుకుని, లోపలికి వెళ్తే, మరో పెద్దగేటు. తల్లిదండ్రులు వచ్చినా సరే, పిల్లలు ఆ గేటు దాటి, ఇవతలికి రావడానికి వీల్లేదు.
 గేటుకు అవతల రెండు శిలావిగ్రహాలు... సాయంత్రపు నీరెండ పడి మెరుస్తున్నాయి.
 గేటు వైపు దొర్లిన బంతిని తీసుకోవడానికి వచ్చిన అయిదో తరగతి కుర్రాడు ఆ విగ్రహాలను చూసి ఆశ్చర్యపోయాడు.
 నిజానికి రెండు నిమిషాల ముందువరకూ అక్కడ ఎలాంటి విగ్రహాలూ లేవు. స్కూలు పరిసరాలన్నీ ఆ పిల్లాడికి కొట్టిన పిండి. హఠాత్తుగా అప్పటికప్పుడు, అక్కడ ఆ విగ్రహాలు ఎలా ప్రత్యక్షమయ్యాయో అర్థం కాక, అయోమయంగా చూశాడు. చేత్తో తాకి చూశాడు. నునుపైన రాతిస్పర్శ!
 బంతిని అక్కడే విసిరేసి, ‘‘ఒరే శ్రీకాంతూ, అశ్వినూ, భాస్వంతూ, నీరజా, వినీతా...’’ అంటూ ఆటస్థలం వైపు పరిగెత్తాడు. ఆ వార్త పెద్దపిల్లల చెవిన కూడా పడింది. బిలబిలమంటూ గేటు దగ్గరకు చేరుకున్నారు.
 అర్జెంటుగా వెళ్లి టీచర్లకు, వార్డెన్లకు చెప్పారు.
 ‘‘ఇదేంటండీ, ఇంత వింతగా ఉంది. అసలీ విగ్రహాలిక్కడికి ఎలా వచ్చాయి’’ వార్డెన్ వంక వింతగా చూస్తూ అడిగాడు ఇంగ్లిషు మాస్టారు. ఆయనకు యాభైపైనే ఉంటాయి. పెళ్లి చేసుకోలేదు. పిల్లలతో పాటు హాస్టల్లోనే ఉంటాడు.
 ‘‘అదే అర్థం కావటం లేదండీ’’ తల గోక్కుంటూ చెప్పాడు వార్డెన్.
 రూముల్లోనే ఉండిపోయిన ట్యూషన్ టీచర్లు, సూపర్‌వైజర్లు, ఆయాలు, కుక్‌లు, సెక్యూరిటీగార్డులు, అటెండర్లు... స్కూలుకు సంబంధించిన యావత్ సిబ్బందీ ఉరుకులు పరుగుల మీద అక్కడికి చేరుకున్నారు.
 ‘‘జాగ్రత్తగా చూడండి మాస్టారు... ఈ పెద్ద విగ్రహంలో రాముడి పోలికలు కనిపించడం లేదూ’’ ఒకరి అనుమానం.
 ‘‘అబ్బెబ్బే, ససేమిరా కాదు. పెద్ద విగ్రహం స్త్రీ పోలికతో ఉంది. చిన్నది పురుషుడ్ని పోలి ఉంది’’ మరొకరి ప్రకటన.
 ‘‘అయితే, మన స్కూల్లో దేవతలు వెలిశారంటారా?’’ ఇంకొకరి సందేహం.
 ‘‘ఊరుకోండి సార్. ఇవి దేవతల విగ్రహాలు కానేకాదు’’ ఒక వార్డెన్ ధ్రువీకరణ.
 ‘‘స్కూలుకి ఏదో కీడు జరగబోతోంది. దానికిది సంకేతం’’ ఓ సూపర్‌వైజర్ భవిష్యవాణి.
 ‘‘పోలీసులకు ఫోన్ చేస్తే?’’ ఓ ట్యూషన్ టీచర్.
 ‘‘సమయానికి ప్రిన్సిపల్ గారు కూడా లేరు...’’
 ‘‘ప్చ్... ఏమిటోనండీ, నాలుగు నెలల నుంచీ స్కూలు స్కూల్లా లేదు. రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి...’’ దిగులుగా అన్నాడు ఇంగ్లిషు మాస్టారు.

కర్నూలులో దయాకర్‌రావు పేరు ప్రఖ్యాతులున్న డాక్టర్. లాభాపేక్ష లేకుండా వైద్యసేవలందించేవారు. తల్లిదండ్రుల నుండి విలువైన ఆస్తులు సంక్రమించడంతో ఆయన ఏనాడూ డబ్బుకోసం తాపత్రయపడలేదు. ఆయనకు ఇద్దరు కొడుకులు. ఇద్దరూ అమెరికాలో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. నెలనెలా తండ్రికి డబ్బు పంపేవారు. ఆ డబ్బును జాగ్రత్తగా దాచిపెట్టి, కొంత మొత్తం అయ్యాక పట్టణ శివార్లలో పదెకరాల పొలం కొన్నారు దయాకర్‌రావు.
 అది ఖాళీగా ఉండడం ఎందుకుని, బ్యాంకులోను తీసుకుని, భవనాలు కట్టారు. మంచి పాఠశాల నడపాలనే తన చిరకాల కోరికను ఆ భవనాల సాక్షిగా నిజం చేసుకున్నారు. అతి తక్కువ ఫీజులతో, సకల సదుపాయాల వసతి గృహాలతో ప్రారంభించారు. ఆదర్శ భావాలున్న ప్రిన్సిపల్‌ను, మంచి జీతాలతో నిపుణులైన  ఉపాధ్యాయులను నియమించారు. ఫలితంగా ఆ స్కూలు రెండు సంవత్సరాల్లోనే మంచి పేరు సంపాదించుకుంది. నాలుగేళ్లు తిరక్కుండానే రెండువేల మంది పిల్లలకు అక్షరాలయంగా మారింది.
 దయాకర్‌రావు ప్రతిరోజూ సాయంత్రం స్కూలుకు వచ్చేవారు. పిల్లలతో కలిసిపోయేవారు. సరదాగా పాఠాలు చెప్పేవారు.
 స్కూలు ఒంటిగంటకే అయిపోయేది. భోజనానంతరం పిల్లలందరూ ల్యాబ్‌లకు చేరుకునేవారు. డ్రాయింగ్, కార్పెంటరీ, టాయ్‌మేకింగ్... ఎవరికి ఆసక్తి ఉన్న అంశం మీద వారు పనిచేసేవారు. కథలు, కవితలు, వ్యాసరచన, ఉపన్యాసం, మిమిక్రీ, పప్పెట్రీ... పిల్లల మనసుల్ని వికసింపజేసే ఇలాంటి అంశాల్లో ప్రతివారం పోటీలు పెట్టి, ఆకర్షణీయమైన బహుమతులిచ్చి, పిల్లల మనసులు దోచుకునేవారు. సాయంత్రం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదో ఒక ఆట ఆడి తీరాల్సిందే.
 జోనల్, జిల్లా, రాష్ట్రస్థాయుల్లో జరిగే పోటీల్లో ఆ స్కూలు విద్యార్థులు బహుమతుల్ని కొల్లగొట్టేవారు.
 ఆడుతూ పాడుతూ చదివినా, పదో తరగతి పరీక్షల్లో ఆ స్కూలు నుంచి కనీసం ఇద్దరైనా మొదటి పది ర్యాంకుల్లోపు నిలిచేవారు.
 హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థుల్ని చూడ్డానికి తల్లిదండ్రులు ఎప్పుడైనా రావచ్చు.
 గత సంవత్సరం దయాకర్‌రావు భార్య మరణించడంతో ఆయన ఒంటరి అయ్యారు. ఆయన ఆరోగ్యం దెబ్బతింది. కొడుకులిద్దరూ అమెరికా నుంచి వచ్చి, యుద్ధప్రాతిపదికన స్కూలును నష్టానికి అమ్మేసి, తండ్రిని తమతోపాటు అమెరికా తీసుకెళ్ళారు.
 కొత్త యాజమాన్యానికి వ్యాపారమే ప్రథమ ప్రాణం. స్కూలు తమ ఆధీనంలోకి రావడమే ఆలస్యం, వ్యవస్థను మార్చేశారు. కొత్త ప్రిన్సిపల్‌ను నియమించారు. చాలామంది టీచర్లను మార్చారు.
 అనేక కొత్త నిబంధనలను అమల్లో పెట్టారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిషేధించారు. పిల్లలు ప్రతిరోజూ ఆడుకోవడానికి వీల్లేదు. పిల్లల్ని చూడాలనుకునే తల్లిదండ్రులు నెలలో మూడో ఆదివారం మాత్రమే రావాలి. అది కూడా మూడుగంటల పాటు మాత్రమే వారితో గడిపి, వెళ్లిపోవాలి.
 చదువు....చదువు... చదువు.... చదువుకోవడం మాత్రమే చేయాలి. సిబ్బంది బెత్తాలు పట్టుకోవడం అలవాటు చేసుకున్నారు. పిల్లల మీద పెత్తనం చేయడం ప్రాక్టీస్ చేశారు.
 సిబ్బంది గాడిలో పడ్డారుగానీ, పిల్లలు మాత్రం ఆ వాతావరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వారం వారం తల్లిదండ్రుల ఒడిలో సేదదీరే అలవాటున్న పిల్లలు, మూడు వారాలు గడిచేసరికి కన్నవారి కోసం అల్లాడిపోతున్నారు.
 నాలుగో వారంలో జరిగిందా సంఘటన.
 సుస్మిత నాలుగో తరగతి చదువుతోంది. అమ్మ మీద మొదలైన బెంగ, అలా అలా మర్రిచెట్టులా పెరిగిపోయి, ఊడలు దిగింది. అమ్మను చూడకుండా, అరక్షణం కూడా ఉండలేని స్థితికి చేరుకుంది.
 సాయంత్రం హాస్టలు గదికి వచ్చి, దిగులుగా మంచం మీద పడుకుంది. ఆయా వచ్చి, ఏమైందని అడిగింది.
 ‘‘ఆయా, నాకు అమ్మను చూడాలని ఉంది. ఏడుపొస్తంది. ప్లీజ్ ఆయా, మా నాన్నకు ఫోన్ చేసి, వచ్చి తీసుకెళ్లమని చెప్పవా’’ దీనంగా అడిగిందా పాప.
 ‘‘లేదమ్మా, అలా ఒప్పుకోరు. ఇంకెంత, ఒక్కవారం ఓపిక బట్టు. వచ్చే ఆదివారం మీ అమ్మానాన్నలు వస్తారుగా’’ ఓదార్చడానికి ప్రయత్నించింది.
 ‘‘నో నో, నాకిప్పుడే మమ్మీ కావాలి’’ మారాం చేసింది.
 ఇంతలో ఆ ఫ్లోర్ సూపర్‌వైజర్ వచ్చాడు, విజిల్ ఊదుకుంటూ.
 ‘‘ఏం తమాషానా? ఒక్కర్ని పంపిస్తే, అందరూ అడుగుతారు...’’ సుస్మితను రెక్క పట్టుకుని లేపి కూర్చోబెట్టి, ‘‘కమాన్, ఫ్రెష్షప్ అయి, ట్యూషన్‌కు వెళ్లు’’ అంటూ గర్జించాడు.
 పాప ఏడ్చింది. అతను వెళ్లిపోయాడు, హుకుం జారీచేసి.
 బెడ్‌ల వద్ద ముగ్గురమ్మాయిలు మాత్రమే ఉన్నారు. మిగతావారంతా ట్యూషన్‌కు వెళ్లిపోయారు. తళుక్కున సుస్మిత చిన్నిబుర్రలో ఏదో మెరిసింది. బుక్‌షెల్ఫ్ ఓపెన్ చేసి,
 ఓ వస్తువును చేతిలోకి తీసుకుంది.
 ఒక్క నిమిషం తర్వాత ‘అమ్మా’ అంటూ పెద్దగా కేక పెట్టింది. ఆ కేక విని మిగతా ముగ్గురూ పరుగెత్తుకొచ్చారు.
 ఎడమచేతి మణికట్టు నుంచి రక్తం కారుతోంది.
 ఓ పాప గబగబా పరుగెత్తుతూ ఫ్లోర్ సూపర్‌వైజర్ దగ్గరకెళ్ళి, ‘‘సార్, సార్, సుస్మిత బ్లేడుతో చెయ్యి కోసుకుంది’’ చెప్పింది వగరుస్తూ.
 అతను హడావుడిగా ఆ గదికి చేరుకుని, తన కర్చీఫ్ తీసి, సుస్మిత చేతికి చుట్టాడు. ఆ తర్వాత సిక్‌రూముకు తీసుకెళ్లాడు. విషయం ప్రిన్సిపల్ దాకా చేరింది. ఆయనే స్వయంగా సుస్మిత తండ్రికి ఫోన్‌చేసి, వెంటనే రమ్మని చెప్పాడు.
 మహబూబ్‌నగర్‌లో ఉంటున్న సుస్మిత తల్లిదండ్రులు మూడుగంటలలోపే స్కూలు చేరుకున్నారు.
 తల్లిదండ్రుల్ని చూడగానే, సుస్మిత మొహం విప్పారింది. చేతిగాయం మర్చిపోయింది. పరుగు పరుగున వెళ్లి, తల్లి ఒడిలో దూరిపోయింది. ప్రిన్సిపల్ అనుమతితో సుస్మితను ఇంటికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు.
 మరుసటి నెలలో మరో సంఘటన.
 ఆరో తరగతి చదువుతున్న ఆశిష్‌కు నాయనమ్మంటే ప్రాణం. ప్రతివారం తల్లిదండ్రుల వెంట ఆమె కూడా వచ్చి మనవణ్ని చూసుకుని మురిసిపోయేది. ఒళ్లో కూర్చోబెట్టుకుని కథలు చెప్పేది. బోల్డన్ని ముద్దులు పెట్టేది. గత నెల మూడో ఆదివారం తల్లిదండ్రులు వచ్చారుగానీ, అనారోగ్యం కారణంగా నాయనమ్మ రాలేదు. పది రోజుల్నుంచీ ప్రతిరాత్రీ ఆమె కలలో కనిపిస్తుంటే, వెంటనే చూడాలన్న తపన పెరిగిపోతోంది.
 ఆశిష్‌కు చదువు మీద గురి కుదరడం లేదు. మనసంతా మహా దిగులు. ‘ఎలాగైనా ఇంటికెళ్లాలి. నాయనమ్మను చూడాలి’.
 సుస్మిత మెదిలింది అతని మనసులో. ఇంకా పెద్ద సాహసం చేయాలి.
 సాయంత్రం అయిదు గంటల వేళ... మూడో అంతస్తు పైనుంచి కిందికి దూకేశాడు.
 అతని అరుపు ఆ మైదానంలో ప్రతిధ్వనించింది. పిల్లలూ సిబ్బందీ ఆఘమేఘాల మీద అక్కడికి చేరుకున్నారు.
 ఆశిష్ కాలు విరిగింది. పక్కటెముకలు దెబ్బ తిన్నాయి. నాలుగు రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని చెప్పారు.
 అమ్మానాన్నలు వచ్చారు. నాయనమ్మ వచ్చింది. ఆమెతోపాటే ఆశిష్ కళ్లల్లో వెలుగు వచ్చింది.
 ఇంత సీరియస్ కాకపోయినా, మరుసటి నెలలోనూ రెండుమూడు చెదురుమదురు సంఘటనలు.

 ఇప్పుడీ విగ్రహాల ప్రహసనం!
 రాత్రి ఏడున్నర దాటింది. పిల్లలూ పెద్దలూ ఎవ్వరూ కదలడం లేదు, ఆ విగ్రహాల దగ్గర్నుంచి.
 చివరికి ఇంగ్లిషు మాస్టారు సాహసం చేసి, ప్రిన్సిపల్‌కు ఫోన్ చేశారు.
 ‘‘వ్వాట్? ఏమిటి మీరనేది?’’ ఫోన్లోనే రంకెలేశాడు ప్రిన్సిపల్.
 ‘‘నిజం సార్. మాకంతా అయోమయంగా ఉంది. మీరు వస్తే కాస్తంత ధైర్యంగా ఉంటుందని...’’
 ‘‘ఓకే, ఐ విల్ బీ దేర్ వితిన్ టెన్ మినిట్స్’’ ఫోన్ పెట్టేశాడు.
 మాటమీద నిలబడుతూ, పది నిమిషాల్లోపే స్కూలు గేటులో అడుగుపెట్టాడు ప్రిన్సిపల్.
 ‘ముందుగా ఎవరు చూశారు? ఎలా జరిగింది? ఎందుకిలా జరిగింది?’ అంటూ రకరకాల ప్రశ్నలతో పావుగంటే సేపు సమీక్ష జరిపాడు.
 ఆ విగ్రహాలకు అతి సమీపంలోనే, అటెండరు తెచ్చి వేసిన కుర్చీలో కూర్చుని, కళ్లు మూసుకుని, దీర్ఘంగా ఆలోచించాడు ప్రిన్సిపల్.
 ‘‘అవును, పిల్లల్లో ఎవరైనా మిస్ అయినట్లుందా?’’ ప్రశ్నించాడు, కళ్లు తెరవకుండానే.
 ‘‘గమనించలేదు సార్’’ రెండువేల మంది పిల్లల్లో, ఒకరిద్దరు మిస్ అయినా, పసిగట్టడం అంత సులభం కాదు.
 ‘‘పిల్లలందరినీ క్లాసువారీగా సమావేశపర్చి, హాజరు తీసుకోండి’’
 పది నిమిషాల తర్వాత ఇంగ్లిషు మాస్టారు కాస్తంత కంగారుగా, చాలా హడావుడిగా వచ్చాడు.
 ‘‘సార్ సార్, సెవెన్త్ క్లాస్‌లో చందన, ఫిఫ్త్‌లో కిరణ్ కనిపించడం లేదు’’ చెప్పాడు కళ్లజోడు సవరించుకుంటూ.
 ‘‘అదీ... ముడి వీడింది’’ తేలిగ్గా నవ్వుతూ అనేశాడు ప్రిన్సిపల్.
 ‘‘ఏమిటి సార్, ఏం జరిగింది?’’ మరింత అయోమయంగా అడిగాడు ఇంగ్లిషు మాస్టారు.
 ‘‘మాయమైన వాళ్లిద్దరూ అక్కాతమ్ముళ్లు కదూ’’
 ‘‘అవును సార్’’
 ప్రిన్సిపల్ ఎవరికో ఫోన్ చేశాడు, ‘‘ఆ శ్రీనివాస్‌గారూ, ఎక్కడిదాకా వచ్చారు’’
 ఫోన్ మాట్లాడాక- ‘‘సరిగ్గా పది నిమిషాల తర్వాత ఈ విగ్రహాలు మాయమవుతాయి’’ అని చిద్విలాసంగా ప్రకటించాడు.
 చుట్టూ చేరినవారు మరింత అయోమయంగా చూశారు.
 చందన, కిరణ్ తండ్రి శ్రీనివాస్ మధ్యాహ్నం ప్రిన్సిపల్‌కు ఫోన్ చేశాడు. తన తండ్రి మరణించారనీ, ఒక్కరోజు పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లడానికి అనుమతించాలనీ అభ్యర్థించాడు.  సరేనన్నాడు ప్రిన్సిపల్.
 చందన, కిరణ్‌లను తన ఛాంబర్‌కు పిలిపించుకుని, ‘‘మీ అమ్మానాన్నలు వస్తున్నారు. ఇంటికెళ్లి, మళ్లీ ఎల్లుండి ఉదయానికంతా ఇక్కడుండాలి’’ అని చెప్పాడు. సాయంత్రం స్కూలు వదలగానే ప్రిన్సిపల్ ఇంటికెళ్లిపోయాడు.
 చందన, కిరణ్‌లు గేటుదాకా వచ్చి, తల్లిదండ్రుల కోసం ఎదురు చూడసాగారు. ముళ్ల మీద నుంచున్నారు. అసహనంగా కదిలారు. కళ్లు విప్పార్చి చూశారు. సమయం భారంగా గడుస్తోంది.
 ట్రాఫిక్‌జామ్‌లో చిక్కుకున్న తల్లిదండ్రులు రావడం ఆలస్యం కావడంతో... వాళ్లలా ఎదురు చూసీచూసీ...
 ‘‘అదిగో కారొస్తంది...’’ పిల్లల్లో ఎవరో అరిచారు.
 అందరూ అలర్టయ్యారు.
 సెక్యూరిటీ దాటుకుని, మెయిన్‌గేటు దాకా వచ్చి, ఆగిన కారులోంచి శ్రీనివాస్, ఆయన భార్య దిగారు.
 మెల్లగా నడుస్తూ, మెయిన్‌గేటు దాటారో లేదో... విగ్రహాల్లో చిన్న కదలిక. చూస్తుండగానే శిలలు కరిగిపోయాయి. వాటికి ప్రాణం వచ్చింది. చందన, కిరణ్ ప్రత్యక్షమై, తల్లిదండ్రులకు ఎదురుగా పరుగెత్తుకెళ్లారు.

అప్పట్నుంచీ అడపాదడపా క్యాంపస్‌లో విగ్రహాలు ప్రత్యక్షమవుతూనే ఉన్నా, ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
 

మరిన్ని వార్తలు