బుల్లితెరపై బెంద్రే తొలి సంతకం!

18 Oct, 2014 23:52 IST|Sakshi
బుల్లితెరపై బెంద్రే తొలి సంతకం!

టీవీక్షణం: మన్మథుడికి తగిన జోడీగా, శంకర్‌దాదాలో ప్రేమ పుట్టించిన పడతిగా, ఇంద్ర మనసును గెలిచిన మగువగా అలరించింది సోనాలీ బెంద్రే. పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైన ఆమె... ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తెరమీద కనిపించడానికి సిద్ధమైంది. అది కూడా ఒక సీరియల్‌తో. లైఫ్ ఓకే చానెల్లో ‘అజీబ్ దాస్‌తా హై యే’తో బుల్లితెర మీద తన తొలి సంతకం చేసింది సోనాలీ.
 
 భర్త, అత్తగారు, ఆడపడుచులు, ఇద్దరు పిల్లలు... వీళ్లు తప్ప వేరే ప్రపంచమే ఉండదు శోభకు. అయితే ఉన్నట్టుండి ఆమె జీవితంలో తుఫాను రేగుతుంది. రాజకీయ నాయకుడైన శోభ భర్త ఓ సెక్స్ స్కాండల్‌లో ఇరుక్కుని జైలు పాలవుతాడు. అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొంటాడు. అతడిని కాపాడాలనుకున్న శోభకి నమ్మలేని నిజాలు తెలుస్తాయి.

తనను మోసగించి భర్త ఎందరు అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నాడో తెలిసి తట్టుకోలేకపోతుంది. ఓ పక్క ఆ బాధ, మరోపక్క భర్త చేసిన పనికి ఎదుర్కొంటోన్న అవమానాలు, ఇంకోపక్క బ్యాంకులు తమ అకౌంట్లన్నీ సీజ్ చేసేయడంతో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. దాంతో కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటుంది. వ్యాపారవేత్త అయిన హీరో దగ్గర పీఏగా చేరుతుంది. అయితే మితిమీరిన ప్రాక్టికల్ పర్సన్ అయిన అతడిని డీల్ చేయడం ఆమెకు కష్టమవుతుంది.
 
 అతడి వల్ల ఆమెకెలాంటి ఇబ్బందులొచ్చాయి, వాటినెలా అధిగమించింది, అతడితో ఆమెకెలాంటి బంధం ఏర్పడింది అనేది కథ! మొదట సాధారణ ఇల్లాలిగా అమాయకంగా కనిపించిన సోనాలీ... తర్వాత ఆత్మవిశ్వాసం ఉట్టిపడే మగువగా అద్భుతంగా నటిస్తోంది. తన హుందాతనంతో శోభ పాత్రకు ప్రాణం పోస్తోందామె. అలాగే మూర్ఖత్వం, మొండితనం, కాస్త మంచితనం కలగలసిన వ్యక్తిగా అపూర్వ అగ్నిహోత్రి అభినయానికి కూడా ఫుల్ మార్కులు వేయవచ్చు. ప్రతి హిట్ సీరియల్ తెలుగులోకి డబ్ అవుతున్నట్టు ఇది కూడా అయితే, తెలుగువారికి మరో మంచి సీరియల్ చూసే అవకాశం దొరుకుతుంది!
 

మరిన్ని వార్తలు