నాలో ఎన్నో... ప్రశ్నలు రేపిన రాత్రి!

24 May, 2015 00:22 IST|Sakshi
నాలో ఎన్నో... ప్రశ్నలు రేపిన రాత్రి!

నిద్రలేని రాత్రులు
అది 1971వ సంవత్సరం. నేను అప్పుడు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నాను. అప్పటికి మూడేళ్ల క్రితమే నేనా ఉద్యోగంలో చేరాను. కానీ ఆ ఉద్యోగం నాకు ఎన్నో నిద్ర లేని రాత్రుల్ని మిగులుస్తుందని నేనప్పుడు ఊహించలేదు. ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య పద్నాలుగు రోజుల పాటు హోరాహోరీగా యుద్ధం జరిగింది. దేశం తరఫున అందరం శాయశక్తులా పోరాడాం. చివరికి సంధి కుదిరింది. యుద్ధం ఆగిపోయింది.
 
ఆ రోజు రాత్రి నేను బిల్లెట్‌లో (బిల్లెట్ అంటే విపత్కర సమయాల్లో సైనికులు ఉండే తాత్కాలిక నివాసం) పడుకుని ఉన్నాను. ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. నిద్రించడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ బిల్లెట్‌లోని ఓ మూలకి చూశాను. ఒక్కసారిగా మనసు చివుక్కుమంది. అక్కడ నా స్నేహితుడు నారాయణన్ ఉండాలి. కానీ లేడు. ఏదో దిగులు కమ్మేసింది నన్ను. నారాయణన్ తమిళనాడుకు చెందినవాడు. మరో ఐదు రోజుల్లో అతని పెళ్లి. దానికి రమ్మని మమ్మల్ని రోజూ పోరేవాడు.

‘మా ఊరు చాలా అందంగా ఉంటుంది, బోలెడన్ని పక్షులు వలస వస్తాయి, అవన్నీ చూడాలంటే మా ఊరు రావాలి, అందుకు నా పెళ్లే తగిన సందర్భం, మీరంతా రావాల్సిందే’ అంటూ రోజూ పోరేవాడు. కానీ ఇప్పుడు తను లేడు. నారాయణన్ మాత్రమే కాదు... గురు మీత్‌సింగ్ కూడా లేడు. పంజాబ్ నుంచి వచ్చి ఎయిర్‌ఫోర్స్‌లో చేరాడు గురుమీత్. తన ముసలి తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలని కలలు కనేవాడు. వచ్చే భార్య వాళ్లని ఆదరిస్తుందో లేదోనని పెళ్లి కూడా చేసుకోననేవాడు. అతను ఏడి? ఎక్కడున్నాడు? ఎవరి కోసమైతే బతికాడో ఆ తల్లిదండ్రుల్ని వదిలేసి ఎలా వెళ్లిపోగలిగాడు?
 
మా స్వామి కూడా లేడు. నేను ఎయిర్‌ఫోర్స్‌కి వెళ్లినప్పుడు ఆయనే నా తొలి గురువు. ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, బాధ్యతల్ని ఎలా నిర్వర్తించాలో... అన్నీ నేర్పాడు. నువ్వు ఇంకా బాగా చదువుకుని ఎయిర్‌ఫోర్స్‌లోనే మంచి పొజిషన్‌కి చేరుకోవాలి అంటుండేవాడు. ఇకమీదట అలా చెప్పడానికి తను లేడు. కదన రక్కసి పాదాల కింద పడి నలిగిపోయాడు. అందరినీ వదిలి వెళ్లిపోయాడు. సరిగ్గా అంతకు కొన్ని రోజుల ముందే స్వామికి కూతురు పుట్టింది. తనని ఇంకా చూసుకోనే లేదు.

‘యుద్ధం అయిపోగానే నా పాపను చూడ్డానికి వెళ్తాను, తనని బాగా పెంచుతాను, డాక్టర్‌ని చేసి ఎయిర్ ఫోర్సులోనే చేర్పిస్తాను’ అంటూ తన కూతురి భవిష్యత్తు గురించి కలలు కనేవాడు. ఆ కలల గురించి ప్రతిక్షణం కలవరించేవాడు. కానీ అతని కలలు నిజం కాలేదు. అతని కూతురి కోసమైనా మృత్యువు స్వామి మీద జాలి పడలేదు.
 
బిల్లెట్‌లో ఎక్కడ చూసినా వాళ్లే కనిపిస్తున్నారు. అక్కడే తిరుగుతున్నారు. నవ్వుతున్నారు. నన్ను పలకరిస్తున్నారు. కబుర్లు చెబుతున్నారు. కన్నుమూసి తెరిచేలోగా మాయమవుతున్నారు. వారిని గూర్చిన తలపుల భారాన్ని మోయలేకపోయాను. వాళ్లు లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయాను. ఆ రాత్రి క్షణమొక యుగంలా గడిచింది.
 అది మాత్రమే కాదు... క్షణమైనా కన్నంటుకోనీయకుండా నన్ను చిత్రవధ చేసిన ఆ రాత్రి... నాలో చాలా ప్రశ్నల్ని కూడా రేపింది.

ఎవరి మధ్య జరిగింది యుద్ధం! దేశాల మధ్య జరిగిందా? లేదు. పాకిస్తాన్ అక్కడే ఉంది. ఇండియా ఇక్కడే ఉంది. అవి నేరుగా తలపడలేదు. నాయకుల మధ్య జరిగిందా? లేదు. వాళ్లు కూడా ఎక్కడివాళ్లక్కడ బాగానే ఉన్నారు. సుఖంగా ఉన్నారు. మరి ఎవరి మధ్య జరిగింది? అహంకారాల మధ్య జరిగింది. తమ అహాలను ప్రదర్శించడానికి జరిగింది. దానివల్ల ఏం జరిగింది? నాలాంటి కొందరి గుండెల్లో శూన్యం మిగిలింది. కొందరు తల్లిదండ్రులకి కడుపుకోత మిగిలింది. కొందరు పిల్లలకు తండ్రి ప్రేమ దూరమయ్యింది.

కొన్ని కుటుంబాల్లో చీకటి పరచుకుంది.     పాకిస్తాన్‌తో సంధి కుదుర్చుకున్న మన ప్రభుత్వం వేలమంది సైనిక బలగాన్ని తీసుకెళ్లి సగర్వంగా పాకిస్తాన్ చేతుల్లో పెట్టింది. కానీ పోయిన సైనికుల ప్రాణాల్ని వెనక్కి తీసుకు రాలేకపోయింది. నా స్నేహితులను నాకు మళ్లీ చూపించలేకపోయింది. నాటి జ్ఞాపకాలను మర్చిపోలేక ఇప్పటికీ నిద్ర లేని రాత్రులు గడుపుతున్న నా కంటి మీదికి కునుకును తీసుకు రాలేకపోయింది.
- ఫన్‌డే టీమ్

మరిన్ని వార్తలు