అవే లేకుంటే... తీపి గుర్తులు ఎక్కడివి..?

5 Jul, 2015 01:01 IST|Sakshi
అవే లేకుంటే... తీపి గుర్తులు ఎక్కడివి..?

నిద్రలేని రాత్రులు
ఆ నిద్రలేని రాత్రులే లేకుంటే, చెప్పుకోవడానికి తీపి గుర్తులెక్కడివి..?
బహు భాషా నటిగా వరుస షూటింగ్‌లతో నిద్రలేని రాత్రులు చాలానే ఉన్నాయి.
అలాంటి నిద్రలేని రాత్రులలో ముఖ్యంగా చెప్పుకోదగినవి ముచ్చటగా మూడున్నాయి.

 
హీరోయిన్‌గా నాకు బ్రేక్ ఇచ్చిన చిత్రాల్లో ఒకటైన ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’లో నేనే చేయాలని దర్శక నిర్మాతలు పట్టుబట్టారు. అప్పటికే వాణిశ్రీ రంగస్థలంపై 150 సార్లు విజయవంతంగా ప్రదర్శించిన క్యారక్టర్ అది. ఆ నాటకం ఆధారంగా తయారవు తున్న చిత్రం కావడంతో ఆసక్తి కలిగింది. అప్పటికే ‘ప్రయాణంలో పదనిసలు’ చిత్రానికి కేటాయించిన కాల్షీట్స్ నుంచి పదహారు రోజులు మాత్రమే సర్దగలనని చెప్పాను. సరేనన్నారు.

యానాం తీరంలో గోదావరి ఒడ్డున గుడిసె సెట్‌లో షెడ్యూల్ మొదలైంది. అదే సమయంలో గోదావరి మరో ఒడ్డున జరుగుతున్న ‘ప్రయాణంలో పదనిసలు’ షూటింగ్‌లో పాల్గొనాల్సిన పరిస్థితి. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు లాంచీలో తిరుగుతూ రెండు చిత్రాలకూ రాత్రింబవళ్లు పనిచేశాను. చెన్నై మహా లింగపురంలో ఇంటి నిర్మాణం పనుల్లో అమ్మ జయశ్రీ బిజీగా ఉండటంతో అమ్మమ్మ సుబ్బలక్ష్మిని తోడుగా పెట్టుకొని గడిపాను. ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’లో మాస్... ‘ప్రయాణంలో పదనిసలు’లో క్లాస్ వేషధారణ.

గోదావరి రెండు తీరాల మధ్య లాంచీలో ప్రయాణించే సమయాన్నే మేకప్‌కు కేటాయించాను. లాంచీలో ఇటూ అటూ తిరుగుతూ మేకప్ మార్చుకుంటున్న సమయంలోనే నా చేతికి ఉన్న ఒక బంగారు గాజు గోదావరిలో పడి పోయింది. గోదావరి తల్లికి సమర్పించు కున్నానని సంతోషించాను. షూటింగ్ స్పాట్‌లో ఒక పెంకుటింట్లో బస. రాత్రి రెండు గంటల వరకు షూటింగ్ జరిగేది. మళ్లీ ఉదయాన్నే ఆరు గంటలకు షూటింగ్ కోసం వేకువన నాలుగు గంటలకే నిద్ర లేవాల్సి వచ్చేది. దాదాపు ఆ పదహారు రోజులూ నాకు నిద్రలేని రాత్రులే! ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ ఘనవిజయం ఆ కష్టాన్ని మరిపించింది.
   
కర్ణాటకలో రామానంద్‌సాగర్ హిల్స్‌లో ‘హుళి హాలిన మేపు’ చిత్రం కోసం నాకు, ‘కన్నడ కంఠీరవ’ రాజ్‌కుమార్‌కు మధ్య డ్యూయెట్ చిత్రీకరిస్తున్నారు. ఆ షూటింగ్ పూర్తయ్యాక, మర్నాడే హైదరాబాద్‌లో హీరో కృష్ణతో ‘ముత్తైవ’ చిత్రం షూటింగ్‌కు హాజరు కావాల్సి ఉంది. అదే సమయంలో జోరున వర్షం మొదలైంది. రాత్రివేళ ఆ వర్షంలోనే ఊటీకి, ఊటీ నుంచి కోయంబత్తూరు, కోయంబత్తూరు నుంచి చెన్నై, అక్కడి నుంచి హైదరాబాద్ కు చేరుకున్నాను.

చెన్నైలో విమానం తలుపులు మూసేస్తున్న సమయంలో మైకులో అనౌన్స్ చేయించి, విమానంలోకి చేరుకోగలిగాను. హైదరాబాద్ చేరేలోగా విమానంలోనే రెడీ అయి, సకాలంలో షూటింగ్ స్పాట్‌కు చేరుకున్నాను. మళ్లీ తెల్లారితే చెన్నై చేరుకోవాలి. నా తొలి చిత్రానికి దర్శకత్వం వహించిన కె.ఎస్.గోపాలకృష్ణన్ ‘నాయకరిన్ మగళి’ ప్రారంభోత్సవం... అందులో నేనే హీరోయిన్. పైగా నాకది నూరో చిత్రం. హైదరాబాద్‌లో షూటింగ్ ముగించుకుని, తెల్లారేసరికి చెన్నై చేరుకుని, తమిళచిత్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్నాను. కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కన్నడ, తెలుగు, తమిళ చిత్రాల షూటింగ్‌లలో పాల్గొనేందుకు నిద్రలేని రాత్రులు గడిపాను.
   
రష్యాలో 1976లో జరిగిన ఫిలిం ఫెస్టివల్‌కు ‘సోగ్గాడు’ చిత్ర బృందమంతా హాజరయ్యాం. మొత్తం పదిరోజులకు వారం రోజులే ఉండగలనని యూనిట్ పెద్దలకు చెప్పాను. ఎన్టీఆర్ హీరోగా ‘మాదైవం’ షూటింగ్‌కు రష్యా నుంచి బయలుదేరాను. ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా రష్యా నుంచి కాబూల్, ఢిల్లీ, చెన్నైల మీదుగా హైదరాబాద్‌కు సకాలానికి చేరుకున్నాను. అలాంటి నిద్రలేని రాత్రులే ఆ రోజుల్లో నాకు క్రమశిక్షణ గల నటిగా పేరుతెచ్చాయి.
- కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై

మరిన్ని వార్తలు