వెలివాడలో  వెలుగుజాడ

8 Apr, 2018 00:37 IST|Sakshi

 ∙ధ్రువతారలు

‘అంటరాని’ కులాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని అంబేడ్కర్‌ తొలి రౌండ్‌ టేబుల్‌ సమావేశంలోనే ప్రతిపాదించారు. భారతదేశంలో అంటరాని కులాలు ఎదుర్కొంటున్న సమస్య ప్రధానంగా రాజకీయ పరమైనదే కానీ, సాంఘిక పరమైనది కాదని ఆయన వాదించారు.

వలస పాలకుల ప్రాభవం పలచబడడం, బ్రిటిష్‌ ఇండియాకు రాజకీయ సంస్కరణల అవసరం చొచ్చుకు రావడం దాదాపు ఒకేసారి ఆరంభమైంది. చారిత్రక నేపథ్యాన్ని బట్టి భారతీయ సమాజం అనేక వర్గాలు, మతాలు, కులాలతో నిండిపోయింది. అసమానతలు ఉన్నాయి. కానీ రాజకీయ సంస్కరణల రథం వీరందరికీ చోటు కల్పించవలసిందే. అలాంటి దశలో దేశంలో ఉన్న ఆరు కోట్ల మంది బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా కనిపించిన వ్యక్తి డాక్టర్‌ భీమ్‌రావ్‌ రామ్‌జీ అంబేడ్కర్‌. శతాబ్దాల బానిసత్వం తరువాత, వలస పాలన కాలంలో భారతదేశంలో కానిస్టిట్యూషనలిజమ్‌ పటిష్ఠ దశకు చేరుకుంటున్న కాలంలో అంబేడ్కర్‌ ఒక శక్తిగా ఎదిగి రావడమే చరిత్రలో ఆయనకు గొప్ప స్థానానికి అర్హుడిని చేసింది. ఆనాటి లెక్కలను బట్టి చూస్తే హిందూ సమాజంలో ప్రతి ఐదో వ్యక్తి అంటరానివాడో, బడుగు వర్గీయుడో అవుతాడు. లేదా అవుతుంది. అంబేడ్కర్‌కు ముందు ఇలాంటి వర్గాలకు అండగా నిలిచినవారు లేకపోలేదు. కానీ రాజకీయ హక్కులకు రూపం ఇస్తున్నప్పుడు అందులో దళితుల స్థానం గురించి చారిత్రకంగానే కాదు, చట్టాల నేపథ్యంతో కూడా చెప్పగల నేత అవసరం ఉంటుంది. అలాంటి నిర్మాణాత్మక పాత్రను నిర్వహించినవారు అంబేడ్కర్‌. దళిత జనోద్ధరణలో గాంధీజీ పాత్రను కూడా విస్మరించలేం. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అదొక చారిత్రక వాస్తవం. కానీ ఒకటి– దళిత జనోద్ధర ణ గాంధీజీకి సంబంధించినంత వరకు ఆదర్శం నుంచి ఆవిర్భవించింది. కానీ అంబేడ్కర్‌కు సంబంధించి అది అనుభవం నుంచి అంకురించింది. 

అంబేడ్కర్‌ జీవితమే ఒక చరిత్ర. అందులో అణగారిన గళాలకు నినాదాన్ని అందించిన తాత్వికత ఉంది. గొప్ప పాఠం ఉంది. అంతవరకు  నిరాకరించినప్పటికీ ఆయన కాలానికి హిందూ సమాజం గుర్తించక తప్పని వాతావరణం కల్పించిన పాఠమది. అంబేడ్కర్‌ తాతగారు, తండ్రి రామ్‌జీ సక్పాల్‌ సైన్యంలో పనిచేశారు. ఆ కుటుంబం కబీర్‌ను ఆరాధించేది. తల్లి భీమాబాయి. ఆమె తండ్రి, మేనమామలు కూడా సైన్యంలో పని చేసినవారే. అలాగే కబీర్‌ ఆరాధకులే. అంబేడ్కర్‌ కుటుంబానికి ఉన్న సైనిక నేపథ్యం ఆయనకు ఒనగూర్చిన గొప్ప ఉపకారం–మంచి విద్యావకాశాలను కల్పించడం. ఆ కాలంలో సైన్యంలో పనిచేసేవారు ఎవరైనా, వారి సంతానానికి మంచి విద్య అందేది. అయినప్పటికీ వివక్షను ఎదుర్కొనక తప్పలేదు. అంబేడ్కర్‌ జీవితం ఎంతో సంఘర్షణను చవి చూసింది. కానీ ఆ సంఘర్షణ నుంచి సమరానికి కాకుండా సయోధ్య వైపు నడిచింది. ఇందుకు ఎన్ని కష్టాలు పడినా ఆ జీవితం ఓర్చుకుని నిలిచింది. కుటుంబానికి నేపథ్యంగా ఉన్న కబీర్‌ ఆరాధన, సైనిక క్రమశిక్షణ ఇందుకు కారణమనిపిస్తాయి. 
 మార్పునకు సిద్ధపడుతున్న సమాజంలో ఆదర్శం కనిపిస్తుంది. ఆ మేరకు గాంధీజీ కృషి చరిత్రాత్మకమే. ఒక సమస్య తీవ్రతను ఇతరులకు తెలియచేయడానికి వ్యక్తుల స్వీయ అనుభవం తోడ్పడిన స్థాయిలో మరొకటేది ఉపకరించదు. దళితులకు సామాజిక న్యాయం అందించడంలో అంబేడ్కర్‌ దార్శనికత, అనుభవం అలాంటి పాత్రను నిర్వహించింది. ఇలాంటివి ఎన్ని చెప్పుకున్నా, సామాజిక న్యాయాన్ని కాపాడగలిగేది మాత్రం రాజ్యాంగబద్ధత. ఆ సత్యాన్ని గుర్తించడమే కాదు, తన వర్గానికి సాధించి పెట్టినవారు అంబేడ్కర్‌. 

అంబేడ్కర్‌ సంస్కర్త. ఆర్థికవేత్త. న్యాయ నిపుణుడు. ఉద్యమకారుడు. గొప్ప విద్యావేత్త. ప్రజాప్రతినిధి. ఇవన్నీ కూడా అంబేడ్కర్‌ను స్వతంత్ర భారత రాజ్యాంగ రచనా సారథ్యం దగ్గరకు నడిపించిన దశలుగానే కనిపిస్తాయి. గాంధీజీ, ముస్లింలీగ్‌ నాయకుడు మహమ్మదలీ జిన్నా చెరో వైపు లాగిన రాజ్యాంగానికి కూడా ఒక ఆకృతి ఇచ్చినవారు అంబేడ్కర్‌. సాంఘిక సంస్కరణలు లేకుండా రాజకీయ సంస్కరణలు చేపట్టడం ఒక ప్రహసనం తప్ప మరొకటి కాదని అంబేడ్కర్‌ విశ్వసించారు. ఆయన సాంఘిక సమానత్వాన్ని ఆకాంక్షించారు. సాంఘిక సమానత్వం వెల్లివిరిస్తే బ్రిటిష్‌ వలస ప్రభుత్వం నుంచి మనం తెచ్చుకోవాలనుకుంటున్న స్వాతంత్య్రం దానికదే వస్తుందని ఆయన నమ్మారు. అమెరికా, ఇంగ్లండ్, జర్మనీలలో విద్యాభ్యాసం చేసి అంబేడ్కర్‌ 1924లో భారతదేశం తిరిగి వచ్చారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆ వెంటనే బహిష్కృత హితకారిణి సభను స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఆయన నిర్వహించిన కార్యక్రమాలు చరిత్రాత్మకమైనవి. కొలాబాలోని చౌదార్‌ చెరువు నుంచి దళితులు సొంతంగా నీరు తెచ్చుకోవడానికి ఉద్దేశించిన మహద్‌ మార్చ్‌ అందులో భాగమే. అంబేడ్కర్‌కు అత్యంత ప్రీతిపాత్రమైన అంశం రాజ్యాంగ వ్యవహారాలు. బ్రిటిష్‌ ఇండియాలో రాజ్యాంగ నిర్మాణానికి పెద్ద కదలిక తెచ్చిన పరిణామం సైమన్‌ కమిషన్‌ లేదా రాయల్‌ కమిషన్‌ రాక. బ్రిటిష్‌ ఇండియాకు రాజ్యాంగం నిర్మించడానికి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించడానికి సైమన్‌ కమిషన్‌ను ఆంగ్ల ప్రభుత్వం పంపించింది. ఉదారవాద న్యాయవాది సర్‌ జాన్‌ అల్సె బ్రూక్‌ సైమన్‌ దీనికి అధ్యక్షుడు. క్లెమెంట్‌ అట్లీ ఒక సభ్యుడు. ఈయన తరువాత ఇంగ్లండ్‌ ప్రధాని అయ్యారు. ఆయన ప్రధానిగా ఉండగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. హెన్రీ లెవీ లాసన్, ఎడ్వర్డ్‌ కాడోగన్, వెర్నాన్‌ హర్ట్స్‌హార్న్, జార్జ్‌ లేన్‌ఫాక్స్, డొనాల్డ్‌ హోవర్డ్‌ మిగిలిన సభ్యులు. మొత్తం ఎనిమిది మంది. దీనిని భారత జాతీయ కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. అప్పటికే కాంగ్రెస్‌తో ముదిరిన వైరాన్ని కూడా మరచి మహమ్మదలీ జిన్నా కూడా సైమన్‌ కమిషన్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చాడు. కారణం ఒక్కటే– ఆ ఎనిమిది మందిలో ఒక్కరు కూడా భారతీయుడు లేడు. అయితే ఈ కమిషన్‌ను అంబేడ్కర్‌ నిరాకరించలేదు. కానీ సైమన్‌ కమిషన్‌ విఫలమైంది. 

ఈ అనుభవాలు, అభిప్రాయాల ప్రాతిపదికగానే అంబేడ్కర్‌ రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లో తన వాదన వినిపించారు. ఆయన వాదన దేశంలోని కింది కులాల ఉనికికి సంబంధించినది. వారి హక్కులకు సంబంధించినది. శతాబ్దాలుగా బాధిస్తున్న అణచివేత నుంచి విముక్తి కోరేది. భార త దేశంలో స్వయం పాలనకు అవసరమైన రాజ్యాంగం గురించి చర్చించడానికి ఇంగ్లిష్‌ ప్రభుత్వం రౌండ్‌ టేబుల్‌ సమావేశాలను ఏర్పాటు చేసింది. కాబట్టి దళితుల వాణిని వినిపించడం అనివార్యం. లేబర్‌ పార్టీ ప్రభుత్వం, నాటి బ్రిటిష్‌ ప్రధాని రామ్‌సే మెక్‌డొనాల్డ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్సులలోను (1930–1932) అంబేడ్కర్‌ పాల్గొన్నారు. నిజానికి రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లు స్వాతంత్య్రోద్యమానికి గొప్ప మేలు చేయలేదు. మొదటి సమావేశానికి కాంగ్రెస్‌ ప్రతినిధులు హాజరు కాలేదు.  రెండో సమావేశంలో బడుగులకు ప్రత్యేక నియోజకవర్గాల విషయంలో గాంధీజీకీ, అంబేడ్కర్‌కూ పొంతన కుదరలేదు. మూడో సమావేశం నామమాత్రంగా జరిగింది. మొత్తంగా చూస్తే స్వాతంత్య్ర సముపార్జనకు ఆ సమావేశాలు గొప్పగా ఉపయోగపడ్డాయని ఎవరూ చెప్పలేరు. కానీ ఇలాంటి సమావేశాల నుంచి కూడా తన వర్గం వారికి కొంత ప్రయోజనాన్ని సాధించిన వారు అంబేడ్కర్‌. రెత్తమాలై శ్రీనివాస్‌తో కలసి ‘డిప్రెస్డ్‌ క్లాస్‌’ ప్రతినిధిగా అంబేడ్కర్‌ ఇంగ్లండ్‌ వెళ్లారు. 

‘అంటరాని’ కులాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని అంబేడ్కర్‌ తొలి రౌండ్‌ టేబుల్‌ సమావేశంలోనే ప్రతిపాదించారు. భారతదేశంలో అంటరాని కులాలు ఎదుర్కొంటున్న సమస్య ప్రధానంగా రాజకీయ పరమైనదే కానీ, సాంఘిక పరమైనది కాదని ఆయన వాదించారు. నాటి బ్రిటిష్‌ ఇండియాలో అంటరాని కులాల వారు 20 శాతం ఉన్నారు. సమాజంలో ఈ స్థాయి భాగస్వాముల సమస్యను నిర్లక్ష్యం చేయడం సాధ్యం కాదని కూడా ఆయన తేల్చి చెప్పారు. అంబేడ్కర్‌ ఉద్దేశంలో ప్రత్యేక నియోజకవర్గాలంటే, అంటరాని కులాలు మాత్రమే తమ ప్రతినిధులను ఎన్నుకుంటాయి. కానీ దీనిని గాంధీజీ వ్యతిరేకించారు. దీని వల్ల హిందూ సమాజం చీలికల పాలవుతుందని ఆయన వాదన. మనుషుల ఆలోచనా విధానంలో మార్పు తేగలిగితే అంటరానితనం పోతుందని గాంధీ విశ్వాసం. అందుకే అంబేడ్కర్‌ ప్రతిపాదనను రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో గాంధీజీ వ్యతిరేకించారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు పూర్తి కాగానే బ్రిటిష్‌ ప్రధాని మెక్‌డొనాల్డ్‌ కమ్యూనల్‌ అవార్డ్‌ను ప్రకటించారు. దీని ప్రకారం ముస్లింలకు, క్రైస్తవులకు, అగ్రకుల హిందువులకు, కింది కులాల హిందువులకు, సిక్కులకు, బౌద్ధులకు అలాగే అంటరాని కులాలకు ప్రత్యేక నియోజక వర్గాలను ఆ అవార్డ్‌ ప్రకటించింది. గాంధీ అలిగి ఎరవాడ (పూనా) జైలులో నిరాహార దీక్ష చేపట్టారు. దీనితో అంబేడ్కర్‌ గాంధీజీతో చర్చలు జరిపారు. చివరికి అంటరాని కులాలకు ప్రత్యేక నియోజకవర్గాలు కాకుండా, హిందూ నియోజకవర్గాల నుంచే ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం కల్పించడానికి నిర్ణయించారు. 

అధికారం, హోదా పరిధులలో అంబేడ్కర్‌ సేవలు ఒక తరహాకు చెందుతాయి. కానీ క్షేత్రస్థాయిలో కూడా అంబేడ్కర్‌ దళితులను ఏకం చేయడానికి తన వంతు కృషి చేశారు. షెడ్యూల్డ్‌ కులాల సమాఖ్య పేరుతో 1942లో ఆయన నాగ్‌పూర్‌లో దళిత సమ్మేళనం నిర్వహించారు. దీనికి 75,000 పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో మహిళలు పాతికవేలు. దళితుల ఆత్మ గౌరవ నినాదం ఈ సభా వేదిక నుంచే అంబేడ్కర్‌ ఇచ్చారు. ఈ సమాఖ్యే తరువాత రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాగా అవతరించింది. అంబేడ్కర్‌ జీవితంలో సంఘ సంస్కరణోద్యమం ఒకవైపు, దళితుల సంఘటన ఒకవైపు, పరిపాలన మరొకవైపు కనిపిస్తాయి. 1942లో అంబేడ్కర్‌ వైస్రాయ్‌ కౌన్సిల్‌లో కార్మిక వ్యవహారాలు చూశారు. ఎనిమిది గంటల పని ఆయన చలవే. భవిష్య నిధి, దినసరి భత్యం కూడా ఆయన ఆలోచనే. ఎంప్లాయిమెంట్‌ ఎక్స్‌చేంజ్, ప్రసూతి సెలవు కూడా అంబేడ్కర్‌ చొరవతోనే రూపు దాల్చాయి. 

క్రిప్స్‌ మిషన్‌ సిఫారసుల మేరకు బ్రిటిష్‌ ప్రభుత్వం రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేసింది. ఇది అవిభక్త భారత్‌కు ఉద్దేశించినది. వివిధ ప్రాంతాల నుంచి ఈ పరిషత్‌కు సభ్యులు ఎన్నికై వచ్చారు. కానీ అంబేడ్కర్‌ బొంబాయి నుంచి పోటీ చేసినా పరిషత్‌కు ఎన్నిక కాలేదు. తరువాత ముస్లిం లీగ్‌ మద్దతుతో బెంగాల్‌ నుంచి ఎన్నికయ్యారు. తీరా అంబేడ్కర్‌ ఎన్నికైన ప్రాంతం తరువాత పాకిస్తాన్‌లో కలిసిపోయింది. అనంతరం బాబూ రాజేంద్రప్రసాద్‌ సూచన మేరకు  మహారాష్ట్ర ప్రాంతం నుంచి అంబేడ్కర్‌ తిరిగి ఎన్నికై పరిషత్‌కు వచ్చారు. ఆ విధంగా ఆయన రాజ్యంగ ముసాయిదా సంఘానికి అధ్యక్షులయ్యారు. ఇందులో ఏడుగురు సభ్యులు ఉన్నప్పటికి ప్ర«ధాన బాధ్యత అంబేడ్కర్‌ మీదే పడింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత నెహ్రూ తొలి ప్రభుత్వంలో అంబేడ్కర్‌ న్యాయ శాఖను నిర్వహించారు. కానీ హిందూ కోడ్‌ బిల్లు దగ్గర అభిప్రాయ భేదాలు వచ్చి రాజీనామా చేశారు. 

చిత్రం ఏమిటంటే స్వతంత్ర భారతదేశంలో తొలి సాధారణ ఎన్నికలు 1952లో జరిగాయి. ఆ ఎన్నికలలో అంబేడ్కర్‌ ఉత్తర బొంబాయి నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. కానీ అంతగా పేరు ప్రఖ్యాతులు లేని కాంగ్రెస్‌ అభ్యర్థి నారాయణ్‌ కాజ్రోకర్‌ చేతిలో ఆ దిగ్గజం ఓటమి పాలైంది. నారాయణ్‌ ఒకప్పుడు అంబేడ్కర్‌ సహాయకుడే. అదే సంవత్సరం ఆయనను రాజ్యసభకు పంపారు. తుది ఊపిరి వరకు ఆ సభ సభ్యునిగానే ఉన్నారు. మధ్యలో బొంబాయి బాంద్రా నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరిగితే అంబేడ్కర్‌ మళ్లీ లోక్‌సభకు పోటీ చేశారు. కానీ మరోసారి ఓటమి ఎదురైంది. మొత్తానికి మొదటి లోక్‌సభలో అంబేడ్కర్‌ వంటి న్యాయ నిపుణుడికి అవకాశం దక్కలేదు. ఇది భారత చట్టసభల చరిత్రలో కనిపించే పెద్ద వైచిత్రి. 
· 

మరిన్ని వార్తలు