భారతీయుల సోదరి

26 Aug, 2018 02:37 IST|Sakshi
సోదరి నివేదిత

‘‘ఈ ప్రభుత్వం ఎంత దుర్భరంగా తయారవుతోందో నీవు ఊహించలేవు. టిబెట్‌ దండయాత్ర, కొత్తగా తెచ్చిన విద్యాచట్టం, బెంగాలు విభజన, అధికార రహస్యాల చట్టం, పురాతన కట్టడాల చట్టం మొదలైన ప్రతి చర్య అణచివేత చర్యే! ఎంతో నిరంకుశంగా సాగుతున్న ఈ పాలన భారతీయులలోని స్వాతంత్య్ర భావనలను నీరుగార్చడానికి చేస్తున్నవే!’’ ఈ మాటలు మెక్‌లౌడ్‌ అనే ఒక విదేశీ యువతికి భారతదేశం నుంచి 1904లో వెళ్లిన ఓ ఉత్తరంలో కనిపిస్తాయి. ఆ లేఖ, అందులో ఆగ్రహావేశాలను రంగరించుకున్న ఈ అక్షరాలు భారతదేశంలో ఏ జాతీయవాదీ రాయలేదు. ఇవి రాసినది మళ్లీ ఒక విదేశీ వనితే. పేరు సిస్టర్‌ నివేదిత.  ఇది అప్పటి వైస్రాయ్‌ కర్జన్‌ మీద ఆగ్రహం కూడా. అతడు ఎన్నో అబద్ధాలు చెబుతున్నా, భారతీయుల ఆత్మగౌరవం దెబ్బ తినే విధంగా మాట్లాడుతున్నా ఇక్కడి వారెవ్వరూ ఖండించకపోవడం కూడా సోదరి నివేదితకు బాధగా కూడా అనిపించింది.

ఇలాంటి వైఖరి ప్రధానంగా జాతీయ కాంగ్రెస్‌లోని మితవాదులదే. అందుకే ఆమె గోపాలకృష్ణ గోఖలే వంటివారికి కూడా సున్నితంగా హితబోధ చేసింది. ఆగ్రహించడానికి ఉపయోగించే భాషకు మర్యాదను అద్దడంతోనే జీవితమంతా గడిపేస్తే భవిష్యత్తరాల గతి ఏమిటన్నదే ఆమె ప్రశ్న. ఇంతకీ ఆ ఉత్తరం అందుకున్న జోసఫైన్‌ మెక్‌లౌడ్‌ అమెరికా దేశీయురాలు. షికాగోలో వివేకానందుని ఉపన్యాసాలను విని గొప్ప గౌరవ భావంతో, ఆయన వెంట ఇంగ్లండ్‌ వచ్చి, అక్కడ కూడా ఆయన ప్రసంగాలను విన్న భక్తురాలు.విదేశీ దండయాత్రలతో, విదేశీ పాలనతో భారతీయులు ఏం కోల్పోయారో పాశ్చాత్యులే బాగా గ్రహించారనిపిస్తుంది. ఈ పురాతన సంస్కృతిలోని ఔన్నత్యాన్ని నిజాయితీగా, సూక్ష్మంగా వారే గమనించారని అనిపిస్తుంది. అందులో సిస్టర్‌ నివేదిత కూడా ఒకరు.

ఆమె కంటే ముందు అనిబీసెంట్‌ మనం కోల్పోయినదేమిటో మనకి చెప్పడానికి ప్రయత్నించారు. ఇద్దరూ ఐర్లాండ్‌ మూలాలు ఉన్నవారే. జీవన విధానం, కళలు, ఆలోచనలు తిరిగి భారతీయం కావాలని ఆకాంక్షించిన వారే. సిస్టర్‌ నివేదిత ఆధ్యాత్మిక చింతన కోసమే, మానవ సేవ కోసమే మనదేశం వచ్చారు. తరువాత ఆమె మార్గం భారతీయుల రాజకీయోద్యమం వైపు మళ్లింది. గడప దాటని భారతీయ మహిళకు అక్షరాలు అందించడానికి ఆమె అంకితమయ్యారు.సిస్టర్‌ నివేదిత అసలు పేరు మార్గరెట్‌ ఎలిజబెత్‌ నోబెల్‌.  మార్గరెట్‌ (అక్టోబర్‌ 28, 1867–అక్టోబర్‌ 13, 1911) ఆనాటి ఉత్తర ఐర్లాండ్‌లోని దూంగన్నాన్‌ అనే పట్టణంలో పుట్టారు.

ఇది టైరోన్‌ కౌంటీలో ఉంది. ఆమె తాత జాన్‌ నోబెల్‌ స్కాట్లాండ్‌కి చెందినవారు. మార్గరెట్‌ తండ్రి శామ్యూల్‌ రిచ్‌మండ్‌ నోబెల్, తల్లి మేరీ ఇసాబెల్‌. శామ్యూల్‌ మత గురువు. మానవులకు సేవ చేయడమంటే, దైవానికి సేవ చేయడమేనని శామ్యూల్‌ పదే పదే చెప్పేవారు. అది ఆచరించి చూపించారు కూడా. పేదల బాగోగులు చూడ్డానికి వెళుతున్నపుడు మార్గరెట్‌ ఆయన వెంట ఉండేది. ఆమే పెద్ద కూతురు. పైగా ఆయనకి  ఎంతో ముద్దు. కానీ పిన్న వయసులోనే, ముప్పయ్‌ నాలుగేళ్లకే శామ్యూల్‌ కన్నుమూశారు. అందుకు కారణం, పేదల సేవలో ఉంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమే. దీనితో తల్లి తన పిల్లలను తీసుకుని తన తండ్రి రిచర్డ్‌ హ్యామిల్టన్‌ దగ్గరకు వెళ్లింది.  ఆయన ఆదాయం తన కుటుంబానికీ, కూతురు కుటుంబానికీ చాలేది కాదు. దీనితో మేరీ తండ్రితో కలసి అతిథిగృహాన్ని నిర్వహించింది. శామ్యూల్‌ తండ్రి జాన్, మేరీ తండ్రి హ్యామిల్టన్‌ ఇద్దరూ ఐర్లాండ్‌ స్వాత్రంత పోరాటంలో, హోంరూల్‌ ఉద్యమంలో ప్రముఖులు.

మార్గరెట్‌ మీద తండ్రి ప్రభావం ప్రగాఢంగా ఉంది.  ఆయనతో సాన్నిహిత్యం, ఆయన నోటి నుంచి విన్న బోధనలు సత్యాన్వేషణకి పురికొల్పాయి. ఆమె ఏమి ఆలోచించినా అందులో సత్యం ఎంత అన్న దాని కోసమే తహతహలాడినట్టు కనిపిస్తుంది. అయితే ఆమె చదువంతా చర్చి సంబంధిత పాఠశాలల్లోనే సాగింది.  తరువాత  హాలిఫాక్స్‌ విశ్వవిద్యాలయంలో చేరింది. ఇక్కడ నుంచే ఆమెలో ఒక గుంజాటన మొదలైంది. తను చదివిన దానికీ, సత్యం దిశగా సాగుతున్న తన ఆలోచనలకీ పొంతన కుదరడం లేదన్న సంగతి అప్పుడే గ్రహించారామె.1884లో కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకుంటూ మార్గరెట్‌ కేస్విక్‌లోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరింది. తరువాత రగ్బీ అనే చోటికి వెళ్లి అనాథ పిల్లల కోసం ఏర్పాటు చేసిన బడిలో చదువు చెప్పింది. ఆపై ఉత్తర వేల్స్‌ బొగ్గుగనుల ప్రాంతం వెళ్లింది. ఇక్కడే వేల్స్‌కి చెందిన యువ ఇంజనీర్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. నిశ్చితార్థం జరగకుండానే అతడు చనిపోయాడు. ఇదే ఆమె జీవితాన్ని మార్చివేసింది.

అక్కడ నుంచి వచ్చేసి లండన్‌ దగ్గర కింగ్స్‌లే గేట్‌ దగ్గర సొంతంగా పాఠశాలను ఆరంభించిందామె. ఇందులో ప్రయోగాత్మకంగా విద్యను బోధించేది. పిల్లలు తరగతి గదిలో కూర్చుని చదువుకోవలసిన అవసరం ఉండదు. ఆటపాటలతోనే చదువు నేర్పే విధానం ప్రవేశపెట్టింది. ఇక్కడే ఆమెతో పాటు ఒక ఆర్ట్‌ టీచర్‌ కూడా పనిచేశాడు. అతడే ఎబ్‌నెజర్‌ కూకే. ఇతడు కూడా ఆనాడు ఇంగ్లండ్‌ బడులలో మార్పు తేవడానికి ఉద్దేశించిన సంస్కరణోద్యమంలో ప్రముఖుడు. ఆర్ట్‌ ఎడ్యుకేషన్‌కి పితాహుడన్న పేరు కూడా ఉంది. హాలిఫాక్స్‌ విశ్వవిద్యాలయం విద్యార్థి వసతి గృహంలో ఉండే నిర్దిష్టత కారణంగా ఏర్పడే చీకాకు నుంచి తప్పించుకోవడానికి, అందులో కలిగే విసుగు నుంచి బయటపడడానికి ఆమె తీవ్రంగా చదివేది. రచనలు చేసేది. అంతవరకు కూడా చదువు, మత బోధనలు సమాంతరంగానే సాగాయి. బాల ఏసును ఆరాధించేది. కానీ ఆ బోధనలేవీ సత్యానికి సమీపంగా తీసుకువెళుతున్నట్టు అనిపించలేదు. ఫలితం–  క్రైస్తవం మీద విముఖత. అప్పటి యూరప్‌ వాతావరణం కూడా ఆమె ఆలోచనలకు పదును పెట్టింది.

ఆ ఖండం అనుసరించిన సంస్కృతి, నమ్ముకున్న భావాలు  అక్కడి ప్రజలు చిరకాలంగా ఆచరిస్తున్న మతం పట్ల వ్యతిరేకతతో, అనుమానంతో నిండిపోయాయి.  మానసికంగా వచ్చిన ఈ శూన్యాన్ని భర్తీ చేసుకోవడానికి మార్గరెట్‌ జీవశాస్త్రం అభ్యసించింది. కొంతకాలం బౌద్ధం అధ్యయనం చేసింది.  ఏడేళ్ల పాటు అలాంటి డోలాయమాన స్థితిలో ఆమె ఉండిపోయింది. ఆ సమయంలోనే చాలా దేశాల కళారీతులను కూడా అధ్యయనం చేసింది. అప్పుడే ఒకప్పటి సహచరుడు ఎబెనెజర్‌ ఒక సమావేశానికి రమ్మని పిలిచాడు.1895 సంవత్సరం సెప్టెంబర్‌ నెల. ఆ ఆదివారం పగలు కూడా విపరీతమైన చల్లగా ఉంది. అలాంటి సమయంలో మార్గరెట్‌ లండన్‌లోని లేడీ ఇసాబెల్‌ మార్గెసన్‌ అనే కులీనురాలి ఇంటికి వెళ్లింది. ఎబెనెజర్‌ ఆహ్వానించిన సమావేశం ఆ ఇంటిలోనే ఏర్పాటైంది.

‘ఆ సమయంలో తాను లండన్‌లో కనుక లేకుంటే తన జీవితం తల లేని మొండెంలా మిగిలేది’ అని మార్గరెట్‌ స్వయంగా ఒకసారి చెప్పుకున్నారు. పదిహేను మందో పదహారు మందో అర్థచంద్రాకారంగా కూర్చున్నారు. వారి నడుమ కాషాయ వస్త్రాలతో, నడుముకు అంగవస్త్రం బిగించి కూర్చుని ఉన్నారా ‘‘హిందూ యోగి’’. ఆయనే వివేకానందుడు. షికాగో సర్వమత సమ్మేళనంలో పాల్గొన్న తరువాత అక్కడే పరిచయమైన కొందరు ఇంగ్లండ్‌ మిత్రుల ఆహ్వానం మేరకు మూడు మాసాలు ఉండడానికి వచ్చారాయన. కానీ ఆయన వెల్లడించిన అభిప్రాయాలు విశ్వజనీనంగా, హేతుబద్ధంగా ఉన్నప్పటికీ అక్కడి తెల్లజాతి మేధావులు వాటిని కొట్టి పారేశారు. కానీ అవే మార్గరెట్‌ను ఆలోచింపచేశాయి. ఆయన ఎక్కడ ప్రసంగించినా వెళ్లి విన్నది. చివరికి ఇంగ్లండ్‌ వీడుతున్న వేళలో ‘‘గురువర్యా!’’ అని సంబోధించిందామె. రెండవసారి ఏప్రిల్, 1896లో వివేకానంద మళ్లీ లండన్‌ వెళ్లారు. ఆమె మరోసారి ఆయనను కలుసుకుంది. ఎన్నో ప్రశ్నలు వేసింది. ఆయన జవాబులతో తనను వెంటాడుతున్న అనేక సందేహాలు నివృత్తి అయ్యాయి కూడా.

రెండేళ్ల తరువాత తన కుటుంబాన్నీ, మిత్రులనీ అందరినీ వదిలిపెట్టి ‘మొంబాసా’ అనే నౌక మీద బయలుదేరి శాశ్వతంగా భారతదేశంలో ఉండిపోవడానికి వచ్చేసింది. జనవరి 28,1898న కలకత్తా చేరుకున్నారు. మార్చి 11న కలకత్తాలోనే స్టార్‌ థియేటర్‌లో రామకృష్ణా మిషన్‌ ప్రారంభ సమావేశం జరిగింది. అందులో మార్గరెట్‌ మాట్లాడింది. వారం తరువాత వచ్చిన తేదీ మార్చి 17ను మార్గరెట్‌ ఎంతో ముఖ్యమైనదంటూ తన డైరీలో రాసుకున్నారు. ఆ రోజే ఆమె శారదామాతను కలకత్తాలో మొదటిసారి కలుసుకున్నారు. శారదామాత ఆమెను ఖూకీ (చిన్న కూతురు) అని సంబోదిస్తే, మార్గరెట్‌ శారదామాతను ‘అమ్మా’ అనే సంబోధించారు. ఇద్దరి మధ్య ఆ అనుబంధం అలాగే కొనసాగింది. అప్పటికే కలకత్తా చేరుకున్న మెక్‌లౌడ్, ముల్లర్‌ అనే మరో ఆంగ్ల యువతలను కూడా తన కూతుళ్లని చెబుతూ శారదామాత వారితో కలసి భోజనం చేశారు.

నిజానికి అది ఆ కాలానికి ఒక అసాధారణ చర్య. వెలివేతకు దారి తీసేదే. అయినా శారదామాత వారితో సఖ్యంగా ఉన్నారు. నిజానికి మార్చి11న ఒక సంఘటన జరిగింది. కాషాయ రంగు చీర ధరించిన ముల్లర్‌ను గంగ ఒడ్డున  చూసిన స్థానికులు కొందరు వాదానికి దిగారు. కాషాయవస్త్రం ధరించే అధికారం ఒక విదేశీ వనితకు ఎవరిచ్చార ని వారు ప్రశ్నించారు.  వారు చెప్పిన వివరణను బట్టి చివరికి స్థానికులు చల్లబడ్డారు. కానీ ఎంతో శోత్రియ కుటుంబంలో పుట్టిన, రామకృష్ణ పరమహంస వంటి యోగికి భార్య అయిన శారదామాత వారితో కలసి భోజనం చేశారు. తరువాత మార్గరెట్‌ స్వామి వివేకానంద సూచన మేరకు ఆ మార్చి 25న బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నారు. ఆ సమయంలో స్వామి ఆమెకు ఇచ్చిన పేరే నివేదిత. అంటే భగవంతునికి సమర్పించినది అని అర్థం. ‘సోదరి నివేదిత’ అని పిలిచారంతా. ఆ రోజు నుంచి ఆమె భారతదేశం కోసం అవిశ్రాంతంగా శ్రమించారు. వంగ భాష నేర్చుకున్నారు.

ఆ సంవత్సరమే అంటే, నవంబర్‌ 13, 1898న, కాళీపూజ రోజున మార్గరెట్‌ కలకత్తాలోనే బాగ్‌ బజార్‌లో బాలికల కోసం పాఠశాల ఆరంభించారు. బాలికలు, యువతలు గడప దాటడానికి కూడా అంగీకరించని కాలంలో నివేదిత ప్రారంభించిన పాఠశాలకు ఎవరు వస్తారని అంతా ప్రశ్నించారు. కానీ ఆమె ఇంటింటికీ వెళ్లి వారిని ఒప్పించి ఆడపిల్లలను చేర్పించారు. ఈ పాఠశాల నిర్వహణకు నిధులు సమస్యగా ఉండేది. నివేదిత ఏమీ అధైర్య పడకుండా రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా వచ్చే డబ్బును ఆ పాఠశాల కోసం వెచ్చించారు. ఆమె పట్టుదల వెనుక పెద్ద ఉద్దేశమే ఉంది. స్వామి వివేకానంద మార్గరెట్‌ను భారతదేశానికి ఆహ్వానించినదే ఇలాంటి సేవలు అందించడానికి. పైగా ఆ పాఠశాలని నివేదిత కోరిక మేరకు శారదామాత స్వయంగా వచ్చి ప్రారంభించారు.

ఆ మరుసటి సంవత్సరమే కలకత్తా నగరంలో ప్లేగ్‌ వ్యాధి వచ్చింది. ఆ సమయంలో సోదరి నివేదిత ప్రాణాలను సయితం లెక్క చేయక రోగులకు సేవలు చేశారు. అప్పుడే మళ్లీ నివేదిత విదేశీ యాత్రకు వెళ్లి, 1902లో దేశానికి తిరిగి వచ్చారు. జూలై 4న వివేకానంద అంతిమ శ్వాస విడిచారు. ఆయనకి నివాళిగా దేశమంతటా ఏర్పాటు చేసిన సభలలో ప్రసంగాల కోసం పర్యటిస్తూ ఉండగా బెంగాల్‌ విభజన జరిగింది. దీనికి ఆమె తీవ్రంగా స్పందించారు. ఉద్యమం వైపు దృష్టి మళ్లింది. బహుశా తండ్రి తరఫు తాతయ్య, అమ్మ తరఫు తాతయ్య ప్రభావం కూడా ఆమె మీద ఎక్కడో ఉంది. అందుకే ఐర్లాండ్‌ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చారు. నిజానికి భారతదేశానికి వచ్చే ముందు ఆమె ఆశయం–బ్రిటిష్‌ వారికీ, భారతీయులకు మధ్య సయోధ్యను కుదర్చడం ఆమె ఉద్దేశం. అందుకే ఒక భారతీయ స్త్రీ తన సంప్రదాయాన్ని ఎంతగా అభిమానిస్తుందో అదే తీరులో తాను బ్రిటిష్‌ పతాకాన్ని గౌరవిస్తానని ఆమె చెప్పారు. బెంగాల్‌ విభజన తరువాత ఆంగ్ల జాతి మీద ఆమెకు ఉన్న భ్రమలన్నీ తొలగిపోయాయి. 

అరవింద్‌ ఘోష్‌ వంటివారితో, అనుశీలన్‌ సమితితో ఆమెకు ప్రత్యక్ష సంబంధాలు ఉండేవి. మితవాదుల ధోరణి రాజకీయ ప్రయోజనాలను సాధించపెట్టలేదని ఆమె పరోక్షంగా విమర్శించేవారు. కానీ రామకృష్ణ మిషన్‌ సభ్యులు రాజకీయాలలో పాల్గొనడం నిషిద్ధం. అందుకే ఆమె విదేశీ వస్తు బహిష్కరణ, వందేమాతరం ఉద్యమాలను సమర్ధించడం కోసం ఆ సంస్థను వీడుతున్నట్టు బాహటంగానే ప్రకటించారు. ఆ మరుసటి సంవత్సరమే బెంగాల్‌ను కరువు కాటువేసింది. ఆ వెంటనే వరదలు వచ్చాయి. బాధితుల కోసం ఆమె నిరంతరం శ్రమించారు. దీనితో ఆమె మలేరియా బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. 1911 సంవత్సరంలో నివేదిత, ఆమె కొందరు మిత్రులు, జగదీశ్‌ చంద్రబోస్‌ దంపతులు (ఆయన పరిశోధనకు ఆమె గొప్ప స్ఫూర్తిగా నిలిచారు. కలకత్తా వచ్చిన కొత్తలోనే ఆ దంపతులతో ఆమె సాహచర్యం మొదలైంది.) డార్జిలింగ్‌ వెళ్లారు. అక్కడే నివేదిత హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. కొద్దికాలం పాటు అక్కడే ఉండిపోయారు. చివరికి అక్టోబర్‌ 13న అక్కడే కన్నుమూశారు. చివరిగా ఆమె నోటి నుంచి వెలువడిన శ్లోకం...‘‘అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ... ఓం శాంతి శాంతి శాంతిః’

- డా. గోపరాజు నారాయణరావు

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా