సల్మాన్‌ఖాన్‌తో సాన్నిహిత్యం పెరిగింది

26 Apr, 2020 10:30 IST|Sakshi

దబంగ్‌లో ‘రాజో’గా అమాయకంగా కనిపించినా... లింగలో ‘మణిభారతిగా’ మెరిసినా....‘అకీరా’లో మార్షల్‌ ఆర్ట్స్‌తో గర్జించినా...‘నూర్‌’లో యంగ్‌ జర్నలిస్ట్‌గా ఆకట్టుకున్నా... అది సోనాక్షికే సొంతం. ఆ అమ్మడి ముచ్చట్లు ఆమె మాటల్లోనే...

దబంగ్‌ నుంచి దబంగ్‌ వరకు...
దబంగ్‌ నుంచి దబంగ్‌3 వరకు నేను పెద్దగా మారింది ఏమీలేదు. అయితే సల్మాన్‌ఖాన్‌తో సాన్నిహిత్యం పెరిగింది. అప్పటితో పోల్చితే ఇప్పుడు వచ్చిన మార్పు ఏమిటంటే, అప్పుడు సల్మాన్‌తో మాట్లాడటానికి భయపడేదాన్ని. వీలైనంత మౌనంగా ఉండేదాన్ని. ఇప్పుడు మాత్రం ఆయనతో స్వేచ్ఛగా మాట్లాడుతున్నాను. నా మనసులో భావాలను పంచుకోగలుతున్నాను.

అలా ఎప్పుడూ అనుకోలేదు...
ఫిల్మ్‌ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. ‘సెట్‌’కు వెళ్లాలనే ఉత్సాహం కూడా ఎప్పుడూ ఉండేది కాదు. నేను సినిమాలు చూస్తూ పెరగలేదు... ఆటలు అంటే మాత్రం చాలా ఇష్టం. అందుకే కెమెరాను ఫేస్‌ చేయడం అనేది నాకు బొత్తిగా కొత్త విషయంలా అనిపించింది.ఇప్పుడు ఫీల్డ్‌కు వస్తున్న కొత్తవాళ్లు వర్క్‌షాప్, యాక్టింగ్‌ క్లాస్‌లకు వెళ్లి బాగా ప్రిపేరై వస్తున్నారు. నేను మాత్రం అన్‌ప్రిపేర్‌డ్‌గా కెమెరా ముందుకు వచ్చాను. అయితే నటన విషయంలో సల్మాన్‌ఖాన్‌ చాలా సలహాలు ఇచ్చారు.

నచ్చినవి మెచ్చినవి
దీపికా పదుకొనే, ప్రియాంకచోప్రా లాంటి వాళ్లు తమ అభిరుచికి నచ్చిన సినిమాలు తీయడానికి నిర్మాతలుగా మారారు. నేను కూడా వారిలాగే భవిష్యత్‌లో నాకు నచ్చిన సినిమాలను తీయాలనుకుంటున్నాను. మంచి సబ్జెక్ట్‌ కోసం ఎదురుచూస్తున్నాను. ఏఆర్‌ మురగదాస్‌ ‘అకీర’లో నేను చేసిన క్యారెక్టర్‌  ‘మోస్ట్‌ చాలెంజింగ్‌ క్యారెక్టర్‌’ అని చెప్పవచ్చు. నేను మార్షల్‌ ఆర్టిస్ట్‌ను కాదు. ఈ సినిమా కోసం మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవాల్సి వచ్చింది. ‘నూర్‌’లో నేను చేసిన జర్నలిస్ట్‌ క్యారెక్టర్‌ కూడా నాకు బాగా నచ్చింది. ఈ కాలం మహిళ పాత్ర అది.

అప్పుడే కదా!
ఒక డైరెక్టర్‌ ‘లూటేరా’లాంటి సినిమా తీస్తే నేను గుర్తుకు రావాలి, అదే డైరెక్టర్‌ ‘దబంగ్‌’లాంటి సినిమా తీసినా నేను గుర్తుకు రావాలి. ప్రతి క్యారెక్టర్‌ నేను చేయగలగాలనేది నా కోరిక. ప్రతి జానర్‌లోనూ నటించాలని ఉంది. ఖందాని షఫఖానా, కలంక్, మిషన్‌ మంగల్, దబంగ్‌3... ఈ నాలుగు చిత్రాల్లో భిన్నమైన పాత్రలు పోషించే అవకాశం వచ్చింది. ఒకదానికొకటి భిన్నమైన ఇలాంటి క్యారెక్టర్లు చేయగలిగినప్పుడు పని మీద మరింత ఉత్సాహం పెరుగుతుంది. 

మరిన్ని వార్తలు