తపాలా: సార్, పొగ తాగవద్దు ప్లీజ్!

23 Mar, 2014 02:00 IST|Sakshi
తపాలా: సార్, పొగ తాగవద్దు ప్లీజ్!

మాది గుంటూరు జిల్లా కొత్తసొలస గ్రామం. నేను ఎన్.ఎస్.పి. డిపార్టుమెంటు-నర్సరావుపేటలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి రిటైర్ అయ్యాను.నేను సర్వీసులో రికార్డు కీపరుగా మొదట చేసినప్పుడు, రికార్డు రూమ్ గోడ పక్కన వచ్చేవారూ, వెళ్లేవారూ మూత్రం విసర్జించేవారు. గోడమీద పేపరులో ‘మూత్రం వాసనకు మెదడుకు సంబంధించిన జబ్బులు వస్తాయి, దయచేసి ఇక్కడ మూత్రము విసర్జించవ’ద్దని రాసిపెట్టేవాణ్ని. కానీ ఎవ్వరూ వినిపించుకునేవారు కాదు. తప్పుచేసేవారి జోలికి వెళితే వారికి శత్రువు అవుతామని తెలిసి భరించేవాణ్ని.
 
 కొన్నాళ్లకు నాకు సీనియరు అసిస్టెంట్‌గా ప్రమోషన్ వచ్చింది. మా కార్యాలయ ఉన్నతాధికారీ, మా గణాంకాధికారీ ఇరువురూ సిగరెట్టు తాగేవారే! ఏదైనా ఫైలు తీసుకొని గణాంకాధికారి వద్దకు వెళ్లాల్సివస్తే, ఆయన సిగరెట్టు ముట్టించి పొగ పీలుస్తూ వదులుతూ ఉండేవారు. నేను పక్కకు వెళ్లేవాణ్ని. దాంతో ఆయన, ‘ఏమయ్యా! ఫైలు చూస్తుంటే పక్కకు వెళతావేంటి?’ అని మందలించేవారు. తిట్లు పెద్దగా హాని చేయవుగానీ, పొగ పీల్చడం హాని చేస్తుందని తిట్లు భరిస్తూ ఉండేవాణ్ని. వారు ఫైలు చూసి నా చేతికి ఇవ్వగానే, ఉన్నతాధికారి దగ్గరికి వెళ్లేవాణ్ని. వారు ఇటు ఫైలు చూస్తూ, అటు సిగరెట్టు పొగ గుప్‌గుప్‌మని వదులుతూ, మరోపక్క పక్కవారితో కబుర్లు చెపుతూ ఉండేవారు. ఆయన దగ్గర నిల్చోలేక, బయటకు వెళ్లలేక, వారికి కోపం వస్తుందేమోనని బాధను అనుభవిస్తూ ఉండేవాణ్ని.
 
 మా ఎస్టాబ్లిష్‌మెంట్ క్లర్కువారు, మా ఇరువురు అధికార్ల కంటే రెండు పెట్టెలు అధికంగా సిగరెట్లు తాగేవారు. మా రూమ్‌లో ఉండేవారిలో కొంతమంది పొగ అంటే గిట్టనివారు ఉన్నారు. మా సిబ్బంది గుమస్తా వారికి నడవడానికి రెండు కాళ్లు లేవు. నాకు ఒక్క కాలు అవుడు. ఒకరోజు ఆయనతో, ‘సిగరెట్టు తాగవద్దు, మీకు చెప్పే ధైర్యము ఎవరికీ లేదు, అందువల్ల అందరూ మౌనంగా ఉంటూ బాధపడుతున్నారు’ అని చెప్పాను.  ‘నేను లేచి బయటకు వెళ్లలేనూ, సిగరెట్టు తాగకుండానూ ఉండలేను’ అని సమాధానం ఇచ్చారు క్లర్కు. దాంతో ఏమీచేయలేక, నా టేబుల్ మీద ఒక అట్టమీద, ‘ధూమపానం ప్రమాదం’ అని రాసి అందరకూ కనబడేటట్లు పెట్టాను. మా కార్యాలయం ఉన్నతాధికారులు దీనిని చూసి నవ్వుకున్నారు.
    
 ఇక ఇటీవలి సంగతి. ఒకరోజు ‘బహిరంగ ప్రదేశం’లో ఒక నీడపట్టున కూర్చుని వేచిచూస్తున్నాం. నా వెంట నా ముగ్గురు మనవరాళ్లు, ఒక మనవడు ఉన్నారు. ఒక కుర్రవాడు, పదిహేనేళ్లు ఉంటాయేమో, మా పక్కన కూర్చుని సిగరెట్టు ముట్టించాడు. తరువాత ఇద్దరు రైతులు వచ్చారు. పొర చుట్టలు చుట్టుకొని, చుట్టచుట్టకు మోటించి కాల్చుకుంటూ పక్కన కూర్చున్నారు. మా కూతుళ్లు, పూలు, కాయలు కొనటానికి బజారుకు వెళ్లారు. నా దగ్గర కూరగాయల సంచులు, పిల్లల బట్టలు గల సంచులు ఉన్నాయి. ఈ పసిబిడ్డలను దూరంగా తీసుకొని వెళ్లలేకా, ఆ సంచులు మోయలేకా, వాళ్లను ఏమీ చేయలేకా, ఆ ఘాటైన వాసన పీలుస్తూ, నరకాన్ని అనుభవిస్తూ అలాగే కూర్చున్నాను. బహిరంగ ప్రదేశంలో ధూమపానం చేసేవారిని శిక్షించే చట్టం మనకు వచ్చింది గదా! అది ఎక్కడైనా అమలవుతోందా?
 అలా మథనపడుతుండగానే, మా కూతుళ్లు ఇద్దరు వచ్చారు. అందరం కలిసి ఆటో ఎక్కాం. తీరా ఆటో డ్రైవర్ సిగరెట్టు ముట్టించి, ఆటోను స్టార్ట్ చేశాడు. ‘పొగ భరించలేకపోతున్నాం’ అంటే, ‘ఇది ఆర్టీసీ బస్సు కా’దన్నాడతను.  ఇతరులను బాధపెట్టే ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుందో వేచి చూడాలి.
 - మద్దూరి రామకోటిరెడ్డి
 కొత్త సొలస, గుంటూరు

 
 ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి.
 మా చిరునామా: తపాలా, ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1,
 రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34.  funday.sakshi@gmail.com
 డిజైన్: కుసుమ

మరిన్ని వార్తలు