అసమర్థుడి ఆర్థిక జీవనం

17 Nov, 2019 04:18 IST|Sakshi

గుమస్తాలు గాబరా పెడతారు. కౌంటరు ఊచలు లోపల్నుంచి కంగారు పుట్టిస్తాయి. రూపాయల కట్టలు, నోట్లు, చిల్లరకుప్పలూ, అవే అంతర్యంలో నుండి ఆందోళనను పురిగొల్పుతాయి.
ఆ సమయంలో కంటపడ్డ ప్రతీదీ కంగారు పుట్టిస్తుంది.
నిప్పు తొక్కిన కోతిలా అయిపోతాను. నేను బ్యాంకు ఆవరణలో అడుగు పెట్టీ పెట్టడంతో గంద్రగోళపడిపోతాను. కలవరపాటు ఆవేశిస్తుంది నన్ను.
ఏదో వ్యాపారరీత్యా కౌంటర్‌ వద్దకు చేరిన మరుక్షణం నుంచి (కలవరపాటనండి, కంగారు వలననండి) నేను శుద్ధ తెలివి తక్కువ వాజమ్మలా ప్రవర్తించడం కద్దు!
ఈ సంగతి నాకు తెలుసు. తెలిసినా ముందుజాగ్రత్త పడ్డాని కవకాశమున్నా గత్యంతరం లేకుండా పోయింది. ఎందువల్లనంటే ఇప్పుడు నా జీతాన్ని యాభై రూపాయలు పెంచారు. ఈ పెంచడం వల్ల కాస్తో కూస్తో ఆదా చేయవలసిన అవసరం ఏర్పడి, అందుకోసం బ్యాంకుకు వెళ్ళవలసి రావడం తప్పనిసరి తద్దినమై కూర్చుంది. 
సరే వెళ్ళాను కాళ్ళీడ్చుకుంటూ. 
ఇక ‘మీ పాల బడ్డాను పాల ముంచినా నీటముంచినా’ అనుకుంటూ భీరువై కలయ చూశాను గుమస్తాలందర్నీ.
ఏ పరమదౌర్భాగ్యుడన్నా బ్యాంకులో ఖాతాదారుడు కావాలంటు, వాడు ముందు మేనేజర్‌ను అడిగి ఆయన సలహా పుచ్చుకుని  ఆ పైన ఏడవాలని అది చాలా అవసరమని నాకు లీలగా గుర్తు.
‘అకౌంటెంట్‌’ అని బోర్డు రాసి ఉన్న కంత దగ్గరకు నేరుగా వెళ్ళాను.
 పిశాచిలా బ్రహ్మరాక్షసుడిలా పొడుగ్గా ఊచలా ఉన్నాడు ఆ ‘అకౌంటెంట్‌’. వాడ్ని చూడడంతోనే నాకు లోపల్నుంచి కుండల్లో గుర్రాలు త్రోలినట్లు గాబరా ఎత్తుకొచ్చింది. ఉన్నట్టుండి నా గొంతుక కూడా పూడిపోయింది.
అశ్వత్థామహతః కుంజరః అన్నట్లు పైకి ‘మేనేజర్ని చూడ్డానికి వీలవుతుందా’ అని అడుగుతూ మెల్లగా  ‘కొంచెం ప్రత్యేకంగా ఒక్కడ్నీ కలుసుకోవాలి’ అన్నాను. ఎందుకట్లా ఒంటరిగా ఒక్కడ్నీ కలుసుకోవాలనుకున్నానో నాకే తెలియదు. అనేశాను.
 నోరు జారింది ఆ ముక్క.
‘‘తప్పకుండా కలుసుకోవచ్చు. దానికేం అభ్యంతరం?’’ అంటూ  మేనేజర్‌కు కబురు చేశాడు.
మేనేజర్‌ చూడ్డానికి ఇక శ్మశాన గంభీర వదనుడు. నెమ్మదస్తుడల్లేనే ఉన్నాడు.
‘‘అయ్యా! తమరేనా  మ్యానేజరంటూ’ ఆర్దోక్తిలో ఆగి అడిగాను.
ఆయన మేనేజర్‌ కావచ్చు. కాకుండా పోడని నాకేమీ సందేహం లేదు.
మరి ఎందుకట్లా అడిగానో ఆ బుద్ధి ఎల్లా పుట్టిందో భగవంతుడికి తెలియాలి.
చెప్పానుగా అంతకంతకు గందరగోళంలోకి దిగిపోతానని.
‘‘అవును నేనే’’ అన్నాడా పెద్దమనిషి.
‘‘అయితే నేను  తమర్ని కలుసుకోవచ్చా?’’ అంటూ ఆగి ‘కొంచెం ప్రత్యేకంగా’ అని అర్థించాను.
ఈమారు మిమ్మల్ని ఒంటరిగా కలుసుకోవాలి అన్న అర్థమిచ్చే ముక్క వాడకుండా ఉందామనుకున్నాను కాని–అది నోరు జారింది తీరా ఎంత వద్దనుకున్నా.
మేనేజర్‌ కొద్దిగా భయపడుతున్నట్టు ముఖంలో గాబరా చిన్నెలతో కనిపించాడు. చెప్పరాని భయంకర పరమరహస్యమేదో నేను విప్పబోతున్నానని అతను తప్పకుండా అనుకుని ఉంటాడు.
‘‘అయితే ఇటు రండి’’ అంటూ ఒక ప్రత్యేకమైన కొట్టుగదిలోకి నన్ను నడిపించుకెళ్ళాడు. మేం లోపలికి చేరుకున్న తరువాత భద్రంగా తలుపులు మూసి తాళం చెవిని త్రిప్పి నా దగ్గరకు వచ్చి–
 ‘‘ఇక్కడ ఏ గోడలకు చెవులుండవు. కూర్చోండి. కూర్చుని మీరు నిస్సందేహంగా చెప్పదలిచినది చెప్పవచ్చు’’ అన్నాడు.
మేమిద్దరం ముఖాముఖి కుర్చీల్లో కూలబడ్డాం.
ఏం మాట్లాడ్డానికి నాకు నోరు పెగిలి రావడం లేదు.
‘‘బహుశా మీరు పోలీసు పరిశోధక శాఖ ఉద్యోగి అనుకుంటాను’’ అన్నాడు బ్యాంకు మేనేజర్‌ సవినయంగా.
నా విచిత్ర ప్రవర్తనాదికాల్నుంచి నేనొక డిటెక్టివునని ఆయన పొరబడ్డాడు.
అతనట్లా నన్ను గూర్చి ఊహిస్తున్నాడని తెలియగానే మరీ అధ్వాన్నమైపోతూ–
‘‘అబ్బే!  ఇక్కడ డిటెక్టివ్‌ని కాను నేను’’ అని అసందర్భంగా ఏదో ప్రేలాను.
‘‘అస్సలు నిజం చెప్పాలంటే–’’ అంటే నేను ఇదివరకు అబద్ధమే చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నట్లు–ఇప్పుడు నిజం చెప్పబోయేట్లుగా అటువంటి ధోరణిలో–
‘‘నేనస్సలు డిటెక్టివుని కానండీ. నేనొక అకౌంటు తెరుద్దామని వచ్చినవాడ్ని అంతే–నా డబ్బు యావత్తూ ఇక్కడే, అంటే మీ దగ్గరే ఉంచుతాలెండి’’ అన్నాను.
మేనేజర్‌ ‘అమ్మయ్యా!’ అని ఊపిరి పీల్చుకుంటూ, ఇంకా ఆతృతతో నేనొక మహారాజాసంబంధినో–పిల్ల జమిందారుడి కొడుకునో అనుకుంటూ ‘‘బహుశా! చాలా పెద్ద మొత్తమై ఉంటుంది మీ డిపాజిట్టు’’ అన్నాడు నాకేసి తిరిగి.
‘‘అయ్యో! నిస్సందేహంగా–’’ అని గొణుగుతూ అన్నాను.
‘‘ఇప్పుడొక మారు మొత్తంగా యాభై ఆరు రూపాయల డిపాజిట్టున్నూ, తరువాత నెలవారీని ప్రతినెలా యాభై రూపాయల చొప్పున వేసీ తీరాలనుకుంటున్నాను’’
మేనేజర్‌ గభాల్నా లేచి గది తలుపులు బార్లా తెరిచాడు.
అకౌంటెంట్‌ను బిగ్గరగా కేకలేస్తూ–నిర్దయగా గుమ్మంలోంచే–
‘‘ఈయన యాభై ఆరు రూపాయలు బ్యాంకులో వేస్తాట్టా, చలాను రాసి డబ్బు పుచ్చుకో–’’ అని కేక∙వేశాడు.
నేను లేచాను.
ఎదురుగా గదిలో ఓ ప్రక్కన పెద్ద ఇనుప దర్వాజ ఒకటి తెరిచి ఉంది.
‘గుడ్‌ మార్నింగ్‌’ అంటూ అందులోకి నడిచాను. రెక్క పుచ్చుకొని ‘ఇటు’ అంటూ వచ్చిన దారికేసి తిప్పాడు.
అది బహుశా బ్యాంకు డబ్బు దాచే ఇనుపపెట్టె గది అయిఉంటుంది.
అకౌంటెంట్‌ బోర్డు కట్టి ఉన్న కంత దగ్గరకు తిరిగి వెళ్లి నిలబడ్డాను. నలుగుర్నీ విస్మయాందోళనలో ముంచి గమ్మత్తు చేయనుద్దేశించిన వాడిలా డబ్బు మొత్తాన్ని అకౌంటెంటు ముఖానికెదురుగా బోర్లించాను.
అప్పటికే నా ముఖం గలాటాలో తన్నులు తిని వచ్చినవాడికి మల్లే తెలతెలబోతూ వెలవెలబోతూ ఉంది.
‘ఈ మొత్తాన్ని ఇక్కడ డిపాజిట్టు చేయాలి!’ అన్నా.
ఏంచేస్తాం ఈ శవాన్ని ఇక్కడే గొయ్యి తీసి కప్పెట్టాలి, మనిద్దరికీ ఈ బాధ తప్పదు..అని స్ఫురించేట్టు  ఉంది కామోసు నా ముఖం.
ఆ డబ్బు తీసుకుని ఇంకో గుమస్తా చేతుల్లో ఉంచాడు. అతను నన్నో స్లిప్పు మీద ఇంత మొత్తమని రాయించి ఏదో పుస్తకంలో సంతకం చేయించాడు. నేను ఏంచేస్తున్నానో నాకే తెలియదు. బ్యాంకు నా సొమ్ముని నా కళ్ల ముందరే హరించి వేసింది చూస్తుండగా.
‘‘సొమ్ము బ్యాంకులో పడ్డట్లేనా?’’ అని సంశయత్మాకంగా ప్రశ్నించాను.
‘‘మీ సొమ్ము డిపాజిట్టు చేయబడింది. ఇక మీరు వెళ్లవచ్చు’’ అని సూచించాడు అకౌంటెంట్‌.
‘‘అట్లా అయితే నేను చెక్కు రాయాలి అనుకుంటున్నాను’’ అని నా మనస్సులోని ఉద్దేశాన్ని వెళ్లగక్కాను.
అసలు నేనేమనుకున్నానంటే, ఓ ఆరురూపాయలు ప్రసుత్తం వాడకానికి బ్యాంకులోంచి చెక్కు ద్వారా బయటకు తీద్దామని.
 ఒక కంతలోంచి ఎవరో చెక్కుబుక్కు నాకు అందచేశారు. ఇంకొకరు చెక్కు ఎలా రాయాలో తెలియ చెప్పనారంభించారు నాకు.
వాళ్ళు నేనేదో మిలియనీరనే భావనలో పడికొట్టుకుంటున్నారు.
ఏదో నాలుగు ముక్కలు నాకు తోచినట్టు చెక్కు మీద రాసి గుమస్తా ముఖాన పారేశాను. అతను చెక్కుకేసి చూశాడు.
‘‘ఏమిటి? మొత్తం సొమ్మంతా తీసేస్తున్నారా?’’ అని ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘హరిభగవంతుడా! యాభైఆరు రూపాయలకని చెక్కుల్లో  రాశాను కాబోలు’’ అని నా కప్పుడు తట్టింది.
ఆరు రూపాయలకని రాయటానికి ఎందుకట్లా రాశానో ఆ కారణానికి నేను చాలా దూరంగా ఉండి పోయాను.
అదీగాక ఇప్పుడెందు కట్టా అంత మొత్తానికి చెక్కు రాశానో విడమర్చి చెప్పడం నా తలకు మించిన కార్యంలా తోచింది. 
అసలా సందర్భం తెలియ చెప్పటం కష్టం కూడా.
ఎవరి పనుల్లో వాళ్ళు రాసుకుంటున్న గుమస్తాలల్లా పన్లు మానేసి అంతా నాకేసి చూడసాగారు.
నాకు వొళ్ళు మండిపోయింది,
రిమ్మెత్తుకొచ్చింది.
‘‘అవును. మొత్తం సొమ్మంతా తీసేస్తున్నాను’’
‘‘బ్యాంకులో ఉన్న సొమ్మంతా లాగేస్తున్నారే?’’ తిరిగి రెట్టించాడు ఆశ్చర్యంతో.
‘‘అవును. ఒక  కానీ కూడా ఉంచను’’
‘‘అయితే తిరిగి మీరే  మొత్తం డిపాజిట్‌ చెయ్యరా?’’
‘‘శుద్ధ అనవసరం. ఇహ ఈ జన్మలో–’’ అనేసిన మరుక్షణం, ఒకటో రకపు బుద్ధి తక్కువపు ఆలోచన నా మెదడులో ప్రవేశించింది.
వాళ్ళంతా నాకిక ఏదో అవమానం జరిగి ఉంటుందనీ– ఏ చెక్కు రాయటంలోనో నాకు కోపం రేగి నా మనస్సు మార్చుకున్నాననీ–అందుకని డబ్బంతా లాగేస్తున్నాననీ బ్యాంకు మీద  ఆగ్రహించానని అనుకుంటారనీ ఆశించాను.
చాలా తొందరపడే స్వభావం కలవాడిలాను, ముక్కోపిలానూ కనపడ్డానికని కోపిష్టిలా నటించడానికి ప్రయత్నించాను.
నన్నేం బతిమాలలేదు. గుమస్తా డబ్బు తిరిగి ఇచ్చి వేయడానికి సిద్దపడ్డాడు.
‘‘డబ్బు ఏ డినామినేషల్లో వుచ్చుకుంటారు?’’ అని అడిగాడు.
‘‘ఏమిటంటున్నారు?’’
‘‘మీకు డబ్బు ఏ రకంగా కావాలి. పదులా ఐదులా?’’
‘‘ ఓహ్హ్‌!’’ గుమస్తా ఉద్దేశాన్ని గ్రహిస్తూ ఆలోచించటానికి ప్రయత్నించకుండానే–
‘‘అయిదు పదులివ్వండి చాలు’’ అన్నా.
అయిదు పది రూపాయల నోట్లు చేతిలో పెట్టాడు.
‘‘మిగతా ఆరు మాటో–’’ అన్నా తెలివిగా.
‘‘ఆరు రూపాయల నోట్లిస్తాను’’
ఆరు రూపాయల నోట్లు నా చేతిలో పెట్టిన మరుక్షణం, బతుకుజీవుడా అంటూ ఇవతలకూడిపడ్డాను బ్యాంకులోంచి.  నేనింకా గుమ్మం దాటకుండానే భూనభోంతరాళాలు దద్దరిల్లేలా నవ్వుతున్న ఘోష, సవ్వడి నా వీనులను తాకింది.

మరిన్ని వార్తలు