నరకమా? అయితే ఓకే!

10 Nov, 2019 03:05 IST|Sakshi

అనగనగా ఒక ఊళ్లో  బాటిల్‌ కుమార్‌ అనే  తాగుబోతు ఉండెను. ఒకరోజు ఇతడికి మార్గమధ్యంలో ఒక స్వామిజీ ఎదురయ్యెను.
‘‘నాయనా, తాగిన వాళ్లు నరకానికి వెళ్లెదరు అనే విషయం నీవు ఎరగవా?’’ అన్నారు స్వామిజీ.
‘‘నరకమా!’’ అని పెద్దగా అరిచి మందు కొట్టడం ఆపి గజగజా వణకడం ప్రారంభించాడు బాటిల్‌ కుమార్‌.
గజగజా షేక్‌ అవుతున్నాడంటే అతనిలో మార్పు వచ్చిందనుకొని సంతోషించారు స్వామి వారు.
‘‘స్వామి నాదొక డౌటు’’ అన్నాడు బాటిల్‌ కుమార్‌.
‘‘ఏమిటి నాయనా అది?’’ అడిగారు  స్వామిజీ.
‘‘నేను మందు కొట్టడానికి ప్రధాన కారణం నాకు అప్పులు ఇచ్చే అప్పారావు. వాడు లేకపోతే నేను మందు కొట్టే ఛాన్సే లేదు. మరి ఆడు నరకానికెళ్లడా?’’ మందు కొట్టడం ఆపి అడిగాడు బాటిల్‌ కుమార్‌.
‘‘ఎందుకెళ్లడు నాయనా...హండ్రెడు  పర్సంటు వెళతాడు’’ అని చెప్పారు స్వామిజీ.
‘‘సరే, వాడేదో బుద్ధిలేక అప్పు ఇచ్చాడు అనుకుందాం. అసలు  ఆ సారా అమ్మే సుబ్బయ్య లేకపోతే, నేనెందుకు మందు కొంటాను. కాబట్టి తప్పంతా సుబ్బయ్యదే. మరి ఈ సుబ్బయ్య నరకానికి వెళతాడా?’’ అడిగాడు బాటిల్‌ కుమార్‌.
‘‘టు హండ్రెడ్‌ పర్సెంట్‌ వెళతాడు నాయనా’’ అన్నారు స్వామిజీ.
‘‘సుబ్బయ్య సంగతి వదిలేయండి. ఆ సోమేష్‌ కూడా వెళతాడా?’’ అడిగాడు బాటిల్‌ కుమార్‌.
‘‘సోమేష్‌ ఎవరు నాయనా?’’ అడిగారు స్వామి.
‘‘సారా కొట్టులో నా గ్లాస్‌మేట్‌. మనం తాగి తప్పు చేస్తున్నాం...అని నాలుగు మంచి మాటలు చెప్పకుండా...ఈ భూమండలంలో మనంత అదృష్టవంతులు ఎవరూ లేరు అంటూ సొల్లు మాటలు చెప్పడం తప్పు కాదా!’’ అన్నాడు బాటిల్‌.
‘‘కచ్చితంగా తప్పే...ఆయన కూడా నరకానికి వెళతాడు నాయనా’’ చెప్పారు స్వామి.
‘‘సరేనండీ, మేమిద్దరం బుద్ధి గడ్డి తిని మందుకొడుతున్నాం అనుకోండి. మరి సారాకొట్టు ముందు చేపలు ఫ్రై చేసి మాకు అమ్మే ఆ చెన్నప్ప మాట ఏమిటి?’’ అడిగాడు బాటిల్‌.
‘‘ఆయన ఏం చేశాడు నాయనా?’’ ఎప్పటిలాగే అమాయకంగా అడిగారు స్వామి.
‘‘అర బాటిల్‌తోనే కానిచ్చారేమిటండీ...మీ లెవల్‌కి తగ్గట్టు ఈరోజు కూడా ఫుల్‌బాటిల్‌ కొట్టాల్సిందే...అని రెచ్చగొడుతుంటాడండీ...ఇది తప్పు కదటండీ!’’ అన్నాడు బాటిల్‌.
‘‘కచ్చింతగా తప్పే...చెన్నప్ప కూడా నరకానికి వెళతాడు నాయనా’’ అని చెప్పారు స్వామిజీ.
‘‘నాయనా, ఇప్పటికైనా మందు మానేస్తున్నావా! లేకపోతే నరకానికి వెళతావు. తెలుసు కదా!’’ అన్నారు స్వామిజీ.
‘‘ఈమాత్రం దానికి భయపడడం ఎందుకు?’’ కూల్‌గా అన్నాడు బాటిల్‌ కుమార్‌.
‘‘నాయనా, నువ్వు వెళ్లబోయేది  కులు మనాలి కాదు నరకానికి’’ హెచ్చరించారు స్వామిజీ.
‘‘అయితే మాత్రం ఏమిటండీ...’’ అంటూ స్వల్వ విరామం తరువాత సంతోషంగా మళ్లీ మందు కొట్టడం మొదలెట్టాడు బాటిల్‌ కుమార్‌.
‘‘అదేమిటి నాయనా...నరకం అంటే భయపడాల్సింది పోయి అంత సంతోషంగా మందు కొడుతున్నావు?!’’  ఆశ్చర్యంగా అడిగారు స్వామిజీ.
‘‘సంతోషం కాకపోతే ఏమిటండీ, అప్పు ఇచ్చే అప్పారావు నరకానికే వస్తాడు, మందు అమ్మే సుబ్బారావు నరకానికే వస్తాడు, నా గ్లాస్‌మేట్‌ సోమేష్‌ నరకానికే వస్తాడు.  ఫిష్‌ ఫ్రై అమ్మే చెన్నప్ప సరకానికే వస్తాడు. ఇంతకంటే కావాల్సింది ఏముంది! ఇక్కడిలాగే హాయిగా రోజూ మందు కొట్టవచ్చు.  స్వర్గంలో ఏముంటుంది నా బొందా’’ అంటూ పెగ్గెత్తాడు బాటిల్‌ కుమార్‌.
– యాకుబ్‌ పాషా

మరిన్ని వార్తలు