చివరికి మిగిలింది!

17 Dec, 2017 00:04 IST|Sakshi

 ∙లాఫింగ్‌ గ్యాస్‌

ఎన్‌ఆర్‌ఐ చిన్నారావుకి మళ్లీ వెనక్కి వెళ్లాలనిపించలేదు. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయాలనిపించనూ లేదు. సెలవులు గడపడానికి హైదరాబాద్‌కు వచ్చిన  చిన్నారావు మార్నింగ్‌ షో నుంచి సెకండ్‌ షో వరకు ఎన్నో తెలుగు సినిమాలు చూశాడు. ఆ జోష్‌లో ‘నేనెందుకు డైరెక్టర్‌  కాకూడదు?’ అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం  రంగంలోకి దిగాడు. నిర్మాత మరియు దర్శకుడి అవతారం  ఎత్తాడు. తన తొలి ప్రెస్‌మీట్‌లో ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు...‘‘ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని సబ్జెక్ట్‌ ఇది. కథ విషయానికి వస్తే పూజా అనే అమ్మాయిని కూజ అనే అబ్బాయి ప్రేమిస్తాడు. హీరో పేరు కూజ  ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? హీరో పూర్తి పేరు కూరపాటి జయంత్‌. షార్ట్‌కట్‌లో కూజ అని పిలుస్తుంటారు. పూజా వాళ్ల డాడీ పేరు బాడి...అతని పూర్తి పేరు బాపయ్య డింగరి...షార్ట్‌ కట్‌లో ‘బాడి’ అని పిలుస్తుంటారు. తన కూతురును కూజ ప్రేమించడం ఈ ‘బాడి’కి నచ్చదు.  ఈ కోపంతో ‘కూజ’ డెడ్‌బాడీని తీసుకురమ్మని గూండాలను టాటా సుమోల్లో పంపుతాడు. ఇలా ఎన్నో కుట్రలను తట్టుకొని పూజా–కూజ ఒక్కటవుతారు. ప్రేమ గెలుస్తుంది. వారికి మానసిక సంతృప్తి మిగులుతుంది. అందుకే సినిమా పేరు ‘చివరకు మిగిలింది’ అని పెట్టాను’’ మరుసటి రోజు అబ్బులు అనే యువకుడు ఫిలింఛాంబర్‌ ముందు ధర్నాకు దిగాడు. చిన్నారావుపై  నిప్పులు చెరుగుతూ ప్రసంగించడం మొదలుపెట్టాడు... ‘‘నిన్న చిన్నారావు అనే డైరెక్టర్‌ ప్రెస్‌మీట్‌లో చెప్పిన కథ నాదే. నా కథను కాపీ కొట్టి చివరికి మిగిలింది అనే సినిమా తీస్తున్నాడు. ఇది అన్యాయం, అక్రమం. ఇలా నాలాంటి కొత్త రచయితలను అణగదొక్కవచ్చా అని ప్రశ్నిస్తున్నాను’’ ‘‘ఇంతకీ నీ కథ ఏమిటి?’’ అని అడిగాడు అక్కడున్న ఒక వ్యక్తి.

‘‘నా కథలో రోజా అనే అమ్మాయిని  రాజా  అనే అబ్బాయి ప్రేమిస్తాడు.  హీరోయిన్‌ తండ్రికి వీరి లవ్‌ ఎఫైర్‌ నచ్చక పది ట్రాక్టర్‌లలో గూండాలను పంపి దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు... అయినా సరే వారు ఒక్కటవుతారు. వారి ప్రేమ జయిస్తుంది. సదరు చిన్నారావు రోజాకు బదులు పూజ అని, రాజాకు బదులు కూజ  అని పేర్లు  మార్చుకున్నాడు. గూండాలు ట్రాక్టర్లలో వెళ్లి హీరోపై  ఎటాక్‌  చేస్తారు అని నేను రాసుకుంటే, దాన్ని టాటాసుమోలుగా మార్చాడు. ఇంతకంటే పచ్చి కాపీ మరొకటి ఉంటుందా!’’అబ్బులు గోల భరించలేక ఈ వివాదంపై ఒక నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు సినీ పెద్దలు. రెండు రోజుల తరువాత ఆ కమిటీ చీఫ్‌ ఇలా తీర్పు చెప్పాడు...‘‘రెండు కథల్ని క్షుణ్ణంగా పరిశీలించాము. రెండు కథలు ఒకేలా ఉన్నాయి. అసలు  ఈ రెండు కథలని ఏమిటి? మన సినిమా కథలన్నీ ఇలాగే ఉంటాయి. ఒక విలన్‌ తప్పనిసరిగా ఉంటాడు. అతనికొక కూతురు తప్పనిసరిగా ఉంటుంది. ఆ కూతురును బీదింటి కుర్రాడొకడు తప్పనిసరిగా లవ్‌ చేస్తాడు. ఈ కుర్రాడి మీద  ఆ విలన్‌ తప్పనిసరిగా దాడి చేస్తాడు. అయినా సరే... ఆ జంట తప్పనిసరిగా ఒక్కటవుతుంది.... ఈ తప్పనిసరి ఫార్ములా ఉన్నంత వరకు ఏ కథ దేనికి కాపీ కాదు...అన్నీ ఒకేలా అనిపిస్తాయి’’మొదటి గండం నుంచి బయట పడ్డాడు  చిన్నారావు. ఊపిరి పిల్చుకునే లోపే మరో ఉపద్రవం ముంచుకొచ్చింది.‘చివరకు మిగిలింది’ టైటిల్‌ నాదే అంటూ రాబోయే కాలంలో కాబోయే నిర్మాత కామేశ్‌  కోర్టుకెక్కాడు.

‘‘చివరకు మిగిలింది అనే టైటిల్‌ నాకు తెగ నచ్చేసింది. కానీ ఇంతకుముందే ఎవరో టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించుకున్నారట. ఏమిటి పరిష్కారం?’’ అని సినిమా ఫీల్డ్‌లో తలపండిన సీనియర్‌ నిర్మాతను సలహా అడిగాడు చిన్నారావు.‘‘చాలా సింపుల్‌. టైటిల్‌కు ముందు నీ పేరు చేర్చితే సరిపోతుంది. అయితే నీ పేరు టైటిల్‌ మీద కనిపించీ కనిపించనట్లు ఉండాలి. నీ పేరు పుణ్యమా అని టైటిల్‌ కొత్తది అవుతుంది. అది నీదే అవుతుంది. ఒక డైరెక్టర్‌గా  ఈ సినిమా వల్ల నీకు గొప్పతృప్తి మిగులుతుంది కాబట్టి ఇక నీ  సినిమా పేరు ‘చిన్నారావుకి చివరికి మిగిలింది’ అని పెట్టు’’ అని సలహా ఇచ్చాడు. అలాగే చేశాడు చిన్నారావు.ఆరేడు నెలల్లో సినిమా పూరై్త... ఒక శుక్రవారం రోజు విడుదల కూడా అయింది. చిన్నారావుకు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి.కొంతమంది వ్యక్తులు ప్రెస్‌మీట్‌ పెట్టి ‘చివరకు మిగిలింది’ డైరెక్టర్‌ మీద విరుచుకుపడుతున్నారు. ఒకవ్యక్తి కోపంగా మైక్‌ అందుకొని...‘‘ఈ సినిమాలో ‘తాట తీస్తా నా కొడుకా’ అనే డైలాగ్‌ ఉంది. ఈ డైలాగ్‌ మా మనోభావాలను భయంకరంగా దెబ్బతీసింది. తాట అంటే మీకు అంత చిన్నచూపా? అదేమన్నా చెప్పులో ముళ్లా, చెవులో పువ్వా  తీయడానికి... గుర్తుంచుకోండి తాట అంటే గుండ్రాయి కాదు... అంతెత్తు కొండ. ఎవడు కదలించలేడు. ఆకాశంలో తారలు ఉన్నంత వరకు ఈ భూమి మీద తాట ఉంటుంది...తాటను టచ్‌ చేయాలనుకోకండి... తట్టుకోలేరు’’ అంటూ  ఆవేశంగా ప్రసంగించాడు.

ఈలోపు ఒక టీవీ రిపోర్టర్‌ బుర్ర గోక్కుంటూ... ‘‘అయ్యా... తాట తీస్తా అనే డైలాగ్‌కు మీ మనోభావాలు దెబ్బతినడానికి సంబంధం ఏమిటో అప్పటి నుంచి ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు’’ అన్నాడు.అప్పుడు ఆ గుంపులో ఒకరు ఇలా బదులిచ్చారు...‘‘తాట అనేది మా అప్పడాల కంపెనీ పేరు’’‘‘అప్పడాల కంపెనీకి తాట అని పేరు పెట్టడం ఏమిటండీ?’’ మరోసారి ఆశ్చర్యంగా అడిగాడు టీవీ రిపోర్టర్‌.అప్పుడు ఆ గుంపులో మరొకరు ఇలా బదులు ఇచ్చారు...‘‘మా కంపెనీ పేరు ‘టేస్టీ హాట్‌ అమెజింగ్‌ ట్రెమండస్‌ అప్పడాలు’ షార్ట్‌కట్‌గా తాట అయింది. ఈ పేరుతోనే ఫేమస్‌ అయింది. ఎన్నో సంవత్సరాలుగా భోజనప్రియులను అలరిస్తున్న మా తాటను తీస్తాననడం ఎంత వరకు సమంజసం? ఇది మా మనోభావాలను దెబ్బతీసినట్లు కాదా?’’ తాట కంపెనీ వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక ‘తాట తీస్తా’ డైలాగును సినిమా నుంచి తీసేశారు.ప్రేక్షకుల ఆరోగ్యం మీద ప్రేమతో ‘చివరకు మిగిలింది’ వారం తిరిగేలోపే థియేటర్ల నుంచి తిరుగుపయనమైంది. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి రావడంతో...మళ్లీ అమెరికాకు ప్రయాణమయ్యాడు చిన్నారావు. వెళ్లేముందు ఒకసారి తన సినిమా పోస్టర్‌ చూసుకోవాలనిపించింది.  ఇంట్లో గోడకు అతికించిన ఆ పోస్టర్‌ వైపు ఒకసారి  చూశాడు.పోస్టర్‌లో ‘చిన్నారావుకు చివరికి మిగిలింది’ అనే టైటిల్‌ కింద ‘చిప్ప’ అని రాసి విషాదంగా నవ్వుకున్నాడు చిన్నారావు.
– యాకుబ్‌ పాషా  

>
మరిన్ని వార్తలు