స్నాక్ సెంటర్

12 Jun, 2016 01:29 IST|Sakshi
స్నాక్ సెంటర్

స్వీట్ పొటాటో కార్న్ కేక్
కావలసినవి: ఉడికించిన స్వీట్ పొటాటో - 2, తరిగిన ఉల్లిపాయలు -1 టేబుల్ స్పూన్, గుడ్డు తెల్ల సొన - 2 టీ స్పూన్లు (కావాలనుకుంటేనే), ఉడికించిన స్వీట్‌కార్న్ గింజలు - అర కప్పు, పాలకూర తరుగు - అర కప్పు, ఉప్పు - 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్, తరిగిన కొత్తిమీర - పావు కప్పు, నూనె - తగినంత
 
తయారీ: ఒక బౌల్‌లో ఉడికించిన స్వీట్ పొటాటోలను చిదుముకోవాలి. అందులో ఉడికించిన స్వీట్‌కార్న్ గింజలు, ఉల్లిపాయలు, గుడ్డు తెల్ల సొన, పాలకూర తరుగు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. మిశ్రమం గట్టిగా ఉంటే.. కొన్ని నీళ్లు పోసి చపాతీ ముద్దలా చేసుకోవాలి.

ఇప్పుడు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని, ఫొటోలో కనిపిస్తున్న షేపులో ఒత్తుకోవాలి. తర్వాత స్టౌ పై పెనం పెట్టి వేడి చేయాలి. అది వేడెక్కాక రెండు మూడు బిళ్లలను ఒకేసారి పెనంపై పెట్టి కాల్చుకోవచ్చు. నూనెను కొద్దికొద్దిగా వేసుకుంటూ రెండువైపులా కాల్చుకోవాలి. పెరుగు లేదా సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి. కావాలనుకుంటే నిమ్మకాయ కూడా  పిండుకోవచ్చు.
 
పచ్చి మామిడి పకోడి..
కావలసినవి: పచ్చి మామిడికాయ -1, తరిగిన ఉల్లిపాయలు - పావు కప్పు, శనగపిండి - 1 కప్పు, అల్లం- పచ్చిమిర్చి పేస్ట్ (రెండింటినీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి)- 2 టేబుల్ స్పూన్లు, తరిగిన కొత్తిమీర - పావు కప్పు, ఉప్పు - తగినంత, నూనె - కావలసినంత
 
తయారీ: ముందుగా మామిడికాయ తొడిమ తీసి, అడ్డంగా రెండు ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలోని టెంకను తొలగించి సన్నని చక్రాల్లా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఓ పెద్ద బౌల్‌లో శనగపిండి, ఉల్లిపాయలు, అల్లం-పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి. తర్వాత అందులో నీళ్లు పోసి గట్టిగా లేకుండా చేసి పావుగంటసేపు పక్కన పెట్టుకోవాలి. మరోవైపు స్టౌ పైన ప్యాన్ పెట్టి నూనె పోయాలి. అది వేడెక్కాక ఒక్కో మామిడికాయ ముక్కను ఆ మిశ్రమంలో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. పుల్లగా.. కారంగా.. పకోడీలు భలేగా ఉంటాయి.. మరి ఆలస్యం దేనికి? వెంటనే ట్రై చేయండి.
 
యాపిల్ ఫ్రిట్టర్స్
కావలసినవి: వెజిటబుల్ ఆయిల్ - కావలసినంత, మైదా పిండి - ఒకటిన్నర కప్పులు, పంచదార - 1 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ - 2 టీ స్పూన్లు, ఉప్పు - అర టీ స్పూన్, గుడ్లు - 2, సన్నగా తరిగిన యాపిల్ - 3 కప్పులు, దాల్చినచెక్క-పంచదార (రెండింటినీ కలిపి పొడి చేసుకోవాలి) - 2 టీ స్పూన్లు
 
తయారీ: ఒక బౌల్‌లో మైదా పిండి, పంచదార, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి కలపాలి. అందులో రెండు గుడ్లను కొట్టి పోయాలి. అలాగే పాలు, కొద్దిగా నూనె కూడా పోసి కలపాలి. ఇప్పుడు మిశ్రమానికి యాపిల్ తరుగు కలిపి పావుగంటసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పైన ప్యాన్ పెట్టి, నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆపైన యాపిల్ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని గారెల్లా ఒత్తుకొని డీప్‌ఫ్రై (లేదా పెనంపై కాల్చుకోవచ్చు) చేసుకోవాలి. ఫ్రిట్టర్స్ అన్నీ పూర్తయ్యాక, వాటిని ఓ ప్లేట్‌లోకి తీసుకోవాలి. వాటిపై దాల్చినచెక్క - పంచదార చల్లి సర్వ్ చేసుకోవాలి.

మరిన్ని వార్తలు