నాగలి

26 Jan, 2020 03:27 IST|Sakshi

అస్సామి కథ

ఆరోజు బోలోరామ్‌ వీధి నూతి వద్ద స్నానం ముగించుకొని వచ్చాడు. తన ధాన్యాగారం వైపు చూసి ఏదో వెలితిని గుర్తించాడు. అక్కడ ఒక వెదురు వంతెన మీద తను పదిలంగా దాచుకున్న ఒక నాగలి దుక్క అక్కడ లేదు. ఒక్కసారిగా ఏదో ప్రమాదంలో పడిన వ్యక్తిలాగా భయపడ్డాడు. తను పొరపాటు పడ్డానేమోనని కొట్టంలోనికి పోయి అన్ని మూలల్లోనూ వెదికాడు. ఎక్కడా కనిపించలేదు. అప్పుడతనికి ఆ నాగలిని ఎవరో దొంగిలించి వుండొచ్చని అనుమానం వచ్చింది.
ఎవరో తెలియని దొంగని కొంతసేపటి వరకు మనసారా శాపనార్థాలు పెట్టుకున్నాడు. బోలోరామ్‌ భార్య వరిపొట్టుతో పొయ్యి వెలిగిస్తున్నది. ఈ దూషణలన్నీ ఎవర్ని ఉద్దేశించినవో తెలియక ఆమె తన చెవులు రిక్కించి విన్నది. అంతలో బోలోరామ్‌కు ఒక సన్నివేశం గుర్తుకువచ్చింది. ఒక నెలక్రితం ఒక సాయంత్రం తన ధాన్యాగారం వద్ద నాగలిని చెక్కుకొంటున్నాడు. సరిగ్గా ఆ సమయంలో మాఫీమహజన్‌ వచ్చాడు. మహాజన్‌ ఆ ఊరిలో వ్యవసాయమూ వడ్డీ వ్యాపారమూ చేసే మోతుబరి.
‘‘అయితే బోలోరామ్‌! నువ్వొక కొత్తనాగలిని చేసుకుంటున్నావన్న మాట. ఆ మాటతో బోలోరామ్‌ ఏకాగ్రత చెడి ఈ లోకంలోకి వచ్చాడు. సరిగ్గా కారణం తెలియదు కాని మహజన్‌ రాక అతనికి ఇష్టం లేదు. తన నాగలి మీద మహజన్‌ దృష్టి పడటం అతడికి ఇష్టం లేదు. ఏదో కీడు శంకించాడు.
‘‘అవును మహజన్‌!’’ అంటూ చెక్కుతున్న నాగలిని పక్కన పెట్టి లేచాడు.
‘‘నీవద్ద రెండు నాగళ్ళు వున్నట్టున్నాయి. చూడబోతే కలప కూడా బంగారు చెట్టుది లా వుంది. ఎక్కడ నుంచి సంపాదించావేంటి?’’ అడిగాడు మహజన్‌.
 అతడి ఆసక్తి చూసి బోలోరామ్‌ కాస్త ఇబ్బంది పడ్డాడు.
‘‘మన నేపాలీ ఆయన తన పెరట్లో చెట్లను కొట్టేస్తున్నాడు. రెండు చెట్లను నేను ఎంపిక చేసుకొని ఏటి వొడ్డు నుండి లారీలో తెచ్చాను’’
‘‘బావుంది. వచ్చే సంవత్సరం నాకూ ఒక కొత్త నాగలి కావాలి. నీ వద్ద నుండి నేనొకటి తీసుకుంటాను. చక్కగా చిత్రిక పట్టించు. ఆ పెద్దది నాకు అవసరమవుతుంది’’ అన్నాడు మహజన్‌.
‘‘నీకు  ఇవ్వడానికి కుదరదు మహజన్‌! నా బావమరిది ఈసరికే దీన్ని కావాలని అడిగాడు. అతడి నాగలి పాతదయింది’’ అన్నాడు  బోలోరామ్‌.
‘‘ఎవరు? చందాబాబేనా? అతడు ఎక్కడినుండైన సంపాదించుకోగలడు. నువ్వు మాత్రం దీన్ని నాకు ఇవ్వక తప్పదు. కావాలంటే నీకు డబ్బు చెల్లించేస్తాను’’
‘‘అయ్యో! నా దగ్గర నేను ఎలా డబ్బు తీసుకోగలను? కాని నా బావమరిదికి ఇప్పుడు ఇది ఇవ్వకపోతే నేను అతడి ముఖం చూడలేదు. నా భార్య కూడా అతడి వైపే మాట్లాడుతుంది. ఈ శనివారం సరికి ఇచ్చేస్తానని మాట కూడా ఇచ్చాను. మీ పెరట్లో చాలా చెట్టున్నాయి కదా! గందేశ్వర్‌ చేత చేయించుకో’’ అన్నాడు బోలోరామ్‌.
కానీ బూరుగ కలప నాగలి సేకరించడం చాలా కష్టమని మహజన్‌కు బాగా తెలుసు. ఆరోజు వారిద్దరి మధ్యా సంభాషణ మరి కొంచెం ముందుకుసాగింది. మరింక ఆలస్యం చెయ్యకుండా బోలోరామ్‌ ఒక నాగలి పనిని పూర్తి చేసి ముందుగా తన బావమరిదికి పంపించి వేశాడు. ఆ తరువాత స్వంతం కోసం మరో నాగలి చెక్కడం మొదలుపెట్టాడు. దాదాపు పూర్తి కావచ్చింది. దాన్నే బోలోరామ్‌ తన ధాన్యాగారంలో దాచుకొని తరువాత మిగిలిన పని పూర్తిచేయాలనుకున్నాడు. దాన్ని తన కోసం అట్టే పెట్టుకోవాలను కున్నాడు. ఈలోగా ఆవాలు పంట అందుకొచ్చింది. నాగలి సంగతి మరిచి ఆ పనుల్లో పడిపోయాడు. ఒక వారం గడిచింది. తీరా ఇప్పుడు చూడబోతే నాగలి మాయమయింది.
కోపం తారస్థాయికి చేరకుంది. పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. ఇప్పుడతనికి మహజన్‌ కోరిక గుర్తుకు వచ్చింది. నాగలిని మహజన్‌ స్వయంగా వచ్చి దొంగలించే అవకాశం లేదు. కాని ఈ అంశంలో అతడి చేయి వుంటుందని అనుమానంగా వుంది. కాని సరైన రుజువు లేదు. సాక్ష్యం లేదు. ఈలోగా కందమూలాలు పంటకు వచ్చాయి. వాటిని రాత్రే తవ్వాలి. బస్తాలకు ఎత్తాలి. బండిని మాట్లాడుకొని దగ్గర్లోని సంతకు వెళ్లాలి.
సహాయం కోసం సోమేశ్వర్‌ని పిలవడానికి అతని  ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో సోమేశ్వర్‌ ఇంట్లో లేడు. అతని భార్యకు వాగుడుకాయగా వూర్లో పేరుంది.
‘‘మా ఆయన భుజం నొప్పితో బాధ పడుతున్నాడు. నిన్ననే పట్నంలోని ఆస్పత్రికి వెళ్ళాడు’’ అని చెప్పింది.
తన నాగలి పోవడానికి సోమేశ్వర్‌ భుజం నొప్పికీ సంబంధం వుందా? అని తర్కించుకున్నాడు.
ఆ సాయంత్రం ఒక ఎద్దులబండినికి అద్దెకు తీసుకోవడానికి కొన్లోరా ఇంటికి వెళ్ళాడు. అతన్తో బోలోరామ్‌ తన నాగలి విషయం ప్రస్తావించాడు. సోమేశ్వర్‌ ఇంటికి వెళ్తే అతడు ఆస్పత్రికి వెళ్ళాడని అతని భార్య చెప్పినట్లు కూడా వివరించాడు.
‘‘ఓ! అదా? సోమేశ్వర్‌ ఇప్పుడు పెద్దవాడైపోయాడు. పెద్దవాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు. భుజం నొప్పులు మనకూ వస్తుంటాయి. పోతుంటాయి. కాని అతడు కేవలం భుజం నొప్పి కోసం పట్నం డాక్టర్‌ వద్దకు వెళ్ళాడు’’ కొన్లోరా తన ద్వేషాన్ని దాచుకోలేదు.
‘‘ఇదంతా ఎందుకు జరిగింది? ఈ భుజం నొప్పీ...’’
‘‘అదోకథ! సోమేశ్వర్‌ ఏదో బరువైన కలపవస్తువుని ఎక్కడి నుండో మహజన్‌ ఇంటికి మోసుకెళ్ళాడు. దాంతో భుజం నొప్పి పుట్టింది. మహజన్‌ దగ్గరుండి సోమేశ్వరుని ఆసుపత్రికి స్వయంగా తీసుకెళ్ళి తన డబ్బుతో ఇంజక్షన్లు వేయిస్తున్నాడు’’
బోలారామ్‌ తన నాగలి గతిని నిర్ధారించుకున్నాడు. అతడికి విషయం రూఢి అయింది.
సంతలో కంద మూలాలు త్వరగానే అమ్ముడు పోయాయి. తిరుగుముఖం పట్టిన ఎద్దులు త్వరగా ఊరి వైపు ఉరకలేస్తున్నాయి. బోలోరామ్‌ మనసులో ఆలోచనలు పరుగెడుతున్నాయి.
‘‘అంటే మహజన్‌ స్వయంగా సోమేశ్వర్‌ని పురమాయించి ఈ దొంగతనం చేయించాడు. అందుకే పిసినారి మహజన్‌ సోమేశ్వర్‌ భుజం నొప్పికయ్యే ఖర్చునీ భరిస్తున్నాడు...’’
బోలోరామ్‌ తరువాత రోజు కొన్ని మంచి కందమూలాలను పట్టుకొని  ఆసుపత్రికి బయల్దేరాడు. ఆ డాక్టర్‌ అతని భార్యని ఆపత్సమయంలో రక్షించాడు. అప్పటి నుండే మంచి ఫలసాయాన్ని డాక్టర్‌గారికి ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు.
ఆసుపత్రిలో వున్న అతడి దగ్గర బంధువు మాటల సందర్భంలో మహజన్‌ సోమేశ్వర్‌ల బంధాన్ని ధృవీకరించాడు. కాని ఈ నేరానికి సాక్ష్యం సంపాదించాలి. మహజన్‌ ఇంట్లో నాగలిని పట్టుకోవాలి. కాని అది తనవల్ల సాధ్యం అయ్యేపనికాదు.
నిజానికి మహజన్‌కూ సోమేశ్వర్‌కు మధ్య అంత సౌహార్ద్ర వాతావరణం లేనే లేదు. సోమేశ్వర్‌  భూమిని మహజన్‌ అప్పు కింద గుంజుకున్నాడు. అప్పటి నుండీ సోమేశ్వర్‌ తండ్రి ఇచ్చిన ఎద్దులబండిని అద్దెకు తిప్పుతూ జీవిక కొనసాగిస్తున్నాడు. మహజన్‌ ఆ బండిని అద్దెకు తీసుకున్నా సోమేశ్వర్‌కు అద్దెడబ్బు సరిగ్గా ఇవ్వడు. అయినా సోమేశ్వర్‌ సిగ్గు లేకుండా మహజన్‌ ముందర మోకరిల్లుతుంటాడు. అంతేకాదు, ఇప్పుడు మహజన్‌ కోసం దొంగతనం కూడా చేసాడు.
సరైన సౌకర్యం సంపాదించడానికి రకరకాల మార్గాలు అన్వేషించసాగాడు. ఆ క్రమంలో బోలోరామ్‌కు ధురూకా గుర్తు వచ్చాడు. ధురుకా టీ కోసం చిరు తిళ్ళ కోసం ఇంటింటికి తిరుగుతుంటాడు. అటువంటి వాడ్ని బోలోరామ్‌ ప్రలోభపెట్టాడు. అతడు రెండురోజుల్లో సమాచారం మోసుకొచ్చాడు. మహజన్‌ ఇంట్లో ఒక పెద్ద మంచం క్రింద  చెక్కడం పూర్తి కావొస్తున్న బోలోరామ్‌ నాగలి పడివున్నది!! ఈ మాట వినగానే మహజన్‌ని వీధిలోనికి లాగాలని బోలారామ్‌ ఎన్నో పథకాలు ఆలోచించాడు. కానీ ఏవీ అమలుకాలేదు.
గజేన్‌ మాష్టరు ఈ వూరులోనే పనిచేస్తాడు. కానీ స్థానికుడు కాడు. పశ్చిమ అస్సాంకు చెందినవాడు. వూళ్ళో చాలా విషయాలకు పెద్ద మనిషిగా వ్యవహరిస్తాడు. అందరూ అతన్ని గౌరవిస్తారు.
బోలోరామ్‌ ఆ మాష్టారితో తన నాగలి విషయం ప్రస్తావించాడు.
‘‘నువ్వు చెప్పింది నిజమే కావచ్చు కానీ ఇందుకు సాక్ష్యమేమైనా వుందా?’’ మాష్టరు ప్రశ్నించాడు.
‘‘నాకు కలప నిచ్చిన నేపాలీ వున్నాడు. నా భార్య వున్నది. అంతేకాదు  ఎవరైనా నాగలిని పడుకునే మంచం క్రింద పెట్టకుంటారా.’’ అన్నాడు బోలోరామ్‌.
‘‘ఇలాంటి రుజువులతో  మనం దొంగతనం ఆరోపించలేం. పోలీస్‌స్టేషనుకు వెళ్ళు. ఫిర్యాదు నమోదు చెయ్యి, వాళ్ళే చూసుకుంటారు’’
బోలోరామ్‌ నిరాశ చెందాడు. పోలీస్‌ స్టేషను అంటే పని మాని నాలుగు మైళ్ళు నడవాలి. అవసరమైతే లంచం ఇవ్వాలి. ఇప్పుడు పోలీసు వారు కూడా మహజన్‌ ఇంటికి వెళ్ళి అతనిచ్చిన తినుబండారాలు తిని, టీ తాగి, అతడి నుండి డబ్బు కూడా గుంజి, ఏమి లేదని తేల్చేస్తారు. మహజన్‌ తనకన్నా ఎక్కువే ఇవ్వగలం, అక్కడితో కథ ముగిసిపోతుంది. వారందరూ ఒకే వర్గం వారు. కాబట్టి పోలీసు ఫిర్యాదు నిరుపయోగమైంది.
మరో రెండు రోజులు బోలోరామ్‌ ఆందోళనతో, అశాంతితో గడిపాడు. ధురుకా సలహా  ఇచ్చాడు: ‘‘విషయం బయట పెట్టెయ్యి. ఏం జరుగుతుందో చూద్దాం’’
ఈలోగా వార్షిక జాతర, నాటకాల ఉత్సవం రానే వచ్చింది. సంఘకార్యాలయంలో రిహార్సల్సు జరుగుతున్నాయి. వూరంతా అక్కడే వుంటారు. మరోసారి ధురుకాను  పంపి నాగలి అక్కడ వున్నదో లేదో చూసి రమ్మని పంపాడు. తను ముఖ్యపాత్ర పోషిస్తున్న నాటకం తరువాత గ్రామ న్యాయస్థానానికి ఫిర్యాదు చేయాలని యోచించాడు.
కాని ధురూకా దుర్వార్త తెచ్చాడు పాతస్థలంలో నాగలి ఇప్పుడు లేదు! బోలోరామ్‌కు ఏమీ పాలు పోలేదు. ఇక ఫిర్యాదు చెయ్యడం ఎలా?
ముందుగా ధైర్యం చెయ్యలేకపోవడమే ఈ స్థితికి కారకం అని చింతించాడు.
నాటకం బాగానే జరిగింది కానీ బోలోరామ్‌ ఊహించిన స్థాయిలో నటించలేకపోయాడు, పాడనూ లేకపోయాడు. సంతోషంగా ఉండలేకపోయాడు.
రాత్రంతా నిద్రలేకపోవడం చేత బోలోరామ్‌కు నిద్రమత్తుతో కళ్ళు మూతపడిపోతూనే వున్నాయి. కానీ టీ తాగి బీడీలు కొనుక్కుందామని ఘనశ్యామ్‌ దుకాణానికి వెళ్ళాడు.
అక్కడ సోమేశ్వర్‌ చిన్న బెంచీ మీద కూర్చుని వున్నాడు. కొద్దిసేపు బోలోరామ్‌ చూపుల్ని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.
 అంతలోనే ‘‘అన్నా! ఎలా వున్నావు?’’ అని బోలోరామ్‌ని పలకరించాడు.
నిద్రలేమితో వున్నప్పటికీ బోలోరామ్‌ వస్తున్న కోపాన్ని అణచుకున్నాడు.
 ‘‘నువ్వు నన్ను అలా పిలవకు’’ కటువుగా అన్నాడు.
సోమేశ్వర ముఖంలో రంగులు మారాయి.
‘‘నేనేం చేసాను? ఎందుకు పిలవకూడదు?’’ అంటూ ఇంకేమో అనబోయాడు.
బోలోరామ్‌ అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. ఇన్నాళ్ళుగా దాచుకున్న అగ్నిపర్వతం అతన్లో ఒక్కసారిగా బ్రద్దలయింది.
‘‘ఏంచేసానని అడుగుతున్నావా? నువ్వొక దొంగవి. దుర్మార్గుడివి’’ బోలోరామ్‌ గొంతు పైకి లేస్తున్నది. పుంఖాను పుంఖాలుగా తిట్లు వస్తున్నాయి.
సోమేశ్వర్‌ కూడా అంతే. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. 
‘‘మాటలు జాగ్రత్తగా రానీ!’’
‘‘ఎందుకు జాగ్రత్తగా రావాలి?’’
‘‘నేను దొంగతనం చేయడం నువ్వు చూశావా?’’
‘‘నువ్వు నా నాగలి దొంగతనం చేశావు. మహజన్‌ కోసం దొంగిలించావు. అంచేత నీకు భుజం నొప్పి పెట్టింది. హాస్పిటల్‌కు వెళ్ళి మహజన్‌ ఖర్చులతో ఇంజక్షన్లు చెయ్యించుకున్నావు. ఇవన్నీ నాకు తెలుసు’’ బోలోరామ్‌ మండిపడ్డాడు. ఈ గొడవంతా విని జనం పోగు పడ్డారు. అంతలోనే గజేన్‌ మాష్టరు కూడా వచ్చాడు.
 ‘‘ఎందుకు? ఎందుకలా తిట్టుకొంటున్నారు?’’ అంటూ అతడు ఇద్దరి మీద కేకలేసి ఆపాడు.
‘‘ఈ దుర్మార్గుడు సోమేశ్వర్‌ని చూసావా? మహజన్‌ ప్రోద్బలంతో నా నాగలిని దొంగతనం చేశాడు. తన పడగ్గదిలో మంచం కింద దాచాడు. వాస్తవానికి మహజన్‌ వీడ్ని బికారిని చేశాడు, అన్ని విధాల ముంచేశాడు. అయినా ఇంకా అతడి కాళ్ళే నాకుతున్నాడు’’ అన్నాడు బోలోరామ్‌.
‘‘అరుస్తున్నావు నిజమే. కాని నిరూపించగలవా?’’ సోమేశ్వర్‌ తిరగబడ్డాడు.
‘‘సోమేశ్వర్‌! నువ్వు నాగలి తీసివుంటే ఒప్పేసుకో. బోలోరామ్‌! నువ్వు పోలీస్‌స్టేషన్‌కి వెళ్ళాలిగానీ ఇలా వీధిలో గొడవ పడకూడదు’’ అన్నాడు గజేన్‌ మాష్టరు.
‘‘మాస్టారూ! ఈ సోమేశ్వర్‌ తండ్రి చనిపోయినప్పుడు నేను మూడు రాత్రులు మేల్కొని వున్నాను. ఊర్లో ఒక్కడు కూడా రాలేదు. నేను నా భార్య తరపు బంధువుల్ని పిలిచి అంతిమ సంస్కారాలు చేయించాను. ఇతగాడి ఎద్దుకు సుస్తీ చేస్తే దున్నుకోడానికి నా ఎద్దుని ఇచ్చాను. ఇవన్నీ మరిచి నాకు చేసిన ప్రత్యుపకారం నా నాగలి దొంగతనం. ఈ విషసర్పం మనకు సహాయం చేసిన వాడినే కాటేసింది’’ బోలోరామ్‌ గజేన్‌ మాష్టరుకి ఫిర్యాదు చేశాడు.
సోమేశ్వర్‌ వైపు వేలు చూపుతూ ఇంకా ఇలా అన్నాడు:
 ‘‘ఆ మహజన్‌ నీ సర్వసాన్ని దోచుకున్నాడు. అయినా నీకింకా గుణపాఠం రాలేదు. మీ నాన్న వైద్యానికి, అంత్యక్రియలకూ అప్పు ఇచ్చి దానికి వడ్డీ కట్టి ఆ మొత్తం క్రింద నీ భూమిని గుంజుకున్నాడు. అప్పుడప్పుడు ఇచ్చిన చేబదుళ్ళకు మారుగా నీ ఫలసాయాన్నీ దోచుకున్నాడు. అటువంటి వాడిపై తిరుగుబాటు చేయడానికి బదులుగా ఉపకారం చేసిన మిత్రుడికి అపకారం చేస్తున్నావు. నీకు మహజన్‌ అంటే భయమెందుకు? అతడి భూమిని నీకు కౌలుకు ఇవ్వడనా? అతడు ఇవ్వకపోతే ఈ ఊర్లో భూమిని కౌలుకి ఇచ్చేవారు వందమంది ఉన్నారు. నువ్వు వానపాములాంటి వాడివి. నీకు వెన్నుముక లేదు. అతడి భూమి ఎన్నో సంవత్సరాలుగా దున్నుతున్నావు. కాని భూమ్మిద నీకు హక్కు లేదు. ఈసారి నాతో పాటు రా. దున్నేవాడి దగ్గర నుండి భూమిని ఎలా తీసుకుంటాడో చూస్తాను’’ బోలోరామ్‌ ఆగాడు. జేబులో చెయ్యి పెట్టి బీడి కోసం  తడుముకున్నాడు.
గజేన్‌ మాష్టరు సర్ది చెప్పడంతో  తాత్కాలికంగా ఉద్రిక్త పరిస్థితి సద్దుమణిగింది. అక్కడున్న వారందరూ బోలారామ్‌నే సమర్థించారు. సోమేశ్వర్‌ సిగ్గుతో తలదించుకొని మౌనం వహించాడు. అతనిలో ఆత్మగౌరవభావం ఆవిర్భవించింది. తనెవరికి బానిస కాను అన్న స్పృహ ఉవ్వెత్తున పైకి పొంగింది.
‘నిజమే, మహజన్‌ తన సర్వస్వాన్నీ కాజేసాడు. అతడి మాట నేనెందుకు వినాలి? దొంగతనానికి కూడా ఎందుకు ఒడిగట్టాలి? పదిమంది ముందరా తనెందుకు దోషిగా నిలబడాలి’ ఇటువంటి ఆలోచనలు  సోమేశ్వర్‌ని బానిస సంకెళ్ళ నుండి విముక్తుడ్ని చేసాయి.
‘‘బోలారామ్‌ మాట నిజమే. సోమేశ్వర్‌! నీకేం భయం లేదు. నిజం చెప్పడానికి సంకోచించనక్కర్లేదు. లేదంటే నన్ను పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళనివ్వు’’ అంటూ గజేన్‌ మాష్టరు  బలల్దేరడానికి సిద్ధమయ్యాడు. సోమేశ్వర్‌ మాష్టారి కాళ్ళు పట్టుకోబోయాడు.
‘‘అయ్యో! ఏంచేస్తున్నావు? నన్ను కాదు, వెళ్ళి బోలోరామ్‌ని క్షమించమను. ప్రజలకూ క్షమాపణ చెప్పు. నువ్వొక నేరం చేసావు. ఒక మనిషి ఇంకొక వ్యక్తికి బానిస కాదు. వెళ్ళు, ఆ నాగలి తెచ్చి బోలోరామ్‌కి ఇచ్చెయ్యి’’ గజేన్‌ మాష్టరు సోమేశ్వర్‌కు సూచించాడు. అంతలోనే సైకిల్‌ తీసుకొని తన పని మీద తను వెళ్ళిపోయాడు.
సోమేశ్వర్‌ బోలోరామ్‌తో అన్నాడు: ‘‘అన్నా! రా! మనం వెళ్ళి నాగలి తెచ్చుకుందాం’’
‘‘నేను రాను. నువ్వే వెళ్ళు. నాగలి ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే పెట్టు. నేనైతే కేవలం బీడీలు కొనడానికి వచ్చాను’’ అన్నాడు బోలోరామ్‌.
కొద్ది క్షణాల క్రితం ఆగ్రహంతో రెచ్చిపోయిన వ్యక్తి ఇప్పుడు చల్లారి పోయాడు.
‘‘అయితే నాకొక బీడీ ఇవ్వు’’ అన్నాడు సోమేశ్వర్‌.
బోలోరామ్‌ తన కట్టలోంచి ఒక బీడిని సోమేశ్వర్‌కు  ఇచ్చాడు.
ఆ సాయంత్రం ఒక విచిత్రమైన సన్నివేశం ఆ గ్రామంలో కలకలం రేపింది.
నాగలి భుజాన వేసుకున్న సోమేశ్వర్‌ వీధుల వెంబడి త్వర త్వరగా అడుగులు వేస్తున్నాడు. అతడి వెనుక దుమ్ము పట్టిన శరీరాలతో నగ్నంగా వున్న చిల్లపిల్లలు గుంపుగా పరుగెడుతున్నారు. నడుస్తూ నడుస్తూ విజయగర్వం వంటి చూపుతో ఒక్కసారిగా ఆగి వెనక్కు తిరిగాడు.
పిల్లలు కూడా ఉలిక్కిపడి ఆగారు. మళ్ళీ సోమేశ్వర్‌ నడక మొదలు పెట్టాడు. పిల్లలూ నడిచారు. వీధులన్నీ కోలాహలంగా వున్నాయి,
సోమేశ్వర్‌ మనస్సూ శరీరమూ తేలికపడ్డాయి. అతడు గదాధారుడై లంకను తగలబెడుతున్న హనుమంతుని వలె ప్రస్థానిస్తున్నాడు. ఈ పాత్రనే అతడు మొన్న ఆ వూరి తిరునాళ్ళలో పోషించాడు. ఇప్పుడు వూరి జనమంతా చోద్యం చూస్తూ నిలబడ్డారు.
సోమేశ్వర్‌ ఆకాశం వైపు ఆనందంగా కుడిచేతిని పైకెత్తాడు.
‘‘ఇదిగో నాగలి దొంగని వస్తున్నాను. పట్టుకోండి...పట్టుకోండి’’ అని బిగ్గరగా అరిచాడు. గుంపులో నిశ్శబ్దం ఆవహించింది. అతని వెనుక పిల్లలు కూడా ఉత్సాహంగా అరిచారు:
 ‘‘నాగలి దొంగని పట్టుకోండి...పట్టుకోండి’’.
కానీ ఎవరూ అతడ్ని పట్టుకోలేదు. అడ్డుకోనూ లేను.
తను చేసిన నేరాన్ని బహిరంగంగా  అంగీకరించడంలో వున్న  ఆనందాన్ని సోమేశ్వర్‌ ఆ క్షణంలో అనుభవిస్తున్నాడు. ఒక పాపాన్ని ప్రక్షాళన చేసుకొంటున్నట్లూ తనకు తానే పునీతుడైనట్లూ భావిస్తున్నాడు. అతడి గొంతు ఇంకా పైకి లేస్తున్నది.
తన ఇంటి అరుగు మీద కూర్చొని హుక్కా పీలుస్తున్న మహజన్‌  ఈ కల్లోలాన్ని గమనించాడు. సోమేశ్వర్‌ అరుపుల్నీ విన్నాడు. తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. మరింత రభస జరిగితే తన పేరే బయటకు వస్తుందనీ భయపడ్డాడు.
కంచె వెనక్కు పోయి దాక్కున్నాడు. అతడి శరీరం వణికింది. ఊపిరి ఆగిపోయినంత వేగంగా గుండె కొట్టుకున్నది.
ఊరేగింపు తన ఇంటిముందు చేరేసరికి మహజన్‌కు మెదుడులోని రక్తనాళాలు చిట్లినంతపనయింది. సోమేశ్వర్‌ హలాయుధధారిౖయె బలరాముడి వలె తన ఇంటివైపే వేగంగా నడుస్తున్నాడు. పిల్లలూ అతడి వెనక పరుగెడుతున్పారు. ఆ జనసందోహంలో మహజన్‌ తనకు అత్యంతప్రీతిపాత్రుడైన తన అయిదేళ్ళ చిన్న కుమారుడ్ని గుర్తించాడు. వాడూ ఆనందంతో నృత్యం చేస్తూ అరుస్తున్నాడు.
మహజన్‌ ఇంటిలోనికి దూరి తలుపులు వేసుకున్నాడు. శరీరం మరింత తీవ్రంగా వొణక సాగింది. గుండె కూడా కొన్ని సెకెన్ల పాటు ఆగింది. అతడు అచేతనుడై నేల మీద పడిపోయాడు.
చేసిన నేరాన్ని బయటికి అంగీకరించిన సోమేశ్వర్‌ మనసు భారం తరిగి సంతోషంగా ఊరేగుతున్నాడు. చేయించిన నేరాన్ని బయటికి చెప్పుకునే ధైర్యం లేని మహజన్‌ గుండె భారం పెరిగి చతికిలబడిపోయాడు.

మరిన్ని వార్తలు