కొనసాగుతున్న దురాచారం

19 Jan, 2020 03:55 IST|Sakshi

నాగరిక సమాజాన్ని కూడా పట్టి పీడిస్తున్న దురాచారం జోగిని. ఇప్పుడు దీన్ని నేరంగా పరిగణిస్తున్నా మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ వంటి చోట్ల ఇంకా ఈ అనాచారం కొనసాగుతూనే ఉంది. ఈ నేరానికి ఆయువుపట్టు పేదరికం, సాంఘిక నిమ్నతలే. వయసొచ్చిన ఆడపిల్లను దేవుడికి అంకితం చేయడం పేరుతో ఆమెను లైసెన్స్‌డ్‌ వేశ్యగా మార్చడం అన్నమాట. పల్లెల్లో ఈ నేరంబారిన పడి చాలామంది ఆడపిల్లల జీవితాలు నాశనమవుతన్నాయి. దీన్ని రూపుమాపడానికి ప్రభుత్వాలు చట్టాలు తెచ్చిన యథేచ్చగా రాజ్యమేలుతూనే ఉంది.

ట్రాఫికింగ్‌.. ప్రాస్టిట్యూషన్‌
‘పట్నంలో నీ బిడ్డకు మంచి పని ఉంది.. నెలకు పదిహేనే వేలరూపాయల దాకా సంపాదించుకోవచ్చు... ఉండడానికి ఇల్లు, తిండి అన్నీ వాళ్లే ఇస్తారు’ అంటూ  పట్నం పోయి బాగా డబ్బు సంపాదించుకున్న ఊరి కుర్రాడో, లేక ఆ ఊరి నడివయసు మహిళో  పేదరికంలో మగ్గుతున్న కుటుంబాల్లో ఆశను రేకెత్తిస్తారు. అమ్మానాన్నలు ఆ ఇంటి ఆడపడచును వీళ్లతో పట్నం బస్‌ ఎక్కిస్తారు. ఆ పిల్ల పుణె రెడ్‌లైట్‌ ఏరియాలోనో, ముంబై కామటిపురాలోనో.. కోల్‌కత్తా సోనాగంచ్‌లోనో తేలుతుంది. ఇవే ట్రాఫికింగ్, వ్యభిచార నేరాలు. రెండూ ఒకదానికొకటి అనుసంధానమైన భూతాలు. రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్‌ భారతాన్ని పట్టిపీడిస్తున్న పిశాచాలు. వీటిని అరికట్టడానికి మన దగ్గరున్న చట్టాలకు కొదవలేదు. కాని అమలు చేసే చిత్తశుద్ధికి కొరత. అందుకే యేటా వేలమంది ఆడపిల్లలు ఈ నేరం కొరలకు చిక్కి చీకటికూపాల్లో మగ్గుతున్నారు.

కనిపించని నేరాలు...ఇంట్లోనే చాలా కనపడతాయి..
►చిన్నపిల్లలను సెక్సువల్‌ అబ్యూజ్‌కి గురిచేయడం దగ్గర్నుంచి డొమెస్టిక్‌ లేబర్‌ను వేధించడం వరకు. అయితే ఇవి ఇప్పుడు చట్టం పరిధిలోకి వచ్చాయి.
►భవన నిర్మాణాలు, ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలు, బీడీ కంపెనీలు,పొలాలు వంటి చోట్ల దగ్గర మహిళా కార్మికులు, మహిళా శ్రామికులను శారీరకంగా, మానసికంగా వేధించడం (కులం పేరుతో, శారీరక రంగు, రూపు గురించి తులనాడడం, తిట్టడం, చేయి చేసుకోవడం, కోరిక తీర్చమని అడగడం) నేరమే.
►పబ్లిక్‌టాయ్‌లెట్స్‌ లేకపోవడం, ఉన్నా వాటిలో సరైన వసతులు అంటే వాటికి తలుపులు లేకపోవడం, ఉన్నా బోల్టులు లేకపోవడం, కింద నేల కనిపించేలా తలుపులు ఉండడం, కంతలు, సందులు ఉండడం,  టాయ్‌లెట్లలో నీటి వసతి, మగ్గులు, బకేట్లు లేకపోవడం, నిర్వహణ (పరిశుభ్రత వగైరా) సరిగా లేకపోవడం వంటివన్నీ నేరాలే.
►అంతేకాదు పబ్లిక్‌ టాయ్‌లెట్లలో గోడల మీద స్త్రీల ప్రైవేట్‌ పార్ట్‌ బొమ్మలు వేయడం, పిచ్చి రాతలు రాయడం, అసభ్యకరమైన గీతలు గీయడం వంటివి అన్నీ నేరాలే.
►అలాగే ఇలాంటి పబ్లిక్‌ టాయ్‌లెట్స్‌ దగ్గర కాపలాదారు లేకపోవడం వంటివి. 

ఇవన్నీ కూడా 354సి నిర్భయ చట్టం కింద వర్తించే నేరాలు
►పాఠశాలలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండులు, ఇతర పబ్లిక్‌ ప్రదేశాల్లో మహిళలకు సరైన మరుగుదొడ్ల వసతి లేకపోవడం నేరమే.
►అలాగే మహిళలకు నాప్‌కిన్స్‌(నెలసరి ప్యాడ్స్‌) అందుబాటులో లేకపోవడం కూడా నేరమే. 
►షాపింగ్‌మాల్స్‌లోని ట్రయల్‌రూమ్స్‌లో, టాయ్‌లెట్స్‌లలో అలాగే సినిమాహాల్స్‌ వంటి పబ్లిక్‌ ప్రదేశాల్లోని టాయ్‌లెట్స్‌లలో రహస్య కెమెరాలు పెట్టడం నేరం. దీన్ని వాయొరిజం కింద పరిగణిస్తారు. 
►బస్సుల్లో, ఇతర రద్దీ ప్రదేశాల్లో స్త్రీలను తాకడం, అసభ్యకరంగా మాట్టాడడం, అసభ్యకర సైగలు చేయడం, స్త్రీలకు పురుషులు తమ ప్రైవేట్‌ పార్ట్స్‌ చూపించడం, అలాగే కార్యాలయాల్లో ఉద్యోగినుల పట్ల  అమర్యాదగా ప్రవర్తించడం, వారిని తూలనాడడం, వేధించడం, సెక్సువల్‌గా అబ్యూజ్‌ చేయడం, వారిని అవమానించడం వంటివన్నీ నేరాలే.  354, 509  విమెన్‌ ఇన్‌సల్టింగ్‌ సెక్షన్ల కింద వీటికి శిక్ష ఉంటుంది. 
►ఇక పబ్లిక్‌ ప్రదేశాల్లో అమ్మాయిల మీద కన్నేయడం, వెంబడించడం, ఈవ్‌టీజింగ్, వంటివన్నీ నేరాలన్న సంగతి విదితమే. 
►అంతేకాదు ఇంట్లో కూడా స్త్రీలను, ఈడు వచ్చిన అమ్మాయిలను తాత మొదలుకొని తండ్రి, అన్న, బాబాయ్, పెద్దనాన్న, మేనమామ ఇలాంటి వాళ్లెవరైనా పరుషపదజాలంతో తిట్టడం, వ్యక్తిగత స్వేచ్ఛ హరించేలా తీవ్రమైన నిఘా పెట్టడం, శీలరక్షణ పేరుతో వాళ్లను కట్టడి చేయడం, శీలంపేరుతో వాళ్ల ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడడం వంటివన్నీ నేరాలే గృహహింస చట్టం కింద.  అలాగే ఇంట్లో ఆడపిల్లలను అబ్బాయిలతో పోల్చి తిట్టడం, చులకన చేయడం, వివక్ష చూపించడం  వంటివీ నేరాలే.

మ్యారిటల్‌ రేప్‌
దీన్ని జస్టీస్‌ వర్మ కమిటీ 376(బి) నిర్భయ చట్టం కింద నేరంగా పరిగణించాలని సూచించింది. కానీ దీనివల్ల భారతీయ వివాహ, కుటుంబ వ్యవస్థలు బీటలు వారుతాయని రాజకీయ పక్షాలు ఆమోదించలేదు. కాని విడాకులు తీసుకున్న భార్యను, లేదా భర్త నుంచి విడిగా ఉంటున్న ఇల్లాలిని భర్త బలవంతం చేస్తే రేప్‌గా పరిగణించాలని మాత్రం నిర్ణయించారు. ∙ వివాహబంధంలో ఉన్న భర్త ..భార్య మానసిక, శారీరక పరిస్థితి తెలుసుకోకుండా ఆమెను ఇబ్బంది పెట్టడం, బలవంతం చేయడం క్రూయల్టీ కింద పరిగణించే నేరమే.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో మహిళా భద్రత
గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రస్తుతం మూడు పోలీసు కమిషనరేట్లు ఉన్నాయి.  అవి: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ. ‘గ్రేటర్‌’ జనాభా 1.17 కోట్లు. హైదరాబాద్‌ మహానగరంలో మహిళల రక్షణ కోసం మూడు కమిషనరేట్లూ చొరవ తీసుకుంటూ పలు చర్యలు చేపడుతున్నా, నగరంలో మహిళల పట్ల నేరాలు జరుగుతూనే ఉన్నాయి.  మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం 2014లో అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ స్వాతి లక్రా నేతృత్వంలో ప్రత్యేకంగా ‘షీ టీమ్స్‌’ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోను మొత్తం 300 షీ టీమ్స్‌ పనిచేస్తున్నాయి. షీ టీమ్స్‌లో 1500 మంది మహిళా పోలీసులు పనిచేస్తున్నారు. మహిళలకు మరింత భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం 2019లో ‘విమెన్‌ సేఫ్టీ వింగ్‌’ను కూడా ఏర్పాటు చేసింది. అదే ఏడాది ఎన్‌ఆర్‌ఐ భర్తల ఆగడాలను అరికట్టేందుకు ‘ఎన్‌ఆర్‌ఐ సెల్‌’ను ఏర్పాటు చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మూడు కమిషనరేట్లలోనూ కలుపుకొని 2015–19 సంవత్సరాల మధ్య కాలంలో మహిళలకు సంబంధించిన నేరాలపై 19,270 కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్‌ షీ టీమ్‌ వాట్సప్‌ 9490616555, సైబరాబాద్‌ షీ టీమ్‌ వాట్సప్‌ 9490617444, రాచకొండ షీ టీమ్‌ వాట్సప్‌ 9490617111

బాలల భద్రత కోసం ‘బాలమిత్ర
బాలల భద్రత కోసం సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ 2019లో ‘బాలమిత్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాఠశాలలకు వెళ్లే బాలబాలికలకు చిన్నప్పటి నుంచి ఎవరితో ఎలా మెలగాలో చెబితే ఆదిలోనే చెడు పోకడలను అరికట్టవచ్చనే ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమం పిల్లలకు, షీ టీమ్స్‌కు మధ్య వారధిగా పనిచేస్తోంది. ‘బాలమిత్ర’ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత దీని ద్వారా బాలలపై వేధింపులకు సంబంధించి 42 కేసులు నమోదయ్యాయి. ‘బాలమిత్ర’ హెల్ప్‌లైన్‌: 9490617444

షీ ఫర్‌ హర్‌తో ఈవ్‌ టీజింగ్‌కు చెక్‌
ఈవ్‌ టీజింగ్‌ను, కళాశాలల్లో విద్యార్థినులపై ర్యాగింగ్‌ వేధింపులను అరికట్టడానికి రాచకొండ పోలీసు కమిషనరేట్‌ 2017లో ‘షీ ఫర్‌ హెర్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ప్రతి కాలేజీ నుంచి ఇద్దరు చొప్పున సీనియర్‌ విద్యార్థినులను వాలంటీర్లుగా ఎంపిక చేసి, విద్యార్థుల్లో మహిళల చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. వేధింపుల బారిన పడ్డ విద్యార్థినులు ఈ కార్యక్రమం ద్వారా తమ పేర్లు గోప్యంగా ఉండేలా ఫిర్యాదు చేసే వెసులుబాటును కూడా కల్పిస్తున్నారు. ‘షీ ఫర్‌ హెర్‌’ ద్వారా గత మూడేళ్లలో 24 కేసులు నమోదయ్యాయి.

ఐటీ కారిడార్‌లో ‘సేఫ్‌ స్టే’
గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో హాస్టళ్లలో ఉంటున్న మహిళా ఉద్యోగినులు, విద్యార్థినుల భద్రత కోసం సైబరాబాద్‌ పోలీసులు 2015లో ‘సేఫ్‌ స్టే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హాస్టళ్లన్నీ తప్పనిసరిగా నిబంధనలను పాటించేలా ఐటీ కారిడార్‌లోని హాస్టళ్లను పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తూ వస్తున్నారు. సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి, హాస్టళ్లన్నీ తప్పనిసరిగా పోలీసు అనుమతి పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా, ప్రతి మూడు నెలలకోసారి హాస్టళ్లన్నీ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నదీ లేనిదీ పర్యవేక్షిస్తున్నారు. ఈ చర్యల వల్ల హాస్టళ్లలో భద్రత మెరుగుపడింది.

టోల్‌ ఫ్రీ హెల్ప్‌లైన్‌ నంబర్లు
వివిధ జిల్లాల్లో పోలీసులు, మహిళా భద్రత కేంద్రాల ఫోన్‌నంబర్లతో పాటు ఆపదలో చిక్కుకున్న మహిళలు, బాలల కోసం నిరంతరం పనిచేసే టోల్‌ ఫ్రీ నంబర్లు ఇవి. వీటి ద్వారా కూడా బాధితులు తమ సమస్యలను తెలిపి పోలీసుల సహాయం కోరవచ్చు. డయల్‌ 100,   చైల్డ్‌ లైన్‌ 1098 

రక్షణ కోసం పోరాట శిక్షణ
►పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన ‘శక్తి’ పేరుతో   జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కేరళ రాష్ట్రానికి చెందిన ‘కలరిపయట్టు’,  కరాటే మెటీరియల్‌ ఆర్ట్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ‘స్పృహ’ పేరుతో జెండర్‌ ఈక్వాలిటీ మీద బాలురకు అవగాహనా కార్యక్రమాలను చేపట్టారు. 
►కామారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్‌పీ ఆధ్వర్యంలో ‘సురక్షిత కామారెడ్డి’ అనే కార్యక్రమం ప్రారంభమైంది. దీనిద్వారా జిల్లాలోని విద్యార్థినులకు ఆత్మరక్షణా విద్యలో శిక్షణను ఇప్పించడంతోపాటు, గ్రామస్థాయిలో జెండర్‌ ఈక్వాలిటీ మీద అవగాహనా సదస్సులనూ నిర్వహిస్తున్నారు. 

మహిళలకు ‘మార్గదర్శకంగా’
సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ల పరిధిలో  ఇంటా, బయట   వేధింపులు, ఈవ్‌టీజింగ్, సైబర్‌ నేరాలు, గృహహింస, ఒత్తిడికి సంబంధించి   కుటుంబసభ్యులు, మిత్రులు, పోలీసులకు చెప్పుకోని విషయాలను  మార్గదర్శక్‌ల దృష్టికి తీసుకొస్తే మార్గనిర్దేశం చేస్తారు. అది ఏ రకమైనా సమస్య అయినా ఓపికతో వింటారు. వారికి న్యాయ సహాయమా, పోలీసుల సహాయమా, సైకలాజిల్‌ సహాయమా...ఇలా వారికి ఏది  అవసరమో గుర్తించి ఆయా నిపుణుల వద్దకు పంపిస్తారు.  వేధింపులైతే బాధితురాలి పేరును బహిర్గతం చేయకుండా పోలీసుల ద్వారా చర్యలు తీసుకునేలా సహాయం అందిస్తారు. సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) సహకారంతో 2016 జనవరిలో సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో, అదే ఏడాది అక్టోబర్‌లో రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో దీన్ని  ప్రారంభించారు. రెండు కమిషనరేట్లలో ఇప్పటికి  585 మంది మార్గదర్శక్‌ల ద్వారా 185 కేసులు పరిష్కరించారు.

‘సేఫ్టీ’ జర్నీ....
ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న మహిళల సురక్షిత ప్రయాణం కోసం షీ షటిల్‌ సేవలను ఎస్‌సీఎస్‌సీ సహాకారంతో సైబరాబాద్‌ పోలీసులు 2015 జూన్‌ 30న ప్రారంభించారు. తొలుత రెండు బస్సులతో ప్రారంభమైన ఈ సేవలు ఇప్పుడూ ఏడుకు చేరాయి. ఈ బస్సు జీపీఎస్‌కు అనుసంధానం కావడంతో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సైబరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి సంబంధిత ఠాణా పోలీసులను అప్రమత్తం చేస్తారు.  అలాగే రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ఎస్‌సీఎస్‌సీ సహాకారంతో ఐటీ కంపెనీల్లో పనిచేసే మహిళల భద్రత కోసం 2017 ఆగస్టు 16న  షీ షటిల్‌ సేవలు ప్రారంభించారు. ప్రస్తుతం రెండు బస్సుల్లో  ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నారు. ఇలా ఈ రెండు కమిషనరేట్లలో కలిపి తొమ్మిది బస్సుల ద్వారా దాదాపు 80,000 మందికి పైగా మహిళలు ప్రయాణిస్తున్నారు. షార్ట్‌ఫిల్మ్‌తో స్మార్ట్‌గా గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్, లైంగిక విద్య గురించి లఘు చిత్రాలతో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ ముండ్రాతి హరిత... బాల్యానికి భరోసా పేరుతో. ఆరవతగరతి నుంచి ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులందరికీ పాఠాలుంటాయి. 

లఘు చిత్రాల రూపంలో
కౌమారదశలో పిల్లల్లో మొదలయ్యే శారీరక మార్పులతోపాటు పాటించాల్సిన శుభ్రత (నెలసరి మొదలయ్యాక అమ్మాయిలు పాటించాల్సిన శుభ్రతతోపాటు), పాటించకపోతే ఎదురయ్యే అనారోగ్య సమస్యలు,  పిల్లలకు ఎవరి నుంచి ఎలాంటి హాని ఎదురవుతుందో ఉదాహరణలతో సహా ఈ లఘుచిత్రంలో చూపిస్తున్నారు..  చెబుతున్నారు. తాతయ్య బాలికపై అఘాయిత్యానికి పాల్పడవచ్చు. వరుసకు  అన్నయ్య అయ్యే వ్యక్తి ఎలాంటి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు?  అసలు అప్యాయతతో కూడిన స్పర్శ ఎలా ఉంటుంది?  దురుద్దేశంతో కూడిన స్పర్శను  ఎలా గుర్తించాలి వంటివన్నీ ఈ లఘుచిత్రాల్లో చూపిస్తున్నారు. ‘కోమల్‌’ అనే లఘు చిత్ర ప్రదర్శన ద్వారా   ఇంటాబయటా స్నేహితులు, అపరిచితుల పట్ల పిల్లలు (ప్రధానంగా బాలికలు) ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తున్నారు.  ‘కోమల్‌’ పది నిమిషాల నిడివి గల హిందీ చిత్రం. ఈ షార్ట్‌ఫిల్మ్‌ ప్రదర్శన తర్వాత అందులోని విషయాల గురించి బాలల పరిరక్షణ విభాగం సభ్యులు, వైద్యుడు.. పిల్లలకు అవగాహన కల్పిస్తారు. ఇప్పటికి పదివేల మందికి పైగా విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. 

ప్రతి మంగళ, శుక్రవారాల్లో.. 
 జిల్లాలోని అన్ని పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు.  జిల్లాలోని బాలల సంరక్షణ విభాగం రెండు బృందాలుగా ఏర్పడి  ప్రతి మంగళ, శుక్రవారాల్లో పాఠశాలలు, జూనియర్‌ కళాశాల్లలో  ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిబృందంలో  జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుంచి  ముగ్గురు అధికారులతోపాటు ఒక  ప్రభుత్వ వైద్యుడు.. మొత్తం సభ్యులుంటారు. 

ప్రజ్వల 
విమెన్‌ ట్రాఫికింగ్‌ను అరికట్టడానికి ప్రజ్వల అనే స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోంది. లైంగికదాడికి గురైన మహిళలు, సెక్స్‌ ట్రేడ్‌లో పట్టుబడ్డ మహిళలకు పునరావాసం కల్పిస్తోంది..  ఆమన్‌గల్‌ మునిసిపాలిటీ పరిధిలోని  ప్రజ్వల పునరావాస కేంద్రంలో. దాదాపు పదేళ్లుగా వందల మందికి ఇక్కడ ఆశ్రయం ఇవ్వడంతోపాటు వారిలో మానసిక స్థయిర్యాన్నీ పెంపొందిస్తోంది .  స్వయం ఉపాధిలోనూ శిక్షణనిస్తున్న ఈ ప్రజ్వల సంస్థాపకురాలు, నిర్వాహకురాలు సునీతా కృష్ణన్‌. 

మరిన్ని వార్తలు