వాగ్దేవి  నర్తించిన  వాయులీనం

6 May, 2018 00:04 IST|Sakshi
ద్వారం వెంకటస్వామినాయుడు 

ధ్రువతారలు

‘‘మనమింతగా నారాధించు కళ నవనవోన్మేషమును బొందవలయును. ప్రాత దుస్తుల తోడను,ప్రాచీనాలంకారముల తోడను మాత్రమే మన కళా సరస్వతిని నిలుపగోరము.’’‘ఫిడేలు నాయుడు’ పేరుతో కర్ణాటక సంగీత సామ్రాజ్యంలో సుప్రసిద్ధులయిన ద్వారం వెంకటస్వామినాయుడు పలికిన మాటలివి. ఏ కళ అయినా పరిణామం వైపే పరుగులు తీస్తుంది. ఎల్లలు లేని సంగీతానికి అది మరింతగా వర్తిస్తుంది. బహుశా విజయనగరం మహారాజా సంగీత కళాశాల ప్రధాన ఆచార్యులుగా పదవీ స్వీకారం చేసిన సందర్భం కావచ్చు. ఆయన పలికిన మాటలు చిరస్మరణీయాలనిపిస్తూ ఉంటాయి. పైన ఉదహరించిన మాటలు కూడా ఆనాటి ఉపన్యాసం లోనివే. ద్వారం వెంకటస్వామినాయుడుగారు (నవంబర్‌ 8, 1893 – నవంబర్‌ 25, 1964) బెంగళూరులో పుట్టారు. కంటోన్మెంట్‌ మిలటరీ క్వార్టర్స్‌లో ఆ సంగీతనిధి కళ్లు తెరిచారు. అది కూడా దీపావళి అమావాస్య రోజున. తండ్రి మేజర్‌ వెంకటరాయలు. తల్లి లక్ష్మీనరసమ్మ. వెంకటరాయలు తండ్రి వెంకటస్వామి. ఆయన కూడా సైన్యంలో పనిచేసిన వారే. ఆయన పేరే వెంకటరాయలు కుమారుడికి పెట్టుకున్నారు. నిజానికి వారి కుటుంబంలో చాలామంది కశింకోట సంస్థానాధీశుని దగ్గర సైన్యంలో పనిచేసిన వారే. స్వస్థలం కూడా అదే.ఫిడేలు నాయుడుగారు తుపాకీ పట్టకుండా కమాను పట్టుకునేటట్టు చేసినవి రెండు. ఒకటి... ఆ కుటుంబ పెద్దల మారిన దృష్టి. రెండు... వెంకటస్వామినాయుడు పోగొట్టుకున్న దృష్టి. పూర్వం భారతీయ ప్రభువుల దగ్గర సేవ చేశారు. కానీ బ్రిటిష్‌ సామ్రాజ్యం విస్తరించిన తరువాత ప్రభువులు మారిపోయారు. పరదేశ ప్రభువుల ఆదేశాలతో సాటి భారతీయుల మీద తుపాకీ ఎత్తవలసి వస్తోంది. అందుకే వెంకటరాయలు ఆత్మగౌరవం కలిగిన వృత్తులలో తన సంతానం ఉండాలని కోరుకున్నారు. వారిని బడికి పంపారు. కానీ వెంకటస్వామి నాలుగో క్లాసుకు వచ్చేసరికి తండ్రి పదవీ విరమణ చేసి, కశింకోటకు చేరుకున్నారు. దానితో వెంటకస్వామిని విశాఖలోని ఏవీయన్‌ విద్యాసంస్థలో చేర్చారు. క్రమంగా చూపులో మార్పు వచ్చింది. నల్లటి బోర్డు మీద అక్షరాలు అతుక్కుపోయి కనిపించేవి. అంతా అయోమయంగా ఉండేది. చివరికి బోధకులు వెంకటస్వామిని సంస్థ నుంచి పంపించేశారు.

అప్పటికే రైల్వేశాఖలో కుదురుకున్న అన్నలు ఇద్దరూ వెంకటస్వామిని ఓదార్చారు. తండ్రి నేర్పించిన వయొలిన్‌ వాద్యాన్ని తమ్ముడికి నేర్పడం ఆరంభించారు. ఆ సోదరులిద్దరిదీ వానాకాలం వాద్యవిద్య కాదు. ఒకరు మద్రాస్‌లో పట్నం సుబ్రహ్మణ్యన్‌ అయ్యర్‌ అంతటి పండితుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. మరొక సోదరుడు రైల్వే ఉన్నతాధికారి ఒకరి దగ్గర పాశ్చాత్య వయొలిన్‌ సంగీతం నేర్చుకున్నారు. ఆ అన్నలిద్దరూ తమ్ముడికి తమకు తెలిసినదంతా నేర్పించారు.1919లో విజయనగరం రాజా సంగీత కళాశాలను నెలకొల్పారు. తొలి ప్రధాన ఆచార్యులు శ్రీమజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు. విద్యార్థులకు ప్రవేశ పరీక్ష జరిగింది. వెంకటస్వామినాయుడిని కూడా తీసుకువెళ్లారు. అది ఆయన జీవితాన్ని మార్చింది. సంస్థానాధీశుడు విజయరామగజపతితో పరిచయం కలిగింది ఆ సందర్భంలోనే. రాజావారు వెంకటస్వామిని కూడా సంగీత కళాశాల ఆచార్యులుగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు.శిల్పం, చిత్రలేఖనం కాలం మీద సంతకం చేసి వెళతాయి. ఏ సంగీతజ్ఞుడి ప్రతిభకైనా ఆ లక్షణం ఉండదు. శిష్యులు, ప్రశిష్యుల పరంపరలో, వారి శైలిలో దాని జాడను అన్వేషించవలసిందే. ఫిడేలు నాయుడుగారి విషయంలో మాత్రం కొందరు తమ అనుభవాలను నమోదు చేశారు. వి. తిరుపతి అనే ఆయన రాసిన సంగతులు చూడండి: ‘‘వారానికి కనీసం అయిదు రోజులైనా ప్రతీ సాయంత్రం సంజ వాలిన కొద్దిసేపటికి ఆ మహా విద్వాంసుడు తన ఇంట్లో ఒక లేడి చర్మం మీద కూర్చొని ఫిడేలు పట్టుకుంటారు. ఆ గదిలో ఒక దీపం మెల్లగా వెలుగుతూ ఉంటుంది. ఊదువత్తులు అగరు వాసనలతో మెత్తగా గది గుబాళిస్తూ ఉంటుంది. నాయుడుగారు నిదానంగా గంభీరంగా తన నాదోపాసనకు పూనుకుంటారు. అక్కడ చేరిన వాళ్లలో శ్రీమంతులు, చిరుపేదలు ఉంటారు. అక్కడ జాతిమత భేదాలు లేవు. చిన్నాపెద్దా, ఆడామగ తేడాలు లేవు. పిలిచారా పిలవలేదా అనుకోరు’’.

తిరుపతి ఇంకా ఇలా రాశారు:‘‘సాధారణంగా ఒక వర్ణంతోనో, ఒక కీర్తనతోనో ఆ సాయంకాలం మొదలవుతుంది. అక్కడి నుంచి ఒక స్వరప్రవాహం... నాథుని ప్రియ స్పర్శతో నెచ్చెలి హృదయం ప్రఫుల్లమై తన అంతరంగ రహస్యాలన్నింటినీ అతని స్వాధీనం చేసినట్లుగానే ఆ వయొలిన్‌ నాయుడిగారి సన్నటి వ్రేళ్ల లాలనలో తన శరీరరంలో, తన నరనరాల్లో దాగి ఉన్న అద్భుత నాద రహస్య సంపదలను ఆయనకు ధారాదత్తం చేస్తుంది.’’ఫిడేలు నాయుడుగారు దురదృష్టం కొద్దీ చూపు కోల్పోయారు. కానీ ఆయనకు అపారమైన ధారణ ఉండేది. ఎన్నో సంగీతశాస్త్ర గ్రంథాలను ఆయన సేకరించారు. ఎవరో ఒకరు వాటిని చదివి వినిపించేవారు. ఎప్పటికీ గుర్తుండేవి.చిత్రంగా ఎవరైనా శిష్యుడు అపరాధపరిశోధన నవలలు చదివి వినిపిస్తే చక్కగా ఆస్వాదించేవారు. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా పురాతత్వ పరిశోధనలు వాటి గురించిన వ్యాసాలు చదివి వినిపించినా శ్రద్ధగా ఆలకించేవారు. కర్ణాటక సంగీత గ్రంథాలతో పాటు, హిందుస్తానీ సంగీతానికి సంబంధించిన పుస్తకాలు కూడా ఆయన చదివించుకునేవారు.  వెంకటస్వామి తిరువానూరు, మద్రాసు, మైసూర్, మధుర, తంజావూరు నగరాలకు తన విద్యను, ప్రతిభను పరిచయం చేశారు. జైపూర్, ఢిల్లీ, కలకత్తాలను కూడా ఓలలాడించారు. 1936లో ఆయన ఇచ్చిన గ్రామఫోన్‌ రికార్డు విదేశాలకు కూడా వెళ్లింది. నాయుడుగారిని హరేన్‌ చటోపాధ్యాయ కలుసుకున్నప్పుడు ‘‘ప్రొఫెసర్‌ గారూ! ఈ శ్రుతుల మాధుర్యం ఒక గొప్ప సంపద. కలకాలం నా హృదయంలో భద్రపరుచుకొంటాను’’ అన్నారు.ప్రతి సంగీతాభిమాని, కళాభిమాని చేసిన పని కూడా అదే.
- డా. గోపరాజు నారాయణరావు

మరిన్ని వార్తలు