సెన్సార్‌

12 Jan, 2020 04:44 IST|Sakshi

పాపం క్వాన్‌! 
ఒకరోజు అతను కొంచెం అజాగ్రత్తగా ఉన్నప్పుడు పట్టుబడ్డాడు. అదృష్టరేఖ తగిలిందని ఆనందిస్తూ ఉన్నప్పుడు, అది విధి ఆడుతున్న చేదు నాటకం అని తెలుసుకునే లోపలే జరిగిపోయిందది. అందరికీ జరిగేదే..ఏమరుపాటుగా ఉండే ఒక్క క్షణంలో ముంచుకొచ్చే అనర్థం. 
అసలేం  జరిగిందంటే,
మరియానా పారిస్‌లో ఉంటున్న విషయం, ఆమె అడ్రసూ ఒక నమ్మకస్తుడైన మిత్రుడి దగ్గరినుంచి దొరికినప్పుడు క్వాన్‌ నరనరాల్లో సంతోషం (భరోసా లేని భావన!) నిండిపోయింది.
తనకి తెలుసు, ఆమె తనని అస్సలు మర్చిపోయుండదు. అంతే–ఇహ రెండో ఆలోచన లేకుండా టేబుల్‌ దగ్గర కూర్చుని, ఆమెకి ఆ ఉత్తరం రాసేశాడు. ఆ ఉత్తరం తను చేస్తున్న పని మీద ధ్యాస నిలవనీకుండా, పడుకుంటే రాత్రికి నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్న ఆ ఉత్తరం. 
(అసలు తను ఏం గిలికాడు? ఆ కాగితాల మీద ఏం రాశాడు?)
తను రాసింది వేలెత్తి చూపగలిగింది కాదనీ, హానికరమైనది కాదనీ క్వాన్‌కి తెలుసు. కానీ మిగతా విషయాల మాటేమిటి? వాళ్లు ప్రతి ఉత్తరాన్నీ చదివి, పరిశీలించి, వాసన చూసి, తడిమి చూసి, చివరికి వాక్యాల మధ్య ఖాళీలనీ, కామాలనీ, కాగితం మీద పొరపాటున ఒక మరక పడితే దాన్ని కూడా శల్యపరీక్ష చేస్తారు.
 సెన్సార్‌ ఆఫీసులో ప్రతి ఉత్తరమూ ఒక చేతి నుంచి మరో చేతికి మారుతూ, రకరకాల పరీక్షలకి గురయి, చివరికి చాలా కొద్ది ఉత్తరాలే బతికి బట్ట కడతాయి. ఈ పరీక్షల ప్రక్రియ పూర్తవడానికి కొన్ని నెలలు పడుతుంది, ఒక్కోసారి కొన్ని సంవత్సరాలు కూడా పడుతుంది–ఉత్తరాల్లో ఏ లోపాలూ లేకపోతే.
 ఉత్తరం రాసినవాడిదీ, ఎవరికి రాశారో వాళ్లదీ స్వేచ్ఛ, ఒక్కోసారి ప్రాణం కూడా ఆ పరీక్షలు పూర్తయేవరకూ ప్రమాదంలో ఉన్నట్టే లెక్క. సరీగ్గా ఈ కారణం వల్లనే క్వాన్‌ ఆందోళన పడుతున్నాడు.
 తన ఉత్తరం వల్ల మరియానాకి ఏదైనా ప్రమాదం వాటిల్లుతుందేమో అని. ఆమె తన కలల రాజ్యం పారిస్‌కి ఇప్పుడు క్షేమంగా చేరుకుని ఊపిరి తీసుకుంటున్న సమయాన ఏదైనా కీడు జరుగుతుందేమో అని. ఈ సెన్సార్‌ వాళ్ల సీక్రెట్‌ కమాండ్‌ గ్రూప్‌ ప్రపంచంలోని ఏ మూలకైనా వెళ్లగలరనీ, పారిస్‌ వెళ్లకుండా వాళ్లని ఏ శక్తీ ఆపలేదనీ, మరియానాని కిడ్నాప్‌ చేసైనా సరే తీసుకురాగలరనీ అతనికి తెలుసు. 
సరే–వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. వాళ్ల యంత్రాంగంలోనే దూరిపోవాలి. ఏదో చేసి, సమస్య అంతు చూసి, దాన్ని నిరోధించాలి.
అలా ఓ పథకం వేసుకుని, సెన్సార్‌షిప్‌ డివిజన్‌లో ఉద్యోగానికి క్వాన్‌ అప్లై చేసాడు. ఆ ఉద్యోగమే సంపాదించాలి. తన ఉత్తరాన్ని వెళ్లి పట్టుకోగలగాలి. చివరికి అనుకున్నట్టుగానే ఆ ఉద్యోగం వచ్చింది. సెన్సార్‌ వాళ్లకి కూడా ఇంకా ఇంకా మనుషులు కావాల్సి వస్తోంది కాబట్టి, వస్తున్నవాళ్ల రిఫరెన్సులూ అవీ అంత శ్రద్ధగా చెక్‌ చేయడం లేదు. 
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నవాళ్లలో కనిపించే లొసుగులు ఏవైనా ఉంటే వాటిని ఉపేక్షిస్తారని కాదు గానీ, సెన్సార్‌షిప్‌ డివిజన్‌ వారికి ఉద్యోగార్థుల పట్ల మరీ అంత కఠినంగా ఉండవలసిన అవసరం లేదు. ఒకవేళ ఎవడైనా తన ఉత్తరం పట్టుకోవడానికే ఉద్యోగానికి వచ్చినా, అదంత తేలికైన విషయం కాదు. పోనీ, అలా ఒకటి రెండు ఉత్తరాలు చేయిజారిపోయినా, కొత్తగా చేరినవాళ్లు సెన్సార్‌ చేయబోయే అసంఖ్యాకమైన ఉత్తరాల సంఖ్యతో పోలిస్తే జారిపోయే ఆ ఒకటి రెండూ ఒక లెక్కా? 
ఆ విధంగా క్వాన్‌ పోస్టాఫీస్‌ వారి సెన్సార్‌షిప్‌ డివిజన్‌లోకి ఒక స్థిరమైన లక్ష్యంతో దిగ్విజయంగా అడుగుపెట్టగలిగాడు. 
బయటికి మామూలు సందడితో కనిపించే సెన్సార్‌షిప్‌ డివిజన్‌కీ, లోపల జరిగే గంభీరమైన విషయాలకీ అస్సలు పొంతన లేదు. కొంచెం కొంచెంగా క్వాన్‌ తన పనిలో మునిగిపోవడం ప్రారంభించాడు. తను మరియానాకి రాసిన ఉత్తరం పట్టుకోవాల్సిన దిశగా అడుగులు వేయగలుగుతున్నందుకు మనస్సు ఇప్పుడు  కొంచెం భరోసాతో నిండిపోయింది. 
బహుశా అందువల్లనే, అతన్ని సెక్షన్‌–కె కి మార్చినప్పుడు దాని గురించి పెద్దగా భయపడలేదు. ఉత్తరాల్లో పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అని చెక్‌ చేయడం సెక్షన్‌–కె లో చేయాల్సిన పని!
అతను సరీగ్గా ఆ సెక్షన్‌కి వచ్చిన మూడోరోజున  ఆ సెక్షన్‌లోని ఒక ఉద్యోగస్థుడి కుడిచేయి ఒక ఉత్తరం కారణంగా పేలిపోయింది. ఆ డివిజన్‌ చీఫ్‌ మాత్రం అది కేవలం ఆ ఉద్యోగస్థుడి నిర్లక్ష్యం కింద తీసిపారేసాడు.
 ఆ సంఘటన జరిగాక క్వాన్, ఇతర ఉద్యోగస్థులూ భయం భయంగానే విధులని కొనసాగించారు.ఆరోజు డ్యూటీ అయిపోయాక, పనిలో ఉన్న అభద్రతల కారణంగా ఎక్కువ జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ స్ట్రైక్‌ చేయాలని ఒక ఉద్యోగస్థుడు కొంత కదలిక తీసుకురావడానికి ప్రయత్నించాడు. క్వాన్‌ మాత్రం దాంట్లో పాలుపంచుకోలేదు. పైగా, కొద్దిగా ఆలోచించి, ఆ ఉద్యోగస్థుడి పేరుని పై అధికారులకి అందజేశాడు. ఫలితంగా క్వాన్‌కి ప్రమోషన్‌ లభించింది. 
ద్రోహమే, కానీ ఒక్కసారేగా చేసింది, ఇదేమీ అలవాటుగా మారదులే అని తనకి తాను నచ్చచెప్పుకున్నాడు. సెక్షన్‌–కె నుంచి ప్రమోషన్‌ మీదసెక్షన్‌–జె (ఇక్కడ ఉత్తరాల్లో విషపదార్థాలు ఏమన్నా ఉన్నాయా అని పరీక్షిస్తారు)కి మారడం ద్వారా నిచ్చెనలో తను ఒక మెట్టు పైకెక్కినట్టు భావించుకున్నాడు. 
కష్టపడి పనిచేస్తూ, అనతికాలంలోనే సెక్షన్‌–ఇ కి క్వాన్‌ చేరుకున్నాడు. ఇది చాలా ఆసక్తికరమైనసెక్షన్‌. ఇక్కడ అతను ఉత్తరాలని చదివి, వాటిని విశ్లేషించాలి. ఏమో, తను మరియానాకి రాసిన ఉత్తరం ఈ సెక్షన్‌లో దొరికినా దొరకొచ్చు!
 తను ఉత్తరం రాసినప్పటినుంచి గడచిన కాలం లెక్కేస్తే, బహుశా తన ఉత్తరం కింది సెక్షన్లని దాటుకుని ఈపాటికి ఇక్కడికి చేరుకుని ఉండవచ్చుననిపిస్తోంది. 
అతిత్వరలోనే అతను పనిలో ఎంత మునిగిపోవాల్సి వచ్చిందంటే, అసలు లక్ష్యం అతని మనసులో మసకబారిపోసాగింది. రోజులు గడుస్తున్న కొద్దీ, అతను ఎర్ర ఇంక్‌తో కొట్టివేసే పేరాలు పెరిగిపోతున్నాయి. నిర్దాక్షిణ్యంగా చెత్తబుట్టలోకి పడేస్తున్న ఉత్తరాల సంఖ్య పెరిగిపోసాగింది. పైకి అస్సలేమీ తెలియనివ్వకుండా రకరకాల తెలివైన పద్ధతుల్లో జనాలు రహస్య సందేశాలని పంపించుకోవడాన్ని అతను గమనించడం మొదలుపెట్టినప్పుడు అవి అతన్ని విస్మయానికి గురిచేసాయి. ఇవన్నీ చూసి అతనిలోని సర్వశక్తులూ ఎంత నిశితంగా తయారయ్యాయంటే, ఉత్తరాల్లో కనిపించే ‘వాతావరణం అటూయిటుగా ఉంది’, ‘ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి’లాంటి మమూలు వాక్యాల మాటున కూడా ప్రభుత్వాన్ని పడదోయడానికి ప్రచ్ఛన్నంగా కుట్ర పన్నుతున్న అదృశ్య హస్తాలేవో అతనికి కనబడసాగాయి.
అతని సమధికోత్సాహం అతనికి చకచకా ప్రమోషన్లని సంపాదించి పెట్టింది. అయితే, ఈ ఎదుగుదల అతన్ని సంతోషపెట్టిందా లేదా అన్నది మాత్రం మనకి తెలీదు. అతను సెక్షన్‌–బి కి చేరుకున్నాక, కింది స్థాయి పరీక్షలన్నీ దాటుకుని అతని దగ్గరకి చాలా వచ్చే ఉత్తరాల సంఖ్య అతి స్వల్పం అయిపోయింది.  అందువల్ల అతను వాటిని మళ్లీ మళ్లీ చదివేవాడు. ఒక భూతద్దం పెట్టుకుని దాని ద్వారా పరిశీలించేవాడు. అతిచిన్న చుక్కలేవైనా ఉన్నాయా అని మైక్రోస్కోప్‌లో చూసేవాడు. ఆ కాగితాల వాసన కూడా పరిశీలించేవాడు. ఇంత తీక్షణమైన పని తర్వాత ఇంటికి చేరుకునేసరికి నిస్సత్తువగా అనిపించేది. సూప్‌ని అతికష్టం మీద కొంచెం వేడిచేసుకొని తాగి, ఏదో ఒక పండు తిని, తన విధులని సక్రమంగా నిర్వర్తిస్తున్నందుకు తృప్తిగా  ఫీలవుతూ పడి నిద్రపోయేవాడు. ఇతని తీరు చూసి తల్లి బాధపడేది కానీ, ఇతన్ని దారిలోకి మాత్రం తీసుకురాలేకపోయేది. లోలా ఫోన్‌ చేసింది, తను స్నేహితురాళ్లతో బార్‌ దగ్గర ఉందట. నువ్వొస్తే బాగుంటుందనుకుంటున్నారు. నీకోసం ఎదురుచూస్తూ ఉన్నారట అని ఆవిడ చెప్తూ ఉండేది (అన్నిసార్లూ అవి నిజం కాదనుకోండి). లేదూ, ఒక్కోసారి ఆవిడ టేబుల్‌ మీద అతను గమనించేలా ఒక వైన్‌ బాటిల్‌ పెట్టివుంచేది. అబ్బే, క్వాన్‌ ఇవేవీ పట్టించుకునేవాడు కాదు. అతని ఆలోచనా ధోరణే వేరు: పక్కచూపు చూశామా, మనం ఉన్న ఉన్నత స్థానాన్నుంచి పడిపోతాం. 
ఒక పరిపూర్ణమైన సెన్సార్‌ ఆఫీసర్‌ అప్రమత్తంగా, నిశితంగా, చురుగ్గా, ఏమరుపాటు లేకుండా ఉండి, మోసగాళ్లని ఏరిపారేయాలి. ఇది దేశభక్తికి సంబంధించిన బాధ్యత. కేవలం త్యాగనిరతి మాత్రమే అందివ్వగల ఆత్మసంతృప్తి. అతని ఆలోచనలు అలా సాగేవి.
సెన్సార్‌షిప్‌ డివిజన్‌ మొత్తం మీద, అతని చెత్తబుట్టకి మాత్రమే అత్యధికంగా ఆహారం లభించడమే కాకుండా, ఆ చెత్తబుట్ట అనేక రాజద్రోహపు ఆలోచనలకి నిలయంగా ఉండేది. ఇహ తనని తాను అభినందించుకోవాల్సిన సమయం వచ్చేసింది! 
తను మరియానాకి రాసిన ఉత్తరం తన చేతికి వచ్చేసింది!!
ఎలాంటి పునరాలోచనా లేకుండా తన మామూలు ధోరణిలో అత్యంత సహజంగా అతను దాన్ని సెన్సార్‌ చేసేశాడు. 
అంతే సహజంగా అతనికి మరణశిక్ష విధించబడింది. మరుసటిరోజు ఉదయం శిక్ష అమలు అవుతున్నప్పుడు అతను దాన్ని నిరోధించలేకపోయాడు. 
పనిపట్ల అతనికి ఉన్న శ్రద్ధవల్ల మరొక బలిదానం జరిగింది.

మరిన్ని వార్తలు