రజతోత్సవ సన్మానం

8 Dec, 2019 03:30 IST|Sakshi

డి.వి.నరసరాజు

ఎవరో పొద్దున్నే ఫోన్‌ చేశారు!–తమది హైదరాబాద్‌ అని, నాతో మాట్లాడాలనీ, ఎప్పుడు వీలవుతుందనీ, ‘‘ఇప్పుడే వస్తే ఇంటి దగ్గర వుంటారా?’’ అని అడిగారు.
‘వుంటా’నన్నాను.
 ‘వెంటనే బయలుదేరి వస్తా’మన్నారు.
ఎవరో ప్రొడ్యూసర్లయి వుంటారని నిశ్చయించుకున్నాను! లోపలికి వెళ్లి నలుగురికి కాఫీలు సిద్ధం చేయమన్నాను.
పావుగంటలో–ఇంటిముందు టాక్సీ ఆగింది. టాక్సీ దిగి నలుగురు లోపలికి వచ్చారు. తమని తామే పరిచయం చేసుకున్నారు. ఒకరు శర్మ, రెండోవారు సాంబమూర్తి, మూడు కృష్ణమూర్తి, నాలుగు రామమూర్తి!
‘మా సమాజం’ పేరు వినే ఉంటారు.
‘శాశ్వత సన్మాన సమాజం’ అన్నాడు శర్మ.
అయితే ప్రొడ్యూసర్లు కాదన్నమాట! నా ముఖంలో కాంతి తగ్గింది. కొంపదీసి చందాకి వచ్చి వుంటారు.
కేవలం సన్మానాల కోసమే పెట్టబడిన శాశ్వత సమాజం వారిది.
రాజకీయ, సాంస్కృతిక కళారంగాలలో అమూల్యమైన సేవ చేసిన వారికి సన్మానాలు చేయడమే వారి సమాజం ప్రధానోద్దేశమట!
వారి లెటర్‌హెడ్‌ చేతికిచ్చి చూడమన్నారు. పాతిక ముప్పయి పేర్లున్నయ్‌! గౌరవాధ్యక్షులు, అధ్యక్షులు, సలహాదార్లు, కార్యదర్శులు, కోశాధికారి,  కమిటీ సభ్యులు వగైరా!
అందరూ ప్రముఖులే! మంత్రులూ, జడ్జీలు, ఫిలిం ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, రచయితలు వగైరా.
వారి సమాజం ఇదివరలో చేసిన సన్మానాల తాలూకు ఫోటోల ‘ఆల్బం’ చేతికిచ్చారు.
తీసి చూశాను!
అబ్బో! చాలా పెద్ద పెద్ద వారికే సన్మానాలు చేశారు. ప్రతి సన్మానంలోనూ మంత్రులు, జడ్జీలు, పురప్రముఖులు పాల్గొన్నారు!
ఆ ఫోటోలు చూస్తున్నంత సేపూ చందా ఎంత ఇవ్వవలసి వుంటుందా అని లోలోపల పీకుతూనే వుంది.
‘ఇంతకూ ఇప్పుడు ఎవరికి చేయబోతున్నారు సన్మానం?’ అని అడిగేశాను!
‘మీకే’ అన్నారు శర్మ!
ముందు గుండె గతుక్కుమంది! వెంటనే ఒళ్లు పులకరించింది. వాళ్ల  ముఖాలలోకి చూశాను! కళాభిమానం, కళాసేవ వాళ్ల ముఖంలో కొట్టవచ్చినట్టు కనబడింది!
పొంగుతున్న సంతోషాన్ని పొంగనివ్వకుండా ఆపి, ‘నా కెందుకండీ సన్మానం? నేనేం చేశాను గనక’ అన్నాను. అప్పుడు నా ముఖంలో ఎక్స్‌ప్రెషన్‌ ఎలా  వుందో!
‘‘అదేమన్నమాట! మీరు సినీరంగానికి ఎంత సేవ చేశారు? మాకు తెలియదా? మిమ్మల్ని సన్మానించేది మీకోసం గాదు, మా కోసం! తెలుగు ప్రజల కోసం! తెలుగు కళ కోసం’’ అన్నారు శర్మ!
‘‘వుండండి, ఒక్క నిముషం’’ అని లోనికి వెళ్లాను.
‘ఒట్టి కాఫీ కాదు, నాలుగు పెసరట్లు కూడా వెయ్యమని’ ఆర్డరిచ్చి వచ్చాను.
‘‘మీరు సినీ రంగంలోకి ప్రవేశించి ఈ సెప్టెంబర్‌ 16కు సరిగ్గా పాతికేళ్లు! కదండీ?’’ అన్నారు శర్మ!
ఆశ్చర్యంతో ‘‘అవునండీ’’ అన్నాను!
‘‘అందుకే, మీ సినీజీవిత రజతోత్సవం సందర్భంగా మిమ్మల్ని సన్మానించదలిచాం’’ అన్నాడు సాంబమూర్తి.
వెంటనే కృష్ణమూర్తి అందుకున్నాడు.
‘‘మీరు 1951లో వాహిని సంస్థలో ప్రవేశించారు. మీ  మొదటి చిత్రం ‘పెద్దమనుషులు!’ దానికి ఆ ఏడు ఉత్తమచిత్రంగా రజతపతకం కేంద్రప్రభుత్వం బహుకరించింది.
మీ రెండో చిత్రం ‘దొంగరాముడు’ అది అన్నపూర్ణావారి మొదటి చిత్రం.
ఇప్పటికీ మీరు దాదాపు 60 చిత్రాలకు రచన చేశారు.
నేను నిర్ఘాంతపోయి, నిశ్చేష్టుడనైనాను.
‘‘నా సంగతి నా కంటె మీకు ఎక్కువ తెలుసండీ’’ అన్నాను–ఆయన విజ్ఞానాన్ని మెచ్చుకుంటూ.
‘‘మీ సంగతే కాదండీ! కళారంగంలో ప్రముఖులను గురించి–రీసెర్చి చేసి రికార్డులు తయారుచేస్తాం!’’ అన్నాడు గర్వంగా శర్మ!
వాళ్ల  కళాభిరుచికి, కార్యదక్షతకు ముగ్ధుడనైనాను.
ఈసారి రామమూర్తి అందుకొన్నాడు.
‘‘మీరు సినిమాలకి రాకముందు నాటకాలు రాసేవారు. మీ నాటకాలకు నాటక కళాపరిషత్తు పోటీలలో బహుమతులు వచ్చాయి. మీకు బి.ఏలో తెలుగు ఫస్ట్‌ క్లాసు వచ్చింది! మద్రాస్‌ యూనివర్శిటీవారి బంగారుపతకం బహుకరించబడింది’’
అబ్బ! ఎంత పరిశోధన చేశారు వీళ్లు! అసలు వీళ్లకి సన్మానం చేయాలి.
‘‘అంతర్జాతీయ కథల పోటీలో మీ కథకి రెండో బహుమతి వచ్చింది! కదూ!’’ అన్నాడు సాంబమూర్తి.
ఇబ్బందిలో పడ్డాను!
‘‘అది నాకు కాదండి. పాలగుమ్మి పద్మరాజుగారికి’’ అన్నాను.
‘ఓహో’ అని కాస్త సర్దుకున్నాడు సాంబమూర్తి!
‘‘మీరు కొన్నాళ్లు అడ్వొకేట్‌ జనరల్‌గా పని చేశారు గదూ?’’ అన్నాడు రామమూర్తి.
‘‘లేదండి! ఆయన దువ్వూరి నరసరాజుగారు. ఆయన ఇప్పుడు లేరు.’’ అన్నాను.
‘‘మరి మీరు?’’
‘‘నేను వున్నాను’’
‘‘అదిగాదు–మీ ఇంటి పేరు?’’
‘‘దువ్వూరి కాదు! దాట్ల!’’
అందరం కాస్త ఇబ్బందిలో పడ్డాం! బండి పట్టాలు తప్పుతోంది.
‘‘మీరింత వరకూ ఎన్ని సినిమాలు తీశారు?’’ అని అడిగాడు వర్మ!
‘‘మరి డి.వి.యస్‌ ప్రొడక్షన్స్‌ మీది గదూ?’’
‘‘కాదండి. ఆయన డివియస్‌ రాజుగారు’’
‘‘ఓహో! డి.వి.య.స్‌ అంటే డి.వి.యన్‌ అనుకున్నాం’’
‘‘ఇందులో నేను ఎవరనుకొని వీళ్లు వచ్చారో! ఇంత రీసెర్చి చేసిన వాళ్లు పొరబడతారా? నా కోసమే వచ్చి వుంటారు?’’ అని సమాధాన పరుచుకొన్నాను.
‘‘ఎందుకయినా మంచిది, మీ జీవిత విశేషాలన్నీ వివరంగా మీరే రాసి ఇవ్వండి. మీ కలర్‌ ఫోటోతో సహా–ఒక చిన్న పుస్తకంగా ప్రచురిస్తాం’’
‘‘ఎందుకండీ! నాకసలు సన్మానలంటేనే...’’ నీళ్లు నమిలాను.
‘‘మీకు ఇలాంటివి ఇష్టం లేదని కూడా మాకు తెలుసు! అందుకే స్వయంగా వచ్చాం మాట్లాడడానికి! సన్మానాలు మీరు చేయమంటే చేస్తామా? అది మా విధ్యుక్త ధర్మం. మమ్మల్ని మేమే సన్మానించుకున్నట్లు! మీరు కాదన్నా–మేం సన్మానం చేసి తీరుతాం’’ అన్నారు శర్మ.
అతని ముఖంలోనూ, మాటల్లోనూ ఎంతో సిన్సియారిటీ కనిపించింది! నా మాటకు కొంత బాధ కూడా పడ్డట్టున్నారు పాపం! కళాభిమానుల మనసులు అంత సున్నితం కాబోలు ననుకున్నాను.
‘‘సన్మానసభకి ముందు ఊరేగింపు వుంటుంది’’ అన్నాడు సాంబమూర్తి సీరియస్‌గా!
‘‘ఎందుకండీ..’’ అనబోయాను.
సాంబమూర్తి కోపంగా ‘‘మీ ఇష్టాయిష్టాలతో మాకు పనిలేదు! మా ఆచారం ప్రకారం జరగవలసిందే’’ అని గద్దించారు.
ఆ గద్దింపులో  ఎంతో ఆప్యాయత వుంది!
‘‘ఊరేగింపులో కారు ఏర్పాటు చేయమంటారా?’’
‘‘కారా?’’ సందేహంగా!
‘‘ఏదైనా కొత్తరకం! నావెల్టీగా ఉంటే మంచిది!’’
‘‘గుర్రం అయితే?’’ రామమూర్తి సూచన.
శర్మ ముఖం వికసించింది.
‘‘కాదు! బ్రహాండమైన నావల్టీ! హైదరాబాద్‌లో ప్రస్తుతం ఒక సర్కస్‌ కంపెనీ ఉంది! వాళ్లతో మాట్లాడి–ఒంటెని ఏర్పాటు చేద్దాం!’’ అన్నాడు.
అవును. నావల్టీగా ఉంటుందని నాకూ అనిపించింది.
‘‘మీ ఇష్టం’’ అన్నాను.
చటుక్కున కృష్ణమూర్తి ప్రశ్న!
‘‘రాజుగారు! తెలుగు నటీమణుల్లో మీకు అభిమాన పాత్రులైన వాళ్లు ఎవరు?’’
క్షణం ఆలోచించి ‘‘చాలామంది ఉన్నారు. వాణిశ్రీ, సావిత్రి, జమున, అంజలీదేవి, భానుమతి, కన్నాంబ, కాంచనమాల...’’ అన్నాను.
‘‘వీరిలో మీకు అత్యంత అభిమాన పాత్రురాలు ఎవరు?’’
‘‘చెప్పడం కష్టం’’
‘‘అయితే ఒక పని చేద్దాం. వాళ్లందరి పేర్లు వేరు వేరు చీటీల మీద రాసి లాటరీ వేద్దాం! ఒక చీటీ తీద్దాం! ఆ చీటి మీద ఎవరి  పేరు వస్తే ఆమె చేత మీకు సన్మానం చేయిస్తాం’’
వెంటనే నేను ‘‘అయితే నేను చెప్పిన లిస్టులో కన్నాంబగారి పేరు తీసెయ్యండి’’ అన్నాను.
‘‘ఏం?’’ అన్నాడు సాంబమూర్తి!
‘‘ఎందుకు పాపం ఆమెను శ్రమ పెట్టటం?’’
‘‘అవును’’ అని ఒప్పుకున్నాడు ఆయన!
‘‘సరే! సన్మానసభకి అధ్యక్షత  వహించడానికి  కేంద్ర, రాష్ట్ర మంత్రులతో ఎవరిని పిలవమంటారు?’’
‘‘వాళ్లలో నాకు విరోధులు ఎవరూ లేరు!  ఎవరిని పిలిచినా నాకు ఇష్టమే’’ అన్నాను అజాతశత్రువులాగా.
‘‘సర్‌! ఆ విషయాలు మాకు వదిలేయండి. కనీసం ముగ్గురు మంత్రులు, ఇద్దరు జడ్జీలు సభలో పాల్గొనే ఏర్పాటు చేస్తాం! ఇంకా ఏమిటీ మాట్లాడాలనుకుంటున్నాం’’ అని దీర్ఘంగా ఆలోచించి–
‘‘ఆ! అసలు ముఖ్య విషయం–మీకు బిరుదు!’’
‘‘అవును. మీకు బిరుదు ఇవ్వాలని నిర్ణయించాము. ఏం బిరుదు కావాలి?’’ అని అడిగాడు చిరునవ్వుతో సాంబమూర్తి.
‘‘మీ ఇష్టం’’ అన్నాను ఎంతో వినయంగానూ కించిత్‌ సిగ్గుతోనూ!
‘‘నాదొక సూచన!’’ అన్నాడు కృష్ణమూర్తి!
‘‘మీ రచనలు ప్రధానంగా హాస్యాస్పదమైనవి గనక మీకు ‘హాస్యాస్పద బ్రహ్మ’ అని బిరుదు...
‘‘వద్దండి! అది వద్దండి’’ అని ఆదుర్దాగా అనేశాను–కాస్త బతిమాలుతున్న ధ్వనితో!
‘‘పోనీ, ‘హాస్యస్పద చక్రవర్తి?’’
‘‘అదీ వద్దండీ! బిరుదు ఏదిచ్చినా కాస్త పెద్ద వాళ్లను పండితులను సంప్రదించి నిర్ణయించండి’’ అన్నాను ప్రాధేయపూర్వకంగా.
‘సరే’నని వాళ్లు నలుగురు ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు.
నా పరిస్థితి ఏమీ బాగులేదు! ఈ సన్మానం ఎలా జరుగుతుందో. రసాభాస అవుతుందో అని భయంలో పడ్డాను!
పోనీ వద్దని ఖచ్చితంగా చెప్పడానికి మనసు ఒప్పుకోవడం లేదు.
ఇంటికి వచ్చి ‘సన్మానం చేస్తామ’ని ఎవరు అంటారు? ఎంతో కళాభిమానం గల వాళ్లు కాకపోతే.
కాస్త ధైర్యం పుంజుకుని అన్నాను!
‘‘అయ్యా! మీ కళాభిమానానికి, కళాసేవకి తెలుగుదేశం  ఎంతో రుణపడి ఉంటుంది. ఇక నా సంగతి చెప్పనే అక్కర్లేదు! ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను!
కాని నేను మనవి చేయవలసినవి రెండు మూడు విషయాలున్నవి!
సన్మానసభలో నన్ను గురించి మాట్లాడే వక్తలు నన్ను గురించిగాని, సినిమాలను గురించిగాని కాస్తో, కూస్తో తెలిసినవాళ్లుగా చూడండి!
నన్నూ పద్మరాజుగారిని, పాపం దువ్వూరి నరసరాజుగారినీ, డీవిఎస్‌ రాజుగారిని కలిపి కొడితే నేను కాస్త ఇబ్బంది పడవలసి వస్తుంది’’ అన్నాను గాద్గదతో!
‘‘ఆ జాగ్రత్తలు తీసుకుంటాం లెండి! మీ జీవిత  సంగ్రహం ముద్రించి వాళ్లకి ఇస్తాం ముందుగానే!’’
‘‘వాళ్ల కిలాంటివి అలవాటే లెండి’’ అని నన్ను సముదాయించాడు శర్మ.
సాంబమూర్తి అదోరకంగా  నవ్వి అన్నాడు–
‘‘మీకు ఇవి అలవాటు లేక ఏవో భయాలు, సందేహాలు పెట్టుకుంటున్నారు! మా సంగతి మీకు తెలీదు! ఇటువంటివి నెలకు నాలుగు సన్మానాలు చేసుకుంటాం’’
నిజమేననిపించింది! వాళ్లు అనుభవజ్ఞులు:
ఎంతో వినయంగా అన్నాను–
‘‘మీరు నా పట్ల చూపుతున్న ఆదరాభిమానాలకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు’’
కళ్లలో నిజంగా నీళ్లు తిరిగాయి.
‘‘ఒక్క రెండువేల రూపాయలివ్వండి’’ అన్నాడు శర్మ ఠకీమని!
పిడుగు పడ్డట్టయింది!
అప్రయత్నంగా ‘‘రెండు వేలా.’’ అనేశాను. పొరబోయి–దగ్గు వచ్చింది!
‘‘ముందు ఏవో చిల్లర ఖర్చులుంటయ్‌ గదండీ. మళ్లీ మీ డబ్బు మీకు వచ్చేస్తుంది! సావనీరు ప్రింటు చేసి డబ్బు వసూలు చేస్తాంగా. అందులోంచి తీసి ఇచ్చేస్తాం!’’ అన్నాడు సాంబమూర్తి బుజ్జగిస్తూ!
నాకు దగ్గు తగ్గలేదు!
‘‘ఉండండి! మంచినీళ్లు తాగివస్తా’’ అని దగ్గుతూ లోనికి వెళ్లాను.
‘‘పెసరట్లు పంపమంటారా?’’ అని అడిగింది మా ఆవిడ!
‘‘అక్లర్లేదు! మంచినీళ్లవ్వమని’’ మంచి నీళ్లు తాగి–తమాయించుకుని–
‘‘చెక్కుబుక్కు ఎక్కడుంది?’’ అని అడిగాను!
‘‘మీ టేబిల్‌ డ్రాయర్‌లో వుంది. ఎందుకు?’’
‘‘వాళ్లకి చెక్కు రాసి ఇవ్వాలి’’ అని మళ్లీ వాళ్ల దగ్గరకు వెళ్లాను.
 దగ్గు ఎలాగో దిగమింగుకున్నాను కాని బుర్ర ఏమీ పనిచేయడం లేదు.
డ్రాయర్‌లోంచి చెక్కుబుక్కు తీసి రెండువేల రూపాయలకి చెక్కు రాశాను. వణుకుతున్న చేతులతో శర్మకి ఇచ్చాను.
శర్మ చాలా సిన్సియర్‌గా ‘థాంక్స్‌’ చెప్పాడు.
‘‘సెప్టెంబర్‌ 16 సన్మానం! వ్యవధి లేదు. చకచక ఏర్పాట్లు చేయాలి. ఇవాళే వెళ్లిపోతాం!’’ అన్నాడు సాంబమూర్తి!
నలుగురు ఏకగ్రీవంగా–
‘‘సెలవు’’ అని విడి విడిగా నమస్కరించి  వెళ్లిపోయారు!
నేను అలాగే నిలబడిపోయాను.
మా ఆవిడ వచ్చింది.
‘‘ఎంత కిచ్చారు చెక్కు?’’
‘‘రెండు వేలు’’
‘‘రెండువేలా? డబ్బిచ్చి సన్మానం చేయించుకుంటారా? ఇంతకంటే సిగ్గు చేటు వుందా?’’
‘‘ఏం చెయ్యమంటావు! డబ్బు సంగతి వాళ్లు ముందు చెప్పలేదు, సన్మానానికి అంగీకరించి తీరా డబ్బు అడిగిన తరువాత ‘వద్దంటే’ ఏమనుకుంటారు?’’
‘‘అందుకని డబ్బు ఎదురిచ్చి సన్మానం చేయించుకుంటారా? అటువంటి సన్మానాలు లేకపోతే ఎవడేడిశాడు?’’
నా ముఖంలో కాస్త చిరునవ్వు తొంగి చూసింది!
‘‘పాతికేళ్ల నుంచి సినిమాలలో పనిచేస్తున్నాను. మరీ అంత తెలివి తక్కువ దద్దమ్మ కట్టేయకు మరి!’’
‘‘అంటే?’’
‘‘నా బ్యాంక్‌ అక్కవుంటులో డబ్బు లేదు. అందువల్ల ఆ చెక్కు చెల్లదు! ఈ సన్మానం జరగదు!!’’

మరిన్ని వార్తలు