అమ్మ చేతిలో చెయ్యేసి...

2 Aug, 2015 04:27 IST|Sakshi
అమ్మ చేతిలో చెయ్యేసి...

మనసు చీటీ
అమ్మకి ఆరోగ్యం బాగోక ఆరునెలలు అయింది. కొద్దిపాటి విరేచనాలతో మొదలైన అనారోగ్యం, అన్నిరకాల కాంప్లికేషన్స్‌నీ పోగేసుకుని - చివరకు స్ట్రోక్‌గా (పక్షవాతం) అవతరించి - అమ్మని వీల్ చెయిర్‌కి పరిమితం చేసేసింది. అంతకుముందు నాకూ, ఆమెకీ ఎప్పుడూ ఒకటే యుద్ధం. నా దగ్గరే ఉండిపొమ్మని నేనూ - ‘‘నాకిక్కడ తోచదు. గుంటూరులోనే ఉంటాను’’ అని ఆమె - బోల్డన్నిసార్లు మాట్లాడుకున్నాం, పోట్లాడుకున్నాం. కానీ ఈరకంగా నా దగ్గర ఉండిపోతుందని అనుకోలేదు.
 
రోజూ అమ్మతో కాసేపు గడుపుదామని ప్రయత్నిస్తుంటాను. అన్ని రోజులూ కుదరదు. ఉదయం హాస్పిటల్‌కి వెళ్లే టైమ్‌కి నిద్రలో ఉంటుంది. సాయంత్రం వచ్చేసరికి లేట్ అయితే మళ్లీ దొరకదు తనతో సాంగత్యం. దగ్గరకు వెళ్లగానే, నా గడ్డం పట్టుకుం టుంది. చేయి వదలదు.
 
‘‘ఆరోగ్యం చూసుకో నాన్నా’’ అని పదిసార్లు గుర్తు చేస్తుంది. అది కొద్దిసేపే - తర్వాత తన లోకంలోకి వెళ్లిపోతుంది. ‘రేపు గుంటూరు వెళ్లిపోతాను నాన్నా’’ అంటుంది ఒక్కోసారి. తనకి ఏమయిందో - ఎందుకు నడవలేకపోతోందో - ఎక్కడ ఉందో తనకు పూర్తిగా అవగాహన లేదు. మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల, కొంత భాగం పనిచేయక - ఈ రకమైన అనిశ్చిత పరిస్థితిలో ఇరుక్కుపోయింది. ఓ రకంగా దేముడు ఆమెకి ఇచ్చిన వరమేమో ఇది. అనారోగ్యంతో చేయి, కాలు కదలక పోవడం, తనంతట తాను టాయ్‌లెట్‌కి వెళ్లలేకపోవడం ఎంత దుర్భరమో... ఆ అశక్తత మనసుకు తెలియకపోవడం అంతకంటే మించిన వరమే అనిపిస్తుంది.
 
వరప్రసాదరెడ్డిగారు తన ప్రతి పుట్టినరోజుని, మాతృదినోత్సవంగా జరుపుతారు. ఆ రోజు కొందరు అమ్మలను గౌరవిస్తారు. పోయిన సంవత్సరం చిరంజీవిగారి అమ్మ, ఎస్పీబాలుగారి అమ్మ, తనికెళ్ల భరణిగారి అమ్మలతో పాటు, మా అమ్మకి కూడా ఆ గౌరవం దక్కింది. కానీ దురదృష్టం, ఆ రోజుకి వారం ముందే అమ్మకి పక్షవాతం వచ్చి హాస్పిటల్‌లో ఉండిపోయింది. అమ్మ తరఫున నాన్న ఆ సత్కారం అందుకున్నారు. ఆ సందర్భంలో నేను మాట్లాడ ప్రయత్నించి విఫలమయ్యి, అందరి ముందూ ఏడ్చేశాను. గుండె లోతుల్లో కూరుకున్న, పేరుకున్న అను భూతులన్నీ పెల్లుబికి కన్నీళ్ల రూపంలో రావడం ఓ అనిర్వచనీయమైన ప్రక్రియ.
 
ఈ రోజు నేను డాక్టర్నయ్యి ఇంత మందికి సాయం చేయగల్గుతున్నానంటే - అది అమ్మ చలవే. ఆమెకి నేను డాక్టర్ కావాలని ప్రగాఢమైన కోరిక. ఆమె ప్రోద్బలం లేకపోతే పట్టు వదలని విక్రమా ర్కుడిలాగా అన్నిసార్లు ప్రయత్నించగలిగి ఉండేవాడ్ని కాదేమో! కానీ దేవుడి లీల - పక్షవాతం పర్మినెంట్‌గా ఆమెని వీల్ చెయిర్‌కి పరిమితం చేయడం - మా డాక్టర్లందరం నిమిత్తమాత్రులుగా మిగిలి పోవడం దురదృష్టం కాక మరేమిటి! కాకపోతే - ఆమెకి ఈ రకంగానైనా కొంత సేవ చేయగలగడం అదృష్టం.
 
అయిదేళ్ల క్రితం నేను తెచ్చిన ‘గురవాయణం’ పుస్తకంలో ‘మాతృ దేవోభవ’ అని అమ్మ గురించి రాశాను. దాంట్లో నామిని రాసిన ‘అమ్మకి జేజే’ పుస్తకం గురించి ప్రస్తావించాను. ఈసారి చీకోలు సుందరయ్యగారి సంపాదకత్వంలో వచ్చిన ‘అమ్మ’ కవితా సంకలనం గురించి చెప్పడం సముచితం. మూడేళ్ల క్రితం మృణాళిని దగ్గర ఈ పుస్తకం చూశాను. వాకబు చేస్తే అదే చివరి కాపీ అని తెల్సింది. ‘‘ఈ పుస్తకం నేను అచ్చేసిస్తాను అవకాశం వస్తే’’ అనుకున్నాను. ఆ అవకాశం ఇన్నాళ్టికి సుందరయ్యగారి ద్వారా వచ్చింది.
 
వందమందికి పైగా కవులు అమ్మ గురించి వివిధ కోణాలని స్పృశిస్తూ పండించిన కవితల సంకలనం ఇది. సుందరయ్యగారన్నట్లు - మన పూర్వీకులు మాతృదేవోభవ అని తొలి నమస్కారం అమ్మకే కేటాయించారు. తొలిస్థానం ఆమెకే ఇచ్చారు. సినీకవులు సైతం ‘అమ్మంటే అంతులేని సొమ్మురా - అది ఏనాటికీ తరగని భాగ్యమ్మురా’ అని అందంగా చెప్పారు. విమలగారు ‘వంటిల్లు’ పేరున అమ్మ గురించి, అమ్మ వంటల గురించి ఆర్ద్రంగా రాశారు.
 
‘ఎంత అద్భుతమైందీ వంటగది
రుచులు రుచులుగా పరిమళాన్ని వెదజల్లుతూ
తెరచిన తినుబండారాల దుకాణంలా
ఎంత నోరూరిస్తుందో
తాలింపు ఘుమాయింపులతో
పూజామందిరం అగరొత్తుల సువాసనల్తో
మా వంటిల్లు నిత్యం శ్వాసిస్తూ ఉంటుంది’ అని.

 
ఈ కవిత చదువుతూనే చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి జారిపోయాను, పారిపోయాను. అమ్మ రవ్వలడ్లు, కొబ్బరి లౌజులు చేసేది. శనివారం ఎప్పుడు వస్తుందా అని చూసేవాణ్ని. ఎందుకంటే - ఆ రోజు దేవుడికి నాన్న కొట్టిన కొబ్బరికాయ - మాకు రవ్వలడ్డుగా అమ్మ చేతుల్లో ప్రత్యక్షం. అమ్మ చేసిన టొమాటో పప్పు అద్భుతహ. అలానే గుత్తి వంకాయకూర ఆమె చేతుల్లో అమృత ధార. మజ్జిగచారు గురించి చెప్పక్కర్లేదు. కానీ నా దురదృష్టం. ఇప్పుడు అమ్మ ఏ వంటా చేయలేని పరిస్థితి. మా వంటామె చేసిన వంటకాల్ని అమ్మకి తినిపిస్తూ, ‘‘అమ్మా! నువ్వు చేసిన పప్పు ఇంతకంటే ఎంత బాగుండేదో’’ అని అంటుంటే - ఆ అలసిపోయిన మొహంలో కొసమెరుపుగా మళ్లీ ఓ చిరునవ్వు మొలుస్తుంది. అదే చాలు నాకు.
నేను మెడికల్ కాలేజీలో చేరేదాకా - అమ్మే తల దువ్వేది నాకు. దువ్వెన ఆమె చేతికిచ్చి తలవంచుకుని నిలబడితే...
 
ప్రేమగా, గోముగా ఓ చేత్తో గడ్డం పట్టుకుని ఇంకో చేత్తో పాపిట తీసి తలదువ్వడం నా గుండెల్లో పదిలంగా దాచుకున్న అనుభూతి. ఆప్యాయత ఎక్కడ కనపడ్డా - ఎవరు పంచినా అమ్మే గుర్తొస్తుంది నాకు. నా ఆరోగ్యం గురించి, నా కెరీర్ గురించి, అనుక్షణం ఆలోచిస్తూ ఆరాటపడే స్నేహితురాలిలో కనపడుతుంది అమ్మ నాకు. సమస్యలలో సతమతమయ్యే సమయాన ధైర్యాన్నిచ్చి చేయూతనిచ్చే భార్యలో కనపడుతుంది అమ్మ నాకు. హాస్పిటల్ నుంచి ఆలస్యంగా వచ్చినప్పుడు, నా కోసం ఎదురుచూసి, భోజనం పెట్టే కూతురిలో కనపడు తుంది అమ్మ నాకు. చూడగలిగితే - ఎటు చూసినా అమ్మే.
 
అమ్మ గుంటూరులో ఉన్నన్నాళ్లూ ఆమెతో గడపటానికి సమయం దొరికేది కాదు. జీవితంలో స్థిరపడ్డానికి బోల్డన్ని యుద్ధాలు, పరుగు పందేలు! ఇప్పుడు అమ్మతో గడిపే సమయం, సందర్భం వచ్చినా అమ్మ లేదు. శారీరకంగా నా ముందే ఉన్నా, నాకందని లోకాల్లోకి వెళ్లిపోయింది. కొడుకు చేతిలో చెయ్యేసి, మాట్లాడ ప్రయత్నిస్తూనే మనకెవరికీ అర్థం కాని శూన్యంలోకి జారిపోయింది.
 
‘అమ్మ బాగున్నప్పుడు ఇంకొంచెంసేపు గడిపి ఉంటే ఎంత బాగుండేదో కదా’’ అని ఎన్ని వందలసార్లు అనుకుని నాలో నేను ఏడ్చుకుంటున్నానో, నాలాగే కొన్ని కోట్లమంది కొడుకులు అమ్మలతో గడపక, గడపలేక కుమిలిపోతూ ఉండి ఉంటారు. వాళ్లందరికీ నా విన్నపం ఒకటే. అమ్మతో గడపటానికి వచ్చిన ప్రతి అవకాశాన్నీ రెండు చేతుల్తో అందుకోండి. అమ్మ మాటలు చాదస్తంగా, ఛాందసంగా అనిపించినా పట్టించుకోవద్దు. చిన్నప్పుడు మీకు రవ్వలడ్డు పెట్టిన అమ్మని, పెద్దయినాక తల దువ్విన అమ్మని గుర్తు తెచ్చుకోండి. మాటలు చేతకాకపోతే చేతిలో చెయ్యేసి అలానే కూచోండి. ఆ స్పర్శలో, ఆ నిశ్శబ్దంలో అవధి లేని అనురాగ గ్రంథాలు ఆవిష్కృతమవుతాయి.
డా.గురవారెడ్డి

మరిన్ని వార్తలు