ఊరంతా ఒకే కుటుంబం

16 Aug, 2015 00:57 IST|Sakshi
ఊరంతా ఒకే కుటుంబం

మన ఊరు
అదేదో సినిమాలో ‘మానవా మానవా’ అని పిలిస్తే ‘మానను గాక మానను’ అంటాడో తాగుబోతు. ఆ ఊళ్లో ఒకప్పుడు అలాంటి దృశ్యాలు ఎటు చూసినా కని పించేవి. వేళా పాళా లేకుండా మందు బాబులు ఊరి మీద పడేవాళ్లు. పనీ పాటా మానేసి మందులోనే మునిగి తేలేవారు. కానీ ఇప్పుడు అక్కడ మందు వాసనే రావట్లేదు. మందు అన్న పేరే వినబడ ట్లేదు. ఉన్నట్టుండి ఆ గ్రామంలో అంత మార్పు ఎలా వచ్చింది?!
 
మన దేశంలోని అనేక కుగ్రామాలలో లాగే మహారాష్ట్రలోని కతేవాడిలో కూడా సరియైన  రోడ్లు ఉండేవి కాదు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా ఉండేది కాదు. మద్య పానం, ధూమపానం, జూదం మొదలైన వ్యసనాలు గ్రామాన్ని పట్టి పీడించేవి. అయితే ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్’ ఈ ఊరిని దత్తత తీసుకున్న తరువాత పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చింది. దుర్వ్యసనాల గ్రామం ఇప్పుడు ఆదర్శ గ్రామంగా ప్రశంసలందుకుంటోంది!
 
‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్’ వారు అడుగుపెట్టేసరికి కతేవాడి పరిస్థితి భయంకరంగా ఉంది. గ్రామంలో డెబ్భై శాతం మంది మద్యానికి బానిసలై పోయారు. పని చేయకపోవడంతో సంపా దన ఉండేది కాదు. ఎక్కడ చూసినా పేద రికం. దానికి తోడు ఊళ్లో ఏ సౌకర్యాలూ ఉండేవి కాదు. ఈ పరిస్థితిని మార్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

ఊరిలో చాలా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఏర్పాటయ్యాయి. వీటిలో గ్రామస్తులందరినీ సభ్యులుగా చేర్చుకున్నారు. వారికి మద్యాన్ని దూరం చేశారు. బాధ్యతగా ఎలా నడుచుకోవాలో నేర్పారు. దాంతో ఒకప్పుడు గ్రామంలో మద్యం మీద రోజుకు వంద నుంచి రెండు వందల రూపాయల వరకు ఖర్చు  చేసిన వాళ్లు కాస్తా ఇప్పుడు ఆ మొత్తాన్నీ ఇంటి కోసం, ఊరి కోసం వినియోగిస్తున్నారు.
 
అలాగే ‘యస్‌హెచ్‌జీ’ల పుణ్యమా అని గ్రామంలో వడ్డీవ్యాపారం తగ్గిపోయింది.  గ్రామస్తుల ఆర్థికస్థాయి మెరుగుపడింది. ప్రతి వ్యక్తీ స్థానిక బ్యాంకులో కొంత సొమ్మును డిపాజిట్ చేస్తున్నారు. ప్రతి ఇంటా సంపద చేరింది. ప్రతి కుటుంబంలో సంతోషం నెలకొంది. అందరి ఇళ్లలోనూ మరుగుదొడ్లతో పాటు అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. ఊరిలో చక్కని రోడ్లు ఉన్నాయి. విద్యుత్ ఉంది. డ్రైనేజీ వ్యవస్థ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల్లో ఐకమత్యం ఉంది.  ‘మద్యం ముట్టను’, ‘పొగ తాగను’ అని గ్రామస్తులందరూ ప్రమాణం చేశారు. ఊరి యువకులు ఒక భారీ ర్యాలీ నిర్వహించి ఇళ్లు, దుకాణాల్లో ఉన్న సిగరెట్లు, చుట్టలు, బీడీలు, మద్యం అన్నిటినీ సేకరించి దహనం చేశారు. అందుకే ఇప్పుడు కతేవాడిలో మద్యం దుకాణాలుకానీ, తాగేవాళ్లు కానీ కనిపించరు.
 
శుభ్రత విషయంలో కూడా కతేవాడి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. గ్రామస్తులంతా కలిసి వీధులు, బహిరంగ ప్రదేశాలు, దేవాలయాలు మొదలైన ప్రదేశాలను శుభ్రం చేస్తుంటారు. భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కూడా విజయవంతం అయింది. ఈ అభివృద్ధికి గాను ప్రభుత్వం నుంచి ‘నిర్మల్ గ్రామ్ అవార్డ్’ను, ‘సంత్ గాడ్గెబాబా’ అవార్డ్ కూడా అందుకుంది కతేవాడి.
 
ఇదంతా ఎలా సాధ్యపడింది అని అడిగితే... ‘‘ఒకప్పుడు ఊళ్లో మా ఇల్లుంది అనుకునేవాళ్లం. ఇప్పుడు  ఊరినే మా  ఇల్లు అనుకుంటున్నాం. ఊరు అభివృద్ధి చెందితే మేము అభివృద్ధి చెందినట్లే కదా’’ అని చెప్తారు ఆ గ్రామస్తులు ఉద్వేగంగా. వారిని ఆదర్శంగా తీసుకుంటే ప్రతి గ్రామమూ ఆదర్శ గ్రామమౌతుంది!     
 
కతేవాడిలో చెప్పుకోదగ్గ మరో విశేషం ‘దాన్ పేటి’. షాప్‌కీపర్ లేకుండా షాప్‌ను నడిపే పథకం ఇది. ఈ షాప్‌లో తక్కువ ధరకే నాణ్యత కలిగిన సరుకులు ఉంటాయి.  ప్రజలు తమకు కావలసినవి తీసుకొని దాని వెల ఎంతో ఆ సొమ్మును ‘దాన్ పేటీ’ అనే క్యాష్‌బాక్స్‌లో వేస్తారు. దాన్ని ఊరి బాగుకై వినియోగిస్తారు.

మరిన్ని వార్తలు