ఆరుబయట ఆటలతో చిన్నారుల చూపు పదిలం

22 Jul, 2017 23:38 IST|Sakshi
ఆరుబయట ఆటలతో చిన్నారుల చూపు పదిలం

ఆరుబయట ఆటలాడటం, పచ్చని పరిసరాల్లో తిరుగాడటం వల్ల చిన్నారుల్లో కంటిచూపు దెబ్బతినకుండా ఉంటుందని నెదర్లాండ్స్‌కు చెందిన నేత్రవైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ కనీసం 45 నిమిషాల సేపు ఆరుబయట గడపడం వల్ల పిల్లలకు తగినంతగా విటమిన్‌–డి లభిస్తుందని, దీనివల్ల వారి ఎముకలు దారుఢ్యాన్ని పుంజుకోవడంతో పాటు వారి కంటిచూపు భేషుగ్గా ఉంటుందని రోటర్‌డామ్‌లోని ఎరాస్మస్‌ మెడికల్‌ సెంటర్‌కు చెందిన నేత్రవైద్య నిపుణుడు డాక్టర్‌ కారోలిన్‌ క్లావర్‌ చెబుతున్నారు.

ఆరుబయట ఆటలకు దూరంగా ఉంటున్న పిల్లలే ఎక్కువగా హ్రస్వదృష్టి (మాయోపియా) బారిన పడుతున్నారని ఆమె తెలిపారు. పాఠశాలల్లో చదువుల ఒత్తిడి, ఇళ్లల్లో టీవీలు, స్మార్ట్‌ఫోన్లను అంటిపెట్టుకుని గంటల తరబడి గడిపే అలవాటు వల్ల పిల్లల్లో దృష్టిలోపాలు తలెత్తుతున్నాయని, ఇవే పరిస్థితులు కొనసాగితే రానున్న ముప్పయ్యేళ్లల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారుల్లో దాదాపు సగానికి సగం మంది మాయోపియా బారిన పడే అవకాశాలు ఉన్నాయని డాక్టర్‌ కారోలిన్‌ హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు