సెక్షన్ 411

1 Dec, 2019 01:02 IST|Sakshi

కంచనపల్లి వేంకట కృష్ణారావు

నేనొక దొంగని. అందరు దొంగలమాదిరి నేను డబ్బు బంగారం కొట్టెయ్యను. సంవత్సరానికి ఒకటో రెండో దొంగతనాలు చేస్తాను. అంతే హాయిగా సంవత్సరం అంతా బతికెయ్యొచ్చు.
నేను దొంగతనం చేసేది పురాతన విగ్రహాలు. చారిత్రక విలువ గల వస్తువులు, పాత పెయింటింగులు.. దొంగతనం చేసిన వాటిని ముంబైలో ఉన్న కాంతిలాల్‌కు చేరుస్తాను. వాటిని పరిశీలించి అతడు నాకు బోలెడు డబ్బు ఇస్తాడు. అతను వాటిని విదేశాలకు అమ్ముకుని డబ్బు చేసుకుంటాడు.
నేను పక్కాగా రెక్కీ నిర్వహించి మ్యూజియంలు, కోటలు, పాత దేవాలయాల్లో విలువైన వస్తువులు, విగ్రహాలు, పెయింటింగులను చాకచక్యంగా దొంగతనం చేసి డబ్బు చేసుకుంటుంటాను.
సాధ్యమైనంత వరకు రద్దీ లేని, అంతగా ప్రాచుర్యం లేని మ్యూజియంలు నా టార్గెట్‌!
ఆ మ్యూజియంల వెతుకులాట కోసం ఇండియా అంతా తిరిగాను. అలా రాజస్థాన్‌లోని జైపూర్‌కి వెళ్లి ‘రాజా గోపాల్‌ సింగ్‌’ మ్యూజియం పరిశీలించాను. అదేమంత ప్రసిద్ధి చెందింది కాదు. మ్యూజియంలో రకరకాల పింగాణీ పాత్రలు, రాజా గోపాల్‌ సింగ్‌ ఉపయోగించిన కత్తులు, చిన్న తుపాకులు ప్రదర్శనలో ఉంచారు. లత‘ఉస్తాద్‌ మయ్యార్‌’ వేసిన ఆయిల్‌ పెయింటింగ్‌ నా దృష్టిని ఆకర్షించింది. రెండు అడుగుల వెడల్పు.. రెండు అడుగుల పొడవుతో అత్యద్భుతంగా పక్షులు, ప్రకృతి ఆకర్షణీయమైన పూలతో కూడిన ఆయిల్‌ పెయింటింగ్‌ అది. ఏది ఏమైనా ఆ పాత పెయింటింగ్‌ మీద అరబ్బీలో ఉస్తాద్‌ మన్యూర్‌ అనే సంతకం, దాని కింద 1674 సంవత్సరం వేసి ఉంది. ఆ మాత్రం చాలు నాకు ఆ పెయింటింగ్‌ నన్ను ఒక్క సంవత్సరం పోషించడానికి.
మ్యూజియం చుట్టూ తిరిగి లోనికి రహస్యంగా పోవడానికి మార్గాలు వెతికాను. ఎక్కెడెక్కడ సీ.సీ కెమెరాలు ఉన్నాయో వెతికాను. నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా! మ్యూజియంకు కాపలా కూడా తక్కువగానే ఉంది. కాపలా వాళ్లు ముసలి వాళ్లు.
వెతగ్గా వెతగ్గా మ్యూజియం వెనుక తలుపు చెక్కది పైగా పాతది. అక్కడక్కడా పగిలిపోయి కనబడుతున్నాయి. నా అదృష్టానికి అదే దారి అన్నట్లు ఆ పాత తలుపు కనబడింది.
ఆ రాత్రే నేను పెయింటింగ్‌ దొంగలించడానికి పక్కగా ప్లాన్‌ చేశాను. రాజస్థాన్‌ వాళ్లలాగ తలపాగా, పెద్ద మీసాలు, గడ్డం తయారు చేసుకున్నాను. ఎందుకంటే ఒక వేళ ఏ సీసీ కెమేరాలో నేను కనబడితే అది రాజస్థాన్‌ వాళ్ల పనే అని పోలీసుల్ని పక్కదారి పట్టించడానికి!
తలుపును తక్కువ చప్పుడుతో విరగొట్టడానికి తగిన పనిముట్లు సేకరించాను.
రాత్రి పదిన్నరకి మ్యూజియం ప్రాంతానికి వెళ్లి ఒక రహస్య ప్రదేశంలో నక్కాను. కాబట్టి అనుకున్నట్టుగానే గట్టిగా హారన్‌ మోగించుకుంటూ పోలీస్‌ వ్యాన్‌ వెళ్లిపోయింది.
అంతే, నేను మ్యూజియం కాంపౌండ్‌ వాల్‌ను చాకచక్యంగా ఎక్కి లోపలికి దూకి, అక్కడ ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక వెనుక తలుపు వద్దకు వెళ్లి నా నైపుణ్యాన్ని అంతా ఉపయోగించి పగిలిన తలపు సందులో సన్నటి రాడ్డు ఉంచి శక్తినంతా ఉపయోగించాను. తలుపు పాత పడిపోయి ఉండటం వలన సులభంగానే చప్పుడు లేకుండా విరిగిపోయింది! 
అలా.. అలా.. తలుపు చాలా భాగం విరిచేశాను. నా పని సులభం అయిపోయింది. అడుగులో అడుగు వేసుకుంటూ ఉస్తాద్‌ మమ్యార్‌ పెయింటింగ్‌ వద్దకు వెళ్లి సులభంగానే దానిని గోడ నుంచి తొలగించాను. గోడ నుంచి పెయింటింగ్‌ తియ్యగానే ఆ ఖాళీ ప్రదేశం ఏదో దుఃఖపూరితంగా నాకు కనబడసాగింది.
అయినా చిరునవ్వుతో నేను చేసిన పనికి గర్విస్తూ పెయింటింగ్‌ని నేను తెచ్చిన గుడ్డలో చుట్టి మెల్లగా అడుగులు వేసుకుంటూ మరలా విరిగిన తలుపు వద్దకు వెళ్లి బయటపడ్డాను.
అటు ఇటు చూచుకుని జాగ్రత్తగా దగ్గరలోనే ఉన్న నా లాడ్జీకి వెళ్లాను. లాడ్జి బాయ్‌ నిద్రమత్తులో ఉన్నాడు. వాడు నా చేతిలో ఏముందో చూడకుండా తలుపు తీశాడు. అదీ నా మేలు కొరకే అనుకుని దానిని రూముకి తీసుకువెళ్లి జాగ్రత్తగా పరుపు కింద పెట్టి దిండు, దుప్పటిని నేల మీద పరచుకొని పడుకున్నాను. అర్ధగంటలోనే మంచి నిద్రపట్టింది.
పొద్దున ఏడు గంటలకు టి.వి. ఆన్‌ చేశాను. అనుకున్నట్టుగానే మ్యూజియంలో జరిగిన దొంగతనం గురించి చెబుతున్నారు. మ్యూజియంలో పని చేసే వాళ్లందరూ అక్కడ గుమి గూడినట్టు చూపిస్తున్నారు. పోలీసులు ఏదో చర్చిస్తున్నట్లు కనబడ్డారు.
‘దొంగని పట్టుకోవడానికి ఏమైనా క్లూస్‌ దొరికాయా?’ అని విలేఖర్లు అడుగుతున్నారు.
‘తప్పు చేసినవాడు తప్పించుకోలేడు త్వరలోనే పట్టుకుంటాం’ అని పోలీస్‌ అధికారి చెప్పాడు. అతని మాటలు విని నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే మరో గంటలో పెయింటింగ్‌తో సహా ట్రైన్‌లో ముంబై వెళ్లిపోబోతున్నాను.
టిఫిన్, కాఫీ అయ్యాక నా చిన్న సూట్‌ కేసు, పెయింటింగ్‌ మీద అనుమానం రాకుండా తగిన విధంగా ప్యాక్‌ చేశాను. లాడ్జీ బిల్లు పే చేశాను. మరలా రూమ్‌కి వెళ్లి సూట్‌ కేసు, పెయింటింగ్‌ తీసుకువెడదామని.. సూట్‌ కేసు పట్టుకొనేసరికి తలుపు దగ్గర ఆరడుగుల పోలీసు ఆఫీసర్‌ అతనితో పాటు నలుగురు పోలీసులు. ఒక్కసారి నా గెండె దడదడలాడింది!
‘ఏం కావాలి సార్‌?’ అడిగాను.
ఆ పోలీసు ఆఫీసర్‌ ఏం మాట్లాడకుండా నా చెంప చెళ్లు మనిపించాడు. నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. 
‘పెయింటింగ్‌ తీయరా’ అని హిందీలో కర్కశంగా అడిగాడు.
‘ఏ పెయిటింగ్‌ సార్‌?’ అని హిందీలో బుకాయించబోయాను.
మరలా నా చెంప చెళ్లుమంది. ఇక లాభం లేదని పెయింటింగ్‌ ప్యాక్‌ విప్పి అతనికి ఇచ్చి వెర్రి చూపులు చూస్తూ.. ‘ఎలా కనిపెట్టారు’ అని ఆలోచిస్తున్నాను.
నా చూపుల్లో అర్థం గమనించిన ఆ పోలీస్‌ ఆఫీసర్‌.. తన జేబులో నుంచి సెల్‌ఫోన్‌ లాంటి పరికరం తీశాడు. అది గూగుల్‌ మ్యాప్‌ చూపిస్తూ ఎర్రటి చుక్కను లాడ్జీలోని నా రూమ్‌ చూపించింది.
‘అరేయ్‌.. పెయింటింగ్‌కి సీక్రెట్‌ చిప్‌ ఉంది. నీలాంటి బద్మాష్‌లు దొంగలిస్తారని ఇప్పుడు దొంగతనం నుంచి రక్షించడానికి ఎలక్ట్రానిక్‌ చిప్స్‌ అమరుస్తున్నాం. ఇక నీ ఆట కట్టింది. ఏమేం వస్తువులు, పెయింటిగ్స్‌ ఇంతకు ముందు దొంగలించావో అన్నీ స్టేషన్‌లో కక్కిస్తాం పదా’ అని నా చేతులకు బేడీలు వేశారు.
‘నీకు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ సెక్షన్‌ 411 ప్రకారం మూడేళ్ల కఠిన కారగార శిక్ష, పది వేల జరిమానా పడుతుంది. నీ తోడు దొంగ లెవరో కూడా నీ చేతనే కక్కిస్తాం’ అని మెడ పట్టుకుని జీపులో ఎక్కించాడు.
నాకు లోకమంతా అంధకార బంధురంగా కనిపించసాగింది. మరొక అర్థగంటలో ముంబైలో కాంతి లాల్‌ అరెస్ట్‌ జరిగిపోయింది.
స్టేషన్‌కు వచ్చిన విలేఖర్ల ప్రశ్నలు బాణాల్లా నన్ను గుచ్చుకుంటున్నాయి. నీరసంతో నా కాళ్లుచేతులు చచ్చుబడిపోయాయి.

మరిన్ని వార్తలు