సూపర్‌ గ్రిల్‌

17 Nov, 2019 04:10 IST|Sakshi

ఆధునిక టెక్నాలజీ పరిచయం చేసే లగ్జరీ లైఫ్‌ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది! అందుకే కష్టం తెలియకుండా చేసే సౌకర్యాలను అందుకోవడానికి అందరూ తాపత్రయపడుతుంటారు. అలా రూపొందిన అత్యాధునిక మెషిన్స్‌లో ఈ గ్రిల్‌ ఒకటి. ఇందులో ఎలాంటి ఆహారమైనా నిమిషాల్లో గ్రిల్‌ చేసుకోవచ్చు. ఇది బొగ్గులపై నడుస్తుంది. అయితే బొగ్గులు మండించేందుకు అవసరమయ్యే గాలి గ్రిల్‌ చుట్టు ఉన్న చిన్న చిన్న హోల్స్‌ సహకరిస్తాయి. అంతే కాకుండా మరింత గాలి కోసం మెషిన్‌ అడుగు భాగంలో ఉన్న ప్రత్యేకమైన యంత్రం ద్వారా వస్తుంది. అది పనిచేసేందుకు బ్యాటరీలు అవసరమవుతాయి. అందుకే మెషిన్‌ అడుగు భాగంలో నాలుగు చిన్న చిన్న బ్యాటరీలు అమర్చుకోవల్సి ఉంటుంది. ఇక మెషిన్‌ లోపల ఉండే చిన్న బౌల్‌లో బొగ్గులు వేసి, వెలిగిస్తే ఈ గ్రిల్‌ పనిచేస్తుంది. ఇందులో చికెన్, మటన్‌ వంటి నాన్‌ వెజ్‌ ఐటమ్స్‌ గ్రిల్‌ చేసుకోవడంతో పాటు.. పిజ్జా వంటి వెరైటీలను రెడీ చేసుకోవచ్చు. ఈ మేకర్‌కి గ్రిల్‌ని అటాచ్‌ చేసుకోవడం సులభమే. ఇంకా ఈ గ్రిల్‌ని క్లీన్‌ చెయ్యడం, అవసరమైన ప్రదేశాలకు తీసుకువెళ్లడం చాలా సులభం. ఇక పెద్ద పెద్ద చికెన్, మటన్‌ ముక్కలను గ్రిల్‌ చేసుకోవడానికి పెద్ద బౌల్‌లాంటి మూత(గ్రిల్‌తో పాటు లభిస్తుంది)ను ఉపయోగించుకోవచ్చు. మొత్తానికి ఈ గ్రిల్‌ మేకర్‌లో తక్కువ ఇంధనంతో ఎక్కువ రుచులను తయారు చేసుకోవచ్చు. ఇతర పాత్రలను కూడా దీని మీద పెట్టి ఉపయోగించుకోవచ్చు. దాంతో చాలా రకాలు తయారు చేసుకోవడం సులభమవుతుంది. బాగుంది కదూ!

హ్యాండ్‌కి హెల్ప్‌
అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ పుణ్యమంటూ కంప్యూటర్‌ మీదే ప్రపంచం నడుస్తోంది. డెస్క్‌ వర్క్‌ ఎక్కువైంది. సిస్టమ్‌ ముందు కూర్చుని గంటల గంటలు పనిచేసే ఉద్యోగాలు పెరిగిపోయాయి. దాంతో ఈ రోజుల్లో కీబోర్డ్, మౌస్‌ కదిలితేనే పనులు పూర్తవుతున్నాయి. కంప్యూటర్‌ వర్క్‌లో కీబోర్డ్‌ మీద వేగంగా టైపింగ్‌ చేయడం, మౌస్‌ కదలించడం వంటివి సర్వసాధారణం. కానీ వాటి వల్ల మణికట్టు, చేతి వేళ్లు నొప్పిపుడతాయి. సపోర్ట్‌ లేకపోవడం వల్ల ఆ పెయిన్స్‌ మరింత ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే చిత్రంలో కనిపిస్తున్న రెస్ట్‌ ప్యాడ్‌ వంటివి తీసుకోవడం మంచిది. మౌస్‌ వర్క్‌ మాత్రమే ఎక్కువగా ఉంటే.. మౌస్‌ యూజింగ్‌కి సరిపడే ప్యాడ్‌.. కీబోర్డ్‌ వర్క్‌ ఎక్కువగా ఉంటే కీబోర్డ్‌ యూజింగ్‌కి సరిపడే ప్యాడ్‌ తీసుకోవచ్చు. వీటి సహకారంతో పని చేయడం వల్ల రిస్ట్‌ పెయిన్‌ రాకుండా ఉంటుంది. వీటిలో చాలా మోడల్స్‌ ఉన్నాయి. మరిన్ని సౌకర్యాలను కలిగి ఉంటే.. ధరల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది.

ఒకేసారి రెండు వెరైటీలు
టెక్నాలజీ తెలియని రోజుల్లో వంట చేయాలంటే.. గంటల తరబడి పొగలు కక్కే పొయ్యిలను ఊదుతూ.. వండి వార్చాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం యమా ఫాస్ట్‌గా పనిచేసే మెషిన్స్‌ మార్కెట్‌లో రాజ్యమేలుతున్నాయి. చాలా వరకు మంట లేకుండానే వంట పూర్తి చేస్తున్నాయి. నిమిషాల్లో రుచుల పంట పండిస్తున్నాయి. ఈ మెషిన్‌ ఆ కోవకు చెందినదే. దీనిలో ఒకేసారి రెండు ఐటమ్స్‌ చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఒకేlబౌల్‌ రెండు భాగాలుగా వేరు చేయబడి ఉంటుంది. ఆ బౌల్‌(మెషిన్‌కి అటాచ్‌ అయి ఉన్న గుంత)లో సూప్స్, పాయసం, పాస్తా వంటి వెరైటీ ఐటమ్స్‌ చాలానే సిద్ధం చేసుకోవచ్చు. చికెన్, మటన్, ఫిష్‌ వంటివి గ్రిల్‌ చేసుకోవచ్చు. ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఈ బౌల్‌లో ఫ్రైడ్‌రైస్, బిర్యానీ, నూడుల్స్‌ వంటివి తక్కువ పరిమాణంలో ఒకరికి సరిపోయేలా చేసుకోవచ్చు. ఈ మెషిన్‌తో పాటూ బౌల్‌కి సరిపడా ఒక మూత కూడా లభిస్తుంది. టెంపరేచర్‌ సెట్‌ చేసుకోవడానికి ఒక రెగ్యులేటర్‌ ఉంటుంది. దాంతో మనకు కావల్సిన ఐటమ్స్‌ మనకు కావల్సినట్లుగా తయారు చేసుకోవచ్చు. పైగా ఈ మెషిన్‌ని క్లీన్‌ చేసుకోవడం, మూవ్‌ చేసుకోవడం చాలా సులభం. దీనికి కనెక్ట్‌ చేసుకునే పవర్‌ కనెక్టర్‌ మీదే టెంపరేచర్‌ సెట్‌ చేసుకునే రెగ్యులేటర్‌ అటాచ్‌ అయి ఉంటుంది.

కోకోనట్‌ బనానా ఫ్రైటర్స్‌
కావలసినవి:  మైదాపిండి – ఒకటిన్నర కప్పులు
కొబ్బరి కోరు – అర కప్పు
పంచదార – 2 టేబుల్‌ స్పూన్లు
ఉప్పు – కొద్దిగా
నీళ్లు – 2 కప్పులు
బేకింగ్‌ పౌడర్‌ – ఒకటిన్నర టీ స్పూన్లు
నూనె –డీప్‌ ఫ్రైకి సరిపడా
అరటిపండ్లు – 6
నువ్వుల పొడి – 1 టీ స్పూన్‌

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో మైదాపిండి, కొబ్బరికోరు, పంచదార, ఉప్పు, బేకింగ్‌ పౌడర్‌ వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుని బాగా కలుపుకుంటూ.. పాన్‌కేక్స్‌ పిండిలా తయారు చేసుకోవాలి. అవసరం అయితే రెండు మూడు గరిటెల నీళ్లు అదనంగా వేసుకుని బాగా కలుపుకుని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరటిపండ్లను నచ్చిన షేప్‌లో.. (అడ్డంగా లేదా నిలువుగా) కట్‌ చేసుకుని.. వాటిని మైదా మిశ్రమంలో ముంచి, బాగా పట్టించి నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటిని ఐస్‌ క్రీమ్‌లో డిప్‌ చేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి.

యాపిల్‌ డోనట్స్‌
కావలసినవి:  మైదాపిండి –  రెండున్నర కప్పులు, ఉప్పు – తగినంత, బ్రౌన్‌ సుగర్‌ – 3 టేబుల్‌ స్పూన్, నిమ్మరసం, పంచదార – ఒక టీ స్పూన్‌ చొప్పున, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా, గోరువెచ్చని పాలు – ముప్పావు కప్పు, గుడ్డు – 1 , యాపిల్స్‌ – 3 లేదా 4 (తొక్క తీసినవి), దాల్చినచెక్క పొడి –పావు టీ స్పూన్, జాజికాయ, లవంగాల పొడి – పావు టీ స్పూన్‌ చొప్పున 
నీళ్లు – పావు కప్పు
పంచదార పొడి – 2 టేబుల్‌ స్పూన్, దాల్చిన చెక్క పొడి – 1 టీ స్పూన్‌

తయారీ: ఒక బౌల్‌లో మైదాపిండి, ఉప్పు, ఒక టేబుల్‌ స్పూన్‌ బ్రౌన్‌ సుగర్, అర టీ స్పూన్‌ నిమ్మరసం, పంచదార, 2 టేబుల్‌ స్పూన్ల నూనె, గోరువెచ్చని పాలు, గుడ్డు ఒకదాని తర్వాత వేసుకుని బాగా కలిపి.. ముద్దలా చేసుకుని.. గంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత యాపిల్స్‌ చిన్న ముక్కలుగా చేసుకుని.. ఒక పాత్రలో వేసుకుని.. అందులో అర టీ స్పూన్‌ నిమ్మ రసం, రెండు టేబుల్‌ స్పూన్ల బ్రౌన్‌ సుగర్, దాల్చిన చెక్క పొడి, జాజికాయ పొడి, లవంగాల పొడి, నీళ్లు అన్నీ వేసుకుని గరిటెతో తిప్పుతూ.. చిన్న మంట మీద 15 నిమిషాల పాటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో పంచదార పొడి, దాల్చిన చెక్క పొడి వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మైదా మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని.. అరంగుళం మందంగా ఒత్తుకుని గుండ్రటి గ్లాసు సాయంతో రౌండ్‌ పీస్‌లు చేసుకుని.. ఒక ట్రేలో పెట్టుకుని, మూత పెట్టి.. 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూనెలో డీఫ్‌ ఫ్రై చేసుకుంటే అవి పూరీల్లా పొంగుతాయి. వాటికి దాల్చినచెక్క, పంచదార పొడి మిశ్రమాన్ని బాగా పట్టించి.. ఒక్కో మైదా బూరికి సైడ్‌కి చిన్న హోల్‌ చేసుకుని.. దానిలోకి యాపిల్‌ మిశ్రమాన్ని కోన్‌ ద్వారా ఎక్కించి సర్వ్‌ చేసుకోవచ్చు.

రైస్‌ పకోడా
కావలసినవి:  అన్నం – 1 కప్పు
అల్లం తురుము – అర టీ స్పూన్‌
పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్‌
ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు
క్యాప్సికం ముక్కలు – 1 టేబుల్‌ స్పూన్‌
కొత్తిమీర తురుము – 1 టేబుల్‌ స్పూన్‌
కారం – అర టీ స్పూన్‌
మిరియాల పొడి – పావు టీ స్పూన్‌
గరం మసాలా – పావు టీ స్పూన్‌
ఉప్పు – తగినంత
శనగపిండి – 1 కప్పు
పెరుగు – పావు టేబుల్‌ స్పూన్‌
నూనె– డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో.. అన్నం, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర తురుము, కారం, మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు, శనగపిండి, పెరుగు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గట్టిగా కలుపుతూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి.

 

మరిన్ని వార్తలు