కురు రాజు కోరిక

26 Jan, 2020 03:37 IST|Sakshi

ఆకాశమార్గాన వెళుతున్న ఇంద్రుడు నేలను దున్నుతున్న కురురాజును చూసి ఆగిపోయాడు. ‘చక్రవర్తి ఏమిటి, సామాన్య రైతులాగా భూమి  దున్నడమేమిటని ఆశ్చర్యంతో భువికి దిగి రాజు వద్దకు వచ్చి ‘‘నేను దేవేంద్రుడిని’’ అని పరిచయం చేసుకున్నాడు. కురురాజు దున్నటం ఆపి ‘‘దివినుంచి భువికి దిగివచ్చారు. నా అదృష్టం’’ అంటూ ఇంద్రునికి నమస్కరించాడు. ‘‘రాజువై ఉండీ సామాన్యుడి లా భూమిని ఎందుకు దున్నుతున్నావో తెలుసుకుందామని...’’ నవ్వాడు ఇంద్రుడు. 
‘‘ఓ అదా! ఇది పరశురాముడు శమంతక పంచకంతో పవిత్రీకరించిన ప్రదేశం. ఈ ప్రదేశంలో పుట్టిన వారందరూ స్వర్గానికి చేరుకోవాలన్న సంకల్పంతో ఇక్కడ నేను ఒక యాగం చేయాలని తలపెట్టాను...’’ 
సమాధానమిచ్చాడు కురురాజు. 
‘‘పాప పుణ్యాలతో సంబంధం లేకుండా కేవలం ఈ ప్రదేశంలో జన్మించినంత మాత్రానే స్వర్గమా? నీ కోర్కె చిత్రంగా, అసమంజసంగా కూడా ఉంది!’’ ఇంద్రుడి భృకుటి ఆశ్చర్యంతో పైకిలేచి ఆగ్రహంతో ముడి పడింది. 
‘‘చిత్రమేముంది ఇంద్రా! మీ దేవతలందరూ కేవలం జన్మమాత్రం చేతనే స్వర్గవాసం చేయడం లేదా?’’ అంటూనే ఇంద్రుడితో తనకిక పనిలేనట్టు నాగలి దున్నే పనిలో లీనమయ్యాడు కురు.
ఇంద్రుడు అమరావతికి వెళ్లిపోయాడు. కురురాజు తలపెట్టిన యాగ సంకల్పం గురించి సభలో చర్చించాడు. 
‘‘ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు మహేంద్రా! స్వర్గప్రాప్తికి జనన ప్రదేశం అర్హత కాదు... కారాదు. దానికి ప్రాతిపదిక మరణమే కావాలి. ఆ విధంగా కురురాజుకు నీవే తగిన మార్గదర్శనం చేయాలి’’ అన్నాడు దేవగురువు. 
ఇంద్రుడు సభ చాలించి లేచాడు. వెంటనే కురురాజు ముందు సాక్షాత్కరించాడు. అతని వంక ప్రసన్నంగా చూస్తూ ‘‘రాజా! నువ్వు యాగం తలపెట్టిన కారణం ధర్మబద్ధం కాదు. స్వర్గలోక వాస ప్రాప్తికి జననం కారణం కారాదు...’’ అంటుండగానే రాజు అందుకుని ‘‘ఈ క్షేత్రంలో మరణిస్తే స్వర్గవాసం లభించాలన్నదే నా కోరిక. అంతకుమించి మరేమీ లేదు మహేంద్రా’’ అంటూ చేతులు జోడించాడు. 
‘‘నీ కోరిక సహేతుకమైనది కాబట్టి నేను నీకు తప్పక వరం ఇస్తాను కురు రాజా! ఈ క్షేత్రంలో ఉండి పుణ్యకార్యాలు చేస్తూ ఈ క్షేత్రం లోనే మరణించినవారు, యుద్ధంలో వీర మరణం పొందినవారూ కూడా స్వర్గవాసానికి అర్హులవుతారు. అంతేకాదు, ప్రజాక్షేమం కోరి నీవు యాగం తలపెట్టావు కాబట్టి ఇకపై ఈ ప్రదేశం నీపేరుతో కురుక్షేత్రంగా ప్రసిద్ధికెక్కుతుంది. ఇది ఈ సురపతి వరం’’ అంటూ చిరునవ్వు నవ్వాడు ఇంద్రుడు. 
అలా ఆ క్షేత్రం ఆ రాజు పేరుతో కురుక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఆ క్షేత్రంలోనే మహాభారత యుద్ధం జరగటం తెలిసిందే. 
చిత్తశుద్ధితో నిస్వార్థంగా మంచి పని తలపెట్టిన వారి పేరు చిరస్థాయిగా నిలబడుతుందన్నదే ఇందులోని నీతి. – డి.వి.ఆర్‌. భాస్కర్‌

మరిన్ని వార్తలు