పెళ్లయితే ఇక అంతేనా?!

19 Mar, 2016 22:54 IST|Sakshi
పెళ్లయితే ఇక అంతేనా?!

ఇంటర్వ్యూ

హీరోయిన్లంతా జీరో సైజు మెయింటెయిన్ చేస్తుంటే... తను మాత్రం బొద్దుగా ఉంటానంటుంది. అందరూ మోడ్రన్ దుస్తుల్లో మెరిసిపోతుంటే... తను మాత్రం చీరకట్టుతోనే కనిపిస్తానంటుంది. అందరూ గ్లామరస్ పాత్రలు చేస్తుంటే తను మాత్రం మహిళ పవర్‌ని, ప్రాధాన్యతని చూపించే పాత్రలు చేస్తుంది. అందరిలా ఉండదు విద్యాబాలన్. అందరిలా మాట్లాడదు కూడా. అందుకే తన ఇంటర్వ్యూ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. చదవి చూడండి...

 

పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్ దెబ్బ తింటుందంటారు. నిజమేనా?
పెళ్లి కారణంగా కెరీర్ దెబ్బ తింటుం దని నేననుకోను. కావాలని నటనకు దూర మవ్వాలే తప్ప నీకు పెళ్లయ్యింది అంటూ ఎవరూ బయటకు నెట్టేయరు. మన అవసరం ఇండస్ట్రీకి ఉన్నంతకాలం మనం అందులో ఉంటాం. అయితే ఒకటి. ఒక అమ్మాయి ఎంత సక్సెస్ అయినాగానీ, పెళ్లవ్వగానే ఆమెని ఓ మగాడికి భార్యగానే చూస్తారు. మావారిని కొందరు ఫంక్షన్లకు పిలుస్తూ, విద్యని తీసుకురా అంటారు. వాళ్లు నాకు తెలిసినవాళ్లే. మరి అలా ఎందుకు చేస్తారా అనిపిస్తుంది. పెళ్లైపోతే అంతేనా? ఆడపిల్లలకి ఇండివిడ్యువాలిటీ ఉండదా?!


ఇండస్ట్రీలో మేల్ డామి నేషన్ గురించి ఏమంటారు?
అసలు మనం ఉన్న సమాజమంత టిలో మగాడిదే పై చేయి. సినీ రంగం లోనూ అంతే. కానీ హీరోయిన్ లేకుండా సీరియళ్లు, సినిమాలు ఉంటాయా? ఎక్కడైనా ఆమె అవసరమే. కాబట్టి మహిళను కాదని పక్కన పెట్టేయడానికి వీల్లేదు. ఆ అవసరాన్నే మనం ఉపయో గించుకోవాలి. మగాళ్లతో సమానంగా కష్టపడి, వీలైతే వాళ్లకంటే కాస్త ఎక్కువే ఔట్‌పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యాలి. నేనెప్పుడూ అదే చేస్తుంటాను.

 
ధైర్యంగా, సవాళ్లను ఎదుర్కొనే సమర్థు రాలిగా మీ పాత్రలు కనిపిస్తుంటాయి. నిజ జీవితంలో మీరలా ఉంటారా?

హండ్రెడ్ పర్సెంట్. నా పాత్రలు నా వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. చిన్నతనం నుంచీ నేను డైనమిక్. నాకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, సవాళ్లను ఎదుర్కొనగలిగే తెగువ... ఇవన్నీ కాస్త ఎక్కువే. అందువల్లేనేమో నేను అలాంటి పాత్రలనే ఎంచుకుంటూ ఉంటాను.

 
స్త్రీ స్వేచ్ఛ గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మీ అభిప్రాయం ఏమిటి?
స్వేచ్ఛ అందరికీ ఉండాలి. మహిళలు ఇలాగే ఉండాలి అని ఎందుకు నిర్ణయించేస్తారు! వాళ్లూ వాళ్లకు నచ్చినట్టు ఉండాలి. నచ్చింది తినాలి, నచ్చినవి ధరించాలి. మగాడు నిక్కర్లు వేసుకుని తిరిగితే ఎవరూ పట్టించు కోరు. అదే అమ్మాయిలు కాస్త పొట్టి బట్టలు వేస్తే చీప్‌గా చూసేస్తారా? ఏదైనా జరిగితే తన డ్రెస్సింగ్ వల్లే అనేస్తారా? ఈ దృష్టికోణం మారాలి. ఆడవాళ్ల వ్యక్తిత్వాన్ని వాళ్ల దుస్తుల్ని బట్టి అంచనా వేయడం మానెయ్యాలి.

 
ఇంత ఆధునిక భావాలు ఉన్న మీరు మోడ్రన్‌గా ఎందుకు కనిపించరు?

ఎందుకు కనిపించను! నేనూ గౌన్లు వేసుకుంటాను. లో నెక్ వేస్తాను. కానీ నాకు చీర అన్నిటికంటే ఇష్టం. అందుకే పెద్దదానిలా కనిపిస్తాను అని కొందరన్నా కూడా చీరనే ధరిస్తాను. అలాగే ఎవరికి నచ్చినవి వాళ్లు వేసుకుంటారు. దాని గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు.

 
మహిళలపై జరిగే అకృత్యాలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది?

కేవలం ఆడపిల్లగా పుట్టినందుకే సమస్యలు ఎదుర్కోవాల్సి రావడం నిజంగా అన్యాయం. అయితే ఇప్పు డిప్పుడే అన్యాయాలను ఎదుర్కోగలిగే ధైర్యం వస్తోంది ఆడపిల్లలకి. పూర్తిగా సాధికారత రాకపోయినా రోజుకొక ఆడపిల్లయినా గడప దాటి వచ్చి తనకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటోందని కచ్చితంగా చెప్పగలను.

 
కానీ ఆడపిల్లలు కూడా కొన్ని పొరపాట్లు చేసి కష్టాల్లో పడుతున్నారు కదా?

అవును. ముఖ్యంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే కావాలని ఎవరూ నష్టపోరు. తెలియక ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. అది కూడా మనం గమనించాలి.

 
సమాజంలో ఎలాంటి మార్పులు వస్తే ఆడపిల్లల జీవితాలు బాగుంటాయి?

అబ్బాయిలకీ, అమ్మాయిలకీ సమాన అవకాశాలు ఉండాలి. కొన్ని రంగాలకి మహిళలు పనికిరారు, అవి పురుషులకే అని నిర్ధారించేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అంతరిక్షంలోకే వెళ్లగలిగిన మహిళ ఎక్కడి కైనా వెళ్లగలను. ఏదైనా సాధించగలదు. ఆడపిల్ల అయినంత మాత్రాన తన శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయ కూడదు. అలాగే తన అభిప్రాయాలను వెలిబుచ్చే అవకాశం, తన కెరీర్‌ని జీవితాన్ని తనకు నచ్చినట్టుగా మలచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి.                           

మరిన్ని వార్తలు